Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

 అమ్మా కొడుకుల భాగోతం

          
వ్యాపార లావాదేవీలలో ఎప్పుడూ ముగ్గురుండాలి (రాజకీయం వ్యాపారమయి చాలాకాలమయింది). మొదట ఇద్దరు చర్చలు జరుపుతారు. మూడో వ్యక్తి ఆ చర్చలకి దూరంగా ఉంటాడు. తీరా నిర్ణయాలన్నీ జరిగిపోయాక -వాటిని ఆ మూడో వ్యక్తి వింటాడు. ఇందులో ఎవరికి నచ్చకపోయినా, కొత్త కిరికిరి పెట్టాలన్నా ఈ మూడో వ్యక్తికి వెసులుబాటు ఉంటుంది. అన్నీ తమకి అనుకూలంగా లేకపోతే ఆ ఒప్పందాన్ని గంగలో కలిపే అవకాశమూ అతనికే ఉంటుంది. అంటే ఏతా వాతా ఏ ఒప్పందానికయినా ఆఖరి నిర్ణయం దూరంగా నిలిచిన ఈ మూడో పెద్దమనిషిది.
అలాంటి మూడో పెద్దమనిషి కాంగ్రెస్‌కి కొంగు బంగారంగా ఒకరున్నారు. ఆయన రాహుల్‌ గాంధీ. ఆయనెప్పుడూ ఏ విషయం మీదా తన అభిప్రాయాలు చెప్పరు. తన చుట్టూ జరిగే అవినీతులూ, కుంభకోణాలకి స్పందించరు. బొగ్గు కుంభకోణం, టూ జీ కుంభకోణం, ఆదర్శ కుంభకోణం, కామన్వెల్తు క్రీడల కుంభకోణం, ఇస్రో -ఎస్‌ బాండ్‌ కుంభకోణం -ఏదయినా సరే. వారు నిమ్మకు నీరెత్తినట్టుంటారు. కాని అవసరమైనప్పుడు ముందుకు వస్తారు. ఎవరికి అవసరమైనప్పుడు? అమ్మగారికి. సోనియా అమ్మగారికి. అన్ని మార్గాలూ మూతపడి, ప్రభుత్వం ఏమీ చెయ్యలేని ఊబిలో పడినప్పుడు -ఈ మూడో పెద్దమనిషి అవసరం వస్తుంది. అసలు ఏ సమస్యకు ఎలా మేడం సోనియాగాంధీగారు స్పందిస్తున్నారో మనకు తెలీదు. ఎవరో చెప్పగా మనం వింటూంటాం. వారెంత గట్టిగా చెప్తే మేడం అంత గట్టిగా స్పందిస్తున్నారని మనం సరిపెట్టుకుంటాం. ఇదేమిటి? ప్రభుత్వ వ్యవహారాలలో ఈ ఏకాంత సందేశాలేమిటి? అదంతే. తప్పనిసరి అయినప్పుడు, తప్పేది లేనప్పుడు అమ్మగారు కొడుకుగారి భుజం గిల్లుతారు. కొడుకుగారు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చెయ్యరు. ఏదో సమావేశంలో జొరబడతారు. ఆయన చెప్పాల్సిన నాలుగు మాటలూ చెప్పేసి మాయమౌతారు. చంద్రబాబుగారు ఓ మాట అన్నారు: మన యువరాజుగారు కాస్త ఆలశ్యంగా నిద్రలేచినట్టున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలి సమ్మతితోనే ఈ ఆర్డినెన్స్‌కి రెక్కలొచ్చాయి. ఏమయినా మన 43 ఏళ్ల యువరాజుగారు ఇంకా రాజకీయ భాష ని వంటబట్టించుకోలేదు. కేంద్ర మంత్రివర్గమంతా చర్చించి, ప్రతిపక్షాలతో చర్చ లు జరిపి, సుప్రీం కోర్టు తీర్పుకి తూట్లు పొడిచే శాసనాన్ని రాష్ట్రపతి సమ్మతికి పంపాక -ఈ పెద్దమనిషి -జరుగుతున్న పత్రికా సమావేశంలోకి దూసుకు వచ్చి ''ఇది నాన్సెన్స్‌. ఈ శాసనాన్ని చించేసి పారెయ్యాలి'' అని చెప్పి తప్పుకున్నాడు. దేశం నిర్ఘాంతపోయింది. ఇలా ఖండించడం ప్రధానమంత్రిని బజారున పెట్టడం కదా? ఆయన అప్పుడు అమెరికాలో అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో మంతనాలు జరుపుతున్నారు. ఆయన్ని ఇరకాటంలో పెట్టడం కదా? బయటికి వస్తూనే అర్జంటుగా రాహుల్‌ గాంధీ మన్మోహన్‌ సింగుగారికి ఒక వర్తమానం పంపారు. ''మీరంటే నాకు అపారమైన గౌరవం ఉంది'' అంటూ. ఇదెందుకు ఇప్పుడు? ఆ రోజు వీధిన పడి పరోక్షంగా ఆయన్ని వీధిన పెట్టారు కనుక. ఇలా చెయ్యడంలో గూడుపుఠాణీ ఏమయినా ఉందా? బొత్తిగా నోరు తెరవని యువరాజు పరపతిని ఆకాశానికి దూసుకెళ్లేటట్లు చెయ్యాలన్న సంకల్పం దీనివెనుక ఉన్నదా? ఇలాంటి చర్యలు ఆయన పరపతిని పెంచవు. ఆయన అనుభవలేమిని, కుర్రతనాన్నీ చాటి చెప్తాయి. ఎప్పుడూ నోరు విప్పని నాయకుడు హఠాత్తుగా, వేళమించిపోయాక ఔచిత్యాన్ని మరిచి, బహిరంగంగా తమ నాయకుని మీదే విరుచుకు పడడం -నిజాయితీ అనిపించుకోదు. ఆకతాయితనం అనిపించుకుంటుంది.అసలు ఇప్పుడెందుకీ శాసనం? ఏ విషయంలోనూ ఏకాభిప్రాయానికి రాకుండా, పార్లమెంటుని వివాదాల, ఆవేశాల రచ్చబండగా మార్చిన రాజకీయ పార్టీలు -దాదాపు ఏకీభావంతో రాష్ట్రపతిదాకా పంపిన ఈ శాసనం ఎవరిని కాపాడడానికి? గడ్డి కుంభకోణంలో ఇరుక్కున్న లల్లూ ప్రసాద్‌ గారిని రక్షించడానికా? (తీరా తీర్పు వచ్చి లల్లూగారు జైలుకి వెళ్లారు). కరుణానిధి కుటుంబమంతా ఇరుక్కున్న అవినీతి నేరాలనుంచి కాపాడడానికా? పవన్‌సింగ్‌ బాన్సల్‌ గారిని ఉద్దరించడానికా? సుప్రీం కోర్టు తీర్పునే సవరించడం తప్పనిసరయిన ఈ శాసనం తమ చేతులు దాటిపోతున్నదని గుర్తుపట్టిన అమ్మగారు కొడుకుని రంగంలోకి దింపారా? ఎన్నడూ నోరిప్పని కొడుకుశ్రీ ప్రస్థుతం హఠాత్తుగా నోరుచేసుకోవడంలో కేవలం ఆయన నిజాయితీయే తెలుస్తోందా? ఇవన్నీ విడని చిక్కుప్రశ్నలు.
ఒక పక్క సుప్రీం కోర్టు నానాటికీ పెచ్చురేగిపోతున్న రాజకీయ నాయకుల జులుంని గుర్తుపట్టి, అవినీతిపరులని పరిపాలనా వ్యవస్థ నుంచి దూరంగా ఉంచాల్సిన సమయం వచ్చిందని ఎరిగి ఇచ్చిన తీర్పు -నిన్నకాక మొన్న సాధికారికంగా ఎన్నికలలో అవినీతిపరులని తిరస్కరించే అవకాశాన్ని చట్టబద్ధం చేసింది. దీన్ని రూలు 49-ఓ అంటారు. 2001లోనే అప్పటి ఎన్నికల కమిషనర్‌ టి.ఎస్‌.కృష్ణమూర్తిగారు వోటరుకి అభ్యర్థుల్ని తిరస్కరించే హక్కుని ఇవ్వాలని, బాలెట్‌ కాగితం మీద ''నేనెవరినీ ఎన్నుకోవడం లేదు'' అనే అవకాశం ఉండాలని, ఇది రాజ్యాంగం ప్రకారం వోటరు హక్కని ప్రతిపాదించారు. అయితే ఎన్నికల ఉద్దేశం నాయకుని ఎన్నుకోవడం కాని, ఎవరినీ ఎన్నుకోని వోటరు హక్కుని -కోట్లు ఖర్చు పెట్టి సమర్థించడం కాదని అప్పట్లో ఆ ప్రతిపాదనని అటకెక్కించారు. కాని నానాటికీ పెరుగుతున్న అవినీతి, చట్టాన్ని, నిబంధనల్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్న నాయకుల కుతంత్రాలు, సమాజం భ్రష్టు పట్టే వాతావరణాన్ని గుర్తించిన సుప్రీం కోర్టు ఈ హక్కుని సమర్థించింది. ఇంతలో ఆలశ్యంగా కన్నువిప్పిన యువరాజులో నిజాయితీ ఉందా లేక మనకి అర్థం కాని మరేదయినా మెలిక ఉందా అని చాలామంది ముక్కుమీద వేలేసుకున్నారు. జరగకూడని, జరగని, జరగరాని పని చేసిన రాహుల్‌ గాంధీగారి కుండబద్దలు కొట్టే చర్య కొందరిని ఉత్సాహపరిచినా, చాలామందిని అనుమానంగా చూసే అవకాశాన్ని కల్పించింది. ఏమయినా అర్దాంతరంగా చొచ్చుకువచ్చిన రాహుల్‌ గాంధీ నిజాయితీ -ప్రభుత్వం ఉద్దేశాలకి పట్టం గట్టదు. పార్టీలతో లాలూచీలో తమవంతు వాటాలేవో కుదరలేదేమోనన్న అనుమానం దగ్గరే ఆగుతాయి. నిజాయితీ ఉన్నట్టుండి ఒక్క వెలుగు వెలిగే మతాబు కాదు. అనునిత్యం ఆకాశాన ప్రజ్వరిల్లే సూర్యుడు. సూర్యరశ్మికి కాలదోషం లేదు. మతాబుకి ఎక్కువ ఆయుష్షు లేదు.


      gmrsivani@gmail.com   
     అక్టోబర్ 07,  2013          

*************

Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   


KOUMUDI HomePage