Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
 
మెజారిటీ రాజకీయాలు
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com

  
ఇది అపర ప్రహ్లాదుల కాలం. దేశాన్ని పాలించే రాజునీ, రాజు ఆలోచనల్నీ, పాలక వ్యవస్థనీ, పాలన సరళినీ నిలదీసి, ఎదిరించి, ఎదిరించడం తమ హక్కుగా బోరవిరుచుకుని, అవసరమయితే వీధినపెట్టే అద్భుతమైన రోజులు వచ్చాయి. అన్నా హజారే పాలక వ్యస్థని ఎదిరిస్తున్న పెద్దమనిషి. పెద్దమనిషి. ఈ దేశ చరిత్రలో పాలక వ్యవస్థకి వోటు వెయ్యవద్దని ఎన్నికల్లో ప్రచారం చేసిన స్వచ్ఛంద సంస్థ -పోనీ, ఉద్యమం ఆయనది. ఇది విడ్డూరం. ఇందులో ఒకనీతి ఉంది. అయితే ఈ నీతిని ప్రశ్నించే పెద్దమనుషులూ ఈ దేశంలో ఉన్నారు. నిన్ననే సుప్రీం కోర్టు ఆవరణలోనే అన్నా అనుయాయులు, సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ని నలుగురు చావగొట్టారు. కాశ్మీర్‌ గురించి ఆయన ఆలోచన వారికి నచ్చలేదు. వాళ్ల ఉద్దేశాన్నో, కోపాన్నో అర్థం చేసుకొందాం. మా అవినీతిని వోటరు తేల్చాలిగాని మీరెవరయ్యా అన్నది వారి వాదం. వాళ్లని అరెస్టు చేస్తే, చేసినందుకు ఒక తిరుగుబాటు. వద్దని అడ్డుపడిన అన్నా మనుషుల్ని మర్నాడు సుప్రీం కోర్టు గేటు ముందే చావగొట్టారు.
ఇలాంటి ప్రహ్లాదులు మనకి బోలెడు. కోట్ల రూపాయల్ని స్వాహా చేశారని రాజాగారి మీద అభియోగం. సుప్రీం కోర్టు ఆయన్నీ, ముఖ్యమంత్రిగారి ముద్దుల కూతుర్నీ, మిగతా కార్పొరేట్‌ సంస్థల పెద్దల్నీ జైలుకి పంపింది. న్యాయంగా అవినీతికి ఇదే పర్యవసానం. కాని పాలక వ్యవస్థలో భాగస్వామి అయిన ఒకపార్టీ నాయకత్వానికి ఈ అవినీతిలో వాటా ఉంది. అందుకనే తన కూతురు నిజాయితీపరురాలని కరుణానిధిగారు కేంద్రం మీద కాలుదువ్వారు. న్యాయ వ్యవస్థ నిర్ణయాన్ని నిలదీసే రోజు వస్తుందని నా జీవితంలో ఊహకందని విషయం.
అణు విద్యుత్‌ను శాంతియుత ప్రయోజనాలకు వినియోగించేందుకు కూడాంకులంలో ఒక కేంద్ర నిర్మాణం సాగుతోంది. స్థానికులు నిర్మించడానికి వీలులేదంటున్నారు. తమిళనాడు ప్రభుత్వం, జయలలితగారు వారితో చెయ్యి కలిపి మద్దతుని ప్రకటించారు. రాజీవ్‌ గాంధీని చంపిన వారిని ఉరితీయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. వారిని నిరపరాధులుగా విడుదల చేయాలని కరుణానిధిగారు బల్ల గుద్దుతున్నారు. వారిని ఉరి తీయరాదని ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వమే -శాసనసభలో తీర్మానాన్ని సాధికారికంగా చేసింది. అలాగే అఫ్జల్‌ గురుని ఉరితీయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తీయరాదని కాశ్మీర్‌ సభలో ప్రభుత్వమూ, ప్రతిపక్షాలూ కొట్టుకుంటున్నారు.
ఇది మిశ్రమ ప్రభుత్వాల రోజులు. ఎన్నో పార్టీల సంకరం. ఆ సంకరం స్పష్టంగా వీధినపడి తెలుస్తోంది. పాలక వ్యవస్థ గౌరవం ఎవరికీ పట్టదు. ఎవరి పార్టీల ఎజెండాలను, ఎవరి పార్టీల వారిని వారు ఒప్పించుకోగలిగితే మళ్లీ అందలమెక్కవచ్చు. దేశాన్ని పాలించే వ్యవస్థ ఐకమత్యం పాలనకి అవసరమన్న స్పృహ పోయి చాలారోజులయింది. నా పార్టీ అవసరాలను, లక్ష్యాలను, ప్రయోజనాల్ని నేను నిలుపుకుంటే రేపు ఈ ప్రభుత్వం కూలిపోయినా -మళ్లీ నా పార్టీకి నిలవనీడ ఉంటే నాకు చాలు. చిన్న నా బొజ్జకు శ్రీరామరక్ష.
ఒకే పార్టీలో ఉన్నకారణంగా అభిప్రాయ బేధాలున్నా వాటిని దిగమింగుకుని ప్రజల దృష్టిలో ఈ పాలన ఏక తాటిమీద సాగుతోందని ఒప్పించాల్సిన బాధ్యత తమదిగా భావించిన రోజులు ఆనాటివి. అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌కూ, ప్రధాని నెహ్రూకు చాలా విషయాలలో అభిప్రాయ బేధాలుండేవి. కాని వారిద్దరూ ఈ దేశ పాలక వ్యవస్థ రధసారథులు. ఐకమత్యం సమష్టి బాధ్యత. అభిప్రాయ బేధం ఆరోగ్యకరమేకాని, ఆ కారణంగా వీధిన పడడం వ్యవస్థని బలహీనపరుస్తుంది. వారిద్దరి దగ్గరా సెక్రటరీగా పనిచేసిన ఐసియస్‌ ఆఫీసరు హెచ్‌.వి.ఆర్‌. అయ్యంగార్‌ వారు కన్నుమూశాక ఆ విషయాలు చెప్తే అంతా ఆ నాయకుల ఉదాత్తతకీ, విచక్షణకీ ముక్కుమీద వేలేసుకున్నారు.
బాబూ, ఇప్పటి ప్రభుత్వాలు మిశ్రమ ప్రభుత్వాలు. అంటే కప్పల తక్కెడ. ఎగిరే హక్కు ప్రతీ కప్పకీ ఉందని ప్రతీ కప్పా బ్లాక్‌మెయిల్‌ చేసే రోజులు. అవినీతి పరుడైన మంత్రి -నేనీపని ప్రధానికి చెప్పే చేశాను అని జైల్లోంచి బోరవిరుచుకునే రోజులు. చేసిన అవినీతికి సిగ్గుపడే రోజులు పోయాయి. నా అవినీతిలో ప్రధానికీ వాటావుందని బోరవిరుచుకునే 'సిగ్గులేని' అవినీతి నేటిది.
ఆ మధ్య మన్మోహన్‌సింగ్‌ 2జి కుంభకోణం గురించి ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ -మిశ్రమ ప్రభుత్వాలలో ఇలాంటి సర్దుకుపోవడాలు తప్పవని వాక్రుచ్చారు. వారు సర్దుకుపోతున్నారని తెలిసే చాలా పార్టీలవారు సూట్‌కేసులు సర్దుకున్న ఫలితమే ప్రస్థుతం -కల్మాడీ దగ్గర్నుంచి ఎందరో తీహార్‌లో కొలువు తీర్చడం. ఇవాళ చెల్లుబాటయే మూలసూత్రం -మెజారిటీ. ప్రస్తుతం పదవుల్ని పంచుకున్న ప్రభుత్వం తట్ట తగలేసినా తమ తమ లాభాలను, లక్ష్యాలనూ కాపాడుకుంటూపోతే, కాపాడినట్టు తమ ప్రాంతీయ వోటర్ల ముందు రేపు బోర విరుచుకోగలిగితే -అప్పుడు వచ్చే కొత్త మిశ్రమంలో మళ్లీ కొత్త పంపకాలకు అవకాశం ఉంటుంది. ఈ 'సిగ్గులేని', 'తెగింపు' మనస్తత్వానికి పెట్టుబడి -మెజారిటీ.
అందుకే మెజారిటీ ఒక గాడిద అన్నాడు బెర్నార్డుషా. నిజాయితీపరుడు మెజారిటీ వ్యవస్థకి మొదటి శత్రువని నిరూపిస్తూ నూరేళ్ల కిందట గొప్ప కళాఖండాన్ని సృష్టించాడు -ది ఎనిమీ ఆఫ్‌ ది పీపుల్‌ - By Henrik Ibsen. ఒక నమూనా ఉదాహరణ. మొన్ననే జీవితంలో మొదటిసారిగా మెజారిటీని సంపాదించి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లో చరిత్రను సృష్టించారు. ఈ దేశపు ప్రధాని పొరుగు దేశం బంగ్లాదేశ్‌తో రకరకాల ఒప్పందాల మీద సంతకాలకి ఆయా ప్రాంతాల ముఖ్యమంత్రులతో తరలివెళ్లారు. ఇది దేశ ప్రతిష్టకీ, శ్రేయస్సుకీ సంబంధించిన విషయం. రెండు దేశాల నదీజలాల పంపిణీ గురించిన ఒప్పందం మీద సంతకాలకి మమతా బెనర్జీ వెళ్లాలి. కాని ఆవిడ వెళ్లలేదు. ఈ దేశపు ప్రతిష్ట కన్నా ముఖ్యమంత్రికి తన రాష్ట్రంలో తన వోటర్ల మద్దతు ముఖ్యం. రేపు తన మెజారిటీ ముఖ్యం. అంతకుమించి ఈ దేశ ప్రతిష్టకీ ఆవిడకీ ఏమీ సంబంధం లేదు. అయినా కేంద్రం ఏమీ చెయ్యలేదు. కారణం? ఇది ఉమ్మడి కుంపటి.
ఆ మాటకి వస్తే నిన్నటి సుప్రీం కోర్టులో జరిగిన దౌర్జన్యానికీ, కర్ణాటకలో శ్రీరామసేన వీర విహారానికీ, జార్ఖండ్‌లో శిబూసొరేన్‌ అవినీతికీ -దేనికీ కేంద్రానికి శక్తి చాలదు. ఇది ఉమ్మడి పొయ్యి. ఈ దేశపు న్యాయవ్యవస్థనే నిరసించి, ఎదిరించే 'మెజారిటీ' సంపాదించిన ఆ ప్రాంతపు ప్రభుత్వాలు, పార్టీలు -దాదాపు 160 ఏళ్ల కిందట జమీందారీల విశృంఖలత్వాన్ని గుర్తు చేస్తున్నాయి. అందరూ ఎవరి మానాన వారుంటే పైనుంచి ఎవరో వచ్చి తన పబ్బం గడుపుకున్నాడు. అదే ఆనాటి ఈస్టిండియా కంపెనీ పునాదులకి పెట్టుబడి. ఆ వాతావరణం ఈ దేశంలో క్రమంగా నెలకొంటోంది. వ్యవస్థని ఎన్నికయిన ప్రభుత్వం ఎదిరిస్తే దిక్కులేదు. మెజారిటీ సంపాదించిన పార్టీ ఎదిరిస్తే చెయ్యగలిగిందేమీ లేదు. చెయ్యి చేసుకోగల ముష్కరత్వం ఎదిరిస్తే? నిజాయితీ పరుడైన పాపానికి ప్రాంతీయ దురహంకారం ఎదిరిస్తే? దిక్కులేదు. హిరణ్యకశిపుడి పాలనలో మామూలు మనిషి రాజుని ఎదిరించినా నరసింహావతారం అవసరం లేదు. కాని రాజుని ఎదిరించింది -రాజు కొడుకే! కనుక మన పురాణాల్లో దేవుడు దిగివచ్చి రాజుని చంపాడు.
మన కాలంలో వ్యవస్థగా బలం చాలని, స్థానికంగా బలం ఉన్న ఎన్ని పార్టీలో ఎదిరిస్తున్నాయి. కనుక ఇక అవతారంతో పనిలేదు. కారణం -మనదేశంలో వీధికో అవతారం. పార్టీకో అవతారం. రాష్ట్రానికో అవతారం. ప్రహ్లాద తత్వం దేశాన్నంతటినీ ఆవరించుకున్న అద్భుతమైన రోజులివి. ఆధునిక కాలంలో నరసింహుడు స్థంభాల్లోంచి రాడు. ఏ అమెరికా రూపంలోనో ఆకాశం నుంచి దిగబడతాడు. మరో 200 సంవత్సరాలు పరపీడన. మరో గాంధీ. మరో స్వాతంత్య్ర సమరం. మళ్లీ వందేమాతరం.

                                               అక్టోబర్ 17,2011

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage