Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

 చీపురు రాజకీయం

  చీపురుని ఎన్నికల గుర్తుగా ఉంచాలని ఆలోచించిన వారెవరో నిజంగా మహానుభావులు. ఇంతకంటే ఇంటి ముంగిట్లో, వీధుల్లో, గదుల్లో తిష్ట వేసుకు కూర్చునే సాధనం మరొకటి ఉండదు. దాని అవసరం లేని రోజూ, అవసరం లేని మనిషీ, అవసరం లేని సందర్భమూ ఉండదు. నిజానికి 'చీపురు'ని ఎన్నికల గుర్తు చేయగానే సగానికి సగం విజయం సాధించినట్టే లెక్క. అందునా ఈ మధ్య సమాజంలో చెత్త ఎక్కువయి, చెత్త రాజకీయాలు తల బొప్పి కట్టించే నేపధ్యంలో ఎలాంటి చీపురుతో ఈ చెత్తని బుట్టదాఖలు చెయ్యాలా అనే ఆలోచనతో దేశంలో చాలామంది జుత్తు పీక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో 'చీపురు' పార్టీ ఎంతగానో స్వాగతించవలసిన సంఘటన. గాలిలో వందలాది చీపుర్లు ఎగరేస్తూ ''మాకు ఓటు వెయ్యండి. చెత్త సంగతి మాకు వదిలేయండి'' అన్న దృశ్యం అత్యంత హృద్యమయినదీ, ఈ దేశం కలలు కంటున్నదీను. చెత్తని వదిలించినా వదిలించకపోయినా -చీపురు దాన్ని 'చెత్త' అని గుర్తు పెట్టడం, దాన్ని సమూలంగా తుడిచి పెట్టాలని తలపెట్టడం -దేశభక్తి, సమాజ సేవ అని దొంగపేర్లు పెట్టి బొర్రలు, ఖజానాలు నింపుకునే నాయకమ్మణ్యుల మీద 'ఏవగింపు' ఈ నినాదానికి గొప్ప పెట్టుబడి. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఇలాంటి ప్రయత్నం ఎన్నడూ జరగలేదు. అంతేకాదు. ఆ కారణానికే పార్టీ అవతరించగానే సగం విజయాన్ని సాధించేసింది. అంతేకాదు. పార్టీ అవతరించిన 9 నెలల్లో -170 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీని మట్టి కరిపించి, 15 సంవత్సరాలుగా ఢిల్లీలో రాజ్యమేలుతున్న ముఖ్యమంత్రిని గద్దె దింపడం కన్న వోటరు 'కసి'కీ, ఈ రాజకీయ వ్యవస్థ పట్ల అతని 'అసహ్యానికీ' మరొక నిదర్శనం అక్కరలేదు. ''వాళ్లూ మాలాగే హామీలిచ్చారు. ఏదీ? చేసి చూపమనండి'' అని మొన్న ఓ రాజకీయ నక్క టీవీలో పెద్ద కబుర్లు చెప్పాడు. ఇది సిగ్గులేని మాట. అయితే సిగ్గు వంటి గుణాలు వీరినుంచి ఆశించడం నిజానికి అన్యాయం. మొదట వారి రాజకీయ నీతిని ఎండగట్టినందుకు సిగ్గుపడడం పోయి, ఎదురు తిరగడం దయనీయం. ఈనాటి సిగ్గులేని రాజకీయ వ్యవస్థకి ఇది కేవలం నీచమైన ఉదాహరణ.
ఈ చీపురు పార్టీ తాము ఇచ్చిన హామీలను తీర్చలేకపోవచ్చు. వాళ్లూ సమాజంలో అవినీతికి, దురాశకీ, దుర్మార్గానికీ బలికావచ్చు. వాళ్లూ క్రమంగా మిగతా పార్టీలలాగే నేలబారు స్థాయికి దిగజారిపోవచ్చు. అవుతుందని కాదు. అయితే ఆశ్చర్యంలేదని మాత్రమే. ఒకవేళ అయినా ఈ విప్లవాన్ని, ఈ దశలో చరిత్రనీ ఏనాటికీ మరిచిపోదు. మరిచిపోకూడదు. పదవిలోకి వచ్చినప్పటి నుంచీ పెట్టెలు సర్దుకున్న నాయకుల పట్ల వోటరు 'ఏహ్యత'కు ఈ ఎన్నిక అద్దం పడుతోంది. నిర్దాక్షిణ్యంగా అవినీతిని వోటరు గద్దెదించడం ఈ దేశానికి శుభసూచకం. చరిత్ర.
సిగ్గులేకుండా రోజూ టీవీలముందు కనిపించే ఎందరి మొహాలనుంచి తమకు విముక్తి కావాలని ఈ దేశ ప్రజలు కలలు కంటున్నారో ఈ ఎన్నిక -కుండ పగలగొట్టి నిరూపించింది. తప్పని సరిగా కోడి గుడ్డుమీద వెంట్రుకలు పీకే ప్రబుద్ధులు ఆయా పార్టీలలో ఉన్నారు. నిజానికి అదే వారి ఘనత. ఈ ఎన్నికలో వోటరు 'విసుగు'ని రహస్యంగానయినా ఈ అవకాశవాదులు గుర్తుపడతారని ఆశిద్దాం.
ఇక రాజస్థాన్‌లో, మధ్యప్రదేశ్‌లో తమ 'హవా' చెల్లుతోందని రొమ్ము విరుచుకునే నాయకులూ ఒకటి గుర్తుపట్టాలి. ప్రతీసారీ -నాయకుల పట్ల తమ కోపాన్ని, అసహ్యాన్నీ, అసమ్మతినీ చూపడానికి మరో ఆస్కారం లేని ఓటరు -తప్పనిసరిగా, నిస్సహాయంగా, ఏడుస్తూ -బాచా బూచులలో మరో పాత 'బూచి'నే ఎన్నుకుంటున్నాడు మరో గతిలేక. ఈ రాజకీయ నాయకులు ''మిమ్మల్ని తిట్టారంటే మ మ్మల్ని పొగుడుతున్నట్టు లెక్క'' అని చంకలు గుద్దుకుని తమ బ్రాండు అవినీతిని అయిదు సంవత్సరాలు ఆచరణలో పెడతారు. అప్పుడు నిస్సహాయంగా వీళ్లని గద్దె దించుతున్నాడు వోటరు -అప్పుడూ మరో గతి లేక. దీనికి ఒకే ఒక ఉదాహరణ -తమిళనాడు. గత 46 సంవత్సరాలలో డిఎంకెని గద్దె దించి, ఎడీఎంకెనీ, అలాగే వీళ్లని దించి వాళ్లనీ ఎన్నుకుంటున్నాడు ఓటరు -నిస్సహాయం గా. కారణం -అతనికి మరో ప్రత్యామ్నాయం లేక. ''బాబూ! రాజస్థాన్‌లో, మధ్యప్రదేశ్‌లో బలమైన 'చీపుర్లు' ఉంటే నిజమైన వోటరు 'అభిప్రాయం' దేశానికి తెలిసేది.
ఈ చీపురు పార్టీ విజయాల్ని చూద్దాం. మూడుసార్లు ఎన్నికయిన ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌నే కాదు. గత 60 సంవత్సరాలుగా అలవాటుగా అంబేద్కర్‌ నగర్‌ నుంచి తప్పనిసరిగా ఎన్నికవుతూ, గిన్నిస్‌ పుస్తకం ఎక్కిన రాజకీయ భీష్ము డు చౌదరీ ప్రేమ్‌ సింగుని అశోక్‌కుమార్‌ చౌహాన్‌ అనే కుర్రాడు ఓడించాడు. ఆ వోటమిలోనూ మూడోస్థానంలో ఉన్నారు ప్రే మ్‌సింగుగారు. ఇది మరో కారణానికి గిన్నిస్‌ పుస్తకం ఎక్కాల్సిన చరిత్ర. సోమ్‌ దత్తా శర్మ అనే విద్యార్థి నాయకుడు ఉచితంగా వైద్య శిబిరాన్ని నడిపి, పేద విద్యార్థులకి చదువుకి సహాయం చేసే పని చేస్తున్నాడు. అతను ఈ చీపురు పార్టీ అభ్యర్థి. సంజీవ్‌ ఝా పై రాష్ట్రాల నుంచి ఢిల్లీ వచ్చి స్థిరపడాలనుకున్న వారికి సహాయం చేసే 'నవ పల్లవ్‌' అనే సంస్థని నడుపుతున్నాడు. సత్యేంద్రకుమార్‌ జైన్‌ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి విసిగి ఉద్యోగానికి రాజీనామా చేసి -పుట్టుకతో మానసికంగా దెబ్బతిన్న పిల్లలకు సహకరించే సంస్థని నడుపుతున్నాడు. మిగతా పార్టీలలో -రాజకీయ నాయకుల కొడుకులు, పెళ్లాలు, మేనళ్లుళ్లు, కూతుళ్లు, పినతండ్రులు -వీరుకాక గూండాలు, మానభంగాలు చేసేవారు, దోపిడీదారులు, మాఫియా పెద్దలు, హంతకులు -వీరంతా ఎన్నికయి -మన శాసన సభల్లో, పార్లమెంటుల్లో ఉన్నారు. వీళ్లు చిన్న చిన్న అవినీతులు చేస్తే తప్పులేదని ఐయ్యేయస్‌లకు గీతాబోధ చేస్తారు. 17 కోట్లు దోచుకుంటే పెద్ద అవినీతికాదని పెదవి విరుస్తారు. ఇళ్లలో టెలిఫోన్‌ ఎక్స్‌ఛేంజ్‌లు నిర్మించుకుంటారు. గడ్డి తింటారు. అమ్మాయిలతో రంకు జరిపి, హత్యలు చేసి శవాల్ని మాయం చేస్తారు. పేరు అడిగినందుకు గుమాస్తాల మీద తుపాకులు తీస్తారు. పోలీసు స్టేషన్లలోకి వెళ్లి పోలీసుల్ని కొడతారు. వీళ్ల అరాచకాలు వర్ణనాతీతం. అత్యంత జుగుప్సాకరం.
ఈ నేపథ్యంలో వీరి అవినీతికి ప్రజలు ఎంతగా విసిగిపోయి ఉన్నారో, ఎక్కడయినా రవంత చల్లగాలి ప్రసరిస్తే ఊపిరి పీల్చుకోవాలని ఎంత తహతహలాడుతున్నారో -నిన్నటి ఢిల్లీ ఎన్నిక చెప్తోంది. చీపురు అవసరాన్ని వోటరు ఎంతగా ఆశిస్తున్నాడో నిరూపిస్తోంది. బాబూ! మిగతా పార్టీల నాయకులూ! తమకొక మనవి. ఆమ్‌ ఆద్మీ పార్టీలోనూ ఒకరిద్దరి అవినీతిపరులు దొంగ దారి గుండా ప్రవేశించారని నిన్న ఎవరో పరాయి పార్టీవారు దేశాన్ని హెచ్చరించబోయారు. వారూ తమ హామీలను తీర్చలేకపోతారా? వారూ నిజాయితీగా రాజకీయాల్ని నిర్వహించలేక మెల్లగా దిగజారిపోతారా? అయినా వారితో ప్రయాణం చెయ్యడానికి చెయ్యి కలుపుతాం. ఎందుకో తెలుసా? వాళ్లు మీలాగ చెడిపోవడానికి మరో 60 ఏళ్లు పట్టవచ్చు. కాని 2013 లో హంతకులతో, ఖూనీకోర్లతో సతమతమవుతున్న మేము, 1947 తర్వాతి కాలంలో అవినీతిని భరిస్తూ ఇంకాస్త మనశ్శాంతితో జీవించగలం. అయిదేళ్ల కుర్రాడిలో తొలినాటి అవినీతి -వేళ్లు నిలదొక్కుకొని మమ్మల్ని సమూలంగా కబలించే చెయ్యి తిరిగిన అవినీతి కంటే మేలయినది. అయితే -రవీంద్రుని మాట మాకు ఊరట. ఈ ప్రపంచంలో కళ్లు విప్పుతున్న ప్రతీ పసివాడూ -మనిషి అనునిత్యం చెడిపోతున్నా ఏనాటికయినా బాగుపడడా అనే భగవంతుడి నిరంతనమైన ఆశాభావానికి, విశ్వాసానికి ప్రతీక -అన్నారు రవీంద్రులు. ఈనాటి చీపురు ఏనాటికయినా ఒక నిజాయితీపరుడిని గద్దె ఎక్కించదా అని మా ఆశ. అందుకు వోటరు ఏనాటికీ అలసిపోడు. కారణం మీ దౌర్భాగ్యపు అవినీతితో క్రుంగి, కృశించి విసిగి వేసారి ఉన్నాడు కనుక.

       
 
      gmrsivani@gmail.com   
     డిసెంబర్  16,  2013          

*************

Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   


KOUMUDI HomePage