దేవదూతలకు ఆహ్వానం
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com

  నేరం ఎప్పుడూ నిర్దయగా, కర్కశంగానే ఉంటుంది. అయితే జాలిగా, సానుభూతితో, కసితో పీకకోసే సందర్భాలూ, కథలూ ప్రపంచ సాహిత్యానికి దగ్గర తోవలు. గోవిందనిహలానీ 'ఆక్రోష్‌', కాళీపట్నం రామారావుగారి 'యజ్ఞం' ఇందుకు మచ్చుతునకలు. ఇవి మినహాయింపులు. మిగతా అన్ని సందర్భాల్లోనూ నేరం నేరమే. నేరానికి శిక్షకి రెండు పార్శ్వాలు. అలాంటి నేరం జరగకుండా 'శిక్ష' ఒక ఆంక్ష కావడం, చేసిన నేరస్థుడిని హింసించడం ద్వారా అలాంటి నేరం పునరుక్తి కాకుండా అరికట్టడం. ఇది ఆయా సమాజాలు సమష్టిగా ఏర్పరుచుకున్న వ్యవస్థలు. అదే న్యాయ వ్యవస్థ.
మళ్లీ ఇందులో వ్యవస్థ తన విచక్షణతో -ఏర్పరిచిన వెసులుబాట్లు -కొన్ని మినహాయింపులూ, రాయితీలూ ఉన్నాయి. రూఢిగా 'అపరాధి' అని నిర్ధారణ అయే వరకూ శిక్ష వెయ్యకు. ఆడవారికీ, గర్బిణీ స్త్రీలకూ కొంత విచక్షణ చూపించు. సత్ప్రవర్తనకి శిక్షలో రాయితీ నేరస్థుడి మానసిక ప్రవర్తనకి ఉద్దీపన. ఇలాగ. యావజ్జీవ కారాగారశిక్షని 18 సంవత్సరాలకి కుదించారు. మళ్లీ సత్ప్రవర్తనకి ఇందులో మినహాయింపు ఉంది. ఇవన్నీ సదుద్దేశంతో, అర్హత గలవారికి అందేటట్టు చేయడం వ్యవస్థలో ఆరోగ్యకరమైన, ఆర్ద్రమయిన, మానవత్వపు విలువల పరిపుష్టికి నిదర్శనం.
ఇంతవరకూ ఈ ఏర్పాట్లన్నీ వ్యవస్థని చూసి గర్వపడవలసిన విషయాలు. అయితే ఈ దేశపు ప్రధానిని దారుణంగా హత్యచేసి, అతనితో పాటు మరో 18 మంది నిరపరాధుల మారణహోమానికి కారణమైన నేరస్థులను న్యాయవ్యవస్థ విచారణ జరిపి, నిర్దారించి మరణ శిక్ష విధించాక -పాలక వ్యవస్థ కారణంగా -శిక్ష అమలు జరగని నేపథ్యంలో వారిని నిరపరాధులుగా విడుదల చేయాలని ఓ పార్టీ నినాదం -చక్కని ఉద్యానవనంలో 'మెజారిటీ' అనే క్రూరమృగం విహారం వంటిది. గర్భవతి అని తెలిసీ నళినికీ కూడా ఉరిశిక్షని న్యాయస్థానం విధించాక -సోనియాగాంధీ అనే హతుడి భార్య క్షమాభిక్షని కోరడం సమాజ నియతిని కాదని ఓ వ్యవస్థ ఏర్పాటుకి అడ్డుకట్ట వేయడం. ఆ మాత్రపు విచక్షణ ఇన్ని విధాలుగా రాయితీలను కల్పించిన న్యాయవ్యవస్థ దృష్టిలోకి రాలేదనుకోవడం కంటే తెలివితక్కువతనం మరొకటి లేదు. తీరా వ్యవస్థ ఒక వ్యక్తి ప్రతిపాదనకి తలవొగ్గడం ఆనాటి మెజారిటీ రాజకీయపు పరిణామమే. పోనీ, ఇదీ ఈ జాతి దయాగుణానికి ప్రతీకగా గర్వపడదాం. బాధ్యత లేకుండా, స్నేహితులతో తైతక్కలాడడానికి బార్‌కి వచ్చి జెస్సికాలాల్‌ని కాల్చి చంపిన మనూశర్మ అనే రాక్షసుడు జైలుకి వెళ్ళకుండా తప్పించుకుని హాయిగా జీవించడం -ఈ వ్యవస్థ అసమర్థతకి చిహ్నం. కేవలం మాధ్యమాల ప్రమేయం కారణంగానే ఈ కేసుని తిరగదోడి ఆ దౌర్భాగ్యుడిని జైలుకి పంపడం న్యాయవ్యవస్థలో లొసుగుకి నిదర్శనం.
ఇంతవరకూ ఈ కథ వ్యవస్థలో న్యాయానికి పట్టిన దుర్గతికి, లేదా చెల్లుబాటు గలవారు వ్యవస్థని ఎంత హాస్యాస్పదం చేయగలరో నిరూపించే ఉదాహరణ. ఈ తర్వాతి కథ మరీ దారుణం. వాళ్లమ్మ అనారోగ్యానికని ఈ హంతకుడిపట్ల దయతలచి జైలునుంచి 'పెరోల్‌' ఇచ్చి తాత్కాలికంగా ఇంటికి వెళ్లే సౌకర్యాన్ని కల్పించింది న్యాయస్థానం. మంచిదే. అయితే ఆ తల్లి అనారోగ్యంతో కాక -క్రికెట్‌ ఆటని ప్రోత్సహించే కార్యక్రమాలలో పాల్గొంటూ టివి కెమెరాల ముందు దర్శన మిచ్చింది. ఈ హంతకుడు బారుల్లో విలాసంగా గడుపుతూ టివిలముందు దర్శనమిచ్చాడు. మళ్లీ జెస్సికాలాల్‌ సోదరి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మనూశర్మ మళ్లీ జైలుకి చేరాడు. ఇది పూర్వకథ.
ఇప్పుడు సదరు మనూశర్మగారు -తన తమ్ముడి పెళ్లికి హాజరుకావడానికి కోర్టుని ఆశ్రయించాడు. కల్లబొల్లి కబుర్లతో అబద్ధం చెప్పి న్యాయస్థానాన్ని మోసం చేసిన ఈ హంతకుడికి మళ్లీ పెరోల్‌ లభించింది! ఏమైంది ఈ దేశంలో న్యాయానికి? ఎంతమంది హంతకులకి ఇలాంటి వెసులుబాటుని ఇస్తోంది ఈ న్యాయస్థానం? హంతకులు బారుల్లో తైతక్కలాడడానికీ, తమ్ముడి పెళ్లిళ్లూ, చెల్లెలు పిల్లల బారసాలలూ చూసే అవకాశం ప్రపంచంలో మరే వ్యవస్థలోనయినా జరగుతోందా?
మరో అందమైన కథ. భారతి అనే అమ్మాయిని నితీష్‌ కటారా అనే యువకుడు ప్రేమించాడు. ఆ ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకి ఇష్టం లేదు. ఆమె డిపి యాదవ్‌ అనే ఓ నేర చరిత్రగల రాజకీయ నాయకుడి కూతురు. ఆమెని వారింప జూశారు. సాధ్యపడలేదు. నితీష్‌ని బెదిరించారు. చివరికి యాదవ్‌గారి తనయుడు సంతోష్‌కుమార్‌ నితీష్‌ని అతి దారుణంగా హత్య చేశాడు. తండ్రి గూండాయిజం, పలుకుబడి పెట్టుబడులుగా ఈ హంతకుడు స్వేచ్ఛగా తిరిగాడు. ఆ కుర్రాడి తల్లి నీలమ్‌ కటారా ఒంటరిగా పోరాటం సాగించి, కోర్టులు పట్టుకు తిరిగి న్యాయం కోసం పోరాటం సాగించింది. మాధ్యమాలు సహకరించాయి. తప్పనిసరిగా ఈ సంతోష్‌కుమార్‌ యాదవ్‌ను న్యాయస్థానం అరెస్టుచేసి, విచారణ జరిపి జైలుకి పంపింది. నేరస్థుడికి తగిన శాస్తి జరిగిందని దేశం సరిపెట్టుకున్న సందర్భమిది.
తర్వాత ఏమయింది? నెలకి కనీసం అయిదుసార్లు చొప్పున -ఈ హంతకుడు తన తండ్రి పలుకుబడి పెట్టుబడిగా నాలుగు సంవత్సరాలలో 65 సార్లు అనారోగ్యం పేరుతో జైలునుంచి బయటపడి అయిదు నక్షత్రాల ఆసుపత్రిలో రాజభోగాలతో గడుపుతున్నాడు. మళ్లీ నీలమ్‌ కటారా గొంతు చించుకుంది. 'నేను ఒంటరిగా ఈ మాఫియాతో పోరాటం సాగించి అలసిపోయాను. ఈ వ్యవస్థకి మోక్షం లేదా?' అని ఈ తల్లి టివి కెమెరాల ముందు వాపోయింది.
అమెరికాలో ఇలాంటి నేరాలకి 80 సంవత్సరాలు, ఒక్కొక్కప్పుడు 100 సంవత్సరాలూ జైలు శిక్షలు వేస్తారు. అన్ని సంవత్సరాల నిందుతుడు బతికుంటాడా? అది ముఖ్యం కాదు. ఆ నేరం ఎంత ఘోరమయిందో శిక్ష సూచిస్తుంది. ముందు ముందు రాయితీల పర్వానికి ఇది అడ్డుకట్ట. జైలుకి వెళ్లిన నేరస్థులు జైళ్లనుంచి బయటికి వచ్చి న్యూయార్క్‌ వీధుల్లో, బారుల్లో స్వైరవిహారం చేసిన కథలు మనం వినలేదు.
కేవలం మానవీయమైన కారణాలకి -మినహాయింపులు కల్పించిన అతి ఉదాత్తమైన న్యాయవ్యవస్థ లక్ష్యాన్ని ఈ అవకాశవాదులు, గూండాలు తమ పలుకుబడితో, డబ్బుతో, రాజకీయమైన పరపతితో భ్రష్టు పట్టిస్తున్న కథలు ఒక్క మన దేశానికే ప్రత్యేకం. మరణశిక్ష పడిన నేరస్థులను నిరపరాధులుగా విడుదల చేయాలని రాష్ట్రాల శాసనసభలు తీర్మానాలు చేయడం ఈ వ్యవస్థకే ప్రత్యేకం. పార్లమెంటు మీదే దాడి చేసిన కుట్రదారులకి సుప్రీం కోర్టు శిక్ష వేస్తే -రాష్ట్ర శాసనసభలో ప్రజలు ఎన్నుకున్న నాయకులు కుర్చీల్ని విరిచి, గుండెలు బాదుకునే 'మత' వైపరీత్యం ఈ దేశానికే ప్రత్యేకం. వ్యవస్థ నియతిని తమ పదవులూ, డబ్బూ నిలదీయగలదని -ఎంత గొప్ప న్యాయస్థానం నిర్ణయాన్నయినా వీధిన పెట్టగల శక్తిసామర్థ్యాలు తమకున్నాయని -ఓ నళిని, ఓ పెరారివాలన్‌, ఓ అఫ్జల్‌గురు, ఓ మనూ శర్మ, ఓ సంతోష్‌సింగ్‌ల తల్లిదండ్రులూ, పార్టీ నాయకులూ రహస్యంగా పండగ చేసుకుని న్యాయవ్యవస్థకి తొడగడానికి కొత్త గాజులు సిద్ధం చేయడం మనకి సూచనగా తెలుస్తోంది. నేరమూ, మోసమూ, బుకాయింపు, కోర్టుల కన్నుకప్పే ఈ హంతకుడికి పోలీసు శాఖ, న్యాయస్థానం మరోసారి పెరోల్‌ ఇవ్వడం ఇందుకు నిదర్శనం. ఈ దేశపు దౌర్భాగ్యస్థితికి -ఈ దేశపు న్యాయవ్యవస్థని 'నపుంశకం' చేయగలిగిన ఈ శక్తుల విజృంభణ కారణం. ఇలాంటి సందర్భాలలోనే నక్సలైట్లూ, మావోయిస్టులు వంటి అతివాదులు దేవదూతల్లాగ కనిపిస్తారు.
 

                                               నవంబర్ 21,2011

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage