Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
 
అవినీతికి గొడుగు

గొల్లపూడి మారుతీరావు
      gmrsivani@gmail.com 

  మనం అవినీతికి 'నీతి' గొడుగు పట్టడం ప్రారంభించి చాలా ఏళ్ళయింది. తమకు గుర్తుందా? ఆ మధ్య ప్రభుత్వం మనతో లాలూచీ పడింది. "మీరు నల్లధనం ఎలా, ఏ అవినీతి పనిచేసి సంపాదించారని మేం అడగం. మీ దగ్గర ఎంత ఉందో చెప్పండి.40 శాతం మాకివ్వండి. మిగతా 60 శాతం మీ దగ్గరే ఉంచుకోండి" అన్న స్కీము పెట్టింది. ఎందరో పెద్ద మనుషులు సంతోషించారు. వేలకోట్ల ధనం పాతర్లోంచి బాంకుల్లోకి బదిలీ అయిపోయింది. ఇది ఊళ్ళని కొట్టేవాళ్ళని మంగళహారతి ఇచ్చి సత్కరించడం లాంటిది. అయితే లాభసాటి వ్యాపారం. ఎవరికి? కొల్లగొట్టేవాళ్ళకి.
ఇంతకంటే గొప్ప ఆలోచన మరో మహనీయుడు ఈ మధ్యనే చేశాడు. అది మీరో నేనో అయితే గొంతు చించుకోనక్కరలేదు. కేంద్ర ఆర్ధిక శాఖలో ప్రధాన ఆర్ధిక సలహా దారుడు డాక్టర్ కౌశిక్ బసు అనే అధికారి ఆలోచన ఇది. అది ఆర్ధిక శాఖ వెబ్ సైట్ లోనే వచ్చింది. (http://finmin.nic/working paper/Act Giving Bribe Legal.pdf)
విషయం ఇది. దేశంలో లంచగొండితనం పెరిగిపోయింది. లంచాలు అడిగేవాళ్ళూ, గతిలేక ఇచ్చేవాళ్ళూ నానాటికీ పెరిగిపోతున్నారు. ఏం చెయ్యాలో తెలీక నేలబారు మనిషి ఈ అవినీతికి తలవంచుతున్నాడు. పుచ్చుకునేవాడు లాభపడుతున్నాడు. ఇచ్చేవాడు పబ్బం గడుపుకుని రాజీపడుతున్నాడు. ప్రభుత్వం నష్టపోతోంది.
కనుక ఈ మేధావి అయిన బసుగారు ఓ పధకాన్ని సూచించారు. లంచాల అవినీతిని రెండు భాగాలుగా విభజించారు.మన మీద వత్తిడి లేకుండా చేతులు మారే లంచాలు. ఓ పిట్టకథ. మొన్ననే ఓ కుర్రాడు నాదగ్గరికి వచ్చాడు. ఏదో ఉద్యోగానికి తను ఏ నేరాలూ చేయలేదని పోలీసు శాఖ నుంచి ఓ కాగితం కావాలని. ఆ కాగితాన్ని సంపాదించడానికి నేరం చెయ్యవలసి వచ్చింది. ఓ మధ్యవర్తి పోలీసు శాఖలో బసువంటి పెద్ద మనిషికి అంతగా వత్తిడి లేని లంచం ఇచ్చి కాగితం తెచ్చుకున్నాడు. ఇంతకూ వత్తిడి ఎవరి మీద? తన జేబుమీదా? స్థోమతు మీదా? నైతికమైన విలువల మీదా? చేసుకుంటున్న ఆత్మవంచన మీదా?
సరే. బసుగారేమంటారంటే (అందరికీ అర్ధమయేలాగ పామర భాషలో చెప్పుకుందాం). తప్పక, గతిలేక, పనిగడుపుకోడానికి మరో మార్గం లేక (పై పిట్టకథలో నిస్సహాయుడిలాగ) లంచం చాలామంది ఇస్తున్నారు కనుక - ఈ దేశంలో మరీ వత్తిడిలేని లంచాన్ని చట్టసమ్మతం చేసేద్దాం. అంటే మీరు ఎమ్మార్వో ఆఫీసులో 50 రూపాయలు లంచం ఇచ్చారనుకోండి. ఇచ్చిన మిమ్మల్ని, మీ పరిస్థితిని అర్ధం చేసుకుని ప్రభుత్వం క్షమిస్తుంది. చట్టం మీ వేపు ఉంది కనుక. ఆ 50 రూపాయలు పుచ్చుకున్నవాడి పీక పట్టుకుంటుంది. న్యాయంగా ఇచ్చేవాడూ పుచ్చుకున్నవాడంత నేరస్థుడే. కాని ఇప్పుడు ఇచ్చే నేరానికి చిన్న వెసులుబాటు.
మీకూ నాకూ ఈ ఏర్పాటు ఎంత ఆలోచనాత్మకంగా, సుఖంగా కనిపిస్తోంది! ఆహా! ఢిల్లీ ఇంతగా మన లంచాల కష్టాల గురించి ఆలోచిస్తోందా అని మనం సంబరపడతాం. ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి ఆఫీసర్లు, ఇంత గొప్ప మేధావులూ ఉన్న ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నందుకు మనం గర్వపడతాం. కదండీ?
