Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

దొంగ మెలోడ్రామా

        ఒక చక్కని డిటెక్టివ్ కధ.                    

        ఫమీదా అనే యిల్లాలు. హనీఫ్ సయ్యద్ భర్త. ఇద్దరూ తమ దేవుడినీ, మతాన్నీ ప్రేమిస్తారు. ఆ రెంటికీ దూరమయిన వాళ్ళని ద్వేషిస్తారు. అంతేకాదు. వాళ్ళని నాశనం చేసే కుట్రకూడా చేస్తారు. వారు ఆరేళ్ళ క్రితం అలాంటి కృషి చేసి కొన్ని బాంబుల్ని తయారు చేశారు. భార్యామణి ఫమీదా ఆ బాంబుల్ని ఒక టాక్సీలో భద్రంగా తీసుకొచ్చి గేట్ వే ఆప్ ఇండియా (ముంబై)లో ఓ మూల వుంచి- టాక్సీ దిగి వెళ్ళిపోయింది. మరి టాక్సీవాడికి తను అక్కడికి వచ్చిన వైనం తెలీదా? తెలిసినా వాడూ ఆ బాంబు పేలుడిలో పోతాడని ఆమె ధైర్యం. ఆశ. కాని అలా జరగలేదు. టాక్సీ డైవరుకి టీ తాగాలనిపించి టీకొట్టు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు బాంబు పేలింది. టాక్సీ ధ్వంసమయింది. కేవలం 54 మంది  చచ్చిపోయారు. 144 మంది గాయపడ్డారు. బతికిన టాక్సీ డ్రైవరు షాకయి తాను తెసుకొచ్చిన ఫమీదాగ్రి యిల్లుని పోలీసులకి చూపించాడు. దంపతులు అరెస్టయారు. ఇది 2003 నాటి మాట. ఈ ఆరేళ్ళలోనూ- ఏ ఒక్క క్షణమూ. ఏ ఒక్క రోజూ- న్యాయస్థానం తమని నిర్దోషులుగా పరిగణించి, తమ దైవ భక్తికి మెచ్చుకుని, మేకతోలు కప్పి యింటికి పంపుతారని ఆ దంపతులు ఊహించి వుండరు. అంటే- ఈ ఆరేళ్ళూ వారి మనస్సుల్లో ఉన్న తీర్పునే న్యాయస్థానం నిన్న (ఆగస్టు 7 న) ప్రకటించింది.

ప్రాణం పోయేవరకూ ఉరి తీయాలని తీర్పునిచ్చింది.

        ఇప్పుడు చక్కని మెలోడ్రామా.

        తీర్పువిన్నాక ఫమీదా తన కొడుకుని చూసి భోరున ఏడ్చిందట. పత్రికలవారికీ గుండె కరిగి ఆ విషయాన్ని చక్కగా వర్ణించారు. శ్రమ తీసుకుని ఎవరయినా చచ్చిపోయిన 54 మంది కధల్ని కెలికితే వారిలో ఎంత మంది బిడ్డల తల్లులున్నారో, ఎంత మంది తల్లుల బిడ్డలు దారుణంగా రూపయినా తెలియకుండా చచ్చిపోయి తల్లిదండ్రుల దుఃఖానికి కారణమయారో తెలిసేది. అలాగే కాలో చెయ్యో కన్నో పోగొట్టుకుని ఉపాధిని నష్టపోయిన నిర్భాగ్యుల కధలు- 144 మందివి తెలిసేవి. ఎన్ని కుటుంబాలు గత ఆరేళ్ళుగా వీధిన పడ్డాయో తెలిసేది.

        మరొక కధ.

        నళిని అనే మరో దేశ భక్తురాలు- దాదాపు 18 ఏళ్ళ కిందట- రాజీవ్ గాంధీని దారుణంగా హత్య చేసే గూడుపుఠానీలో పాల్గొంది. రాజీవ్  గాంధీతో పాటు మరో 18 మంది శరీరంలో భాగాలు కూడా దొరకకుండా ఛిద్రమయిపోయారు. కాగా హత్య జరిపాక- నళిని మురుగేశన్ తో కాపురం చేసి పిల్లనికంది. ఇప్పుడు ఆ పిల్లకి తల్లిగా తన మీద చట్టం జాలి చూపించాలని పదే పదే న్యాయస్థానానికి దరఖాస్థులు పెట్టుకుంది. అమెరికావంటి దేశాలలో న్యాయస్థానం యిలాంటి నేరాలకి 70 సంవత్సరాలు, 122 సంవత్సరాలు శిక్షల్ని విధిస్తాయి.

        ఇక- రాజీవ్ గాంధీ కూతురు- ప్రియాంక ఒకరోజు జైలుకి వెళ్ళి నళినితో కబుర్లు చెప్పి "మా నాన్నని ఎందుకు చంపావు? మా నాన్న నీకేం అపకారం చేశాడు?" అని అడిగింది. అడగాల్సింది ఆ ప్రశ్నకాదు. ఆ గుంటకి తెలివితేటలుంటే- "మా నాన్నతో పాటు - ఎందుకు చచ్చిపోతున్నారో తెలియకుండా- శరీరాలు ముక్కలు ముక్కలై చచ్చిపోయిన 18 అనామకులు నీకేం అపకారం చేశారు?" అని అడగాలి. రాజీవ్ గాంధీ చావుకి కారణమయినా వుంది. కాని అతనితో పాటు చచ్చిపోయిన వారికి ఏ కారణమూ  లేదు- ఆ క్షణంలో సమీపంలో ఉండడం తప్ప. అయితే యింత మంది చావుని నళిని ముందే ఊహించివుండాలి. నళిని మీద కోపం లేదని చెప్పడానిక్ ప్రియాంక ఎవరు? మదర్ ధెరిస్సానా? ఆ మాట రాజీవ్ గాంధీతో పాటు చచ్చిపోయిన 18 కుటుంబాలవారు అనగలరా? అసలు వాళ్ళెవరు? యిప్పుడు వారి పరిస్థితి ఏమిటి? ఎవరయినా ఆలోచించారా? రాజీవ్ గాంధీ పోయాక శ్రీపెరుంబుదూర్ లో అందమయిన స్మృతి చిహ్నం వెలిసింది. కాని ఆ 18 కుటుంబాలకీ దక్కాల్సిన ఉపశమనమో, ఉపకారమో దక్కలేదని ఆ మధ్య ప్రియాంక అనే ఆధునిక మదర్ దెరిస్సా నళినిని క్షమిస్తున్నట్టు ప్రకటించినప్పుడు ఆ కుటుంబాల వారు పత్రికల్లో వాపోయారు.

        మరో గొప్ప మెలోడ్రామా.

        మొన్ననే రాఖీల పండగ జరిగింది. తమ శ్రేయస్సునీ, జీవితాల్నీ చల్లగా కాపాడమంటూ మహిళలు సోదరుల చేతులకి రాఖీలు కట్టే సత్సంప్రదాయం ఉత్తర హిందూ దేశమంతటా వుంది.

        కాని జైల్లో వున్న కసాబ్ అనే కసాయి నాకెవరూ రాఖీ కట్టడం లేదే అని వాపోయాడు. అవును కట్టి తీరాలి. 163 మంది చావుకి కారణమయిన ఓ హంతకుడు- పరాయి దేశం జైల్లో మ్రగ్గుతూండగా- ఆడపిల్లలందరొ వెళ్ళి ""చాలా మంచిపని చేశావు బాబూ! యిలాగే ముందు ముందు మా వాళ్ళని చంప్ పుణ్యం కట్టుకో’’ అని ఆ లం.కొ (దీని అర్ధం తమకు తెలిసేవుంటుంది) కి తప్పని సరిగా రాఖీ కట్టాలి.

        ఈ దేశంలో డిటెక్టివ్ కధల కన్నా మెలోడ్రామాకి మనం పెద్ద పీట వేస్తాం. కష్టాలకు కార్చే కన్నీరు కన్నా కరుణతో కార్చే కన్నీరు మనకి గొప్పది. మనకి మానవతాహక్కుల సంఘాలున్నాయి. మానవత్వం వున్న మనుషులున్నారు. ఆన్నిటికీ మించి అర్ధం పర్ధం లేని సెంటిమెంటుని పత్రికల్లో మోసే మహనీయులున్నారు. మెలోడ్రామాని అమ్ముకునే పత్రికలున్నాయి.

        ఇవన్నీ తెలిసిన ఫమీదాలు, నళినిలూ, కసాబ్ లూ వున్నారు. అందుకే మనది కర్మభూమి మాత్రమే కాదు. మన "ఖర్మభూమికూడా.

      **********                   *********                *********                   **********
You can mail your opinions directly to Maruthi Rao Garu at gmrsivani@gmail.com
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage