Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

పులి-పిల్లి-పెళ్ళి కధ
గొల్లపూడి మారుతీరావు

                            gmrsivani@gmail.com         

           టైగర్ వుడ్స్ ప్రపంచం విస్తుపోయి చూసేంత గొప్ప ఆటగాడు. ఇంతవరకూ ఎవరూ సాధించలేనన్ని విజయాలూ, ఎవరూ సాధించలేనంత డబ్బూ, కీర్తీ సంపాదించాడు. స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ ఆటకోసం చదువుని మధ్యలో మానుకున్నాడు. ఆయనకి స్విస్ పెళ్ళాం వుంది. పిల్లలున్నారు. డబ్బు, కీర్తి ఒకప్పుడు మనిషిని తల్లకిందులు చేస్తుంది. చదువూ, సంస్కారం ఆ వికారాన్ని ఏ కాస్తో ఆపగలుగుతుంది. అయితే- అన్నీ ఉన్న టైగర్ అందరూ ఊహించలేనన్ని అందమయిన నేరాలు చేశాడు. కనీసం పది మంది అందకత్తెలతో శృంగారం నెరపాడు.

       మనదేశంలో ప్రతీ రెండో వ్యక్తికీ వేపకాయంత వెర్రి ఉంటుంది. కాని విదేశాలలో ముఖ్యంగా అమెరికాలో- ఏ చిన్న మానసికమయిన యిబ్బంది వచ్చినా రోగం కుదర్చడానికి బోలెడు పిచ్చిడాక్టర్లున్నారు. వారు ధెరపీనెలల తరబడి జరుపుతారు.

       ఆ మధ్య ఫ్లారిడాలో టైగర్ కారు చెట్టుకి గుద్దుకుని తుక్కు తుక్కు అయింది. అప్పటికి ఆయన శృంగార లీలలు ఒక్కొక్కటీ బయటికి వచ్చాయి. రకరకాల అందమయిన అమ్మాయిల ఫొటోలు పత్రికలకెక్కాయి. మనదేశంలోలాగ కాక టైగర్ వంటి మహానుభావుడితో సంబంధం వున్నందుకు బహిరంగంగా గర్వపడే అమ్మాయిలు అక్కడ వున్నారు. వారంతా టైగర్ తో తమ లీలలు చెప్పుకుని గర్వపడ్డారు. గడుసైన అందకత్తెలు డబ్బుకూడా చేసుకున్నారు.

       ఈ రాస లీలలు పత్రికలకెక్కాయి. చిన్నవాడు చేస్తే అది రంకు. పెద్దవాడు చేస్తే అదిశృంగారం. టైగర్ శృంగారం పత్రికలకీ, ఛానళ్ళకీ, వెబ్లకీ కావలసినంత మేత. ఆ దేశాల్లో గొప్ప గొప్పవాళ్ళ వంటవాళ్ళూ, గుర్రాల సైసులూ వారి రహస్య కధలు చెప్పి లక్షలు సంపాదిస్తారు. ఇప్పుడు టైగర్ రంకు బయటపడితే ఆయన పరపతి చెడుతుంది. గొప్పవాడి అపకీర్తికీ, అవినీతికీ గిరాకీ ఎక్కువ. అయితే ఆయన పరపతిని వాడుకుని వ్యాపారాలు చేసే ప్రకటనకర్తలకు నష్టం వస్తుంది.ఆయనకి పెళ్ళాం, పిల్లలు, తల్లి, బంధువులూ,స్నేహితులూ ఉన్నారు(వీళ్ళు అప్పుడూ ఉన్నారుకదా!) ఆరువారాల కిందటే టైగర్ తన ప్రవర్తనకి బహిరంగంగా క్షమాపణ చెప్పాడు.తరువాత ఆనవాయితీ ప్రకారం ధెరపీకి వెళ్ళాడు. ఇప్పుడు- ఆరు వారాల తర్వాత- నిన్న ప్రపంచమంతా చూస్తూండగా- కళ్ళనీళ్ళ పర్యంతం అయి చక్కటి భాషలో క్షమాపణ చెప్పాడు. తన భార్యకంటే తనకి విలువైన వ్యక్తి లేదని, తన పిల్లలకంటే మరో ప్రపంచం లేదని- తను అందరినీ మోసం చేశాననీ, అనుచితమైన పనులెన్నో చేశాననీ వాపోయాడు. కాగా, నేను నాపెళ్ళానికి చెప్పుకోవలసిన సంజాయిషీ మాయిద్దరి స్వవిషయం- అని నొక్కి వక్కాణించాడు.

       మరి ఈ పత్రికా సమావేశం ఎందుకు? ఛానళ్ళ ముందు ప్రదర్శన ఎందుకు? ఓ గొప్పవాడి అవినీతిని అర్ధంచేసుకుని, ఆయన పశ్చాత్తాపాన్ని గౌరవిస్తుందనా? ఆ విధంగా భార్యపట్ల, కుటుంబం పట్ల, తన సమీప సమాజం పట్ల అతని భాధ్యతని పునరుద్ధరిస్తుందనా? లేక ఆయనకి భార్యపట్లా, బిడ్డల పట్లా వున్న ఆత్మీయతలను ఎరిగి వివాహ వ్యవస్థని పునః ప్రతిష్ట చేస్తుందనా?

       చివరలో ఆయన తల్లి ఆయన్ని కావలించుకుని ఓదార్చింది. ఇప్పుడు టైగర్ మళ్ళీ ధెరపీకి వెళ్తారట. శుభం.

       గర్ల్ ఫ్రెండ్స్, ఫ్రీ సెక్స్, స్వేఛ్ఛా జీవనం, పెళ్ళిళ్ళ ప్రమేయంలేకుండా కలిసిబతికే వ్యవస్థ నిలదొక్కుకున్న దేశంలో టైగర్ గారు ప్రముఖుడు కావడం వల్ల వీధిన పెట్టారుగాని అలాంటి పనులు ఎందరో, ఎక్కడో చేయడాన్ని ఎవరు గమనిస్తున్నారు?

       అమెరికా అద్యక్షుడు బిల్ క్లింటన్ గారి శృంగారం కనుక మోనికా అపూర్వ సౌందర్యాన్ని మనం దర్శించుకున్నాం గాని ఎన్నో కార్పొరేట్ సంస్థల్లో ఎంతమంది అలా సుఖపడుతున్నారో ఎవరికి పట్టింది? ఇంత ముక్కు మీద వేలేసుకుని, యింత అద్భుతంగా, యింత ఉదారంగా, యింత స్పష్టంగా, యింత గొప్పగా టైగర్ అవినీతిని చీల్చి చెండాడిన మాధ్యమాలు చీల్చి చెండాడడాన్నిఆనందిస్తున్నంతగా, వైవాహిక వ్యవస్థని కాపాడడానికి ఆతృతపడడం లేదని మనకందరికీ అర్దమవుతూనే వుంది.

       యద్యదాచరతి శ్రేష్ట తత్తదేవేతరోజనః (పెద్దలు ఏం చేస్తే యితరులూ అదే చేస్తారు)అన్న గీతాకారుడిలాంటి మహానుభావుల నీతిని ఆ దేశం అపూర్వంగా తలకెత్తుతోందని గర్వపడాలా?ఇటువంటి క్షమాపణ అవినీతి పరులకు చెంపదెబ్బ, కుటుంబ వ్యవస్థ సుస్థిరతకు మద్దతు, అగ్నిసాక్షిగా( అలాంటి గొడవలేవీ ఆ దేశాల్లో లేవుకనుక) పోనీ, చర్చి సాక్షిగా ఉంగరం తొడిగిన భర్తకి యిచ్చే moral support అని మనం చంకలు గుద్దుకోవాలా? లేక పత్రికల వ్యాపారానికీ, పెద్దల శృంగార  సరదా కధల ఆకలిని పాఠకులకి తీర్చడానికి, ప్రకటన వ్యాపారస్థుల పెట్టుబడులు కాపాడడానికి- టైగర్ ని ఇలా బోనెక్కించారని అర్ధం చేసుకోవాలా? యివన్నీ సమాధానం దొరకని ప్రశ్నలు.

         మనమూ ఆలోచించాల్సిన అవసరం ఎందుకు వస్తోందంటే- అదృష్టవశాత్తూ- మనమూ స్టాన్ ఫోర్డ్ చదువులు చదివిన మేధావుల్ని తయారు చేసుకుంటున్నాం. వాలెంటీన్లూ, గర్ల ఫ్రెండ్ ల సంస్కృతి, పబ్బుల్లో పబ్బాలు గడుపుకొనే సరదాలూ, కలిసి గదుల్లో జీవించే కంబైన్డ్ జీవికలూ- కనీసం నగరాల్లో వచ్చేశాయి. టైగర్ సంస్కృతికి మనం ఎంతో దూరంలో లేము. ఎక్కడో మంగుళూరులో బారుల్లో ప్రమోదాన్ని సంపాదించుకునే ఆడపిల్లల మీద చెయ్యి చేసుకునే ప్రమోద్ ముతాలిక్ ల మీద మనం ఆగ్రహం వ్యక్తం చేస్తాం. అది న్యాయమే.

       మనమూ టైగర్ లు వీధిన పడి పిల్లులయితే ఆనందిస్తాం- అచిరకాలంలో వివాహ వ్యవస్థని కాపాడడానికి ఇంకా అది బలహీనపు పొలికేక కనుక.

       కాని మన నాయకత్వం- అది యెడ్యూరప్పలుగాని, రాతిచిప్పలుగానీ-వీటిని పట్టించుకోదు. సామాజిక జీవనంలో నైతిక విలువల రాజీఎవరికి అంత యిబ్బంది పెట్టే విషయం కాదు కనుక. తమ నాయకత్వానికి ఆ వికారాలు అడ్డం కావుకనుక. ఎవరూ జుత్తు పీక్కోవడం లేదుకనుక. కందకు లేని దురద బచ్చలికి ఎందుకు? కాని నైతిక పతనం చాపకింద నీరు. వేరుని కొరికి తినే చీడ. ఆకుదాకా పాకేదాకా బయటపడదు. అప్పటికి వేళ మించిపోతుంది. ఈలోగా నాయకులకి 5 ఏళ్ళు గడిచిపోతాయి.

       అన్నగారు (ఎన్టీరామారావుగారు) మళ్ళీ పెళ్ళి చేసుకున్నప్పుడు అన్న- అన్నన్నఅని కాలమ్ రాశాను. నాయకత్వం సమాజం వారికిచ్చిన బాధ్యత కనుక. ఎంతో కొంత అవసరమయితే త్యాగాన్ని వారినుంచి సమాజం ఆశిస్తుంది కనుక. పురాణ పాత్రల్ని గబ్బు పట్టించి దానికి సృజన అని దొంగ పేరు పెట్టుకునే ఈనాటి తరానికి రాముడిని ఉదహరించాలంటే కలం వొణుకుతోంది- ఆయనకెంతమంది ప్రేయసులున్నారని కధలొస్తాయేమోనని.

       ఏతా వాతా,ఇలాంటివి మనం అతి ఉదారంగా అనుకరించే దేశాలలో బొత్తిగా పట్టవని మనం గ్రహించాలి. మనకి తెలిసేలోపల ఆయన సరదా తీరింది. తెలుసుకొనే దురదప్రస్థుతం అందరికీ తీరింది.

       నిన్నటి వారి పశ్చాత్తాపాన్నిఎన్ని లక్షల డాలర్లతో ఎంత అద్భుతంగా ప్రపంచానికి పంచారో పత్రికలు, ఇంటర్నెట్ లూ, ఛానళ్ళూ, వెబ్ లూ చూస్తే తెలుస్తుంది. ఆయన మళ్ళీ ధెరపీకి వెళ్తారు. మళ్ళీ ఆట ఆడతారు. మన అదృష్టం కలిసొస్తే మళ్ళీ ప్రేమలో పడతారు. చరిత్ర పునరావృతమౌతుంది.

       బోడి వివాహ వ్యవస్థ అమెరికాలో ఎలాగూ అక్కరలేదు. ఇప్పుడిప్పుడు మనకీ అక్కరలేకుండా పోతోంది. అదొక సాకు. ఇంకా రుచిచావని తంతు. కొందరికయినా తప్పని తతంగం. చాలామందికి అక్కరలేని అలసట. అందుకే ఇప్పుడు మంత్రాలు అక్కరలేని నడిమంత్రపు పెళ్ళిళ్ళు వచ్చేశాయి.

 

           ఫిబ్రవరి 22, 2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage