Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

మంచి కూడా అంటువ్యాధే

గొల్లపూడి మారుతీరావు
                                 gmrsivani@gmail.com
                                     

  పధ్నాలుగు సంవత్సరాలుగా మా అబ్బాయి స్మారకార్ధం జాతీయ బహుమతి కార్యక్రమాలు జరుపుతున్నా - ఏనాడూ నేను కాలం రాయలేదు. రాయవలసిన అవసరం లేదని నేను భావించాను. కన్నీళ్ళలోంచి ఓదార్పుని వెదుక్కోవడం - నా దురదృష్టం నాకిచ్చిన విముక్తి. అది నా వ్యక్తిగతం. అయితే నిన్న నాకు ఒకాయన ఉత్తరం రాశాడు. ఆయన మొన్న జరిగిన 13 గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ బహుమతి ఉత్సవానికి హాజరయాడు. ఆయనెవరో నాకు తెలీదు. ఆయన్ని నేనెప్పుడూ కలుసుకోలేదు. నిన్నకూడా కలుసుకోలేదు. ఆయన ఉత్తరం స్థూలంగా ఇది:

" పురస్కారం ఏర్పరచడానికి కారణము, ఉద్దేశమూ నా హృదయాన్ని కదిలించింది. మీ కుటుంబం గురించి 'ఏంకర్' చెపుతున్నప్పుడు 'అయ్యో, ఆఫీసునుంచి సరాసరి వచ్చేశానే, మావిడని తీసుకువస్తే బాగుండునే!' అని వాపోయాను.

పన్నెండేళ్ళ కిందట దేవుడు మాకో ప్రత్యేకమైన బిడ్డని బహూకరించాడు. మా గుండె పగిలింది. నాకే ఎందుకు? మాకే ఎందుకివ్వాలి? నా కొడుకే ఇలా ఎందుకు? అని కంటతడి పెట్టుకున్నాం. కొన్నేళ్ళ తర్వాత - బయటికి రండి. చుట్టూ వెదకండి. అలాంటి అవిటితనమే ఉన్న బిడ్డల్ని ఆదుకోండి అని భగవంతుడు విధంగా చెప్పాడనిపించింది.

అప్పుడే ఇలాంటి దురదృష్టవంతులయిన ప్రత్యేకమైన 'అవిటితనం' ఉన్న బిడ్డల కోసం చిన్న ధర్మ సంస్థని ప్రారంభించాం. మా అబ్బాయి అరవింద్ కి ఇప్పుడు పన్నెండేళ్ళు. మా సంస్థకి వాడి పేరే పెట్టాం. ఇవాళ 47 మంది పిల్లల్ని ఆదుకునే మూడు - పగలంతా సాకే కేంద్రాల్ని ఏర్పాటు చేశాం. పిల్లలు మెరుగవుతున్నారు. వారి ప్రవర్తన, స్వభావాల్లో మార్పు వస్తోంది.

మాకు నిధులు తక్కువ. ఎంతో శ్రంతో కేంద్రాల్ని నడుపుతున్నాం. అయితే అలాంటి బిడ్డల్ని ఆదుకోవడం మాకెంతో ఆనందాన్నిసోంది. మీ సంస్థతో, మీ లక్ష్యాలతో మా ప్రయత్నాన్ని పోల్చుకున్నప్పుడు - తండ్రిగా మీ హృదయాన్ని అర్ధం చేసుకోగలిగాను. ఎంత వేదనతో సంస్థని ఏర్పరిచారో అర్ధం చేసుకోగలిగాను.

ప్రతీ 'తొలి దర్శకుడి 'లో మీ అబ్బాయిని, శ్రీనివాస్ ని  చూసుకోవడంలో దైవత్వం ఉంది. తండ్రిగా మీరు మీ అబ్బాయిని పదమూడు సార్లు వెనక్కి తెచ్చుకున్నారు. తండ్రీ కొడుక్కీ ఇంతకంటే ప్రేమని చూపించలేడు."

పొగడ్తల వెల్లువని పోగుచెయ్యడం కాలం ఉద్దేశం కాదు. అదే చెయ్యాలంటే 14 ఏళ్ళు ఆగనక్కర్లేదు. మరొక దురదృష్టవంతుడైన తండ్రి ఆర్తిని పంచుకోవడంలో - దుఃఖంతో క్రుంగిపోక దుఃఖాన్ని పక్కవాడిలో గుర్తుపట్టే ఔదార్యాన్ని అర్ధం చేసుకోడానికి - ఇన్నేళ్ళ తర్వాత 'ఆత్మారాం ' అనే తండ్రి ఉత్తరాన్ని ఉటంకిస్తున్నాను.

ఆయన తన ఫోన్ నంబరు నాకిచ్చారు. కానీ ఫోన్ చెయ్యను. సూర్యోదయం  తూర్పున కళ్ళు విప్పి చీకటిని వెదుక్కోదు. కాని అది వెళ్ళిన చోటల్లా చీకటికి స్థానం ఉండదు. 'ఆనందం' అన్నది ఒక దృక్పధం. మనఃశ్శాంతి ఒక సమన్వయం. మహాత్ముడు మానవాళి విముక్తిలో, మదర్ థెరిస్సా మానవాళి శ్రేయస్సులో దాన్ని వెదుక్కున్నారు. ఆత్మారాం సాటి బిడ్డల సేవలో వెదుక్కున్నాడు. అది అతను సంపాదించుకున్న విముక్తి.

ఈమెయిల్ నాకు రాలేదు. మా అబ్బాయికి వచ్చింది. కారణం - మా ఆహ్వానం మీద అతని అడ్రసు ఉంది. కొసమెరుపు - ప్రతియేటా ప్రపంచం నలుమూలా నుంచీ పురస్కార సభలకి కొందరు వస్తారు ప్రతీ ఏడూ పూనా నుంచి ఒకాయన విమానంలో వచ్చి చూసి వెళ్ళిపోతాడు. ఈసారి వాళ్ళ అమ్మాయితో వచ్చాడు. సంవత్సరం - అబూదాబీలో ఉన్న మా మిత్రులు - గంటి ప్రసాదరావుగారు భార్యతో వచ్చారు. ఆత్మారాం ఉత్తరాన్ని మా అబ్భాయి చదివి వినిపించాడు. అంతే. ఆవేశంగా ప్రసాదరావుగారు లేచి నిలబడ్డారు. 'నేను సేవా కేంద్రానికి 50 వేలు ఇస్తాను. ఎలా పంపించాలో చెప్పండి' అన్నారు.

మంచి కూడా అటువ్యాధే. 'కష్టం, కన్నీళ్ళు'   వ్యాధిని రెచ్చగొట్టే రసాయనాలు. 'ఇవ్వడం' గొప్ప వ్యసనం. దానిలో ఉన్న రుచిని చరితార్ధం  చేసిన శిబి, బలి, కర్ణుడి కథల నిధానం మన ఇతిహాసాలు.

భక్తుడు భగవంతుడితో అంటాడు: 'నన్ను కష్టాల నుంచి దూరం చెయకు స్వామీ! సుఖాలలో మత్తెక్కి నిన్ను మరిచిపోతానేమో' నని.

ఇది జాతి వైభవం. సంస్కృతి వైభవం. ఒక్క మతంలోనే భక్తుడు భగవంతుడిని అడుగుతాడు: 'నాకు  వృద్ధాప్యాన్ని ప్రసాదించు' అని. ఎందుకు? మరిచిపోయినవీ, చెయ్యలేనివీ, చెయాలసినవీ వెదుక్కోడానికి - జీవితంలో మిగిలిన కాస్త రోజుల్లోనయినా అవకాశం ఉంటుందని!

ఎంత పరిణతి! ఎంత వికాసం! ఎంత ఉదాత్తత!

 

     ఆగస్టు 16, 2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage