Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here Are you
using iPad ( any iOs Device)? Try direct MP3,
Click
here
సత్తలేని దినములు..
157 సంవత్సరాల కిందట త్యాగరాజస్వామి వాపోయిన తీరు ఇది. కలిలో ప్రథమ
పాదంలోనే యిన్ని అనర్థాలు జరుగుతున్నాయన్నారు. 2014 లో ఆయా సందర్భాల
విశ్వరూపాన్ని చూస్తున్నాం. ఇంకా ఇది కలిలో ప్రథమ పాదమే. గూండాలూ,
రేపిస్టులూ పదవుల్లో నిలవడం, దౌర్జన్యం, బుకాయింపు రాజ్యమేలడం, నిర్భయ
వంటివారి దారుణ మరణాలు, కేమ్కావంటి నీతిపరులయిన ఆఫీసర్ల శంకరగిరి తిరణాలూ...
ఇంకా ఇది కలిలో మొగటి భాగమే!
అయితే 157 సంవత్సరాల కిందటే ఈ మాట అనగలిగిన, అనవలసిన అరాచకాన్ని
త్యాగరాజస్వామి ఏం చూశారు? ఆయన కీర్తనలు వెదికితే ఆ ఛాయలు కనిపిస్తాయి. ''నాదుపె
పలికేరు నరులు, వేదసన్నుత భవము వేరు జేసితి ననుచు..'' అని వాపోయారు.
అప్పటికే త్యాగరాజు రచనా సరళిని, జీవన దృక్పథాన్ని దుయ్యబట్టే 2014 మార్కు
ప్రబుద్ధులున్నారన్నమాట. ''సోమిదమ్మ సొగసుగాండ్రను మరిగితే సోమయాజి
స్వర్గార్హుడగునా?'' అని నిలదీశారు. వేగలేచి, బూది పూసి నకిలీ భక్తిని
కురిపించే కుహనా భక్తుల్ని ఎండగట్టారు. ఆనాటికి అవి అపశృతులు. భయంకరమైన
కలిప్రభావానికి గుర్తులు. ఇప్పుడు? కులాంతర వివాహాలు. ఇద్దరు ముగ్గురితో
సంబంధాలు, స్వామీజీల రంకు కథలూ, నాయకుల రొమ్ము విరిచిన అవినీతి... ఇంకా ఇది
కలిలో మొదటి భాగమే!
అయితే ఇది నెగిటివ్ పార్శ్వం. చెడిన కాలానికి మచ్చుతునక. మరి కలిసిరాని
కాలానికి? వివేకానంద మరో పదిహేనేళ్లు బతికి ఉంటే? శంకరాచార్య, రామానుజం,
జీసస్ మరో పాతికేళ్లు ఉండగలిగితే? మానవాళికి ఎంత మేలు జరిగేది? ఇవన్నీ 'సత్తలేని
దినముల...'' ఛాయలేకదా?
నేనా మధ్య నార్వే వెళ్లాను. నార్వేలో నెత్తికెత్తుకునే -ఆ మాటకు వస్తే
ప్రపంచ నాటక రంగం నెత్తికెత్తుకునే మహారచయిత హెన్రిక్ ఇబ్సన్ ఇల్లు,
మ్యూజియం చూసి పులకించాను. ఒకసారి -ఆయన వృద్ధాప్యంలో ఓ 18 ఏళ్ల అమ్మాయి ఆయన
ప్రేమలో పడింది. కాని ఆ ప్రేమకు సార్థక్యం లేదు. ఆ ప్రేమకి భవిష్యత్తు లేదు.
ఆ ప్రేమకి అర్థమూ లేదు. ఆ నిజాన్ని ఇబ్సన్ ఆమెకి తెలిసేటట్టు చేశాడు -ఆలోచనలో
పరిణతీ, ప్రవర్తనలో ఉద్ధతీగల రచయిత. తర్వాత ఈ ఇతివృత్తం నేపథ్యంగా ఒక నాటకం
రాశాడు. దానిపేరు 'ది గోస్ట్స్'. ఈ ప్రేమ గురించి సమీక్షించమంటే వందమంది
వంద రకాలుగా చెప్పగలరు. కాని ఇబ్సన్ ఒకే వాక్యంలో ఒక మహాకావ్యాన్ని
చెప్పాడు.She is the May sun in my September life అన్నాడు. (ఆమె నా
సెప్టెంబరు జీవితంలో మే సూరీడు.)
సత్తలేని దినములు..
ప్రముఖ పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరరావు గారు విజయవాడలో మా యింటి పొరుగున
ఉండేవారు. కేవలం తన సంపాదకీయాల్తో, రాజకీయ విమర్శలతో ఆనాటి రాజకీయ నాయకుల
జీవితాల మీద ప్రభావం చూపగల శక్తివంతమయిన పాత్రికేయులు. ఆయనకి ఒకసారి
గుండెపోటు వచ్చింది. ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉండేది. ఆ రోజుల్లో నాతో ఒకమాట
అన్నారు ''ఇంకా కొన్నాళ్లుండాలని ఉంది మారుతీరావుగారూ. ఇప్పటికి ఇద్దరు
ముఖ్యమంత్రుల్ని పదవుల్లోంచి దించాను. మరొక్కరిని దించి హ్యాట్రిక్ చేయాలని
ఉంది'' అని.
సత్తలేని దినములు..
97వ యేట నాకు పినమామగారు, పద్మభూషణ్ పినాకపాణిగారిని కలిశాను. మాట్లాడుతూ
''ఇన్నేళ్లుగా సాధన చేస్తున్నాను. ఇంకా భైరవి స్వరూపం అంతుచిక్కడం లేదు''
అన్నారు. సంగీతంలో ఆవలిగట్టుని గుర్తెరగడానికి వారి జీవితం 97 వ ఏట కురుచ
అయింది!
సత్తలేని దినములు..
మహాత్ముల కాలం కురుచ అవడానికీ, మామూలు మనుషుల కాలం దుర్వినియోగం కావడానికీ
సారూప్యాన్ని వెదకడం ఈ 'కాలమ్' ఉద్దేశం కాదు. మారే కాలధర్మంలో దుర్మార్గులకు
కాలం కలిసివచ్చినట్టుగా, మహానుభావులకు కలిసిరావడం లేదు. అయితే ఇదీ కలికాల
ధర్మమేమో! కొందరి మహానుభావుల ఉద్ధతిలో క్షీణత -దురదృష్టం. వారికి కాలం
దుర్మార్గంగా కలిసిరాదు. కొందరు దౌర్భాగ్యుల జులుం రెచ్చిపోవడానికి కాలం
కలిసివస్తుంది -అది అరిష్టం. రెండూ ఓ నాదయోగి భావనలో ''సత్తలేని దినములు...''
కు నిదర్శనాలే!