Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

కమిషన్లూ- కమామిషూ

గొల్లపూడి మారుతీరావు

gmrsivani@gmail.com

 

        వెనకటికి ఒకాయన అడిగాడు: రైల్వే టైంటేబిల్ వల్ల లాభం ఏమిటని. చాలా పెద్ద లాభమే వుంది. రైళ్ళు ఎప్పుడెప్పుడు, ఎలా సమయానికి రావడం లేదో మనం అర్ధం చేసుకు ఆనందించవచ్చు. లేదా క్రమశిక్షణతో ఎప్పుడూ ఎలా లేటవుతాయో తెలుసుకోవచ్చు.అయితే ఎందుకు? చస్తే ఈ ప్రశ్నకు దేవుడుకూడా సమాధానం చెప్పలేడు. 

        అలాంటిదే మరో ప్రశ్న. ఈ దేశంలో ఎంక్వైరీ కమిషన్లు ఏం చేస్తాయి? రిటైరయిపోయిన న్యాయమూర్తులకు చేతినిండా పనినిస్తాయి. వారు పని చెయ్యడానికి సాయపడేవారికి పనులు దొరుకుతాయి. ఎప్పుడో ఎలాగో న్యాయం జరగకపోదనుకునేవారికి తృప్తి కలుగుతుంది. ఎప్పుడూ న్యాయం జరపనక్కరలేదని తెలిసిన ప్రభుత్వానికి పబ్బం గడుస్తుంది. ప్రతిపక్షాలకు అక్కసు తీరుతుంది. వెరసి- ఎప్పుడూ ఏమీ జరగదు.

        అసలు కధేమిటంటే- ఎప్పుడయినా ఏదయినా ఉపద్రవం జరిగినప్పుడు రాజకీయ నాయకులు (అనగా అధికారంలో ఉన్న ప్రభుత్వం) వాడే మొదటి ఆయుధం- పరిశీలక సంఘం. ఇది అన్ని రోగాలకీ Shock absorber. అలాంటిదే మరో ఆయుధం- సీబీఐ విచారణ. సీబీఐ వారు ఎక్కడో ఆకాశం నుంచి దిగివచ్చిన దేవతామూర్తులో, హరిశ్చంద్రులో కారు. కాని సీబీఐ గవర్నమెంటు ఆరేసిన మడిబట్ట. అది పూనుకుంటే పవిత్రత సిద్ధించినట్టే. కాని వారూ గవర్నమెంటు మాటే వింటారనీ, గవర్నమెంటు అడుగులకే మడుగులొత్తుతారనీ అందరికీ తెలుసు. ఒత్తాలని వారికీ తెలుసు. ఇది అందరికీ తెలిసినా అందరూ అంగీకరించే చిదంబర రహస్యం.

        ప్రజాభిప్రాయం ఎప్పుడూ గొర్రె మనస్తత్వం. దాని నడకని మొదటి రెండు మూడు గొర్రెలు నిర్ణయిస్తాయి. దాని ఆవేశాన్ని ఆ గుంపులో మొజారిటీ నిర్ణయిస్తుంది. ఆ గొర్రెల దారిని మళ్ళించి, వాటిని సముదాయించి, నోరెత్తకుండా ఓ మూలకి తోసే అతి చాకచక్య మైన, సాధికారికమైనఎత్తుగడ పేరు- పరిశీలక సంఘం.

        బొంబాయిలో పేలుళ్ళు జరిగాయి. కొన్ని వందలమంది చచ్చిపోయారు. చచ్చిపోతారని తెలిసిన పెద్దలు పాకిస్థాన్ కి తరలి పోయారు. పాకిస్తాన్ తో మనకో సుఖం వుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలుస్తాయి. వాళ్ళ అడ్రసులు దొరుకుతాయి. ఇళ్ళ ఫొటోలు పేపర్లలో వస్తాయి. కాని పాకిస్థాన్ ప్రభుత్వానికి వీరు దేవతామూర్తులు. కళ్ళకు కనిపించకుండా తిరుగుతూంటారు. ఆ మధ్య అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ క్రీడాకారుడు జావేద్ మియందాద్ కొడుక్కి దావూద్ ఇబ్రహీం కూతుర్నిచ్చి పెళ్ళి చేశారు. పెళ్ళికి చాలామంది వచ్చారు. ఆ పెళ్ళిలో ఒక్కరే ఎవరి కళ్ళకూ కనిపించకుండా తిరిగారు. ఆయన దావూద్ ఇబ్రహీం.

        సరే. బొంబాయి పేలుళ్ళ మీద విచారణకి శ్రీ కృష్ణా కమిషన్ ని వేశారు. కేవలం 14 సంవత్సరాల తర్వాత రిపోర్ట్ వచ్చింది. ఇంతకీ టైగర్ మెమూన్ గారెక్కడ! 1984 లో సిక్కు ఊచకోత జరిగింది. నానావతీ కమిషన్ విచారణ జరిపింది. ఎన్నాళ్ళు? దాదాపు 25 సంవత్సరాలు. నేరస్థులని భావించిన వారు కొందరు చచ్చిపోయారు. ఇంకా  జగదీశ్ టైట్లర్ గారు పిల్లి గెడ్డంతో మనమధ్య తిరుగుతూనే వున్నారు. ఇలాగ తలుచుకోవాలంటే- అహూజా కమిషన్, ధిల్లన్ కమిషన్, తెహల్కా కమిషన్,  వాలేకర్ కమిషన్, ఖోస్లా కమిషన్, ముఖర్జీ కమిషన్, సహారియా కమిషన్, సర్కారియా కమిషన్,  మిశ్రా కమిషన్, మార్వా కమిషన్-ఇలా కోకొల్లలు.

        కన్యాశుల్కంలో అగ్నిహోత్రవధాన్లు పక్కింటి వాడి గోడ తనదేనని దావా వెయ్యాలంటాడు. గిరీశం వెంటనే "ఈ గోడ స్పష్టంగా మీదాన్లాగే కనబడుతోందండిఅంటాడు. ఈ కమిషన్లు సరిగా గిరీశం పాత్రను నిర్వహిస్తాయి. వీటికి తమ అభిప్రాయం చెప్పడం వరకే పరిమితం. చర్యని అప్పటి ప్రభుత్వం తీసుకోవాలి. కొన్న నివేదికల్ని ప్రభుత్వాలు బయటికి తియ్యవు. మండల్ కమిషన్ రిపోర్ట్ కొన్ని దశాబ్దాలు అలా పడివుంది. కొన్ని బయటికి వచ్చినా ఏ చర్యలూ తీసుకోరు. కొన్నిటికి కాలదోషం పడుతుంది.

        ఇలాంటిదే ఇప్పుడు రంగంలో దిగిన లెబర్హాన్ కమిషన్ రిపోర్ట్. 1992 లో బాబ్రీ మసీదుని విశ్వ హిందూ పరిషత్, భజరంగ దళ్, శినసేన కార్యకర్తలు కూల్చారు. ఇది ఒక నిముషంలో జరిగే పనికాదు. కొన్ని గంటలు, కొన్ని వేలమందితో జరగాల్సిన పని. మరి ఇంత సమగ్రమైన పని జరుగుతూండగా దేశమంతా చూసింది. ప్రభుత్వాలు ఎందుకు చూడలేదు? సరే, దీనికి భాధ్యులెవరు? మన దేశంలో నాయకులు మతం పేరెత్తితే రెచ్చిపోతారు.(కులం పేరెత్తినా రెచ్చిపోతారు- అది రెండో పార్టు.) రెచ్చిపోయారు. వెంటనే ప్రభుత్వం ఓ కమిషన్ ను నియమించింది. లెబర్హాన్ కమిషన్ ఈ దేశంలో ఓ చరిత్రను సృష్టించింది. 17 సంవత్సరాలపాటు 48 సార్లు వాయిదాలు తీసుకుని, అయిదేళ్ళ కిందటే విచారణ పూర్తిచేసి, మరో అయిదేళ్ళపాటు రచనకు కూర్చుని , 900 పేజీల అపూర్వ గ్రంధాన్ని సిద్ధం చేసింది.ఈలోగా ఈ నేరంలో భాగముందని నలుగురూ అనుకున్న పీవీ నరసింహారావుగారు కన్నుమూశారు. అప్పటీ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ప్రస్థుతం గోళ్ళూ గిల్లుకుంటూ యింట్లో ఉన్నారు. అసలీపని రెచ్చగొట్టారని అభియోగం వున్న వాజ్ పేయీగారు అటు తర్వాత రెండు సార్లు ప్రధాని అయి, రెండో విడతలో అయిదేళ్ళు పాలన జరిపి, రిటైరయి ప్రస్థుతం అనారోగ్యంతో మంచమెక్కారు.

              నేరస్థుల జాబితాను లెబర్హాన్ గారు సోదాహరణంగా ప్రకటించారు. కాని ఇది కొత్తేముంది? అందరికీ తెలిసిన విషయమే కదా? అయితే ప్రస్థుతం నిజాన్ని శంఖంలో పోశారు.  ఆ జాబితాలో ఉన్నవారంతా "అవును. మేం నేరాలు చేశాం. మీ దిక్కునవాడితో చెప్పుకోండీ' అని పదే పదే అంటూనేవున్నారు. మరీ ముఖ్యంగా లెబర్హాన్ నివేదిక బయటపడిన రోజున కళ్యాణ్ సింగ్ పత్రికా సమావేశాన్ని పెట్టి "ఆ రోజు మసీదు కూల్చినందుకు నేను సిగ్గుపడడం లేదు. బాధ పడడం లేదు. పశ్చాత్తాప పడడం లేదు. ఏం చేస్తారో చేసుకోండీ' అన్నారు.

              అయ్యా, కొండని తవ్వడాన్ని ఎలుక మన పక్కనే వుండి చిరునవ్వుతో గమనిస్తోందన్న నిజాన్ని ప్రభుత్వం తెలుసుకోడానికి 17 సంవత్సరాలు పట్టింది. ఇది హాస్యవంతమైన లెబర్హాన్ కామెడీక్ ముక్తాయింపు.

           వెండి తెరమీద ఎన్నో సినీమాలు ఆడుతూంటాయి. కధలు మారుతాయి. ప్రేక్షకులు మారుతారు. నటులు మారుతారు. నిర్దేశకులు మారుతారు.సన్నాయి నొక్కులు మారుతాయి. కాని తెరకి దోషం అంటదు. అది ఎక్కడికీ పోదు. అలాగే దోషులు మారుతారు. నేరాలు మారుతాయి.కొత్త కమిషన్లు వస్తాయి. కాలం జరుగుతూంటుంది. ఏమీ జరగదని ప్రజలకి తెలుసు. ప్రజలకి తెలుసన్న విషయం నేతలకీ తెలుసు.ఇది కధముందే తెలిసిపోయిన కొత్త సినీమాలోని పాత ముగింపు.

                           కాని నాదొక్కటే బాధ. 17 సంవత్సరాల తర్వాత లెబర్హాన్ గారు నిరుద్యోగి అయిపోయారే- అని.

                                          (ఆంధ్రప్రభ సౌజన్యంతో)                 

                                                             డిసెంబర్ 07, 2009

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage