వి.వి.యస్.లక్ష్మణ్ క్రికెట్ కెరీర్ కి స్వస్తి పలికాడు.
అందరూ ఏదో ఒక సమయంలో ఆ పని చెయ్యాల్సిందే. కానీ నేటి నుంచీ జరగబోతున్న
న్యూజిలాండ్ మాచ్ లో జట్టుకి ఎంపిక అయిన తర్వాత - తన ఆటని
చాలించుకోబోతున్నానని ప్రకటించాడు. ప్రపంచ చరిత్రలో ఇది మరొక రికార్డు.
మనిషి జీవితంలో తనంతట తాను 'ఇకచాలు' అనుకోవడం అతని హుందాతనానికీ,
ఆత్మతృప్తికీ, సమ్యమనానికీ - వెరసి వ్యక్తి గంభీరమైన శీలానికీ తార్కాణం.
లక్ష్మణ్ మొదటి నుంచీ అందరిలాంటి మనిషి కాడు. అందరిలాంటి ఆటగాడూకాదు. తన
పనిని తాను నెరవేర్చి, తనవాటా బాధ్యతను నిర్వర్తించి, బోరవిరుచుకోకుండా
తలవొంచుకు పక్కకి తప్పుకునే మనస్తత్వం అతనిది. ఇటీవలి కాలపు క్రికెట్
చరిత్రలో సామర్ధ్యం గల ఇద్దరు గొప్ప ఆటగాళ్ళు - ఈ దేశపు కీర్తిని ఆకాశంలో
నిలిపినా - ప్రతీసారి జుట్టులో తమ స్థానాన్ని నిలుపుకోడానికి తమ
సామర్ధ్యాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకోవలసిన స్థితిలోనే ఉంటూ వచ్చారు -
నాకు తెలిసి. ఒకరు మొహీందర్ అమర్ నాధ్. అలనాడు దేశం సాధించిన మొట్టమొదటి
ప్రపంచకప్పు పోటీలో కీలక పాత్రని పోషించాడు. (ఫైనల్సు లో అతను మాన్ ఆఫ్ ది
మాచ్). ఇక ఎన్నో సందర్బాలలో ఆటమీద మన జట్టు ఆశలు వదులుకున్న సమయంలో మౌనంగా
మధ్యకి నడిచి చరిత్రను పదే పదే సృష్టించిన ఘనత లక్ష్మణ్ ది.
2001 మార్చి 13 చరిత్ర. కలకత్తాలో గ్రౌండులోకి నడిచి రెండు రోజులు
నిర్విరామంగా ఆడి 281 పరుగులతో ఆస్ర్టేలియా వెన్నెముకలో చలి పుట్టించి,
ప్రపంచాన్నే దిగ్ర్భాంతుల్ని చేసి, అలవోకగా 'విస్డన్ ' పుటల్లోకి దూసుకు
వెళ్ళిన ఒకే ఒక్క ఆటగాడు వి.వి.యస్ లక్ష్మణ్. అతని ఆట క్రీడ కాదు. ఓ యాత్ర.
ఓ ఉద్యమం. ఓ ఆదర్శం. జావీద్ మియాన్ దాద్ లాగ ప్రదర్శనగానో, వివ్ రిచర్డు
లాగ పోటోగానో, బ్రియాన్ లారాలాగ పరిశ్రమగానో సాగించే మనస్తత్వం కాదు.
ఏనాడూ ఆట మధ్యలో మాట తూలిన సందర్భం లేదు. ఒక క్రమశిక్షణ, సమన్వయం, కర్మ
సిద్దాంతాన్ని నమ్ముకున్న యోగిలాగ లక్షల మంది మధ్య ఏకాంత యాత్ర సాగిస్తున్న
పధికుడిలాగ కనిపిస్తాడు. క్రికెట్ అతని ఊపిరి. ధ్యేయం కాదు.
ఆయన జీవితంలో డాక్టర్ కావాలని ఆశించినట్టు కుటుంబ వర్గాలు తెలిపాయి.
ఆశ్చర్యం లేదు. మరో రంగంలో మరో విధంగా ఆ పనే చేశాడు. ఆయన స్క్వేర్ కట్,
ఫ్లిక్ - ఏ వైద్యుడో సశాస్త్రీయంగా, అతి సుతారంగా, అలవోకగా, కానీ
నిర్దుష్టంగా - మరల్చగలిగిన కత్తివేటు. అవును. తన వృత్తిలో మెలుకువల్ని
ఆపోశన పట్టిన అరుదైన డాక్టర్ క్రికెట్ మైదానంలో లక్ష్మణ్.
లక్షల మంది మధ్య ఒంటరి. ఏ ఇంటర్వ్యూ లోనూ తన బృందం గురించీ, దేశాన్ని
గురించే తప్ప తన గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. క్రికెట్ ఆటనుంచి
విరమించుకోడానికి కారణాలు చెప్తూ - యువతరానికి అవకాశానికి దోహదంగా ఆ పని
చెస్తున్నానన్నాడు. ఈ మాట అతని హృదయంలోంచి వచ్చిన మాట. మన రాజకీయ నాయకుల 'సమాజసేవ',
'లోకకళ్యాణం' లాంటి బూతు మాటకాదు.
నా జీవితంలో ఒకే ఒక్కసారి కుర్రతనంగా పెంకితనాన్ని ప్రదర్శించాను. అతని
పెళ్ళికి శుభాకాంక్షలు పంపుతూ 'వి.వి.యస్.లక్ష్మణ్, హైదరాబాదు' అని రాశాను.
వారాల తర్వాత నాకు కృతజ్ఞతల ఉత్తరం వచ్చింది. ఆ మధ్య టైంస్ ఆఫ్ ఇండియా
తరపున "సురభి" అనే మాసపత్రిక సంపాదకుడిగా తెలుగులో లబ్దప్రతిష్టులయిన
చాలామంది గురించి వరసగా వ్యాసాలను ప్రకతించాను. ఆ సందర్బంలో
వి.వి.యస్.లక్ష్మణ్ మీదా రాయాలని తలంపు. పదిసార్లు ఆలోచించి ఆలోచించి అతనికి
ఫోన్ చేశాను. నాకున్న పేరు ప్రతిష్టలు నాకున్నాయి. కానీ లక్ష్మణ్ ప్రపంచ
ప్రఖ్యాతిని సాధించిన ఆతగాడు. యువకుడు. చిన్న గోరోజనం, నిర్లక్ష్యం, అహంకారం
- ఇలాంటివి ఏవయినా, అన్నీ అయినా ఉన్నా ఆశ్చర్యం లేదు. అబ్బురమూ కాదు. చాలా
తక్కువ సందర్భాలలో ఇలా ఫోన్ చెయ్యడానికి సందేహించి ఉంటాను. అటు పక్క
లక్ష్మణే మొబైల్ తీశారు. నా గొంతు వినగానే అతి మృదువుగా, మర్యాదగా, అణుకువగా
"బాగున్నారాండీ?" అన్నాడు. పొంగిపోయాను. గొప్పతనానికి కళ్ళు ఆకాశంలో ఉంటాయి.
వినయానికి హృదయం ఆకాశంలో ఉంటుంది. 'వినయం ' అంటే తలవొంచడం, తప్పుకోవడం కాదు.
తన గొప్పతనం విలువ ఎరిగి, బేరీజు వేసుకుని దాన్ని సముచితమయిన స్థాయిలో
నిలపగలగడం. ఆ పనిని అతి సమర్ధనీయంగా చేసిన సంస్కారి లక్ష్మణ్.
ఆయన దైవచింతనగల కుటుంబానికి చెందినవాడు. సాయి భక్తుడు. ఎదుర్కునే ప్రతి
బంతిలోనూ పెదాలు కదుపుతూ దైవం పట్ల విశ్వాసాన్నీ, తోడునీ వదలనివాడు. తన
బిడ్డలు - కొడుకుకి 'సర్వజిత్' అని పేరు పెట్టాడు. అంటే అన్నింటినీ
జయించినవాడని అర్ధం. కూతురుకి 'అచింత్య' అని పేరు పెట్టాడు. అంటే ఏ
చింతాలేని నిరంతనమైన శాంతిని సాధించుకున్నది అని అర్ధం. ఈ రెండు పేర్లూ
లక్ష్మణ్ లోని రెండు ముఖ్యమైన స్వభావాలకు అద్దం పడతాయి.
జీవితంలో చాలామంది తమ వృత్తినుంచి రిటైరయే సమయానికి - ఏ వృత్తీ చేయలేని దశకి
- వయస్సు రీత్యా రావడం రివాజు. కానీ క్రికెట్ లో పదవీ విరమణ జీవితంలోఒక దశ
ముగింపుకి చిహ్నం కానీ రెండవ దశలో ప్రశాంతతకీ, మన్నికయిన జీవికకీ మొదటి
దశలోనే పునాదులు వేసుకున్న లక్ష్మణ్ అదృష్టవంతుడు. చరితార్ధుడు. ఇంకొక్క
మాట చెప్పాలి - కోటి మందిలో ఒక్కడు.