Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

మంచి పోలీసు - చెడ్డపోలీసు

మీరెప్పుడైనా గమనించారో లేదో మంచి పోలీసు - చెడ్డపోలీసు చాలా సరదా అయిన ఆట. రోడ్డు మీద టోపీ లేకుండా వెళ్ళే మోటార్ సైకిల్ మనిషిని ఒక పోలీసు పట్టుకుంటాడు. నెలాఖరు రోజులు. బేరం ప్రారంభమవుతుంది. అలాక్కాక - అవతలి మనిషి మంత్రిగారి వియ్యంకుడో, ఎమ్మెల్యే గారి బావమరిదో అయితే పోలీసు ఇరుకులో పడతాడు. అప్పుడేమవుతుంది? మరో పోలీసు రంగంలోకి దూకుతాడు. ఇతను తప్పనిసరిగా మంచి పోలీసు అయివుంటాడు. రాగానే పాసింజరుకి నమస్కారం చేస్తాడు. “అయ్యగారూ బాగున్నారా సార్” అని పలకరిస్తాడు. మోటారు సైకిలు లేటెస్టు మోడల్ కొన్నందుకు అభినందిస్తాడు. ఇప్పుడు చెడ్డ పోలీసు వేపు తిరిగి అలాంటి పెద్దమనిషిని నిలదీసినందుకు కోప్పడతాడు. చెడ్డ పోలీసు తలదించుకుంటాడు. ఇద్దరూ కలిసి పాసింజరుకి సెల్యూట్ చేస్తారు. మోటార్ సైకిలు వెళ్ళిపోతుంది. వీలయితే మంత్రిగారికి తన బదిలీకి మాట చెప్పమని చిరునవ్వుని రువ్వుతాడు మంచి పోలీసు.

ఇరకాటంలోంచి తప్పుకునే అందమయిన, కాని ఎప్పుడూ కలిసివచ్చే ఆటయిది. రాజకీయాలలోనూ దీనికి లాయకీ ఉంది. ఆటలో ఆరితేరిన పార్టీ కాంగ్రెస్. ఇలాంటి ఆటలు వారికి వెన్నతో పెట్టిన విద్య. అందుకు 'మంచి పోలీసు ' పాత్ర వారికి సిద్దంగా ఉంటుంది. మంచి  పోలీసు పేరు - రాహుల్ గాంధీ. వారు ఏ రకమైన పదవులకీ ఇష్టపడరు. అవినీతి కుంభకోణాల మీదా మాట్లాడరు. సాధారణంగా పార్లమెంటు సభలలోనూ కనిపించరు. కానీ అవసరం వచ్చినప్పుడు - ఆఖరి క్షణంలో చెడ్డ పోలీసుని కాపాడే మంచి పోలీసు పాత్రని చాలా హుందాగా నిర్వహిస్తారు.

  మధ్య అవినీతిలో కూరుకుపోయిన పార్లమెంటు సభ్యులనీ, అసెంబ్లీ సభ్యులనీ ఎన్నికలలో పోటీ చేసే అర్హతను తొలిగించడాన్ని వ్యతిరేకించే ఆర్డినెన్సును కేంద్ర మంత్రివర్గం - సిఫారసు చేసింది. ప్రతిపక్షాలు ఇది అరాచకమని ఎదురు తిరిగాయి. తన సంతకానికి వచ్చిన ఆర్డినెన్సుపై వివరణలకోసం రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ - దేశీయాంగ మంత్రి సుశీల్ కుమార్ షిండేగారికి, కపిల్ సిబల్ గారికి కబురు పంపారు. పెద్ద దుమారం లేచింది. అప్పుడేం జరిగింది? కాంగ్రెసు సమాచార ప్రతినిధి అజయ్ మాకన్ గారు నిర్వహిస్తున్న పత్రికా సమావేశంలోకి రాహుల్ గాంధీగారు దూసుకు వచ్చి మైకుని అందుకున్నారు. మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం 'నాన్సెన్స్' అంటూ ఆర్డినెన్సుని చించేసి చెత్తబుట్టలో వేయవలసిందేనని వక్కాణించారు. దేశమంతా తెల్లబోయింది. కాంగ్రెసు వర్గాలు అవాక్కయిపోయాయి. రాహుల్ గాంధీగారు బయటికి వచ్చి మన్మోహన్ సింగు గారి మీద తన విమర్శల రాయి పడిందని గుర్తించి, వెంటనే అమెరికాలో పర్యటిస్తున్న మన్మోహన్ గారికి ఫోన్ చేసి వారి పెద్దరికం మీదా, వారి నేతృత్వం మీదా తనకు బోలెడు గౌరవం ఉన్నదని సెలవిచ్చారు. ఇది తుంటి మీద కొట్టి బుగ్గని ముద్దులాడడం లాంటిది.

పైగా అదే సభలో దేశంలో ఒక్క కాంగ్రెస్సే అవినీతి గురించి ఇంకా మాట్లాడుతోందని రాహుల్ గాంధీగారు బోరవిరిచారు. అయ్యా! తమ పార్టీ గత పదేళ్ళుగా పాలనలో ఉంది. పదేళ్ళలోనూ మీరింకా అవినీతి గురించి 'మాట్లాడే' స్థాయిలోనే ఉన్నారు. చేతల్లో అవినీతికి చర్యలు తీసుకోడానికి వేళమించిపోయిన విషయం తమకు ఇప్పటికి అర్ధమయిందని చర్యతో మాకు అర్ధమయింది.

మధ్య దేశంలో కల్లా అతి గొప్ప కుంభకోణం బయట పడింది. ముంబైలో ఆదర్శ అపార్టుమెంటుల కథ. ఇందులో నలుగురు ముఖ్యమంత్రులు, ఇద్దరు దేశసైన్యాధిపతులు, ఎందరో ఐయ్యే­­­యస్ లూ వాటాలు పంచుకున్నారు. దానిపై విచారణ జరిపిన న్యాయమూర్తి కమిటీ ఇందులో బోలెడు కుంభకోణం ఉన్నదని నిర్ధారణకు వచ్చింది. కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్ గారు కమిటీ రిపోర్టుని తృణీకరించారు. తిరస్కరించారు. మళ్ళీ రాజకీయ పార్టీలన్నీ విమర్శలు గుప్పించాయి. నేపధ్యంలో మంచి పోలీసు రాహుల్ గాంధీ గళమెత్తారు. కమిటీ రిపోర్టుని మహారాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ పరిశీలించాల్సిందే నన్నారు. అంతే. కొన్ని గంటల్లో ముఖ్యమంత్రి మహాశయులు తన తిరస్కారాన్ని ఉపసంహరించుకున్నారు. పునః పరిశీలన జరిపి - కుంభకోణంలోంచి ముఖ్య మంత్రుల్ని తప్పించి, ఆఫీసర్లని వాళ్ళ మానాన వాళ్ళని వదిలేశారు.

ఇలాంటిదే మరో ప్రహసనానికి మధ్యనే నాంది జరీగింది. తెలంగాణా  ఏర్పాటుకి సూచనలు ఇవ్వడానికి ఏర్పాటయిన మంత్రి మండలి తనరిపోర్టుని  మంత్రివర్గానికి సమర్పించే ముందురోజే ఒక గాలి వార్తని దేశంలోకి  వదిలింది కాంగ్రెసు ప్రభుత్వం. మంత్రి మండలి రాయల తెలంగాణాను సిఫారసు చెయ్యబోతోందని. ఎటూ తమ మంచి పోలీసు ఆట ఉండనే ఉన్నదికదా అని పార్టీ ధీమా. అయితే మిన్నువిరిగి మీద పడింది. తెలంగాణా, రాయలసీమ, ఆంధ్రాలో విమర్శలు వెల్లువెత్తాయి. సర్వే సర్వత్రా ప్రతిపాదన చెల్లదని తేలింది. కాస్త వ్యవధి ఉంటే - ఘనత మంచి పోలీసుకి దక్కేదే. కానీ వెంటనే గాలివార్తని గాలిలోనే వదిలేశారు.

చిక్కల్లా ఆటని పిడుగుకీ బియ్యానికీ ఒకే మంత్రంగా వాడితే బెడిసి కొడుతుంది. కాగా ఆటని ఆటస్థాయిని దాటిపోయే ఆదర్శ కుంభకోణం, అవినీతి ఆర్డినెన్స్ వంటివాటికి వాడినప్పుడు - అది కాంగ్రెసు గొప్పతనంగా కాక - అతి తెలివితనంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నెత్తిన పిడుగు పడేవరకూ నిమ్మకు నీరెత్తినట్టు తెరవెనుక ఉండి - తీరా వేళమించిపోయే వేళకి నీతులు పలకడం - పార్టీ గొప్పతనంగా కాక - అతి తెలివితనంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నెత్తిన పిడుగు పడేవరకూ నిమ్మకు నీరెత్తినట్టు తెరవెనుక ఉండి - తీరా వేళమించిపోయే వేళకి నీతులు పలకడం - పార్టీ గొప్పతనంగా కాక - మంచి పోలీసు అనుభవరాహిత్యాన్నీ తెలియజేస్తుంది.

ఎందుకంటే ఆట మంచి - చెడ్డ పోలీసు స్థాయినుంచి - మంచి - ముదనష్టపు పోలీసు స్థాయికి చేరిపోయింది. అడ్డుపుల్ల వేసే అవినీతి అధ్వాన్న స్థాయికి చేరిపోయింది. ఇంకా వీరభద్ర సింగు కుంభకోణం, అగస్తా హెలికాప్టర్ల కుంభకోణం వంటివి బోలెడు రంగంలోకి రాబోతున్నాయి. అన్నిటికీ మించి ముసళ్ళ పండగ - సార్వత్రిక ఎన్నికలు కనుచూపు మేరలోకి వచ్చేశాయి. కాంగ్రెసు నాయకులు మెల్లగా పార్టీలోంచి బయటకు వెళ్ళడానికి దారులు వెదుక్కుంటున్నారు. ముఖం చెల్లని నాయకుల్ని తప్పించి కొత్త ముఖాల్ని వెదికే పనికి రాహుల్ గాంధీ స్వయంగా నడుం కట్టారు. ఇప్పుడు నందన్ నీలకేణి, చందన్ చతుర్వేదీ, మరో దానయ్యలను వెదకాల్సిన పని ఏర్పడింది. అలాంటివారికి కొండకి వెంట్రుకని కట్టే అవకాశం. కాంగ్రెసుకు మరో గత్యంతరం లేని దేబిరింపు. ఏనాడయినా - అరిచి గీపెట్టినా పార్టీ నందన్ నీలకేణి వంటి ఉద్దండులకి అవకాశం ఇచ్చేదా - లల్లూవంటి సహచరులు ఉండగా? తెలంగాణా ధర్మమా అంటూ తెలుగు దేశంలో బొత్తిగా కొత్తమొహాలకు అన్వేషణ జరగాల్సిందేనని రాజకీయ ప్రముఖులు అంటున్నారు.

ఉన్నట్టుండి పైకి ఎగదన్నే ఆవేశం నిజాయితీ అనిపించుకోదు. ఆకతాయితనం అనిపించుకుంటుంది. ఇది బోరవిరుచుకున్న అవినీతి కంటే పండి ముదిరిన ఆత్మవంచన.

 
 
      gmrsivani@gmail.com   
                జనవరి 13,,  2014          

*************

Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   


KOUMUDI HomePage