Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
 
 దేవుడికి జ్వరమొచ్చింది
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com

  మన దేవుళ్లు ఒకొక్కప్పుడు మనకంటే బలహీనులు. బొత్తిగా ఆరోగ్యాన్ని నిలుపుకోలేనివాళ్లు.
ప్రతీ సంవత్సరం ఆషాడమాసంలోనే జగన్నాధుడికి జ్వరం వస్తుంది. ఎందుకని? ఆయనకి
108  కలశాలతో అభిషేకం జరిగినందుకు. జలుబుచేసి, ముక్కు దిబ్బడవేసి జ్వరం ప్రారంభమవుతుంది. భక్తులు ఆయనకి రకరకాలయిన లేహ్యాలను సిద్ధం చేస్తారు. అంతేకాదు. ఆయన సోదరుడు బలభద్రుడు, దేవేరిలతో మూడు రధాలతో బయల్దేరదీసి- వేరే ఏకాంతమందిరంలో వుంచుతారు. అక్కడ ఆయనకి 15 రోజులపాటు అభిషేకాలు లేవు. దేవుడు పత్యం చేస్తాడు. జలుబు తగ్గి ఆరోగ్యం పుంజుకున్నాక- మళ్లీ స్వస్థలానికి వస్తాడు.
మన దేవుళ్లు వెన్నదొంగతనం చేస్తారు. తల్లులతో చిన్న చిన్న అబద్ధాలు చెప్తారు. పెద్దయాక పెద్ద పెద్ద అబద్ధాలను చెప్పించే నేర్పరులవుతారు. పరాయి ఆమ్మాయిల బట్టలు దొంగతనం చేస్తారు. మనకొచ్చే కష్టాలు- ఆ మాటకు వస్తే- మనం కూడా తట్టుకునే కష్టాలను దేవుళ్లు తట్టుకోలేరు.
ఆయనకీ శరీరం రంగు సమస్యలున్నాయి. మూడు పూటలా స్నానాలున్నాయి. కొత్త బట్టలున్నాయి. యజ్నోపవీతం ఉంది. పెళ్లాలున్నారు. పెళ్లాల సమస్యలున్నాయి. కొడుకుల సమస్యలున్నాయి. పెళ్లాల కాళ్లు పట్టుకోవలసిన పరిస్థితులున్నాయి. వెరసి- మనం ఊహించని- ఒక్క మనిషి జీవితంలో రాలేని, రాకూడని పాట్లు ఉన్నాయి.
ఇంక వీళ్లు దేవుళ్లేమిటి? అనిపిస్తుంది- మన దేవుళ్ల కధలు చదివినవాళ్లకి. "అదేమిటయ్యా! అక్కడ ఒరిస్సాలో చెల్లెల్ని కట్టుకున్నవాడా?" అని మీ దేవుణ్ణి ఆడిపోసుకుంటారు. మరెక్కడో వాలిని దొంగదెబ్బ కొట్టినవాడా? అని తిట్టుకుంటూంటారు. వినాయకచవితినాడు మీ దేవుడిలాగ మీరూ తిట్లు తినాలని కోరుకుంటారు. మీ దేవుళ్లు చేతులతోనూ, చక్రాలతోనూ, గదలతోనూ చెయ్యని హత్యలు లేవు. పైగా అవన్నీ ధర్మాన్ని ఉద్ధరించడానికని పెద్దలు సమర్ధిస్థారు- ఇవన్నీ ఈ మతాన్ని కొత్తగా తెలుసుకున్నవాడికి విడ్డూరంగా కనిపించే విషయాలు.
మహాభక్తుడు-నందనార్ చెప్పులు కుట్టుకునేవాడు. అతనికి ఆలయ ప్రవేశం లేదు. మహాశివుడిని దర్శించాలని కోరిక. ఎప్పుడూ ఆలయం బయటనుండే ఆత్రంగా చూసేవాడట. కాని స్వామి దర్శనం కాదు. కారణం- స్వామి ముందు పెద్ద శరీరంతో నందీశ్వరుడు కొలువుతీరివుంటాడు. నందనార్ గుండె పగిలిపోయింది. స్వామిని వేడుకున్నాడట. "స్వామీ! నిన్ను చూడాలని కొండంత ఆశతో వస్తున్నాను. ఈ నందీశ్వరుడు నీకూ నాకూ మధ్య నిలబడ్డాడు. కాస్సేపు పక్కకి తప్పుకోమని చెప్పు స్వామీ. నిన్ను కళ్లారా చూసుకుంటాను.” ఆన్నాడు. స్వామి నందీశ్వరుడిని తప్పుకోమన్నాడు. నందనార్ కి మూలవర్ల దర్శనమయింది. తమిళంలో ఆద్భుతంగా సంగీతరూపకంగా రచించారు ఒక ఆళ్వార్. తమిళనాట 12 మంది ఆళ్వారులలో ఒకాయన కులశేఖరుడు. ఆయన స్వామిని మోక్షాన్ని కోరుకోలేదు. ""స్వామీ! నిన్ను అనునిత్యం కోట్లాదిమంది భక్తులు దర్శించిపోతూంటారు. వారి పాద ధూళి నా శిరస్సుని తాకేలాగ నీ ముందు గడపగా నన్ను పడిఉండనీ” అన్నారు. తిరుమల క్షేత్రంలో గర్భగుడిలో స్వామివారి ముందు గడపని "కులశేఖరప్పడి’ అంటారు.
మరొక భక్తుడు శివుడికి పందిమాంసాన్ని పెట్టాడు. రెండో కన్నుని యివ్వడానికి తన కాలిని గుర్తుగా శివుడి ముఖంమీద పెట్టాడు. ఆలోచనకి ఆస్కారమయినా లేని ఒక ఏనుగు స్వామికి ప్రతినిత్యం అభిషేకం చేస్తుంది.
ఇలాంటి కధలన్నీ అభూతకల్పనల్లాగా అనిపిస్తాయి. బొత్తిగా ఆలోచనచాలని ప్రాధమిక స్థాయిని గుర్తుచేస్తాయి. మన మతాన్నీ, మన దేవుళ్లనీ, మన ఆచారాల్నీ, మన ఆలోచనల్నీ వెక్కిరిస్తాయి. వేళాకోళం చేస్తాయి.
హేతువాదులకి యివన్నీ అవకాశవాదుల ఆగడాలుగా, అరాచకాలుగా కనిపిస్తాయి.
కాని-
దేవుడు మనకి పైవాడు కాదు. మనమే! ఇక్కడ భక్తుడు తన దేవుడిని తన limitations లోనే తయారు చేసుకున్నాడు. అతనిలోని limitlessness ని వెదకడం భక్తి. అమ్మకి అన్నివిధాలా తనపైన ఆధారపడే నిస్సహాయుడు తన బిడ్డ. అన్నివిధాలా తన పని తాను చేసుకునే సమర్ధుడయిపోతే? ఇక అమ్మ అవసరమేముంది? దేవుడిలో limitation భక్తుడి గడుసుదనం.
ప్రపంచ మతాల్లో మరేమతంలోనూ భగవంతుడితో యింత తాదాత్మ్యాన్నీ, యింత ఏకీభావాన్నీ సాధించిన మతం లేదు. ఇస్లాంలొ దేవుడికి రూపం లేదు. క్రైస్తవమతంలో దేవుని కొడుకే ఉన్నాడు. హిందువులు తనరూపంలో దేవుడిని భావించుకున్నారు. తమ లక్షణాల్నీ, అవలక్షణాల్నీ, తమకి అనందాన్నిచ్చే క్రియల్ని అన్నీ దేవునికి ఆపాదించుకున్నారు. ఆయన తమలాగే స్నానాదికాలు చెయ్యాలి. తమలాగే అర్ఘ్యం పుచ్చుకోవాలి. తమలాగే బట్టలు కట్టుకోవాలి. మంచిపదార్ధాలు సేవించాలి. తమకొచ్చే కష్టాలన్నీ స్వామికీ వస్తాయి. వాటన్నిటినీ ఆయనా అధిగమించాలి. అప్పటికి భక్తుడికి తృప్తి. ఈ మతంలో అనాదిగా చేసినంత muse మరేమతంలోనూ లేదు.
మానవుడి నైమిత్తిక జీవితంలో ప్రతి లక్షణానికీ, అవలక్షణానికీ, గొప్పతనానికీ, బలహీనతకీ- దేవుడికీ దగ్గరతోవవుంది. అవన్నీ ఎప్పుడో ఒకప్పుడు దేవుడు అనుభవించాడు. ఆ అనుభవాల అమృతసారమే ఎందరో ఆళ్వారుల, వాగ్గేయకారుల, దాసుల, కవుల, సాహితీపరుల కీర్తనలు! ప్రపంచంలో కళాపరంగా, సాహిత్యపరంగా, ఆధ్యాత్మ చింతనపరంగా యింత వైవిధ్యం మరే మతంలోనూ లేదు.
ఎంత ఉన్నతుడైనా -అంతులేని బాధలో, ఊహించని ఆనందంలోఅతి ప్రాధమిక మానవుడయిపోతాడు. తట్టుకోలేనిబాధతో సుడులు తిరిగిపోయే 90 ఏళ్ల వృద్ధుడూ ఆమ్మనే ఆశ్రయిస్తాడు. "మేష్టారూ!” ఆని ఏడవడు. ఆర్ధ్రతలో, అంతులేని ఆరాధనలో భక్తుదు పసివాడవుతాడు. బేల అవుతాడు. తనకంటిని భగవంతుడినికి దానమిచ్చే ఉదారుడవుతాడు. ఊహల ఎల్లలు చెరిపేసుకుంటాడు. పరిమితులు లేని ప్రేమ, పరాకాష్ట సాధించిన భక్తి- "హేతువు’కి లొంగని సింబల్ అవుతుంది. బయటనుంచి చూసేవారికి అది అసందర్భం. నందనార్ వంటి భక్తుడి అది దేవుడి సమక్షం.
మరొ దేవుడి జలుబు? నిజమైన ప్రాధమిక మనస్థత్వానికి అది మొదటి నిచ్చెన. అంతలోతుగా అలోచించలేనివాడూ దేవుడిని ఆశ్రయిస్తున్నాడు. అది గొప్ప గమ్యానికి ప్రాధమిక ప్రయత్నం. తప్పులేదు. మన దేవుడు అకాశంలొ లేడు. మన మధ్యనే ఉన్నాడు. మనలోనే ఉన్నాడు. మనమే- అనుకోవడంలో ఎంత ధైర్యం! ఎంత నమ్మకం! ఎంత దగ్గర తోవ! ఉన్నతమయిన స్థాయిలో తాదాత్మ్యం సాధించిన భక్తుడు- దళితుడైనా నందనార్ అవుతాడు. నందీశ్వరుణ్ణి పక్కకి తప్పుకొమ్మంటాడు. దేవుడు తలవొంచి అతని కోరికని తీరుస్తాడు. ఇది ఈ తాత్విక చింతనలోని మూలసూత్రం. నమ్మేవారికి వైభవం!

 ***
జూలై  04, 2011

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage