Error: Embedded data could not be displayed.
 
ప్రకృతి స్వేదానికి పట్టిన దోసిలిలా, ఒకో వాన చినుకుని కాసేపైనా తన దోసిలిలో పట్టి ఉంచాలని ప్రతి పువ్వుదీ ఉత్సాహం అయితే.. తోటంతా పూలు... ఓ అద్భుతం అ దృశ్యం! కనులకైతే పండుగే. మనసుకైతే మైమరపే!
పగలంతా తన ప్రతాపంతో చికాకునే కలిగించినా ఆ పొద్దు సెలవంటూ పడమటి వైపున వాలుతూ అనంతమైన ప్రేమని రగిలిస్తుంటాడు , పంచమని . సూర్యాస్తమయ రంగుల విన్యాసాలకు స్పందించని హృదయం ఉంటుందా! వొడ్డున వాలిపోవాలని ఆత్రంగా వచ్చిన కెరటాలని అంతలోనే సముద్రుడు వద్దు వద్దు అంటున్నాడా అన్నట్టు తనలోకే లాక్కునేంతలో ప్రేమగా వచ్చి పాదాలను తడుముతూ కుశలమడుగుతున్న అల ఆత్మీయత కనిపినచని హస్తాలతో హత్తుకోలేదూ.. కాసేపలా నడిస్తే ఎంత ప్రశాంతత.
ప్రకృతికి ... అందం, ప్రేమా, ప్రశాంతతా పర్యాయ పదాలే కదూ! తనిచ్చేవన్నీ అనుభవిస్తూ ప్రకృతి కడుపునే కొట్టాలనుకుంటే అనర్ధమే కదా!
పువ్వులో ఉన్న సుకుమారం కాయగా మారుతూ మొరటు తనం సంతరించుకుంటూ పల్లేరు గాయ అవుతుంది... పువ్వు అందం ఆకర్షించడానికైతే ఆ కాయలో కరుకు దనం రక్షణ కవచం ప్రతి సృష్టి కి ఆధారం. పువ్వు వెదజల్లుతుంది సువాసనైనా, దుర్వాసనైనా అర్ధముంది. కాయ చేదైనా, తీపైనా కారణముంది. గొంగళి పురుగుని చూసి కలిగే వికారం సీతాకోకచిలుక ఆకారంలో మమకారం అవుతుంది.. ఏది ఏమైనా అన్నిటి పరమార్థం ఒకటే సృష్టిని కలసి కట్టుగా ముందుకి నడిపించడం.
ఊసరవెల్లి కి మారే రంగులు, తోకను కోల్పెయే బల్లి , ఆపదంటేనే విషం చల్లే పాము, పక్షి అరుపులూ అతి సహజ లక్షణాలు. పాము పగబడుతుందనో, పక్షుల గూళ్ళు కిటికీల్లో కీడనో, అపశకునమనో , అరిష్టమనో వాటిని కష్టపెట్టాలనుకుంటే మనిషికి మిగిలేవి నష్టాలే..
లెక్కకు మిక్కిలి అనిపించే చిన్న జంతువులు, లెక్క ఇంతేనా అనిపించే పెద్ద జంతువులూ... ప్రకృతికీ ఓ లెక్కుంది అనిపించట్లేదూ .. .. ఆహారం కోసమే అయితే ధర్మం అలంకరణ కోసమో, అత్యాశతోనో ఈ లెక్క తప్పడానికి మనిషి కారణమయితే ప్రకృతి మనిషి లెక్క సవరించే పనిలో పడిందంటే అది 'పగ' ఎలా అవుతుంది? ప్రకృతి నిర్ణయం ధర్మమే కదా..
కట్టెపుల్ల కదులుతుందని ఆసక్తిగా చూడబోయి అది పుల్ల కాదు పురుగని తెలిసి ఉలిక్కపడి దూరంగా జరిగామా..అది పురుగా ఆకా! పురుగు ఆకయ్యిందా ఆకు పురుగయ్యిందా. ఆ దూరంగా కనిపిస్తుంది రాయా పక్షా.. పోల్చుకోలేము రెక్కలు విప్పుకునే వరకు.. ఎన్ని వింతలో, ఎన్నెన్ని అద్భుతాలో మరిన్ని అనుభూతులో.. ఆశ్చర్యమే కదూ! జీవితాన్ని ఆస్వాదించడానికి ఇవి చాలవా... అన్వేషిస్తే సరి! అడుగడున సాక్షాత్కారం అవుతున్న సత్యాలు మనలోని అసహాజాలని మనమే మంటల్లో వేసి కాల్చుకునేల చేస్తుందేమో!