చీకట్లోకి ప్రయాణం

గొల్లపూడి మారుతీరావు
      gmrsivani@gmail.com 

దాదాపు 40 ఏళ్ళు పైగా నా మనస్సులో నిలిచిన ఒక వాక్యం ఉంది."కథ బ్రహ్మ దేవుడి ఆఖరి వ్యసనం" అని. ఇది ఎప్పుడూ నాకు గుర్తొచ్చే వాఖ్య. బ్రహ్మదేవుడు అందమయిన ముఖాన్ని,శరీరాన్ని, సౌష్టవాన్ని సిద్ధం చేశాక ఆయన చెయ్యాల్సిన ఆఖరి పని - ఆ బొమ్మకి ఒక కథని నిర్దేశించడం. ఈ సృష్టిలో కోట్లాది కథల్ని సిద్ధం చేసిన గొప్ప కథా రచయిత, సృష్టి కర్త - బ్రహ్మ దేవుడు. ఇది చాలా అందమయిన ఆలోచన.
ప్రస్తుతం నేను అబూదాబీలో ఉన్నాను. ఈ పర్యావరణాన్ని సుప్రతిష్టం చేసే అన్ని రకాల వాస్తవాలను సమీకృతం చేసి పుస్తకాలుగా - కాదు - విజ్ఞాన సర్వస్వాలుగా ప్రచురించే యునెస్కో ప్రాజెక్ట్ ఇక్కడ నడుస్తోంది. దాన్ని సిద్ధం చేసే అంతర్జాతీయ సంపాదక మండలిలో నేను సభ్యుడిని. ఆ పనిమీదే ఇక్కడికి వచ్చాను.
ఇది వివరణ. ఈ కాలమ్ ఉద్దేశం ఇది కాదు. ఇవాళ సృష్టికర్త శక్తికి మూలకారణమయిన జన్యుకణాలలో (డి ఎన్ ఏ) ఏ అంశం వల్ల మానవజీవితంలో ఈ వైవిధ్యం రూపు దిద్దుకుంటోందో అర్ధం చేసుకునే సామర్ధ్యాన్ని కూడా మానవుడు పెంచుకున్నాడు. మనిషి పెరిగి పెద్దయ్యాక బట్టతల రావడానికీ , నేత్ర సౌలభ్యం దెబ్బతినడానికీ, శరీరం రంగు నల్లగా ఉండడానికీ, పక్షవాతం రావడానికీ - ఆ కణాలలో ఏ భాగాలు కారణమో మానవుడు గుర్తుపట్టాడు. ఇంకా గొప్పవిషయం ఏమిటంటే ఆయా ఏర్పాట్లను మార్చే సామర్థ్యాన్ని కూడా మానవుడు పెంపొందించుకున్నాడు. ఇది అద్భుతమైన అభివృద్ధి. అనూహ్యమైన ముందడుగు.
మరొక గొప్ప విషయాన్ని గుర్తు చెయ్యడానికే ఈ కాలమ్. కోట్లాది మంది ఉన్న ఈ భూగ్రహం పై ఒక మనిషికీ, చీమకీ, సింహానికీ, చెట్టుకీ - ఆ మాటకొస్తే ప్రాణం ఉన్న ఏ జీవరాశికైనా - ఆ జీవస్వభావాన్ని నిర్ణయించే ప్రాతిపదికలు ఈ జన్యుకణంలో కేవలం నాలుగే ఉన్నాయి. ఈ దశలో దీన్ని అర్ధం చేసుకోడానికి ఈ మాత్రం వివరణ చాలు. ఈ నాలుగు ముఖ్య లక్షణాలను శాస్త్రజ్ఞులు A, G, C, T గా గుర్తుపట్టారు. ఈ నాలుగు ప్రాతిపదికల వివిధ సంయోగమే ఒక జీవరాశిని మరొక ప్రాణికి భిన్నంగా సృష్టిని చేస్తుంది. కేవలం నాలుగు. ఈ సృష్టి అంతా కేవలం ఈ నాలుగు పార్శ్వాలలో ఇమిడి ఉంది. ఇంతకంటే మరో కారణమూ లేదు మరో సంయోగమూలేదు. కేవలం నాలుగు పార్శ్వాలు.
ఇప్పుడు - మనసృష్టి కర్తకి కేవలం నాలుగే ముఖాలు. నాలుగు విభిన్నమైన పార్శ్వాలు. ప్రత్యేకతలు. వీటిని సంయోగపరచడమే సృష్టికర్త చేసేపని.
ఆశ్చర్యంగా ఉందా? అద్భుతంగా ఉందా? పూర్వీకులు - ఆనాటి ఋషులు లేదా మేధావులు - ఇంత సాంద్రతగల జన్యుశాస్త్ర రహస్యాన్ని ఆనాడే గుర్తుపట్టారా? బ్రహ్మ నాలుగు ముఖాలలో దత్తాత్రేయుడి మూడు ముఖాలలో - ఇంకాస్త ముందడుగు వేసి రావణాసురుడి పది తలకాయలలో - మన "ప్రాధమిక"మైన ఆలోచనలకి అందని అభిజ్ఞ (సింబల్) ఏదైనా ఉందా?
ఎరిగిన బలమైన నిజాన్ని ఎరగనక్కరలేని విశ్వాసంగా తరతరాల మానవాళికి వారసత్వం గా పంచిన అలనాటి రుషులు తాము తెలుసుకున్న, అర్ధం చేసుకున్న గొప్ప సత్యాల్ని కేవలం విశ్వాసాల్లోకి ఇరికించి నిక్షిప్తం చేశారా?
వెక్కిరించే పరిమితమైన తెలివితేటలు మాత్రమే ప్రోదు చేసుకున్న, వాలంటైనులను దొడ్డిదారిన దిగుమతి చేసుకున్న నేటి "తెలివైన" ఆధునికునికి ఇది అభూతకల్పనా? ఇలా చాలా నిజాలను చాలా రంగాలలో కేవలం విశ్వాసానికి మాత్రమే అందే దశలో వదిలిపెట్టేరా మన పూర్వీకులు?
మరొక గొప్ప సంఘటనని ఇక్కడ ఉదహరించక తప్పదు. మనం గుర్తించుకున్నా లేకపోయినా లోక కళ్యాణానికి అనునిత్యం, నిశ్శబ్దంగా కృషిచేసేవాడు ఋషి. కొన్ని వేల సంవత్సరాలు ఈ పనిని మనదేశంలో చాలామంది చేశారు. వాళ్ళు మనదేశంలో చేశారు కనుక మనం వాళ్ళని తేలిగ్గా మరచిపోవచ్చు. ఆపనే సమర్ధనీయంగా ప్రస్తుతం చేస్తున్నాం. కాని అలాంటి పని 19వ శతాబ్ధంలో విదేశాల్లో ఒకాయన చేశాడు. ఆయన పేరు థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన మానవజాతికి వెలుగునిచ్చిన వైతాళికుడు. పండితుడినీ పామరుడినీ, మెచ్చుకున్న వాడినీ తిట్టుకున్నవాడినీ వెలుగుతో (విద్యుద్దీపంతో) సత్కరించిన ఋషి. ఇంకా చలనచిత్ర కెమెరానీ, గ్రామఫోను రికార్డునీ కనుగొన్నాడు. కనుగొన్నాక గ్రాం ఫోను మీద మొదటిసారిగా ఎవరిచేత మాట్లాడించాలా అని ఆలోచించాడు. ప్రముఖ జర్మన్ తత్వవేత్త మేక్స్ ముల్లర్ అతని మనస్సులో కదిలాడు. ఆయన ఇంగ్లాండులో ఉంటున్నాడు. ఎడిసన్ షిప్పులో ఇంగ్లాండు బయలుదేరాడు. ఎందరో హాజరైన సభలో మాక్స్ ముల్లర్ గ్రామఫోను ముందు గొంతు విప్పి మాట్లాడాడు. ప్రేక్షకులు ఆయన కంఠధ్వని ఆ పెట్టెలోంచి రావడాన్ని చూసి దిగ్ర్భాంతులయారు. కాని ఆయన మాట్లాడిన భాష, విషయం వారి కర్ధంకాలేదు.
అప్పుడు మాక్స్ ముల్లర్ వారికి వివరించాడు: నేను మాట్లాడిన భాష 'సంస్కృతం ' చెప్పిన మొదటి వాక్యం - ఋగ్వేదంలో మొదటి శ్లోకం - "అగ్నిమీలే పురోహితం". వేదం మానవాళి చరిత్రలో సృష్టించబడిన మొట్టమొదటి కృతి - శృతి. ప్రాచీన కాలంలో యూరపులో మనుషులు చెట్టునుంచి చెట్టుకి కొమ్మనుంచి కొమ్మకి చింపాంజీలలాగ ఎగురుతూ, ఒళ్ళు దాచుకోడానికి ఆకులు చుట్టుకుని, వ్యవసాయమంటే ఏమిటో తెలియక, గుహల్లో తలదాచుకుని, జంతువులని వేటాడి, తిని బ్రతికే రోజుల్లో భారతీయులు అత్యున్నత స్థాయిలో సంస్కృతీ వికాసాన్ని మానవాళికి అందిస్తున్నారు. ప్రపంచ తాత్విక చింతనకు వేదం ద్వారా ఒక పరిణతినీ, మార్గాన్నీ సూచిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ మాటని ఒక విదేశీయుడు మాక్స్ ముల్లర్ అన్నాడు కనుక మనం గౌరవించవచ్చు.
మళ్ళీ మనం ఈ కాలం ముఖ్యాంశం - బ్రహ్మస్వరూపం దగ్గరికి వద్దాం. ఎంతవరకు ఈ సమ్యమనాన్ని మనం అంగీకరించవచ్చు?
ముందుతరాలకు "పర్యావణ కాలుష్యాన్ని గురించి" ప్రాధమిక సమస్యల గురించి సాధికారంగా పరిశోధనలు జరిపి, విజ్ఞాన్ని 600 సంపుటాలలో - 20 విజ్ఞాన సర్వస్వాల ద్వారా రేపటి మానవుడికి నిక్షిప్తం చేస్తున్న UNESCO-EOLSS కార్యాలయంలో (అబుదాబి శాఖలో) కూర్చుని ఈ ప్రశ్నల్ని సంధిస్తున్నాను.
చీకటి అందర్నీ భయపెడుతుంది. అజ్ఞానం కొందరికి ఆయుధం అవుతుంది. కానీ చీకటిలోనే గురిచూసి బాణాన్ని సంధించే సామర్ధ్యాన్ని వేల సంవత్సరాల క్రితమే పురాణాల్లోకి ఎక్కించిన మన వ్యవస్థ ఈ "చీకటిని" సమన్వయం చేసుకునే సమయం వచ్చిందా? అన్న ప్రశ్న వేయడానికే ఈ కాలం.
ముగించే ముందు ప్రపంచ ప్రఖ్యాత రచయిత లియొ టాల్ స్టాయి మాటలు: "నేటి ప్రధాన సమస్యల గురించి అధ్యయనం చేసేముందు, గతించిన శతాబ్దాల ఆలోచనా సరళి పట్ల మన దురభిప్రాయాలు, స్పర్ధల్ని మనం సమూలంగా నిర్మూలించుకోవాలి."
 

 ***
మే 16, 2011

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage