Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here Are you
using iPad ( any iOs Device)? Try direct MP3,
Click
here
"రేపు" కథలు
రేపుని తెలుసుకోవాలనుకోవడం మానవుని బలహీనత. అది తన గురించే అయితే ఆ బలహీనత
వెర్రితలలు వేస్తుంది. అది స్వప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని
తెలుసుకోవాలనుకుంటే ఇక ఆ రోగానికి అవధులు ఉండవు. ఈ ఒక్క కారణానికే మన దేశంలో
జ్యోతిషాన్ని చాలామంది గబ్బుపట్టించారు. గ్రహాల గమనం, తత్కారణంగా భూమిమీదా,
మానవుల మీదా వాటి ప్రభావం, ఏతావాతా ఇందువల్ల మానవునికి జరిగే ప్రయోజనానికీ
సంబంధం ఒక దృష్టితో చూస్తే కనిపించకపోవచ్చు. కాని సహేతుకంగా చూడగలిగితే ఆ
దృష్టి ఆ వాస్తవాలను నిరూపిస్తుంది -సాధారణంగా. అలనాడు మహాతపస్వి పిడపర్తి
దక్షిణామూర్తిగారి వంటి మహానుభావులు నిరూపించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అవి
పుస్తకరూపంలోనూ వచ్చాయి.
చాలా సంవత్సరాల కిందట నేను మురారి అనే సినిమాలో పనిచేస్తున్నాను. ఒక
సన్నివేశంలో నటించడానికి చక్కని గెడ్డం, తెల్లని జుత్తుతో గంభీరంగా ఉన్న
వ్యక్తిని ఒకానొక వేషానికి పిలిపించారు. ఆయన పొట్టి శ్రీరాములు
విశ్వవిద్యాలయంలో జ్యోతిష శాస్త్ర విభాగానికి అధిపతి సి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం
గారు. నాలుగయిదు రోజులు కలిసి పనిచేశాం. చర్చలు న్యాయంగా జ్యోతిషం మీదకీ,
దాని గురించి ప్రచారంలో ఉన్న అసంబద్ధాల మీదకీ పోయాయి. వారప్పుడు చెప్పారు.
జ్యోతిషం ప్రధానంగా వైద్యానికీ, వ్యక్తి పాప ప్రక్షాళనకీ సంబంధించిన
శాస్త్రమని. "పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ బాధతే" అన్నారు. పాపపుణ్యాలని
నమ్మకపోయినా మనం గతంలో చేసిన కర్మలు (ఇదీ గొడవ గనుక, కర్మ అంటే పనులు
అనుకుందాం) మన మనస్సు మీదా, ఆరోగ్యం మీదా ప్రభావాన్ని చూపుతాయి.
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో లక్షలాది యూదుల్ని చంపించిన నాజీ నాయకులు -క్రమంగా
నరాలలో నిర్వీర్యతకు లోనయారు. ఆ దృశ్యాలు వారిని పీడకలలై వెంటాడాయి. కొందరు
తాగుబోతులయారు. నరాలు, కడుపు, పేగుల జబ్బులతో మంచం పట్టారు. ఆ బీభత్సాన్ని
మనస్సులోంచి నెట్టే ఆస్కారం లేక నిస్సహాయులైన యూదుల్ని చావబాది చావబాది
రహస్యంగా భోరుమనేవారట. ఇది చంపించిన ఆఫీసర్ల మాట! అంటే ఆ కర్మ మన
ప్రయోజనానికయినా మరొకరికి హాని చేసేదయినా ఫలితం తప్పదు.
ఈ కర్మల నుంచి విముక్తికి 5 సాధనాలున్నాయట. జపం, హోమం, సురార్చన, ఔషధం, దానం.
వీటికి మార్గాన్ని సుగమం చేసే శాస్త్రం -జ్యోతిషం. రేపు ఎన్నికలలో మెజారిటీ
వస్తుందా, ఫలానా సినిమా హిట్టవుతుందా, పక్కవాడి బుర్ర ఎప్పుడు పగులుతుంది
అనే విషయాలు తేల్చడం కాదు ఈ శాస్త్రం పని. ఇది తాటిచెట్టుకీ తాత పిలకకీ ముడి
వేయడం. ఏమయినా ఈ కాలమ్ పని జ్యోతిషం మీద నమ్మకం లేనివారికి కలిగించడం,
ఉన్నవారి భుజాలు పొంగించడం కాదు.
మరో పార్శ్యం -డబ్బున్నవాడికి నిలుపుకోలేనేమోనన్న యావ. పదవి ఉన్నవాడికి
ఊడుతుందేమోనన్న భయం. తనదికాని, చెయ్యనక్కరలేని పనులు చేసేవాడే -ఇలాంటి
కాలజ్ఞానానికి అర్రులు జూస్తాడు. రేపటి యావ -ఉన్నవాడికి. ఏమీలేనివాడికి కాదు.
ప్రపంచంలో ప్రధానంగా మూడే కష్టాలట. ఎదుటి వ్యక్తి తనకు అనుకూలంగా లేకపోవడం,
డబ్బు సమయానికి లేకపోవడం, ఆరోగ్యం సరిగా లేకపోవడం. విచిత్రంగా మనిషి
ముఖ్యమైన మూడోదానిని మూడో స్థానంలోనే ఉంచి ఆరోగ్యాన్ని దుబారా చేసుకుంటాడు.
వీటిలో ఏ కష్టం వచ్చినా వీటినుంచి బయటపడే మార్గం సూచించిన రేపటి కథ
అమృతప్రాయంగా ఉంటుంది. జ్యోతిషం దుర్వినియోగానికి ఇదీ దగ్గర తోవ. ఇలాంటి
జ్యోతిషాన్ని ఆటపట్టిస్తూ ప్రముఖ రచయిత ఆస్కార్ వైల్డ్ ఓ గొప్ప కథని ఏనాడో
రాశాడు -"ది లార్డ్ ఆర్దర్ సెవైల్స్ క్రైమ్" దానిపేరు. రేపటి కథని తు.చ
తప్పకుండా గుర్తించి ప్రవచించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. ముందుగా
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, ఫ్రెంచి కాలజ్ఞాని నోస్టర్‌డామస్ గుర్తుకు
వస్తారు.
శ్రీకృష్ణ దేవరాయలు తన ప్రతీ జైత్రయాత్రకీ సశాస్త్రీయంగా ముహూర్తాన్ని
నిర్ణయించుకుని బయలుదేరేవారట. ఇది మన దేశానికి పరిమితం కాదు. మానవ స్వభావంలో
"కురుచదనం" విశ్వజనీనం. లూయీ గారిక్ అనే యూరోపియన్ జ్యోతిష్కుడు పదవ పోప్
లియో గారిక్ పదవిలోకి వస్తారని ముందుగానే సూచించారట. ఒకటవ హెన్రీ మహారాజు
మృత్యువుని నోస్టర్‌డామస్ కుండ బద్ధలుకొట్టినట్టు చెప్పాడు. నెపోలియన్
చక్రవర్తి అవుతాడని పియరీ లీ క్లెర్క్ అనే జ్యోతిష్కుడు బల్లగుద్ది మరీ
చెప్పాడు. నమ్మకం శాస్త్రం మీద లేనివారికీ -వారు చెప్పే ఫలితాల మీద మాత్రమే
వ్యామోహం ఉన్నవారికీ -శాస్త్రాన్ని దాటి వచ్చిపడే లాభం మీద మక్కువని
పెంచుతుంది. ఓడిపోయే రాజకీయ నాయకుడు ఎన్నికల జ్యోతిషాన్ని నమ్మనంటాడు.
గెలుస్తాడని చెప్పినప్పుడు ఆ నిజాన్ని భుజాన వేసుకు తిరుగుతాడు. ఇది మానవుని
బలహీనత. సైన్యంలో పనిచేసిన, కోట్ల మందిని ఊచకోత కోయించిన గత దశాబ్దపు నియంత
హిట్లర్‌కి జ్యోతిషం మీద నమ్మకం ఉంది. హనూస్సెన్ అనే జ్యోతిష్కుడు 1933
జనవరి 30 తర్వాత హిట్లర్ ప్రభ వెలిగిపోతుందని ఓ కవితని రాసి మరీ
బల్లగుద్దాడు. (ఆ కవిత నాదగ్గర ఉంది.)
ఏతా వాతా సుబ్రహ్మణ్యంగారి మాటల్లో -మానవుని గత జన్మ -లేదా గతంలో చేసిన
కర్మ (పోనీ, పనులంటే కొందరికి నచ్చుతుంది) కారణంగా వచ్చే అనారోగ్యాలకు -రాబోయే
కాలంలో ఎంత ఉపశమనం కలుగుతుందో సూచించే శాస్త్రంగా జ్యోతిషాన్ని గుర్తుపడితే
పక్కవాడిని దోచుకోడానికో, అర్హతలేని పదవికి ఎగబ్రాకడానికో జ్యోతిషాన్ని సాకు
చేసుకుంటున్న అజ్ఞానుల కారణంగానే శాస్త్రం లక్ష్యం భ్రష్టుపడుతోంది. ఈ
దేశంలో భగవాన్ రమణ మహర్షులూ ఉన్నారు. సినీతారల్ని పక్కలో వేసుకుని కాషాయం
చాటుగా రంకు నడిపే నిత్యానందులూ ఉన్నారు. చిలుమును వెలిగించేదీ నిప్పే.
సమిధెను రగిలించేదీ నిప్పే. నిప్పుది ధర్మం. ప్రయోజనానిది కల్మషం. రెండు
సందర్భాలను గుర్తుచేసి ముగిస్తాను. మా నాన్నగారికి 1977లో తీవ్రంగా
గుండెనొప్పి వచ్చింది. ఆయన 50 సంవత్సరాలు పైగా బీడీలు కాల్చారు. అది ఆయన
చేసిన కర్మ. రెండు ఊపిరితిత్తులూ చెడిపోయాయి. కోమాలోకి వెళ్లిపోయారు.
విశాఖలో వర్షాలు. అంతిమయాత్రకి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అప్పుడు మా
తమ్ముడు అన్నాడు: "ఓసారి వేదుల కామేశ్వర శర్మగారిని కలుద్దామా" అని. ఆయన మా
యింటి జ్యోతిష్కులు. ఆయనకి కుష్టువ్యాధి. నాన్నగారు అవసానంలో ఉన్నారనడానికి
జ్యోతిషం సాయం అక్కరలేదు. చూస్తేనే అర్థమవుతోంది. అయినా ఆశపోదు. వెళ్లాం.
గంటపైగా లెక్కలు వేశారు -మాకు అత్యంత హితులు శర్మగారు. ఆ క్షణంలో జ్యోతిషం
మీదా, మా తమ్ముడిమీదా, శర్మగారిమీదా నాకు కలిగిన ఏహ్యభావం చెప్పలేను. అవతల
వేళ మించిపోతోంది. లెక్కలు పూర్తయాక "మరేం పరవాలేదయ్యా. సుబ్బారావుగారికి
గండం గడిచిపోతుంది" అన్నారు శర్మగారు. ఆ క్షణంలో ఆయన పుస్తకాల్ని చించి
పోగులు పెట్టాలన్నంత కోపం వచ్చింది. దురుసుగా లేచాను.
తర్వాత మా నాన్నగారు 14 సంవత్సరాలు జీవించి ఒకరోజు నిద్రలో
వెళ్లిపోయారు.మిత్రుడు, రచయిత భమిడిపాటి రాధాకృష్ణ గణితంలో విచిత్రమైన
పరిశోధనల్ని చివరి రోజుల్లో జరిపాడు. చాలా సత్యాల్ని నిరూపించాడు. ఆయన తన
పుస్తకంలో తాను "సెప్టెంబరు 4, 2007న బాల్చీ తన్నేస్తాను" అని రాసుకున్నారు.
అక్షరాలా అదే రోజున కన్నుమూశారు. వంకర శాస్త్రానిది కాదు. దానిని అన్వయించు
కునే మనిషి బుద్ధిది. సత్యానికి రెండో పార్శ్వం ఉండదు. ప్రలోభానికీ,
స్వార్ధానికే ఎన్నో ముఖాలుంటాయి.