|
|
Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here
ఓ గొంతు - ఓ గర్జన
అరవై ఐదు సంవత్సరాలు కుళ్ళి, అహంకారంతో, స్వార్థంతో
నేరచరిత్రతో గుండెలు దీసిన ధైర్యంతో చట్టాల్నీ, చట్టసభల్నీ కైవశం చేసుకుని
దేశాన్ని దోచుకుతింటున్న పాలక వ్యవస్థలో కేవలం 9 నెలల్లో రూపు దిద్దుకుని
--ప్రజల మద్దతుని సాధించి, మైనారిటీ వోటుతో మెజారిటీని నిరూపించుకోవడానికి
అసెంబ్లీలో నిలబడిన- ఏనాడూ నిలబడాలని,నిలబడతానని ఊహించని ఓ సాదా సీదా
నేలబారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గొంతు విప్పితే ఎలా ఉంటుంది? ఇలా
ఉంటుంది.'మేము పార్టీ రాజకీయాలు నడపడానికి ఇక్కడికి రాలేదు. ఆ పని మాది కాదు.
మా జీవితాల్లో మేమెప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. చేస్తామని అనుకోలేదు.
మేము సాదాసీదా నేలబారు మనుషులం. మాకు స్టేటస్ లేదు, అక్కడ కూర్చున్న 'వందన'
ఓ ఇల్లాలు.ఆమె వెనుక కూర్చున్న అఖిలేష్ సివిల్ పరీక్షలు రాయడానికి ఢిల్లీ
వచ్చాడు.ఆ వెనుక కూర్చున్న ధర్మేంద్ర సింగ్ కోలీ చెల్లెలు హత్యగావించబడింది.
ఈ 28 మంది ఇలా వచ్చిన వారే. వీళ్ళు ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయవలసి వచ్చిందో
ఆ అసెంబ్లీ ఆలోచించాలి. ఈ దేశంలో నేలబారు పౌరుడికి ఏం కావాలి? కడుపుకి
పట్టెడన్నం కావాలి. పిల్లలకి చదువు కావాలి.రోగం వస్తే నయం చేసే వైద్యం
కావాలి. ఉండానికి చిన్న ఇల్లు కావాలి. తాగే నీరు కావాలి. కరెంట్ కావాలి.
తనూ,తన కుటుంబమూ, పిల్లలూ క్షేమంగా ఉండే వాతావరణం కావాలి. తనకి న్యాయం చేసే
వ్యవస్థ కావాలి. ఈ 65 సంవత్సరాలలో ఈ కనీస అవసరాలు ఈ నేలబారు మనిషికి
దక్కలేదు. ఎందుకు? ఈ చిన్న సౌకర్యాలు ఎందుకు అందలేదు? నిన్ననే ఢిల్లీలో
చలికి తట్టుకోలేక ఇద్దరు చనిపోయారని విన్నాం. ఎందుకిలా జరిగింది? గత 65
సంవత్సరాలుగా ప్రభుత్వం కోట్లాది రూపాయిలు ఖర్చు చేస్తోంది. అయినా ఈ
అనర్ధాలు జరుగుతున్నాయి. ఆ డబ్బుంతా ఏమయింది? ఆ డబ్బు సజావుగా ఖర్చు అయి
ఉంటే ఈ పాటికి నేలబారు మనిషి కనీసపు అవసరాలు తీరేవి. కాని ఆ డబ్బు రాజకీయ
వ్యవస్థ చేతుల్లోకి పోతోంది. ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకు
పోయింది. రాజకీయాల్లో నేర చరిత్ర స్థిరపడింది. ఇవాళ చదువులెందుకు పాడయాయి?
కారణం-- రాజకీయ వ్యవస్తలో అవినీతి, ఆరోగ్యరంగం అధోగతిలో ఉంది. కారణం--
రాజకీయ వ్యవస్థలో అవినీతి. విద్యుచ్ఛక్తి సమస్యలు, నీటి సమస్యలు, రోడ్ల
సమస్యలు, రవాణా సమస్యలు. కారణం- రాజకీయ వ్యవస్థలో అవినీతి. ఇవాళ అందరం ఏకమయి
ఈ రాజకీయ వ్యవస్థని మార్చాలి.రెండేళ్ళ కిందట నేలబారు మనిషి రోడ్డు మీదకు
వచ్చి అవినీతిని ఖండిస్తూ చట్టాన్ని చేయమని కోరాడు.కాని రాజకీయ నాయకులు--
మీకు దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి మీరే చట్టాలు చేయండి--అని అన్నారు.
నేలబారు మనిషి పేదవాడు, గతిలేని వాడు. ఎలా పోటీ చేస్తాడని అనుకున్నాడు
రాజకీయ నాయకుడు. మాకు ధనబలం ఉంది, భుజబలం ఉంది-- ఈ నేలబారు మనిషికి ఎంత
ధైర్యం అనుకున్నాడు. అది రాజకీయ నాయకుల పెద్ద పొరపాటు. వాళ్ళు మరిచి పోయిన
నిజం ఒకటుంది. నేలబారు మనిషి పొలంలో పని చేస్తాడు. రాజకీయ నాయకుడు
కాదు.నేలబారు మనిషి నూలు నేస్తాడు. రాజకీయనాయకుడు కాదు.నేలబారు మనిషి రాళ్ళు
మోస్తాడు, రాజకీయ నాయకుడు కాదు.నేలబారు మనిషి టాక్సీ నడుపుతాడు.
రాజకీయనాయకుడు కాదు. నేలబారు మనిషి చంద్రమండలానికి వెళ్తాడు. రాజకీయనాయకుడు
కాదు. నేలబారు మనిషి పరిశోధనలు చేస్తాడు. రాజకీయనాయకుడు కాదు. రాజకీయ
నాయకులు ఏమీ చేయరని తెలుసుకున్నాక నేలబారు మనిషి ఎన్నికల్లో పోటీకి
సిద్ధపడ్డాడు. రాజకీయవాతావరణాన్ని ప్రక్షాళితం చేయడమే నేలబారు మనిషి లక్ష్యం.
కానీ, అతని దగ్గర డబ్బులేదు. నల్లధనం తీసుకోలేడు.కానీ, నిజాయితీతో
ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు. పోటీ ప్రారంభమయింది. కొన్ని నెలల క్రింద
ప్రారంభమైన పార్టీ 28 సీట్లు గెలుస్తుందని ఎవరు కలగన్నారు? రాజకీయనాయకులు
నవ్వారు.వెక్కిరించారు. మీ తరం కాదన్నారు. అయితే, ఒక సామెత ఉంది. మనిషికి
ఎవరూ తోడు లేనప్పుడు దేవుడు తోడుగా నిలుస్తాడని. దేవుడు నిజాన్ని
సమర్ధిస్తాడు. నిజాయితీని సమర్ధిస్తాడు. డిసెంబర్ నాలుగు, ఎనిమిది తారీఖుల
మధ్య ఓ మ్యాజిక్ జరిగింది. నేలబారు మనిషి (ఆమ్ ఆద్మీ) ఎన్నికల్లో గెలిచాడు.
ఇప్పుడీ పోరాటం ఈ దేశంలో అవినీతిని నిర్మూలించడం. వ్యవస్థకి చికిత్స చేయడం.
*************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com |
|