|
|
హుద్ హుద్ హుర్రే! 34 సంవత్సరాల క్రితం దివిసీమలో ఓ అర్ధరాత్రి ఉప్పెన కెరటాలు ఉవ్వెత్తున లేచాయి. లేస్తాయని ఎవరికీ తెలీదు. లేస్తే ఏం చెయ్యాలో తెలీదు. ఎటుపోవాలో తెలీదు. అందరూ నిద్రలో ఉన్నారు. బెంబేలెత్తి పరుగులు తీశారు. ఎటు పరుగెత్తాలో తెలీదు. ఆస్తి నష్టం సరే. శవాలు గుట్టలయాయి. ఒకాయన మర్నాడు పట్టాల మీద నడుస్తూ గుంటూరు బయలుదేరాడు. రైలు పట్టాలకు రెండు పక్కలా శవాలు. తెగిన చెట్లు. ప్రకృతి చేసిన బీభత్సం. "మారుతీరావుగారూ! ఆ రాత్రి గాలి చప్పుడులో మృత్యుఘోష వినిపించింది" అన్నారు. రేడియోలో ఆయన్ని నేను ఇంటర్‌వ్యూ చేశాను. మొన్న ఒకాయన పేపర్లో రాశాడు. అంగారక గ్రహానికి ఇంత ఖర్చుపెట్టి ఉపగ్రహాన్ని పంపడం అవసరమా? ఆ డబ్బుని పేదల భోజనానికి, వసతులకి ఖర్చుపెట్టవచ్చుకదా? అని. ఈయనెవరో ఇంకా రాతియుగంలో ఉన్నారు. ఆశ్చర్యం. ఇలాంటి అర్ధంలేని చవకబారు, సెన్షేషనల్ తెలివితేటల్ని ఓ పత్రిక ప్రకటించింది. ఇది గేలరీలకు అందే నినాదం. ఈ ఉత్తరం రాసిన లాంటి మనుషులు దైనందిన అవసరాల వేపే చూస్తారు. కానీ వ్యవస్థ జాతి దీర్ఘకాలిక ప్రయోజనాల వేపు దృష్టిని సారిస్తుంది. సారించాలి. పర్యావరణాన్ని, భూకంపాలను, ప్రకృతి విలయాలను ఎప్పటికప్పుడు గురుతుపట్టే ఉపగ్రహాలను ఇప్పటికి 36 దేశాల తరపున మనదేశం అంతరిక్షానికి పంపింది. అదీ ఆధునిక మానవుడి అప్రమత్తత. అంగారకుడి దగ్గరగా వెళ్ళిన ఉపగ్రహం వల్ల ఏం మేలు జరుగుతుందో ఇప్పుడిప్పుడే మన ఆలోచనకి అందకపోవచ్చు. పిచ్చి కుక్క కాటుకి - రాబీ వ్యాధికి అంతవరకూ లేని చికిత్సను కనిపెట్టిన లూయీ పాశ్చర్ ఆనాడు తొమ్మిదేళ్ళ పసివాడిమీద ప్రయోగాన్ని చేసే ధైర్యం లేకపోతే ఇవాళ మానవాళికి ఈ ఉపకారం జరిగేదికాదు. మొదట 'హుద్ హుద్' అంటే ఏమిటి? అది ఇజ్రేల్ జాతీయ విహంగం పేరు. చాలా అందమయిన పక్షి. ఇంత భయంకరమైన తుఫాన్‌కి ఇంత అందమయిన పక్షి పేరేమిటి? దూసుకు వచ్చే విపత్తు మనల్ని రెచ్చగొట్టేదో, భయపెట్టేదో కానక్కరలేదని భావించారేమో! 'భూలోకరాక్షసి ', 'ప్రజాహంతకి ' - ఇలా పిలిస్తే ఇంకా భయపడి పోయేవాళ్ళమేమో! హిరణ్య కశిపుడనే రాక్షసుడి తలవొంచే శక్తి అతి సరళమైనదీ, సర్వామోదయోగ్యమయినదీ. పేరు - ప్రహ్లాదుడు. 94 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ భయంకరమైన ఉప్పెన - ఏ క్షణంలో, ఏ వేగంతో, ఏ స్థలాన్ని తాకగలదో ప్రతీ చిన్న సమాచారాన్ని మన శాస్త్ర పరిజ్ఞానం మనకి చెప్పి మనల్ని అప్రమత్తం చేసింది. గంటకి 200 కిలోమీటర్ల వేగంతో తాకే గాలి, వాన ఉధృతి ఆనాడు దివిసీమ బాధితుడు చెప్పిన మృత్యువు తాకిడిని గుర్తు చేసింది. కొన్ని లక్షలచెట్లు కూలిపోయాయి. కొన్నివేల ఎలక్ట్రిక్ స్తంభాలు పూచిక పుల్లల్లా ఎగిరిపోయాయి. కాని ముగ్గురు, కేవలం ముగ్గురే ఈ గాలివాన తాకిడికి కాక, పర్యవసానం తాకిడికి బలి అయారు. ముందురోజు తెల్లవారు ఝామున మూడున్నర గంటలకి పెద్ద శబ్దమయితే లేచాను. అయిదో అంతస్థులో ఉన్న నా పుస్తకాల గది తలుపు తెరుచుకుపోయి - కుండపోతగా వర్షం, భయంకరమైన గాలితో ఇంట్లోకి వస్తోంది. అది మృత్యువు. తలుపు మూయాలని నేనూ, మా ఆవిడా ప్రయత్నించాం. అరగంట ప్రయత్నించినా తలుపు మూయలేకపోయాం. కాస్త అడుగు తడబడితే గాలికి ఇద్దరం కొట్టుకుపోతామని అర్దమౌతోంది. ప్రయత్నం మానుకున్నాం. తలుపు వదిలేశాం. మరుక్షణంలో పెళపెళమంటూ అద్దాలు బద్దలయిపోయాయి. గదిలోకి నీటి వరద. మరికాస్సేపటిలో మరిన్ని అద్దాలు పగిలాయి. ఇది చిన్న ఉదాహరణ. కొన్నివేల అద్దాలు, కొన్ని వందల భవనాల్లో తునాతునకలయాయి. కొబ్బరిచెట్లు అపజయానికి తలవొంచిన వీరుల్లాగా - పీలికలై, వికవికలాడాయి. అదొక ప్రళయం. ప్రకృతి విలయతాండవాన్ని ఎవరూ ఆపలేరు. కానీ ముందుగా తెలిస్తే తప్పించుకోగలరు. వీలయినంత ప్రభావాన్ని తగ్గించగలరు. ఈ విపత్తు పగలు రావడం మరో గొప్ప అదృష్టం. జనం కళ్ళు తెరిచి అప్రమత్తంగా ఉన్నారు. "ఇలాంటి మరో విపత్తుకి మనం ఉండమేమో. ఏఏ చర్యలవల్ల ఈ విపత్తుని ఈమాత్రమయినా ఎదుర్కోగలిగామో ఒక 'బ్లూ బుక్ ' తయారు చేసి ముందు తరాలకి అందించాలి" అన్నారు ఈ విపత్తుని చూసిన నరేంద్రమోడీ. చావు దెబ్బతిని ప్రజలు కకావికలు కాలేదు. చావు తప్పినందుకు ఆ మేరకు ఊపిరి పీల్చుకున్నారు. అతలాకుతలమయిన ఓ నగరం అవసరాలు వెంటనే తీరవు. కానీ సత్వరంగా తీర్చే ప్రయత్నం యంత్రాంగం చేస్తోంది. ఆ ఫలితాలు క్రమంగా ప్రజలకు చేరుతున్నాయి. సముద్రతీరాన్నే మా మిత్రుడి హోటల్ ఉంది. మద్యాహ్నం పన్నెండు గంటల సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చే వాయుగుండం కైలాసగిరిని ఢీకొట్టడం స్వయంగా చూసి వణికిపోయాడు. వాయుగుండం ఎటు కదలాలో తెలీక అరగంటసేపు అక్కడే గిజగిజలాడిందట. తర్వాత వాయుగుండం భీమిలీ వేపు తిరిగింది. పొరపాటున నగరం వేపు తిరిగివుంటే ఎమ్.వి.పి కాలనీ, మద్దిలపాలెం, రేసవానిపాలెం, యూనివర్సిటీ, సిరిపురం ఇవన్నీ నేలమట్టం అయిపోయేవి. ఇప్పటికే అక్కడి విధ్వంసం అనూహ్యం. ఏమయినా వాయుగుండం విశాఖని తాకింది. విశాఖ - భీమిలి మధ్య తీరాన్ని దాటింది. కనీవినీ ఎరగని మరోదృశ్యం - ముఖ్యమంత్రి స్వయంగా పెట్రోలు బంకులో నిలబడి పెట్రోలు అమ్మకాన్ని పర్యవేక్షించడం, గాజువాక ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్‌లో కూర్చుని ఉద్యోగులని కార్యోన్ముఖుల్ని చేయడం. కొన్ని వందల బలగాలు ఏలూరు, గుంటూరు, మైదుకూరు మొదలైన ప్రాంతాలనుంచి వచ్చాయి. సైనిక సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది అంతా ఏకమయి సహాయక చర్యలు చేపట్టారు. ఒక అపూర్వమైన సామూహిక చర్య. 24 గంటల్లో కొన్ని ప్రాంతాలలో దీపాలు వెలిగాయి. సబ్సిడీ ధరలకు కూరగాయలు అందాయి. ఉచితంగా బియ్యం అందింది. కానీ మానవ స్వభావంలోని నీచత్వానికీ ఇదే అదను. పెట్రోలు ధరని 200కి పెంచి వ్యాపారులు లాభం చేసుకున్నారు. నీటి లారీలనుంచి నీరు పట్టుకుని - మూడు బకెట్లు నింపిన ఓ పెద్దమనిషి వీధి చివర బకెట్ పది రూపాయలకు అమ్మకం సాగిస్తున్నాడు. గ్లాసు అద్దాలు పగిలిన షోరూములలో అంత తుఫానులోనూ దోపిడీలు చేశారు. అంతరిక్ష పరిశోధన ఉపయోగం ఏమిటని అడిగిన పాఠకునికి సమాధానం - ఆరోజంతా అమెరికాలో హ్యూస్టన్ నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి - విశాఖపట్నంలో మా ఇంటి బయట, సముద్ర తీరంలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు చెపుతున్నారు. సిడ్నీనుంచి ఒక మిత్రుడు ఇంకెంత సేపట్లో వాయుగుండం తీరాన్ని తాకబోతోందో మమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. చెన్నై నుంచి మా అబ్బాయి చెపుతున్నాడు - వాయుగుండం ఇప్పుడే విశాఖని తాకిందన్నాడు. రామకృష్ణా బీచ్ రోడ్డు మీదకి సముద్ర కెరటాలు వచ్చాయన్నాడు. మరో 40 నిముషాలకు కాస్త విరామం. "మీరిప్పుడు వాయుగుండం కేంద్రంలో ఉన్నారు" అన్నాడు. మరో అరగంటకి వాయుగుండం దిశమారింది. "ఈసారి మరీ తీవ్రంగా తాకబోతోంద"ని హెచ్చరించాడు. పరిశోధన మానవ కళ్యాణానికి దీర్ఘగాలిక ప్రణాళికల్ని రచిస్తుంది. ఓ జాతికి ఉపకారం చేస్తుంది. ఒకనాడు మశూచి మహమ్మారి. మానవుడు జయించాడు. 34 ఏళ్ళ క్రితం ఉప్పెన మృత్యువాత. 2014 నాటికి మానవుడు ఎదిరించడానికి ఆయుత్తమవుతున్నాడు. నిన్న సముద్రతీరంలో హోటల్‌కి వెళ్ళాం. ఎదురుగ్గా ప్రశాంతంగా పరుచుకున్న సముద్రం. మానవుడు - తన మేధస్సుతో, ప్రతిభతో, అత్యాశతో, అహంకారంతో నిర్మించుకున్న ఎన్నో విజయాల్ని కేవలం గంటలో సర్వనాశనం చేయగల ప్రాధమిక శక్తులు - నీరు, గాలి - అని హెచ్చరించిన సముద్రం మళ్ళీ నంగనాచిలాగ చెలియలికట్టకి లోబడి కెరటాల్ని తనలోకి తాను లాగుకుంటోంది. ఈ ఉప్పెన భీభత్సాన్ని నా పెంట్‌హౌస్‌ని వదిలి - పక్క ఇంట్లో ఉన్న మా తమ్ముడి ఇంట్లో గడిపాను. ఉదయమే మేడమీదకు వచ్చాను. వేలాది పుస్తకాలు నా కళ్ళముందు నీళ్ళల్లో పడవల్లాగ తేలుతున్నాయి. గుండె పగిలిపోయింది. నిర్వీర్యుడినయి చదికిలబడిపోయాను. తలుపు చప్పుడయింది. కింద ఫ్లాటులో ఉండే అయిదేళ్ళ ముస్లిం అమ్మాయి వచ్చింది. ఒక గ్లాసుతో మంచినీళ్ళు నాకు అందించింది. ఎందుకు? నేను అడగలేదే! కానీ అవసరమని ఆ పసి మనస్సుకు అనిపించినట్టుంది ఆ పిల్ల నోరెత్తలేదు. కేవలం instinctతో చేసిన పని. ఆ పసిపాప అందించిన మంచినీళ్ళ గ్లాసు - నా జీవితాంతం ఈ భయంకరమైన ఉప్పెనకి ఉపశమనంగా నా మనస్సులో నిలిచిపోయే జ్ఞాపకం.
*************
Read all the columns from Gollapudi గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి |
|