Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

    నిజం నిద్రపోయింది

 దాదాపు 50 సంవత్సరాల కిందట నేనో నాటిక రాశాను. దాని పేరు 'నిజం నిద్రపోయింది '. ఆ రోజుల్లో అది - అప్పటి నాటక ప్రక్రియకి పదేళ్ళు ముందున్న రచన. ఈ సృష్టిలో అన్ని నిజాలూ చెప్పుకోదగ్గవి కావు. ఒప్పుకోదగ్గవికావు. పంచుకోదగ్గవి కావు. ఎంచుకోదగ్గవికావు. కొన్ని నిజాలు బయటికి రావు. రానక్కరలేదు. ఆ కారణానే మన జీవితాలు ఆనందంగా, ప్రశాంతంగా సాగుతున్నాయి.
అయితే ఏ నిజాలు బయటికి రావాలి? ఎంతవరకూ రావాలి? ఎప్పుడు రావాలి? వీటిని నిర్ణయించే దక్షత గల పెద్దల చేతుల్లోనే ఈ నిజాలు మిగలాలి.
ఓ భయంకరమైన క్షణంలో "ఈ రాక్షసిని ఎందుకు పెళ్ళి చేసుకున్నాను?" అని పెళ్ళాం గురించి మొగుడు అనుకోవచ్చు. "ఇలాంటి తిరుగుబోతుని ఎలా కట్టుకున్నాను?" అని పెళ్ళామూ అనుకోవచ్చు. ఆ రెండు నిజాలూ బయటపడితే వాళ్ళ జీవితాలు వేరుకానూవచ్చు. కాని మన్నికయిన సాహచర్యంలో - ఇద్దరూ మనస్సు మార్చుకున్న 'సమ్యమనం' వాళ్ళ 50 సంవత్సరాల వైవాహిక జీవితానికి ప్రతీక కావచ్చు. ఆ క్షణంలో మనస్సుల్లో ఆలోచనలకన్న - వాళ్ళ సాహచర్యం కాలదోషం పట్టకుండా కాపాడగల 'అబద్దం' ఆ మేరకు వారికి ఉపకారి కావచ్చు. ఇదే నాటిక ఇతివృత్తం.
రాజకీయ, సామాజిక రంగాల్లో ఏ నిజాన్ని ఎవరు ఎప్పుడు బయట పెట్టాలి? దానివల్ల ఏం ప్రయోజనం? - ఇవన్నీ చాలా బరువైన ప్రశ్నలు. ఒక్కొక్కప్పుడు సమాధానం రాని ప్రశ్నలు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుగారి మీద లెబర్హాన్ కమిషన్ విచారణ జరుగుతున్న రోజుల్లో నేను ఆయన్ని రెండు మూడుసార్లు ఢిల్లీలో కలిశాను. ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ "కొన్ని విషయాలు తెలియడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. కాగా, కుండ బద్దలవుతుంది. నాకు తెలిసిన - నాకు మాత్రమే తెలిసిన కొన్ని నిజాలు నాతోనే కాటికి పోతాయి" అన్నారు. మాటలు ఇవే కాకపోవచ్చు. అర్ధం ఇదే. అది బాధ్యతని నెత్తిన ఎత్తుకున్న ఒక దేశపు పాలకుని గాంభీర్యం.
నిన్న సి.బి.ఐ చైర్మన్ గా రిటైరయిన యు.ఎస్.మిశ్రా నోరిప్పారు. తమ వ్యవహారాల్లో రాజకీయ పక్షాల, మంత్రుల, శక్తివంతమయిన నాయకుల జోక్యం ఉందన్నారు. ఆ జోక్యం బి.జె.పి పాలనలోనూ, కాంగ్రెసు పాలనలోనూ సాగిందన్నారు. ఎవరీ పక్షాలు? ఎవరీ మంత్రులు? ఏ వ్యవహారంలో జోక్యం చేసుకుని వత్తిడి తెచ్చారు? అప్పుడేమయింది? చెప్పనన్నారు. సి.బి.ఐ.మీద రాజకీయ పార్టీల వత్తిడి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మిశ్రాగారు ఆ విషయాన్ని శంఖంలో పోశారు. వత్తిడివచ్చిన రోజుల్లో ప్రభుత్వాన్ని ఎదిరించడమో, రాజీనామా చేయడమో నిజాయితీ అనిపించుకుంటుంది. లేదా బయటపడి - ఆ నాయకుల పేర్లు బయట పెట్టడం సాహసం అనిపించుకుంటుంది. నిన్న మొన్నటి వికీ లీక్స్ వల్ల ఏం ఒరిగింది?
బాధ్యతగల పదవుల్లో ఉన్నవారి మొదటి కర్తవ్యం - తమ ఉద్యోగ నిర్వహణలో తెలిసే ఎన్నో నిజాలను మనస్సులోనే నిలుపుకోవడం. వాటిని వీధిని పెట్టే పని - అంత ఉన్నత పదవుల్లో ఉన్న ఉద్యోగులు చెయ్యవలసిందికాదు. చెయ్యదగింది కాదు. చెయ్యనక్కరలేదు. చెయ్యమని ప్రతిజ్నలు చేసి కుర్చీల్లో కూర్చున్నారు కనుక.
అలాగే - నిన్న క్రికెట్ ఆటగాడు మొహీందర్ అమర్ నాధ్ - ఆ మధ్య టీముని ఎంపిక చేయండంలో ధోనీని తొలిగించాలని ఇద్దరు ముగ్గురు అన్నట్టు బయటపడి చెప్పాడు. ఇది బొత్తిగా బాధ్యతారహితమని నా ఉద్దేశం. జుట్టుని నిర్ణయించడంలో ఆయా ఆటగాళ్ళ మంచి చెడుల్ని చర్చించడం పరిపాటి. వినోద్ కాంబ్లీని తొలగించిన రోజుల్లో ఆయన 'తాగుడు' గురించీ మాట్లాడుకుని ఉంటారు. చర్చించడం సహజం. అంతమాత్రాన ఆ అభిప్రాయాలు వీధిన పడనక్కరలేదు. సాముహికంగాకమిటీ నిర్ణయానికే సభ్యులంతా కట్టుబడి ఉంటారు. ఉండాలి. ఆ పని అప్పుడు మహీందర్ అమర్ నాధ్ కూడా చేశారు. ఇప్పుడు బయటపడి చెప్పడం ఎందుకు? అందునా తెల్లవారితే టెస్ట్ ప్రారంభమవుతూండగా, అసలే ఓటమిని రుచి చూసిన స్వదేశపు కేప్టెన్ ని గురించి - బయటపడి చెప్పనక్కరలేదని, చెప్పకూడదని, చెప్పడానికి అధికారం లేని - ఓ సీనియర్ సభ్యుడు చెప్పడం బొత్తిగా దుర్మార్గం. చెప్పాలన్న నిజాయితీ ఆనాడే ఉంటే అప్పుడే తన సభ్యత్వానికి రాజీనామా చేసి వీధిన పడాల్సింది. ఓటమిని రుచిచూస్తున్న టీం నాయకునిపై కాలుదువ్వడం విచక్షణా రాహిత్యం. అప్పుడే దొంగలు పడి ఆరునెలలు దాటిపోయింది.
మరి కమిటీమీద బీసీసి ఐ అధ్యక్షుడు, వారి అనుయాయుల ఒత్తిడి ఎలా బయట పడుతుంది? బయట పెట్టే వ్యక్తుల నిజాయితీ సమృద్దిగా ఉన్నప్పుడు. నిజానికి ఎప్పుడూ రెండు ముఖాలుండవు. అబద్దానికి ఆరు ముఖాలుంటాయి. సందర్భం లేని సమయంలో నోరిప్పడమూ అవినీతే అవుతుంది. ఛానల్ లో ఆలశ్యంగా నోరిప్పడం రాజకీయం అవుతుంది.
ప్రభుత్వం సామూహికంగా జరిపే పాలనలో మంచికీ చెడుకీ, నీతికీ అవినీతికీ, తప్పిదానికీ ఒప్పుకీ - ఎవరిది బాధ్యతో పదిమందిలో నోరిప్పడం - అనుచితమైన వ్యక్తిత్వాల పతనానికే నిదర్శనం.
తమ తమ స్వల్పకాలిక ప్రయోజనాలకు - నీతిని తప్పి కొన్ని విషయాల్ని బయటపెట్టడం - నిజాయితీగా భావించే, కనిపించాలని తాపత్రయపడే నిజమైన అవినీతిపరుల కాలమిది.
లేకపోతే కొందరు మంత్రులు జైలులో ఉండి, కొందరు బయట ఉండి, కొందరు ఎక్కడ ఉండాలో తెలియక ఎవరిది అవినీతో తెలియని అవ్యవస్థ ఇప్పటిది.
పొత్తూరి వెంకటేశ్వరరావుగారి వంటి సీనియర్ పాత్రికేయులు - జైళ్ళలో ఉండాల్సిన వారు బయట ఉన్నారు. బయట ఉండాల్సినవారు జైళ్ళలో ఉన్నారు - అన్నారు ఈ మధ్య. సరే. ఎవరి మాటల్లో నిజం ఉంది? లేకపోతే ఏ నిజం ఎక్కడ ఎంతగా నిద్రపోయింది? మిశ్రాలూ, అమర్ నాధ్ లూ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పరు. ప్రశ్నలను మరింత సంక్లిష్టం చేస్తారు. వ్యవస్థలో మరో కొత్తరకం అవినీతికి తెర తీస్తారు.


                                                                           gmrsivani@gmail.com  

 
                                                                          డిసెంబర్ 17, 2012

   ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage