Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here భరాగో అనే ఉద్యమం
గొల్లపూడి మారుతీరావు
1968లొ నేను విజయవాడ ఆలిండియా రేడియోకి బదిలీ మీద వచ్చేనాటికి పురాణంగారికి సహాయకులుగా భరాగో “ఆంధ్రజ్యోతి” వారపత్రికలో చేరారు. “మీ చేసిన సాహితీ వ్యవసాయం చూసి మీరెంత పెద్దవారోననుకున్నాను” అన్నారు నన్ను చూసి. “మీ కధలు చదివి మీరెంత చిన్నవారోననుకున్నాను” అన్నాను నేను. అలా ప్రారంభమయిన మా స్నేహం, ఆత్మీయమయి మొన్నటిదాకా సాగింది. ఆ రోజుల్లోనే నేను రాసిన “వెన్నెల కాటేసింది” నవలకి తన ముత్యాలలాంటి తన చేతిరాతతో ముస్తాబు చేసి, బంగీ కట్టి ఎమ్.ఎన్.రావు(ఎమెస్కో)కి పంపేదాకా పూనుకున్నది భరాగోయే. ఈ పనిని ఒక ఉదాత్తమయిన సేవగా చివరిదాకా నడిపిన ఓ ఉద్యమం భమిడిపాటి రామగోపాలం. ఆయన శరీరానికున్నన్ని సమస్యలు ఎవరూ ఊహించలేనివి. వేళ్ళు కదలవు. కాళ్ళు కదలవు. శరీరం కదలదు. గుండె చెప్పినమాట వినదు. ఇంకా ఎన్నెన్నో సమస్యలు. వాటిలో ఏ ఒక్కటి ఉన్నా నాలాంటి వాళ్ళకి బుర్ర పనిచేయదు. కాని- మనస్సుని, మెదడుని తన చెప్పుచేతల్లో పెట్టుకుని, సహకరించని అన్ని అవయవాలతో రాజీపడి,లొంగదీసుకుని పోరాటం సాగించిన యోధుడు భరాగో. ఒక్క మెదడు పాదరసంలాగ పనిచేస్తూంటే- పని చెయ్యనిస్తే- ఎన్ని రుగ్మతలనయినా జయించవచ్చని నిరూపించి చూపిన వ్యక్తి ఆయన. ఒక్కగానొక్క కూతురు కుటుంబంతో యాత్రకి వెళ్తూండగా దేవుడులాంటి అల్లుడు ఆక్సిడెంటులో పోయాడు. చేతిలో కొడుకు –భరాగో మనుమడు- పోయాడు.అలా మంచం మీద కూర్చునే ఆమె జీవితాన్ని తన శక్తి మేరకి సవరించి తీర్చిదిద్దాడు. మా అమ్మ పోయినప్పుడు ఆయన గొంతులో దుఃఖాన్ని చూశాను.వచ్చి ఓదార్చాడు. ఆయన భార్య వెళ్ళిపోయినప్పుడు గొంతు వణికింది. ఆయన జీవితం ఎందరికో స్పూర్తికావలసిన పాఠం.ఒక అద్భుతమైన resilience తో ఎన్నో గొప్ప పనులు చేశాడు.తనకు నచ్చిన ఎందరో రచయితలు, గాయనీమణుల ప్రత్యేక సంచికలను రూపొందించి ప్రచురించాడు. అందులో కొత్తపల్లి వీరభద్రరావు, రావిశాస్త్రివారితో పాటు నా షష్టిపూర్తి సత్కార్య సంచిక కూడా వుంది. ఆ ఫొటొలు, ఆ వ్యాసాల సేకరణ, ఆ పేజీల కూర్పూ, పునరుక్తిని పరిష్కరించడం అనితరసాధ్యం. నా నవల “సాయంకాల మైంది”ప్రచురించే మేస్త్రీ పని చేశారు.నా “ప్రొఫైల్” వేయించి ఇచ్చారు. నా “ఆత్మకధ” ని ఎన్నో సార్లు చదివి, శీర్షిక దగ్గర్నుంచి, అక్షర స్కాలిత్యాల దాకా పరిష్కరించారు. విశాఖపట్నం వెళ్తే- పని వున్నా లేకపోయినా ఆయన దగ్గరికి ఒకటి రెండుసార్లయినా వెళ్ళకపోతే తోచదు.