కాని మనం వెర్రి గొర్రెలమని ఢిల్లీ బసూలకు తెలుసు. అవినీతిని నిర్మూలించలేని ప్రభుత్వం చేతకానితనానికి - కొండల్ని ఫలహారం చేసే బడా నాయకుల్ని చూసే రాళ్ళను నంచుకునే ఉద్యోగులు ఉంటారని మనల్ని మరిపించే మార్ఫియా ఈ ఉపకారం. ఇది మీకూ నాకూ కాదు. అసలు గుట్టు చూడండి.
రేపు ఎన్నికల్లో వోటు కోసం మీ చేతిలో నోటుని పెట్టే నాయకుడు 'నిస్సహాయంగా' ఇచ్చిన కారణానికి నిర్దోషి. కోట్లు ఖర్చు చేసి పదవిని కొనే ఆయన పదవిలోకి వెళతాడు. వందరూపాయలు పుచ్చుకున్న ఓటరు జైలుకి వెళతాడు. బహుశా - ఈ దేశంలో ఉన్న ఇలాంటి 'నిర్దోషుల్ని' రక్షించడానికే ఇంత బృహత్తరమైన చట్టం అవసరమని నాయకుల మధ్యవర్తిగా 'బసు' ఈ పధకాన్ని ప్రతిపాదిస్తున్నారేమో!
నా మీద వత్తిడి తెచ్చే ప్రయత్నం జరిగినందుకే నేను ఆయా లంచాలు పంచవలసి వచ్చిందని రేపు మరో నిర్దోషి రాజా జైలు నుంచి బయటకు నడవచ్చు. (అవినీతిని ప్రజలతో పంచుకునే పని ప్రభుత్వం చేసిందని ముందే మనవి చేశాను)
కార్పొరేట్ సంస్థల పెద్దలు వత్తిడి పెరిగిన దుర్భరమైన స్థితిలో లంచాలు చదివించక తప్పులేదని తప్పుకోవచ్చు. ఇచ్చేవాడు నేరస్థుడు కాదు కదా!
రేపు ఓ జడ్జీగారికి నేను లంచం ఇచ్చి, ఇచ్చినట్టు నిరూపిస్తే నేను బయటపడతాను. ఆయన జైలుకి వెళతాడు. ఈ ఒక్క ఆయుధంతో నేను న్యాయ వ్యవస్థని బ్లాక్ మెయిల్ చెయవచ్చుకదా!
మన రహస్యాలు కనుక్కోడానికి విదేశీ ఏజెంటు మన రక్షణ శాఖలో మనిషికి లంచం ఇచ్చాడు. రహస్యాల్ని ఎగరేసుకుపోయాడు. రేపు వ్యవహారం బట్టబయలయింది. ఫలానా ఉద్యోగికి ఇచ్చానని అతని విమానం ఎక్కే స్తాడు. అతని నేరస్తుడు కాదు కదా? ఉద్యోగి వీధిన పడతాడు. అది వీడి ఖర్మ. ఈ దేశం దరిద్రం.
బాబూ. ఇలాంటివి బోలెడున్నాయి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఈ దేశం అధ్వాన్న స్థితిని ఇంతకంటే భయంకరమైన తెలివితేటలు నిరూపించవు. ఇవి మీరూ నేనూ చేసిన ఆలోచనలు కావు. కేంద్ర ఆర్ధిక శాఖ వెబ్ సైటులో చోటుచేసుకున్న ఓ ప్రధాన అధికారి యంత్రాంగం.
ఈ వ్యవస్థలో అవినీతి పునాదులకు ఎంత మద్దతు లభిస్తుందో, ముందు ముందు మరెందరు పెద్దమనుషులు చట్టబద్దం కానున్న ఈ గొడుగు కిందకి వస్తారో - వేచి వినోదం చూడాలి.
నాకూ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లక్షణాలు కొన్ని ఉన్నాయి. రేపు రాబోయే కొన్ని సౌకర్యాలు గమనించండి.
రేప్ చేస్తే నేరం కాదు. మనిషి చావకుండా ఉంటే చాలు.
అయిదు కోట్ల లంచం నేరం కాదు. మినహాయింపు ఇస్తున్నాం. పది కోట్లు దాటితే నేరం.
కాలు విరగ్గొడితే నేరం కాదు. పీక తెగ్గొస్తే నేరం.
అవినీతికి మినహాయింపుని కల్పించే వ్యవస్థలో ఎన్ని సౌకర్యాలకు చోటుండదు!
183 మంది నేర చరితులూ, గూండాలూ, హంతకులూ ఉన్న పార్లమెంటులో నేరాలకి చట్టబద్దతని కల్పించే - ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చేసే బసూలు కోకొల్లలుగా దొరుకుతారు!

 

 ***
ఏప్రిల్ 25, 2011

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage