చత్తీస్ ఘడ్ ..
దట్టమైన అడవులూ, ఇప్పటికీ ఆ అడవి తల్లి చిటికిన వేలు వదలని జీవనం!
కనుచూపు మేరా పచ్చని పంట పొలాలు, పొలం గట్లు, పంట కాలువలు..మామూలే!
అవే గట్లపై వేళ్ళూనుకుని, ఎన్నో ఏళ్లుగా, తర తరానికి మారుతున్న మనిషి
జీవన విధానానికి మూగ సాక్షులుగా కనిపిస్తాయి అక్కడక్కడా మహా వృక్షాలు.
ఆ కాస్త భూమిని కూడా సాగు చేసుకోవచ్చు కదా అనో, వాటిపై చేరిన పిట్టల
గుంపులు పంటలను కాజేస్తున్నాయనో చెట్లను నరకడం అనే ఆలోచనే రాని వీరు, ఆ
చెట్లు, పచ్చదనం తో మమేకమైన వీరి జీవిత అలవాట్లు అబినందనీయం... చెట్లు,
చెట్లపై పక్షులు , చెట్లకల్లుకున్న సాలీల్ల గూళ్ళు..రైతుకి నేస్తాలె కదా!
అంతా బాగానే ఉంది..మరి పొలాల్లో మనుషులు కనిపించరే!
కలుపులు తీస్తూనో, తీయిస్తూనో, పురుగుల మందులు చల్లుతూనో మనుషులు
కనిపించాలిగా.. ఒక్క మనిషి జాడైనా లేదే!
పంట వేసి వదిలేశారా, లేక ఎవరో అన్నట్లు వీరు బద్దకస్తులా...! ఆశ్చర్యం
గానే ఉండేది నాకు!
కలుపులు తీయడం, పంట అడుగు మందులే కాదు, పై పురుగు మందులు చల్లడం లాంటివి
చేయరు.. నాటు వేయడం తోనే ఇక పంట చేలో మాకేం పనన్నట్లుగా, ఏమీ
పట్టనట్లుగా కనిపిస్తారు... ఇవీ! ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో పంట చేల
వైపు వెళ్తే అక్కడ మనకి కనిపించే దృశ్యాలు..
అక్టోబరులో అక్కడో ఇక్కడో కాస్త అలికిడి అయినట్లు అనిపించినా నవంబరు
వచ్చేసరికి అప్పటివరుకూ కళ్ళు అలవాటు పడిన దృశ్యాల్లో ఒక్కసారిగా
చైతన్యం మొదలౌతుంది ! వరి పైరు కోత కాలం ఆరంభంతో..
చేతిలో కొడవలితో వడివడిగా గట్లపై నడుస్తూ ఒకరైతే, కోసిన పంటని భుజాలపై
ఇంటి దగ్గరి కల్లాలోకి మోస్తూ ఎదురు పడే మరొకరు..
చూస్తుండగానే నున్నగా అలికి ఇంటి ఆవరణని కళ్లాలుగా మార్చే ఆడవాళ్ళు..
పంట నూర్చడానికి మిగతా అంతా సిద్దం చేసుకుంటున్న మగ వారు..
పంటలో, ఇంటిలో చేతనైన సాయం అందించడానికి చిన్ని చిన్ని చేతుల చిన్నారులు!
ఒక జీవితం గడపదానికి ఇంతకు మించిన బతుకు పాఠాలేమున్నాయి అనిపిస్తుంది ఆ
పిల్లలను చూస్తుంటే!
పొద్దున్నే, మంచు తెరలని తొలగించుకుంటూ సూర్యుడు మెల్లి మెల్లి గా
పైపైకి వస్తుండగా...
ఆ వేడి కోసమే మేము తపస్సు చేస్తున్నదీ అన్నట్లు పొలం గట్ల పై బారులు
తీరి సూర్యునికేసే చూస్తున్న కొంగలు...
ఆకు చివరల నుండి జారడానికి సిద్దమవుతూ సూర్యుని లేత కిరణాలని
ప్రతిఫలిస్తున్న మంచు ముత్యాలు
వోవ్...వోవ్..వోవ్.. దూరంగా ఎక్కడో ఎద్దులని అదిలిస్తూ నాగలిని
సాగిస్తున్న రైతుల లయ బద్దమైన అరుపులు..
కెమెరా పట్టుకుని అలా పొలం గట్లపై నడుస్తుంటే అడుగడుగునా అపురూప దృశ్యమే..
ఏ ఒక్క దృశ్యమూ కెమెరాలో బంధించక వదలాలని అనిపించదు.
ఒకరి కోతకి ఇంకొకరు తోడుగా, వీరి పంట కోతకి వారు తోడుగా, లేదా ఎవరి పంట
వారే అన్నట్లుగా ఒంటరి పోరాటమే కాని కూలీలను పెట్టి పైరుని కోయించడం
లాంటివి ఉండవు..
పైరునంతా ఇంటివాల్లె కోయడమే కాక , కోసిన పంటని ఇంటికి చేర్చడానికి ఎడ్ల
బండ్లు, ట్రాక్టర్లు లాంటివి కూడా వాడరు. ట్రాక్టర్లు ఏమో కాని ఎడ్ల
బండ్లు కనిపించక పోవడం మరీ ఆశ్చర్యంగా ఉంటుంది.
ఎడ్లని నాగలి లాగడానికి తప్ప ఎలాంటి బరువులు లాగించడానికి ఉపయోగించరు..
వీరికుందే భూమి కూడా తక్కువే.. ఒకటికి తక్కువ నుండి నాలుగు ఎకరాలకి
మించి భూమి ఉండదు. మొదటి పంటగా వరి, రెండో పంటలో నూనె గింజలు, పప్పు
ధాన్యాలు మరో వైపు కూరగాయలు.. వచ్చే సీజను వరకు బతకడానికి ఇంతకన్నా ఏం
కావాలి అన్నట్లుగా ఉంటుంది ఇక్కడి వారి వ్యవసాయ పద్ధతి.. కాలాన్ని
అనుసరించి ఏ పంట ఏ సమయంలో వెయ్యాలో, నీటిని ఎలా వృధా కాకుండా
వినియోగించుకోవాలో వీరికి బాగా తెలుసనుకుంటాను..
వ్యవసాయం లో ఆధునిక యంత్రాల వాడకం, కూలీలు, పురుగు మందులు...ఇలా
వ్యవసాయ ఖర్చులు పెంచుకుంటూ పోయి 'ఆశిం'చిన పంట రాలేదని రైతు
కుంగిపోవడం లాంటివి ఇక్కడ అసలు కనిపించవు... పండినంతే చాలు.. మిగిలినదే
అమ్ముతుంటారు..ఆ నేల గొప్ప తనమో ఏమో, బాగానే పండుతుంది కూడా...!