Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

      తెలుగు తెగుళ్ళు

    అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఎన్నికయినప్పుడు - ప్రపంచమంతా సంబరపడింది తమకేదో మేలు జరిగినట్టు. ఆయన ప్రసంగాన్ని - తమ నాయకుడే చెపుతున్నంతగా విని పొంగిపోయింది. అదొక వెల్లువ. రెండోసారి ఆయన ఎన్నికయినప్పుడు ఆయన చికాగోలో ప్రసంగించారు. కానీ ఆయన ప్రత్యర్ధి మిట్ రామ్నీ చెప్పిన నాలుగు మాటలూ నన్ను పులికింపజేశాయి ఆ వాక్యాలు. ఇంగ్లీషులో కవిత్వమంత పదునైనవి. తప్పనిసరిగా - తెలుగులో రాస్తున్నాను.
"ఇవాళ దేశం క్షిష్ట పరిస్థితిలో ఉంది. ఇలాంటి సమయంలో రాజకీయమయిన కుమ్ములాటనీ, అభిప్రాయబేధాలనే గుద్దులాటతో పరిస్థితిని మరింత దిగజార్చకూడదు. ప్రజాహితాన్ని చేయడానికి - మన నాయకులు - అవసరమయితే వ్యక్తుల్ని దాటి నడవడం అలవాటు చేసుకోవాలి. పౌరులుగా ఈ సమయంలో కాలానికి తగ్గట్టు కలిసి నిలబడాలి. ఒబామాకి నా శుభాకాంక్షలు"
ఇంతకన్న గాంభీర్యం, ఠీవి, ఔదార్యం, విచక్షణ ఒక ప్రత్యర్ధిలో చూడం. మన 'నీలం ' తుఫాన్ రోజుల్లోనే అమెరికాలో 'శాండీ ' తుఫాన్ వచ్చింది. అప్పటికి ఒబామా - రామ్నీ మధ్య బాహాబాహీగా చర్చలు ప్రసారమవుతున్నాయి. ఎప్పుడూ లేనంతగా - ఇద్దరూ స్పష్టంగా విమర్శించుకున్నారు. ఈలోగా తుపాన్ వచ్చింది. ఈ ఎన్నికల చర్చావేదికని వాయిదా వేశారు. ఒక్కమాట -ఒక్కసారి, ఒబామా అసమర్ధతని గానీ, ప్రభుత్వ వైఫల్యం గానీ రామ్నీ దుమ్మెత్తి పోయలేదు. ఇది అతి హృద్యమయిన అతి హుందా అయిన ప్రవర్తన.
పోటీలో ఒకరు ఓడారు. కానీ దేశం ముఖ్యం - సమాజం ముఖ్యం - పౌరుడు ముఖ్యం - పోటో ముగిసిపోయింది. పాలన జరగాలి. దాన్ని వక్రీకరించే సంకుచితాన్ని రామ్నీ ప్రదర్శంచలేదు . మరొక్కసారి - మరొక్కసారి - ???తెలిసి ఇంత ఉదాత్తతని చూపిన సందర్భంగాని, ప్రత్యర్ధిని కాని - నేనెన్నడూ చూడలేదు. ఒకటి ఎన్నికలో ఓటిమి, రెండోది ప్రకృతి వైపరీత్యం. ఇందులో ప్రభుత్వం అసమర్ధతని - ఆ దశలో దుయ్యపట్టడం ఏ నాయకునికయినా అనౌచిత్యం.
ఆ పని 'నీలం ' తుఫాన్ రోజుల్లో ప్రతిపక్ష నాయకులూ చేశారు. ప్రకృతి వైపరీత్యాన్ని తమకు అవకాశంగా మలచుకోడానికి ఉవ్విళ్ళూరారు. ఇది 'శవ ' రా జకీయం వంటిదని నేను కాలం రాశాను.
ఇప్పుడు మరొక సందర్బం. 37 సంవత్సరాల తర్వాత ఆంధ్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహా సభల్ని నిర్వహిస్తోంది. 30 సంవత్సరాల పాటు ఏ ప్రభుత్వాలు ఈ పని చెయ్యాలన్న ఆలోచనయినా చెయ్యలేదు. ఈ దేశపు రాష్ట్రపతి ఆ సభల్ని ప్రారంభిస్తున్నారు. ప్రపంచంలోని తెలుగువారంతా చూస్తున్నారు. బర్మా, మారిషస్, అమెరికా, బ్రిటన్, మలేషియా వంటి ఎన్నో ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. జర్మనీ నుంచీ, రష్యా నుంచీ తెలుగు నేర్చుకుని అభిమానించే విజ్నులు వచ్చారు.
ఈ సభలు రాజకీయ లబ్ధిని దృష్టిలో పెట్టుకున్నవి కావు. ఇందులో పార్టీలు ప్రమేయం లేదు. దేవులపల్లి, శ్రీశ్రీ, సురవరం ప్రతాపరెడ్డి వంటి ఎందరో మహాకవులు, నాయకులు, సేవా తత్పరులు ఉన్నారు. ఇది తెలుగు వారికి అరుదైన బంగారు పండగ. అందరూ ఆనందించాల్సిన పండగ. భాషకి, సంస్కృతికి పట్టాభిషేకం.
తెలుగు సభలను బహిష్కరిస్తామని స్థానికీ ఎమ్మెల్యేభూమన కరుణాకర రెడ్డిగారు ప్రకటించారు. తెలుగు తల్లి విగ్రహం ముందు నిరాహార దీక్షను ప్రారంభించారు. ప్రపంచ తెలుగు మహాసభలలో నిరసనను తెలియచేస్తామని అభ్యుదయ రచయితల సంఘ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ప్రకటించారు. దానికి వారి వారి కారణాలను తెలిపారు. అలాగే మరొక పార్టీ ప్రతినిధి - పేరు అనవసరం. లోపాలు ప్రతీ పనిలోనూ ఉంటాయి. కాని ఉద్దేశం, ఆ కార్యక్రమ లక్ష్యం - వాటిని ఆ మేరకి కప్పిపుచ్చుతాయి.
ఆ మధ్య ప్రపంచ తమిళ మహా సభలను ప్రపంచం ఏకమయి జరుపుకుంది. పార్టీల ప్రమేయం లేకుండా పార్టీల ప్రమేయం లేకుండా అన్ని పార్టీలూ ఏకమయి వేదిక మీద నిలిచారు. తమిళ భాష మనకంటే ముందే అధికార భాష అయింది. తమకి సమష్టిగా మేలుచేసే ఏ కార్యక్రమానికైనా తమిళులు రాజకీయమయిన పరిధుల్ని చెరిపేస్తారు. అందుకే వారికి మనపట్లా, వారి సంఘటిత శక్తి పట్లా కేంద్రానికి గౌరవం. మనకి దక్కే గౌరవం ఏమిటో - తెలంగాణా వివాదంలో పోలవరం వంటి విషయాల్లో కేంద్రం తటస్థాన్ని చూస్తున్నాం కదా! మన మీద, మన సంస్కృతి మీదా మనకే బేధాలున్నప్పుడు - మరొకరు - మనకిచ్చే గౌరవం, విలువా అంతంత మాత్రంగానే ఉంటుంది.
ప్రపంచమంతా ఎకమయి జరుపుకునే తెలుగు పండగ - రాజకీయ ప్రమేయం లేని ఈ పండగని - తమ పార్టీలు గిరులు దాటి - ప్రపంచ ప్రతినిధుల మధ్య ఉదాత్తతని చాటలేని - మన పార్టీల ఒంటిపిల్లి తనానికి - ఇది అతి హృదయ విదాకరకమయిన నిదర్శనం అని నా కనిపిస్తోంది.
ఈ సభల పట్ల నిరసనని ప్రతిపక్షాల తీరు చూశాక మిట్ రామ్నీ వంటివారు మరీ ఆకాశంలో కనిపిస్తారు.
                                                                           gmrsivani@gmail.com  

 
                                                                          డిసెంబర్ 31, 2012

   ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage