Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here Are you
using iPad ( any iOs Device)? Try direct MP3,
Click
here
'మరో
కుంభకోణం'
మూలిగే నక్కమీద మరో తాటిపండు ఈ కొత్త కుంభకోణం. ఈ శతాబ్దానికి అటు 13
సంవత్సరాలకు, ఇటు 13 సంవత్సరాలకు ఈ దేశంలో రెండు పెద్ద కుంభకోణాలు జరిగాయి.
రెండూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. రెండూ రక్షణ శాఖకు
సంబంధించినవే. రెండూ అప్పటి రక్షణ మంత్రులూ, అప్పటి ఆయా సైన్యాధిపతులతో
ముడిపడినవే. ఒకటి ఇప్పటికీ ముడి విడలేదు. రెండోదానికి -మొదటి అనుభవం
దృష్ట్యా ఎప్పటికీ విడుతుందన్న ఆశలేదు. ఎందుకంటే నిజాయితీ, ప్రజాభిప్రాయం
కంటే ఏనాడయినా అధికారం నోరు పెద్దది. చేసేది ఎలాగూ ఏమీలేదు కనుక -ఒక చక్కని
అపరాధ పరిశోధక కథలాగ ఈ వ్యవహారాన్ని విప్పుకుందాం. చెప్పుకుందాం. నేలబారు
మనిషికి తెలియని, వంట బట్టని రంగం ఏమిటి? రక్షణ శాఖ. యుద్ధాల గురించి మనం
వింటూంటాం. ఎక్కడో సరిహద్దుల్లో తుపాకులు పేలుతాయి. మనం టీవీల్లో బొమ్మలు
చూస్తాం. ఎప్పుడో -రిపబ్లిక్ దినోత్సవం నాడు సరదాగా ఢిల్లీలో ఊరేగే ఆయుధాల,
శకటాల వైభవాన్ని చూసి సంతోషిస్తాం. తుపాకులు, బాంబులు, హెలికాప్టర్లు,
టాంకులు -వీటి కొనుగోళ్లు గురించి మనకేమీ తెలియదు. తెలుసుకునే అవకాశమూ లేదు.
అది రక్షణ శాఖకు సంబంధించిన అభ్యంతరకరమైన సమాచారం కనుక. కొన్నికోట్ల సొమ్ము
ఆయా ఆయుధాల మీద ఖర్చవుతుందని మనం వింటూంటాం. ఎలా ఖర్చవుతోందో మనకు తెలిసే
అవకాశం లేదు. కనుక కొల్లగొట్టదలచినవారికి ఈ రంగం నల్లేరుమీద బండి. అడిగే
నాధుడు లేడు. మనం నమ్మే నాయకులు, రక్షణ అధికారులు, ఉద్యోగులకు తప్ప ఎవరికీ
తెలియవు. మరి కంచే చేనుమేస్తే? అదే 1987 లో తెలిసింది. మళ్లీ ఇప్పుడు 2013
లో బయటికి పొక్కింది.
ఇది యాదృచ్ఛికం అనండి, అనుకోకుండా జరిగింది అనండి, అనుకునే చేసింది అనండి -ఆనాటి
దోపిడీకి, ఇప్పటి దోపిడీకీ చాలా పోలికలున్నాయి. దొంగలకి కొన్ని
చేతివాటాలుంటాయి. పోలీసులు సాధారణంగా ఆ వాటంని గుర్తించే పట్టుకుంటారు.
అలాగే అలనాటి బోఫోర్స్ చేతి వాటానికీ, ఇప్పటి హెలికాప్టర్ దోపిడీ వాటానికీ
చాలా పోలికలున్నాయి. సరదాగా ముచ్చటిద్దాం.
అప్పుడూ ఇటలీ సామగ్రి కొనుగోలు జరిగింది. ఇప్పుడూ ఇటలీ కొనుగోలులోనే మతలబు
జరిగింది. ఇటలీకీ కుంభకోణాలకీ ఏదైనా దగ్గర సంబంధం ఉందా? ఆ రోజుల్లో బోఫోర్స్‌లో
చేతులు మారిన సొమ్ము 250 కోట్లన్నారు. రూపాయి విలువ పడిపోయిందో, అవినీతి
విలువ పెరిగిందో తెలీదు కాని -ఒక టీవీ ఛానల్ సమాచారం ప్రకారం 5.5 బిలియన్ల
సొమ్ము -ఇప్పటికి చేతులు మారిందట! బోఫోర్స్ కుంభకోణానికి కేంద్ర స్థానం
స్వీడన్. ఇప్పుడు ఇటలీ. రక్షణ శాఖ అధికారులు సరిహద్దుల్లో పర్వత ప్రాంతంలో
తిరగడానికి 18 వేల అడుగుల ఎత్తున ఎగరగల హెలికాప్టర్లను ఫిన్‌మెకానికా అనే
ఇటలీ సంస్థ నుంచి కొనుగోలు చెయ్యాలనుకున్నారు. అందులో జరిగిన అవినీతి
కారణంగా ఇప్పటికే కమర్షియల్ డైరెక్టర్ పావ్లో పొజిస్సేర్రీ, చీఫ్ ఆఫీసరు
గిస్సెప్పీ ఆర్సీనీ అరెస్టు చేశారు. అలనాడు అనట్రానిక్ కార్పొరేషన్ విన్‌చెద్దా
గారికి జరిగిన మర్యాద గుర్తుండే ఉంటుంది.
ఈ డబ్బు ఎవరెవరికి ఎలా చేరింది. అప్పుడూ ఇప్పుడూ రూట్లు ఒక్కటే. మారిషస్‌లో
పోర్ట్ లూయీ, స్విట్జర్లాండ్‌లో లుసానే, ఇంగ్లండు, న్యూయార్కుల మీదుగా
మళ్లీ ఢిల్లీకి చేరుతుంది. అలనాడు బోఫోర్స్ శతఘ్నులు కూడా సైన్యానికి
కావలసిన తరహాలో లేవన్నారు. అయినా రాజీ జరిగింది. ఇప్పుడూ ఫిన్‌మెకానికా
హెలికాప్టర్లు 18 వేల అడుగులకి ఎగరలేవన్నారు. కనుక 15 వేలకి రాజీ పడ్డారు.
ఎవరు? ప్రపంచంలో 15 వేల అడుగుల ఎత్తున ఎగర గలిగిన హెలికాఫ్టర్లు ఒక్క ఫిన్
మెకానికా కంపెనీయే తయారు చేస్తోంది. వారికిక పోటీలేదు. అది ముఖ్య కారణమా?
లేక అదే ముఖ్య కారణమా?
ఇప్పుడు మరో లొసుగు. అప్పటి ఎయిర్ ఛీఫ్ మార్షల్ శశి త్యాగీ. ఈ
కుంభకోణానికి కారకులు ముగ్గురు -వారు జూలీ త్యాగీ, డోక్సా త్యాగీ, సందీప్
త్యాగీ. వీరు ముగ్గురు ఎయిర్ మార్షల్ గారి సోదరులు. ఆ మాట వారే
ఒప్పుకున్నారు. కాని తనకేమీ తెలియదన్నారు త్యాగీ. తమకూ ఏమీ తెలియదన్నారు
సోదరులు. మంట లేనిదే పొగరాదు కదా? అయితే 5 బిలియన్లు అవినీతికి తలాపాపం
పంచుకునే పెద్దలు ఎక్కడెక్కడ ఎందరున్నారో! ఇంకో మధ్యవర్తి లండన్‌లో ఉన్నాడు.
(అలనాడు బోఫోర్స్‌కి ఏ.ఈ. సర్వీసెస్ లండన్‌లో ఉన్న సంగతి గుర్తుండే ఉంటుంది)
ప్రస్థుత లండన్ మధ్యవర్తికీ మన కాంగ్రెస్‌కూ చాలాదగ్గర సంబంధాలున్నాయట. ఈ
వ్యవహారమంతా 23 ఏళ్ల కుర్రాడు అభిషేక్ వర్మ నడుపుతున్నాడట. ఇతనికి బొత్తిగా
వ్యాపార దక్షత లేదు. మరేముంది? వాళ్లనాన్న శ్రీకాంత వర్మ ఒకప్పుడు కాంగ్రెస్
జనరల్ సెక్రటరీ. తల్లి మినిమిత వర్మ 24 సంవత్సరాలు పార్లమెంటు సభ్యురాలు.
ప్రస్థుతం ఈ అభిషేక్‌గారు మరేవో కారణాలకి తీహార్ జైల్లో ఉన్నారు. వీరు
ఇప్పటికే ఎందరో పాత్రికేయులు, ఎడిటర్లు, రాజకీయ నాయకులు, మధ్యవర్తుల మధ్య
5.5 బిలియన్ల సొమ్ముని పంచారట. భేతాళ కథలాగ ఉందికదా? ఇటలీలో ఏ కోర్టు
వ్యవహారాలయినా బహిరంగంగా సాగుతాయి. కావాలంటే బహిరంగంగా ఆ కాగితాలను
తెప్పించుకోవచ్చు. ఒక్క ట్యునీసియా నుంచి మారిషస్‌కి 510 లక్షల యూరోలు
చేతులు మారినట్టు తెలియవస్తోంది. ఇటలీలో ఈ అవినీతి పనులు చేసినవారిని
అరెస్టు చేశారు. ఈ కుంభకోణాన్ని సంవత్సరం కిందటే ఒక ఛానల్ బయట పెట్టింది.
అయినా భారతదేశం ఇంకా మీనమేషాలు లెక్కపెడుతోందేం? ''ఛానల్ కథనాలు మేం వింటాం.
కాని మా రుజువులు మాకు కావాలి'' అని ఒకానొక నాయకులు టీవీలో వక్కాణించారు.
ప్రభుత్వ అలసత్వానికి ఎన్ని సుళువయిన తొడుగులున్నాయో! పాలుతాగే పిల్లులకు
ఎన్ని గంతలున్నాయో! మనకి నిజాయితీ పరుడయిన రక్షణ మంత్రిగారున్నారు. అతి
నిజాయితీ పరుడయిన ప్రధానమంత్రి గారున్నారు. కాని చుట్టూ ఉన్న వాతావరణం
అవినీతిలో కూరుకుపోతూంటే కళ్లు మూసుకునే నిజాయితీ కూడా భయంకరమైన అవినీతే.
ఇప్పటికే మనల్ని చూసి ప్రపంచమంతా నవ్వుకుంటోందని అలనాడు బోఫోర్స్ గుట్టు
రట్టు చేసిన చిత్రా సుబ్రహ్మణ్యన్ జెనీవా నుంచి చెప్పారు.
ఇంతగా కొంపలు మునుగుతూంటే -ఇలా తేలికగా తీసుకుంటున్నట్టు పాఠకులకు
అనిపించవచ్చు. అయ్యా, మనదేశంలో కుంభకోణాలు బయటపడతాయి. అవి బయటే ఉంటాయి.
కాకపోతే బోఫోర్స్ కుంభకోణం వల్ల 1989 లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలింది.
ఇప్పటి కుంభకోణం వల్ల రేపు 2014 ఎన్నికలలో అదే పరిస్థితి రావచ్చు. అయితే
వచ్చేదాకా బుకాయించడం రాజకీయం. కొన్ని నెలల కిందట అప్పటి తన ప్రియురాలుకి
ఐపిఎల్ కేరళ కంపెనీలో ప్రమేయం ఉన్నదన్న కారణంగా శశిధరూర్ అనే మంత్రిగారు
కేంద్రంలో పదవీ విరమణ చేశారు. తరువాత ఏమీ జరగలేదు. కాలం గడిచింది. మళ్లీ
వారు ప్రస్థుతం మంత్రి పదవిలోకి ఎలా వచ్చారు? కొన్ని నెలల క్రితం పదవికి
ఎసరుపెట్టిన అవినీతి ఇంతలో ఎలా మాయమయింది? ఎవరు అడుగుతారు? రాజకీయాల్లో కాలం
చాలా సుఖవంతమయిన ముసుగు. ప్రజాభిప్రాయం ఎన్నికల దాకా ఎవరికీ బోధపడదు. కాగా
ఈ దేశంలో ప్రజాస్వామ్యం పెద్ద గాడిద.