Error: Embedded data could not be displayed.
  చిన్న మొక్కగా మొదలైన ప్రస్థానం, ఎండా వానలతో సావాసం చేస్తూ, చేతులు చాచి విస్తరిస్తూ, నింగిని ఆలింగనం చేసుకోడానికా అన్నట్టు ఆకాశం వైపు అడుగులేస్తూ, నీడనిస్తూ హాయినిస్తూ, ప్రాణ వాయువునిస్తూ...కాలాన్ని స్వాగతిస్తూ, అనుగుణంగా ఒదిగిపోతూ,రంగూ రూపు మార్చుకుంటూ..తనదంతా సమర్పిస్తూ..
వేళ్ళల్లో, కొమ్మల్లో తన మూలామూలల్లో, తన నీడనా, తన చుట్టూ సాగిపోతున్న జీవనాన్ని నిశబ్దంగా వీక్షిస్తూ..
ఆకుల్లో పువ్వుల్లో ' సృష్టి ముందడుగుకి' సహకరిస్తూ, తన ఉనికికై విశ్వ ప్రయత్నం చేస్తూ
ఇన్ని చేస్తూ, అన్నీ ఇస్తూ, ఎన్నో చూస్తూ, అనుభవాల్ని నింపుకుంటూ........................... మౌనంగానే ఎదుగుతుంది చెట్టు.

ఎండనపడి నీరసించిన శరీరం కంటబడిన చెట్టు నీడన కొత్త శక్తిని పుంజు కోలేదూ.. కరెంటు కష్టాలా చెట్టు 'హాయి' ఉండనే ఉంది. టీవీ ముందునుండి కదలని ఈ తరం పిల్లలకి చెట్టుకి వేలాడదీసిన ఉయ్యాల రుచి ఒక్కసారి చూపిస్తే సరి!
పురుగూ పక్షీ పశువూ దేన్నీ కాదనదు చెట్టు . ఏదీ లేదనదు.
మనసులో వేదన, ఆలోచనలు భారమయినప్పుడు ఏ చెట్టు కిందో కాసేపల గడిపితే మెలిపెడుతున్న చింతలన్నీ పండుటాకుల్లా రాలి మనసు తేలికవక తప్పదు.. ఇలా చెప్పుకుంటూ పోతే చెట్టు చేసేదంతా మేలే. అలాంటి చెట్టుని కొట్టడం అంటే మన కాళ్ళని మనం నరుక్కోవడమే.
నిన్నటి తరం నాటిన మొక్క 'ఫలాలని' అందుకుంటున్నాం మనం.. మరి రేపటి తరానికి అందించాల్సింది మనమేగా...

చత్తీస్ ఘడ్..ఈ పేరు వింటేనే 'పచ్చదనం' కళ్ళ ముందుకొస్తుంది. దానితో పాటే ఎండల్లోనూ హాయినిచ్చే చల్లదనం. ఎవరో అన్నారు 'ఇక్కడ (వరంగల్) లో అప్పుడే ఎండలు మాడ్చేస్తున్నాయి, అక్కడ ఎలా ఉందీ అని'. నేను చెప్పాను ,ఇక్కడా 'ఎండలున్నాయి , చెట్లూ ఉన్నాయి' అని. నిజం, ఎప్పుడు ఎవరు నాటారో, అవే మొలకెత్తాయో కాని ఎవరూ మాత్రం 'చెట్టుని కొట్టలేదు'. రోడ్ల పక్కన, ఇంటి ఆవరణల్లో పెద్దవీ చిన్నవి ఎన్నో చెట్లు.. కొన్నైతే మహా వృక్షాలు. .. నీడకై వెతుక్కోవాల్సిన అవసరం, చల్ల గాలికి ఏ కొరతా లేదన్నట్లు. ఇంటి అవసరాల కోసం వెదురు ఇంటి దగ్గరో పోలాల్లోనో పెంచుకుంటారు. 'కట్టెల' కోసం ఎంత దూరమైనా అడవికే నడుస్తారు. ఏ చెట్టు ఏ రకమో, దేని వల్ల ఎన్ని ఉపయోగాలో , రేపటి అవసరాలకి ఇప్పుడే నాటాల్సిన ఆవశ్యం, ఆ మొక్కనెలా కాపాడుకోవాలో..ఇలా ప్రతిదీ ఎవరూ నేర్పాల్సిన అవసరం లేకుండానే చేసుకు పోతుంటారు ఇక్కడి పల్లెల్లో నివసించే వాళ్ళు.
ఇప్పటికీ మట్టినంటుకుని చెట్టునల్లుకున్న వీరి జీవన విధానం ఎంతైనా స్పూర్తినిచ్చేదే..