నాకే కాదు- తెలుగు దేశంలో వున్న ఎందరో సాహితీబంధువులకి ఆయన యిల్లు ఒక యాత్రాస్థలం. అందరి అభిమానాన్ని, ఆదరాన్ని, గౌరవాన్ని, స్నేహాన్నీ పొందిన సంపన్నుడు. ఒకరోజు డబ్బు విషయంలో మరీ కూడ బలుకుతున్నాడని నిష్టూరంగా మాట్లాడితే “నాకు డబ్బంటే భయమయ్యా .ఏమయినా ఇవ్వగలను. డబ్బు మాత్రం ఇవ్వలేను” అన్నాడు. అల్పసంతోషి. ఆయన్ని వ్యక్తిగా మెప్పించడం సుళువు. రచయితగా ఒప్పించడం చాలా కష్టం. తన తూకపురాళ్ళతోనే రచనల్ని బేరీజు వేసుకుని రావిశాస్త్రి దగ్గర్నుంచి, సైగల్ దగ్గర్నుంచి, పాలువాయి భానుమతిదాకా- మనస్సులో నిలుపుకుంటాడు. భానుమతి, పి.సుశీల లకి వేసిన ప్రత్యేక సంచికలు వారి పట్ల ఆయన అభిమానానికి ప్రతీకలు. సుశీల పుస్తకాన్ని వేస్తూ “మనవూరి అమ్మాయికదా? మనం చెయ్యకపోతే ఎవరు చేస్తారు?” అన్నాడు నాతో. ఆయన “నూటపదహార్లు” తెలుగు సినీసంగీతానికి వెయ్యినూటపదహార్ల కట్నం. ఏ ఎం.ఫిల్ పట్టాకో ఏ కమిటెడ్ విద్యార్ధో చెయ్యవలసిన పరిశోధన. కాని ఆయన సినీ సంగీతానికి కమిటెడ్ అభిమాని. అందుకని రెండు సార్లు కృషి చేసి తన రుణం తీర్చుకున్నాడు. ఎప్పుడు ఫోన్ చేసినా నామొదటి ప్రశ్న:”ఎలా వున్నారు?” ఆయన పడికట్టు సమాధానం:”బాగులేనయ్యా” ఆ మాట కేవలం అంతవరకే. ఆయన ధారణ అపూర్వం. మంచం మీద కూర్చునే ఖంగుమనే కంఠంతో తన అసిస్టెంటుకి చెప్తాడు: “ఆ రెండో వరుసలో కిందనుంచి ఎర్రట్ట వున్న మూడో బైండు తియ్యి. అందులో 121 పేజీలో “మనుషులు” అనదానికి బదులు “మడుషులు ’’అని పడింది చూడు అంటారు. పక్కగదిలో ఏ బుట్టలో ఏ పుస్తకం వుందో ఈ గదిలో మంచం మీద కూర్చుని చెప్తారు. నన్నామధ్య ఎవరో నా రచన “సెక్సీ కధ”కి టీవీ రూపకం రాయమని ఫోన్ చేసారు. అలాంటి కధ నేను రాసిన విషయమే మరిచిపోయాను. మా తమ్ముడు భరాగోకి ఫోన్ చేస్తే “మీ అన్నయ్య వదిలిఫొయిన బుట్టలో వుందయ్యా” అన్నారట. వెళ్తే నా “కదంబం” స్క్రిప్టుల డబ్బాలోంచి తీసియిచ్చారు. ఆయన సెన్సాప్ హ్యూమర్ అనన్య సాధ్యం. ఈ మధ్య రెండు నెలలు మంచం పట్టారు. జ్వరం ఎంతకూ తగ్గలేదు. గెడ్డం పెరిగింది. తెల్లటి బుల్లిగెడ్డం. “గెడ్డం పెంచారేమిటి?” అన్నాడట మా తమ్ముడు. “మొన్న కలలో చంద్రబాబు నాయుడు కనిపించాడయ్యా. అలా గెడ్డం పెంచాలనిపించింది” అన్నారట. ఇలాంటి వ్యక్తి మీదకి మృత్యువు దూకడానికి ఎన్ని గుండెలు! ఆయన దగ్గర పని చేసిన అమ్మాయికి డబ్బు ఖర్చుచెసి పెళ్ళి చేసి, సారెపెట్టి కాపురం పెట్టించాడు. Underdog ని వెనకేసుకురావడంలో ఆయనకి ఆయనేసాటి. ఆ మధ్య అపరకర్మల మీద ఎవరో పుస్తకం రాస్తే దాన్ని పరిష్కరించి ఇచ్చాదు. ఉత్తరాంధ్రలోని బ్రాహ్మణాగ్రహారాలు అనే పేరిట ఆ ప్రాంతాల్లో పనిచేసిన ఓ పోలీసాయన సయ్యద్ మీర్ మహమ్మద్ రాస్తే దానికి సహకారం చేసి పరిష్కరించి ప్రచురించారు. ఆచంట జానకిరామ్ “సాగుతున్న యాత్ర”, ”నా స్మృతిపధంలో” మళ్ళీ ప్రచురించి ఈ తరానికి ఉపకారం చేశారు. అంగర వెంకట కృష్ణారావుగారి “విరామం” నవలను పునర్ముద్రించి వారి కుటుంబానికి అందజేశారు. మిత్రుడు జ్యేష్ఠ పేరిట ఆయన చేసిన సభలు, ప్రచురించిన పుస్తకాలు, చేసిన ఉపకారాలు ఎన్నో. తెలుగు సాహితీ ప్రపంచంలో ఆయన చాలామందికి పెద్దదిక్కు. ఓ పెద్ద సంస్థ ఈ మధ్య ఒక మాసపత్రికని ప్రారంభించనున్నారని చెప్తే నాకు ఎన్నో సలహాలను ఇచ్చారు. “భరాగో పేజీ” అంటూ ఒక పేజీని కేవలం హాస్యం కోసం కేటాయిస్తానన్నాను. మొన్నకూడా ఆ పేజీగురించి ఆయనతో ప్రస్తావించి ప్లేన్ ఎక్కాను. ఇప్పుడా పేజీ ఉండే అవకాశం లేదు. పాఠకులు ఎన్ని నవ్వుల్ని నష్టపోయారో! దుఃఖం నా జీవితంలో “గ్రేడ్”ల తేడాయేకాని పరిచయం లేనిసరుకు కాదు. భరాగో లేరని తెలిసి ఫోన్ లో వారబ్బాయిని పలకరిస్తూంటే మాటల మధ్య దుఃఖం తొసుకొచ్చింది. భరాగో అనే రచయితగురించి- నవ్వించే రచయిత గురించి, సరదా రచయిత గురించి, వంటొచ్చిన మొగాడి గురించి, “తడిసి మోపెడు” రచనలు చేసి కేంద్ర సాహిత్య అకాడమీని మెప్పించిన మొనగాడి గురించి నేనింతవరకూ ఏమీ రాయలేదు. కారణం- రాయనవసరం లేదని. ఇవన్నీ రేపయినా ఆయన పుస్తకాలు చెప్పగలవు. కాని జీవితాన్ని ఎదిరించి, బెల్లించి, శాసించి, కష్టానికీ, నష్టానికీ లొంగక- తన షరతులమీదే జీవికని నడిపించి- హఠాత్తుగా, ఠీవిగా, గర్వంగా వెళ్ళిపోయిన ఓ “ఉద్యమం” గురించి రేపట్నుంచీ ఎవరూ చెప్పలేరు. ఆయన్నీ, ఆయన జీవికనీ చూడలేరు కనుక. భరాగో ఒక వ్యవస్థ. సంవత్సరాల రాపిడితో అలసిపోయిన, అనారోగ్యం వత్తిడిలో వొడిలిపోయిన, మనస్తాపాల మనస్సులో సడిలిపోయిన ఓ నిస్సహాయపు శరీరాన్నిమభ్యపెట్టి, నిప్పురవ్వలాగ పూరించిన ఏకైక యోధుడు భరాగో. ఆయన గుప్పెడు ప్రాణం ఆయన్ని మోసం చేసి తప్పింకుపోయివుంటుంది. తెలిస్తే లొంగేవాడు కాదు. ఏప్రిల్ 12, 2010 ************ ************ ************* ************* |