Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

        దేవుడూ-చేగోడీలూ


మిత్రులూ, ప్రముఖ రచయితా ఇచ్చాపురపు జగన్నాధరావుగారు ప్రతీరోజూ ఏదో కథో, జోకో ఇంటర్నెట్‌లో పంపుతూంటారు. అదీ మా బంధుత్వం. ఈ కథ నలుగురూ వినవలసినది.
ఓ కుర్రాడికి దేవుడిని చూడాలనిపించింది. దేవుడున్న చోటుకి వెళ్లాలంటే చాలా దూరం కదా? కనుక అమ్మ ఇచ్చిన చేగోడీల పొట్లాన్నీ, స్కూలుకి తీసుకెళ్లే మంచినీళ్ల సీసానీ పట్టుకుని బయలుదేరాడు.
వీధి చివరికి వచ్చేసరికి -పక్కనే ఉన్న పార్కులో ఓ ముసలాయన పార్కు బెంచీమీద కనిపించాడు ఎగిరే పావురాల్ని చూస్తూ... కుర్రాడు వచ్చి పక్కనే కూచున్నాడు. చేతిలో ఉన్న చేగోడీల్ని తింటూ ముసలాయన్ని చూశాడు. అతనూ ఆకలితో ఉన్నట్టు గుర్తించాడు. ఓ చేగోడీ ఇచ్చాడు. ముసలాయన అందుకుంటూ ఓ చిరునవ్వు నవ్వాడు -మిగిలిన నాలుగు పళ్లతో.
ఆ నవ్వుకి మురిసిపోయాడు కుర్రాడు. మళ్లీ ఆ నవ్వుని చూడాలనిపించింది. మరో చేగోడీ అందించాడు ముసలాయనకి. ఆయన మళ్లీ నవ్వాడు. కుర్రాడు మళ్లీ సంతోషించాడు.
మధ్యాహ్నం దాకా ఇద్దరూ అలాగే కూర్చున్నారు. ఇద్దరూ చేగోడీలు తిన్నారు. ఇద్దరూ నీళ్లు తాగారు. ఇద్దరూ నవ్వుకున్నారు. కాని ఒక్క మాటయినా మాట్లాడుకోలేదు. ఎండ నెత్తికెక్కగానే కుర్రాడి ధ్యాస ఇంటివేపు మళ్లింది. లేచి నాలుగడుగులు వేశాడు. అంతలో వెనక్కి తిరిగి ముసలాయన్ని చూసి దగ్గరికి వచ్చి ఆయన్ని కావలించుకున్నాడు. ముసలాయన చిరునవ్వునవ్వాడు.
ఇంటికి వచ్చాక వీధి తలుపు తీసిన తల్లి ఆనందంతో వెలిగిపోతున్న బిడ్డని చూసి ఆశ్చర్యపడింది. ''ఎందుకంత ఆనందంగా వుంది? ఎక్కడికెళ్లావు? ఏం చేశావు?'' అని అడిగింది.
''పార్కు బెంచీ మీద దేవుడు కనిపించాడు. దేవుడితో కలిసి చేగోడీలు తిన్నాను. ఆయన ఎంత బాగా నవ్వాడనుకున్నావు?'' అన్నాడు కుర్రాడు. ''నీకు తెలుసా? దేవుడు బొత్తిగా ముసలాడయిపోయాడు'' అన్నాడు.
అక్కడ ముసలాయనా మిట్ట మధ్యాహ్నం యింటికి చేరాడు. ఆయన ముఖమూ ఆనందంతో వెలిగిపోతోంది. చూసి -ముసలాయన కొడుకు ఆశ్చర్యపోయాడు. ''ఏమిటి నాన్నా? ఏం జరిగింది? అంత ఆనందంగా వున్నావు? అనడిగాడు.
''నీకు తెలుసా? పార్కుబెంచీ మీద యిందాకటివరకూ దేవుడిచ్చిన చేగోడీలు తిన్నాను'' అన్నాడు.
విస్తుపోతున్న కొడుకుని చూస్తూ ''నీకు తెలుసా? దేవుడు బొత్తిగా పసివాడురా'' అన్నాడు ముసలాయన.
ఓ చిరునవ్వు, ఓ మంచిమాట, మౌనంగా పలకరింత, బుజ్జగింపు, దయ -యిలాంటివేవయినా జీవితాన్ని వెలిగిస్తాయి. దేవుడిని తలపిస్తాయి.
ఈ దేశంలో కొందరికి దేవుడంటే బూతుమాట. కరుణానిధి గారికి రామసేతు అభూతకల్పన. రాముడు ఆయనలాంటి మానవుడే. ఏ రామయ్యరో, అలగప్పన్‌ అని వారి నమ్మకం. కాని వారు 2జి ని నమ్ముతారు. అందులో చేతులు మారిన కోట్ల ధనం వారికి వాస్తవం. వారి ప్రియ పుత్రిక కనిమొళి వున్న తీహార్‌ జైలు వారికి గుండెలు పిండే వాస్తవం. పండిత సుఖ్‌రాం గారు దేవుడిని నమ్ముతారు. కాని 17 కోట్లు దోపిడీనీ నమ్ముతారు.
పరిమితమయిన హ్రస్వదృష్టి -మేధస్సునే పెట్టుబడిగా, జాతి విశ్వాసాన్ని అటకెక్కించిన నేటితరం జిజ్ఞాసువులు కొందరికి తరతరాల సంప్రదాయ వైభవం ఏవగింపు. వారిని వారి అవిశ్వాసం రక్షించుగాక.
కాని చిన్న పలకరింత, మంచిమాట, చూపే కరుణతో దైవత్వం వుంది. మళ్లీ 'దైవత్వం' అన్నమాటలో చిన్న తిరకాసు ఉంది. నమ్మని కరుణానిధి గారి 'అవిశ్వాసం' వుంది. దాన్ని 'అతిమానవత్వం' అందామా? 'అపురూప మానవత్వం' అందామా?
పార్కు బెంచీమీద ముసలాయన చిరునవ్వులో, పసివాడు పంచిన చేగోడీల తాయిలంలో -సాజన్యంలో- వున్న మహనీయత పేరే -'దేవుడు!'.
అలనాడు కుచేలుడి అటుకులు, యిప్పటి పసివాడి చేగోడీలు ఆ కథ చెప్తాయి. అయితే దేవుడిని నమ్మనివారికి- 2జిలూ, కోల్‌గేట్లూ, ఆర్మ్‌ గేట్లూ వంటి ప్రత్యామ్నాయాలు చాలావున్నాయి. నాస్తికులకు ఆత్మవంచన నల్లేరు మీద బండి.
తొలిరోజుల్లో పుట్టపర్తి వెళ్లిన సందర్భం గుర్తుంది. బాబాగారి సోదరులు జానకిరామయ్య గారు నన్ను మొదటిసారిగా పుట్టపర్తి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బయట చెప్పులు వదలడం మరిచిపోయాను -తెలియక. నా వెనుక ఓ ముసలాయన వచ్చాడు -''మీ చెప్పులు'' అంటూ. విషయం తెలిసి బయట చెప్పులు వదలడానికి వెళ్లబోయాను. ఆయనే స్వయంగా నా చెప్పులు తీసుకున్నారు -భరతుడు స్వామి పాదుకలు అందుకున్నట్టు. ఆయన ఏదో వూరిలో పోస్టల్‌ డిపార్టుమెంటులో పెద్ద ఆఫీసరు. ఏమిటీ సేవ! ఆసుపత్రిలో సౌకర్యాలు ఒక పక్క అలావుండగా -అక్కడ పనిచేస్తున్న వ్యక్తుల కమిట్‌మెంటు నన్ను ఆశ్చర్యపరిచింది. ఆ క్షణంలో బాబా దేవుడా కాదా అన్న ప్రశ్న నాకు కలగలేదు. కాని ఇక్కడి వ్యక్తుల సేవలో దైవత్వం తొణికిసలాడింది. సాటి మనిషికి సేవ చేసే దృక్పధాన్ని అంతమందిలో మేలుకొలపడం దైవత్వమే. 'సేవ'ని ఒక వ్యక్తి లేదా శక్తి ఒక జీవితకాలం ఉద్యమం చేయడం -సందేహం లేదు. దైవత్వమే. ఈ మధ్య పుట్టపర్తి వెళ్లాను. అంతా నిర్మానుష్యంగా వుంది. ఆసుపత్రిలో ఎవరూ లేరు. బాబా సమాధిని దర్శించడానికి వేళలు నిర్ణయించారు. అదేమిటి? రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధిని ఎవరయినా ఎప్పుడయినా దర్శించవచ్చు. స్విట్జర్లాండులో చార్లీ చాప్లిన్‌ సమాధిని అలాగే చూశాను. బాబాగారి సమాధికి వేళలెందుకు? బాబా జీవించిన అన్ని సందర్భాలలో వారిని దర్శించివచ్చిన నేను, ఆయన లేనప్పుడు వారి సమాధిని చూడలేక తిరిగి వచ్చాను. ఇప్పుడెవరు చూస్తున్నారో ఆ ఏర్పాట్లను. వారికీ విషయం తెలియాలి. గోళ్లు గిల్లుకుంటున్న భాషరాని ఓ కార్యకర్త ఇప్పుడు చూడడానికి వీల్లేదని గోళ్లు గిల్లుకుంటున్నాడు. దురదృష్టం.
కలకత్తాలో మదర్‌ థెరిసా తన దగ్గరికి 12 మంది మతిస్థిమితం లేని బిడ్డల్ని చేర్చుకునే దృశ్యాన్ని టీవీలో చూపించారు. వారు అనాధలు. పైగా కరుణ, ఆదరణకి నోచుకోనివారు. వారిని ఒక్కొక్కరినీ బుగ్గలు పుణికి ఆ తల్లి పలకరిస్తూంటే నాకు భోరున దు:ఖం తోసుకొచ్చింది.
ఎప్పుడో 'నిప్పులాంటి మనిషి'లో రాశాను. ''కన్నీళ్లకి మతం లేదు ఇన్‌స్పెక్టర్‌! అవి ఎవరు కార్చినా కష్టానికిగుర్తే!'' అని.
దేవుడు ఆకాశంలో ఉంటాడేమో తెలియదు. కాని చూడగలిగే మనస్సుంటే దైవత్వం మన చుట్టూ కనిపిస్తుంది. మనలో ఔదార్యం ఉంటే మానవత్వం మనచుట్టూ వెల్లివిరుస్తుంది.


                                                                           gmrsivani@gmail.com  

 
     మార్చి 04.2013          

*************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   


KOUMUDI HomePage