Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
 
'చావు'తెలివి
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com

 ఈ విషయాన్ని గురించి చాలాసార్లు రాసిన గుర్తు అయినా మరోసారి మననం చేసుకునే అతి ముఖ్యమయిన ఘట్టం ఇది.
20 ఏళ్ళ క్రితం ఈ దేశానికి ప్రధాని కావలసిన ఒక మాజీ ప్రధానిని - రాజీవ్ గాంధీని - ఎల్ టీ టీయీ బృందం దారుణంగా హత్య చేసింది. అది నిజానికి హత్యకాదు. మారణకాండ. అందులో రాజీవ్ గాంధీతోపాటు మరో 17 మంది చచ్చిపోయారు. వారి పేర్లకోసం, వారి కుటుంబ వివరాలకోసం కంప్యూటర్ ముందు కూర్చుని కొన్ని గంటలు వెదికాను. ఎక్కడా ఆ వివరాలు లేవు. ఎవరో అనామకుల చావు వివరాలు ఎవరికి కావాలి? రాజీవ్ గాంధీ చావుకి గ్లామర్ ఉంది. తెలుసుకోవాలనే ఉత్సాహం ప్రజలకీ, తెలపాలనే ఉత్సాహం ఇంటర్నెట్ ఇంజన్లకీ ఉంది. చచ్చిన పదహారో కానిస్టేబుల్ కుటుంబం వాళ్ళకి బోరింగ్ వివరం. తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరో పిచ్చి కవి శ్రీ శ్రీ వంటివారి బాధ. రాజీవ్ గాంధీ? అది తురుపు ముక్క. నేరానికి బంగారు అంచు. అది చంపిన వాళ్ళకీ తెలుసు. చావుని ప్రచారంలో నిలిపిన మాధ్యమాలకి తెలుసు. నేరస్థులని క్షమించే ఔదార్యంతో దాన్ని సొమ్ము చేసుకున్న ప్రియాంక వంటి (మా తూర్పు భాషలో) 'గుంట'లకి తెలుసు.
రాజీవ్ గాంధీతో చచ్చిపోయిన 17 మందికి సిద్దాంతాలతో కానీ, రాజకీయాలతో గానీ ఏమీ సంబంధం లేదు. వాళ్ళలో కొందరు కేవలం ఉద్యోగాలు చేసుకుంటున్న పోలీసులు. వాళ్ళకి పెళ్ళాం, పిల్లలూ ఉన్నారు. వాళ్ళ తండ్రి, భర్త ప్రతి రోజులాగే ఆ రోజూ నౌఖరీ చేసి ఇంటికి వస్తాడని ఎదురుచూశారు. కానీ రాలేదు. ఓ కొండ చరియ కూలినట్టు, రాజీవ్ గాంధీ అనే పెద్ద పేరు నీడలో దిక్కులేని చావు చచ్చారు. రాజీవ్ గాంధీ హత్యకి ప్రపంచం దిగ్ర్భాంతి చెందింది. ప్రపంచం సానుభూతి పలికింది. దేశం కన్నీటితో వారి అంత్యక్రియల్ని చూసింది. ఈ 17 మంది కుంటుంబాలవారూ ఏకాంతంగా కన్నీరు కార్చారు. వారికి ప్రభుత్వం సానుభూతితో ఉపకారం చేస్తానంది. కాని ఉపకారం వారికి అందలేదు. వాళ్ళ కుటుంబాలు - పిల్లలు - తండ్రులు పోయిన కారణంగా ఛిన్నాభిన్నమయారు. ఆ సంగతి దేశంలో చాలామందికి తెలీదు.
రాజీవ్ గాంధీ చచ్చిపోవడం వల్ల పార్టీకి మేలు జరిగింది. ఊహించరాని మెజారిటీతో పదవిలోకి వచ్చింది. భర్త చావు కారణంగా భార్య దేశంలో అత్యున్నత పదవిలో కూర్చుంది. ప్రియాంక, రాహుల్ గొంతులు అందరూ వింటున్నారు. ఈ 17 మంది కుటుంబాల పిల్లల్నీ ఎవరికీ తెలీదు. ఏ కార్తికేయనో -ఫైళ్ళు చూస్తేనే కానీ వారి పేర్లు కూడా ఎవరికీ తెలీదు.
ఈ హింసని పకడ్బందీగా రూపొందించినవారికి జరగబోయే మారణ హోమం తెలుసు. నిజానికి 18మంది పోయారు కానీ - ఎంతమందయినా చచ్చిపోయే అవకాశం ఉన్నదని తెలుసు. వాళ్ళందరూ చెయ్యని నేరానికి, నిర్దాక్షిణ్యంగా చంపబడుతున్నారని తెలుసు. వాళ్ళు అతి క్రూరంగా 18 మంది చావుకి కారణమయారు.
హత్య కుట్ర జరుగుతున్న సందర్భంలో ఇద్దరు చెయ్యి కలిపారు. మురుగేశన్, నళిని. భయంకరమైన కుట్ర వారి సఖ్యతకి ప్రాతిపదిక. అది క్రమంగా ముదిరింది. హత్య తర్వాత - కేవలం - ఆ భయంకరమైన వత్తిడి నుంచి 'ఆటవిడుపు'కి ఇద్దరూ సెక్స్ అనుభవించారు. నళిని గర్భవతి అయింది. ఇద్దరూ అరెస్ట్ అయేనాటికి - రాజీవ్ గాంధీ హత్య తర్వాతే ఆమె గర్భం దాల్చిన రుజువులున్నాయి. ఇది ఇద్దరూ భయంకరమైన వత్తిడి నుంచి విడుదలకి నిదర్శనం.
మీరూ నేనూ కాదు - ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పరిశోధక విభాగం - వారి నేరాల్ని రుజువు చేసింది. కోర్టులు అతి నిశితంగా, నిర్దుష్టంగా ఆయా నేరాలను పరిశీలించాయి. నిందితులలో దాదాపు 20 మందిని నిరపరాధులుగా తగిన సాక్ష్యాధారాలు లేనందువల్ల విడిచిపెట్టాయి. కొందరికి శిక్షలు పడ్డాయి. హైకోర్టు పునఃపరిశీలించి శిక్షలను ఖరారు చేసింది.
నేరస్థులు సుప్రీం కోర్టుకు వెళ్ళారు. సుప్రీం కోర్టు మళ్ళీ వివరాలని తిరుగదోడి ఉరిశిక్షలను ఖరారు చేసింది. దరిమిలాను క్షమాభిక్షకు నేరస్థులు రాష్ర్టపతిని ఆశ్రయించారు. రాష్ర్టపతి ముందు దాదాపు అయిదేళ్ళ పైగా నడిచిన కేసుల వివరాలున్నాయి. మూడు న్యాయస్థానాల వేరు వేరు తీర్పులు - ఒకే శిక్ష వివరాలున్నాయి. అయినా ముగ్గురు రాష్ర్టపతులు 11 సంవత్సరాలపాటు ఈ క్షమాభిక్ష మీద నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు రాష్ర్టపతి తిరస్కరించారు.
నళిని అప్పటికి గర్భవతి కనుక సోనియాగాంధీ ఆమె పట్ల సానుభూతిని చూపమన్నారు. న్యాయస్థానం చూపింది. ఇప్పుడు ఉరిశిక్ష ఆపాలని తమిళనాడులో ప్రదర్శనలు జరిగాయి. ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రియాంక అనే ఒకావిడ జైల్లో నళినిని కలిసి - తనకి ఆవిడంటే ఏ ద్వేషమూ లేదని నవ్వుతూ ప్రకటించింది. 18 కుటుంబాల సాముహిక విషాదానికి ఆమె ప్రతినిధికాదు. తండ్రి చావు కారణంగా తల్లికి దక్కిన దేశీయమైన పదవి, అధికారాన్ని రుచిచూసే కూతురి ఔదార్యమది. భేష్. అలాంటి ఔదార్యం ఆ 17 మందిలో ఏ అనామకుడి బిడ్డపట్ల ఆమె చూపినా ఆ 'క్షమ' విలువ మరింత పెరిగేది. మిగతా కుటుంబాలకు మేలు జరిగిందా అని ఆమె పూనుకుని వారికి ఉపకారం చేస్తే ఆమె ఔదార్యం ఉదాత్తంగా ఉండేది. నళిని కూతురు ప్రణీత - ప్రస్తుతం ఇంగ్లండులో చదువుకుంటోంది. ఆమె అమ్మా నాన్నా మారణ హోమంలో పాలు పంచుకుని తనకు ప్రాణ ప్రతిష్ట చేసేనాటికి ఆ నేరం భోగట్టా తెలీదు. ఇప్పుడా పిల్ల తన తల్లిదండ్రులు నిరపరాధులని చెప్పింది. ఆ మాట తమ తండ్రిపోయిన కారణంగా కనీసం తమిళనాడులో చదువుకొనసాగించే మరే హతుడి కూతురయినా చెప్పగలిగితే సజావుగా ఉండేది.
నిస్సహాయుడి కన్నీరు వ్యవస్థకి అందని వ్యర్ధమైన వ్యధ. 'క్షమ'కీ ఒక గ్లామరుంది. హింసకీ ఒక గ్లామరుంది. హింస పర్యవసానంగా దేశస్థాయిలో నిలవగలిగే ఓ తల్లి కూతురు చిరునవ్వుకీ బోలెడంత గ్లామరుంది.
తన బిడ్డని కాలేజీలో చేర్చడానికి డబ్బు సమకూర్చుకోవాలని ఆ రోజు అదనపు డ్యూటీ చేస్తూ కన్నుమూసిన అలగప్పన్ (పేరు ఇది కాకపోవచ్చు) దిక్కుమాలిన చావుకి గ్లామర్ లేదు.
20 సంవత్సరాల తర్వాత - ముగ్గురికి అమలు కావలసిన శిక్షకి ఒక రాష్ర్టం, ఒక ప్రాంతం, ఒక పార్టీ, ఒక సిద్దాంతం సమర్ధన ఉంది. మిగతా 17 కుటుంబాలకీ వీరెవ్వరి సమర్ధనా లేదు. ఆత్మవంచనకి ఇది దగ్గర తోవ.
ఈ కథకి ముగింపు ఏమిటంటే దారుణమయిన మారణ కాండలో భాగమయిన నేరస్థులకు సానుభూతిని చూపే ఈ కర్మభూమి 'ఖర్మ'ని గమనిస్తున్న - కేవలం 128 మంది చావుకి మాత్రమే కారణమయిన ఓ పొరుగు దేశం నేరస్థుడు - అజ్మల్ కసాబ్ - తనకి విధించిన ఉరిశిక్ష గురించీ ఆలోచించాలని న్యాయస్థానానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. చచ్చిపోయిన 128 కుటుంబాలలో ఒక్క ప్రియాంక అయినా ఉండదా అని ఆ నిరపరాధి ఆశ.
చావడం మీదే ఖాతరులేని పొరుగు దేశపు దౌర్జన్యకారుడికి - 20 సంవత్సరాల కిందట తమ ప్రధానిని చంపిన వారి చావుని అమలు చెయ్యలేని అలసత్వం (మానవత్వం కాదు) మరింత అలుసు కావడంలో ఆశ్చర్యంలేదు. ముందుంది ముసళ్ళ పండగ.

***


సెఫ్టెంబర్
05, 2011

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage