మాటకి తెరలు

               
         
            ప్రఖ్యాత సోషియాలజిస్టు ఆల్విన్‌ టాఫ్లర్‌ చెప్పినమాట. ఈ భూమి మీద మానవుని ఉనికిని గత 50,000 సంవత్సరాలలో పరిశీలిస్తే -ఒక మనిషి జీవిత పరిమితి 61 సంవత్సరాలనుకుంటే -మానవుడు 800 జీవితకాలాల నుంచీ ఈ భూమిమీద జీవిస్తున్నాడు. షాక్‌ అయే విషయం -అందులో 650 జీవితకాలాలు గుహల్లో గడిపాడు. గత 150 జీవితకాలాల నుంచే గుహలనుంచి బయటకు వచ్చాడు. అదెలా సాధ్యమయింది? మాట కారణంగా. ఒకరితో ఒకరు తమ ఆలోచనలను పంచుకునే శక్తిని, వెసులుబాటునీ పెంచుకున్న కారణంగా. ఈ ఒక్క కారణమే మనిషికీ జంతువుకీ తేడాను నిర్ణయించేది. మనిషి ఆలోచిస్తాడు. ఆలోచనను చెప్పగలుగుతాడు. జంతువు చెప్పలేదు. అదీ అతని శక్తి. ఈ శక్తి యొక్క పరాకాష్ట -కళ. అంటే గొప్పగా చెప్పడం. బలంగా చెప్పడం. ఆవేశంగా చెప్పడం. అన్నిటికన్నా ముఖ్యం -అర్థమయేలాగ చెప్పడం. ఈ పనిని మనిషి గత మూడు జీవితకాలాల నుంచే సమర్థవంతంగా చేస్తున్నాడట. ఇక్కడ ఆల్విన్‌ టాఫ్లర్‌ని అటకెక్కించేద్దాం.

          ఆఫ్రికా మేక తెలుగు మేకతో తనగోడు చెప్పుకోలేదు. తమిళం ఎద్దు హిందీ ఎద్దు కష్టసుఖాలను అర్థం చేసుకోలేదు. కాని ఆఫ్రికా మనిషి -కాస్త ప్రయత్నిస్తే తెలుగు మనిషితో మాట్లాడగలడు. తమిళం మనిషి హిందీ మనిషి కష్టసుఖాలను తెలుసుకోగలడు. తెలుసుకోగలగడమే సమిష్టి జీవనం అర్థం. ప్రయోజనం. అవకాశం కూడా. జాతి సమైక్యంగా ఉండాలంటే అందరూ ఒక ఆలోచన చెయ్యకపోయినా, చెయ్యలేకపోయినా -ఒక భాష మాట్లాడాలి. ఉపాధి పేరిటో, మంచి జీవితానికి రుచిచూసో, తప్పనిసరి అనిపించో గత 200 సంవత్సరాల పైగా ఆ పని ఇంగ్లీషు చేసింది. 1889 గురజాడ అప్పారావుగారి 'కన్యాశుల్కం' లో అగ్నిహోత్రావధాన్లు పెళ్లాం వెంకమ్మ గిరీశాన్ని తన కొడుకుతో ఇంగ్లీషులో మాట్లాడమంటుంది. వేదం చదువుకుంటున్న కరటక శాస్త్రి శిష్యుడు అదిచూసి పొంగిపోతాడు. ఇంగ్లీషు గ్లామరు, అవసరం అప్పుడే వంటబడుతున్న రోజులు. ఇప్పుడు మంచి చెడ్డల గురించి బేరీజు వేస్తున్నాం కాని ఆసేతు హిమాచల పర్యంతం ఇంగ్లీషు నేర్చుకునే అవసరాన్ని, అవకాశాన్ని బ్రిటిష్‌వారు కల్పించి విజయం సాధించారు. తర్వాత మనకి స్వాతంత్య్రం వచ్చింది. మనకి నచ్చినది నచ్చినట్టు చేసుకొనే హక్కు వచ్చింది. దేశాన్నంతిటినీ ఏకీకృతం చేసేది భాష అని గుర్తించిన పెద్దలు 'హిందీ'ని జాతీయ భాష అన్నారు. కాని మనం స్వతంత్రులం కదా? ఇప్పుడెందుకు ఒప్పుకుంటాం? ఆనాడు బ్రిటిష్‌వారి మాట 'చచ్చినట్టు' విన్నాం. నేర్చుకున్నందుకు గర్వపడ్డాం. గర్వంగా కుండలుచేసే కుమ్మరి 50 రూపాయల ఉద్యోగం చేస్తున్నందుకు అలనాడు గర్వంగా 'డవాలా' సర్దుకున్నాడు. వేదాన్ని వదిలేసి 'ప్లీడరు గుమాస్తా' అయిన పంతులుగారు ఏనాడూ చూడని, అవసరంలేని కరెన్సీని లెక్కపెట్టుకుని పొంగిపోయాడు. పరవాలేదు. అందరూ ఒద్దికగా ఒక్క భాషమీద నిలబడ్డారు.

           కాని స్వతంత్ర భారతదేశంలో 'మాకు హిందీ వద్దు' అని బస్సులు తగలెట్టి, ఆస్తులు కూల్చి గవర్నమెంటు తలవొంచారు. 40 ఏళ్లు ద్రవిడ పార్టీలు దక్షిణాదిన అలా తలవొంచగలిగిన కారణంగానే పదవిలోకి వచ్చాయి. ఇక్కడ విజయం వ్యవస్థ కాదు. ఒక వ్యవస్థని కూల్చడం. మనం స్వతంత్రులం కదా? 67 సంవత్సరాల తర్వాత కూడా మనం హిందీ చదువుకోము. ఎందుకు? చదువుకోకపోవడం మన హక్కు కనుక. అది హిందీ కనుక. అది మరొక భాషని మన మీద రుద్దడం కనుక. అన్నిటికీ మించి -ఎదిరించి తలవొంచడం రాజకీయమైన విజయానికి గుర్తు కనుక. ఇది మెజారిటీని దుర్వినియోగం చేసుకునే దరిద్రం.

          మొన్న కలకత్తానుంచి విశాఖపట్నం విమానంలో వస్తున్నాను. రుమేనియానుంచి వచ్చిన పైలెట్‌ విమానం నడుపుతున్నాడు. విమానం సముద్రాన్ని దాటి నగరం మీదకి వచ్చి దాదాపు నేలమీద వాలుతుందనగా -ఉన్నట్టుండి ఆకాశంలోకి ఎగిరింది. మేం షాక్‌ అయాం. రుమేనియా పైలెట్‌ మాట విశాఖపట్నం రాడార్‌ని చూస్తున్న అప్పలకొండకి అర్థం కాలేదా? మాకు వొళ్లు చల్లబడింది. అర్థం కాకపోతే 168 మంది ప్రాణాలు బలి అయిపోతాయి. ఓ గొప్ప గుండె జబ్బు నిపుణుడు ఉన్నాడు. అతను బెంగాళీవాడు. ఆపరేషన్‌ టేబులు మీద పేషెంటు గుండెని తెరిచారు. రక్తం పోతోంది. తెలుగు రక్తం గురించి బెంగాళీ రక్తం గుర్తు పట్టలేదు. టేబిలుమీద పేషెంటు ఏమవుతాడు? భాష కారణంగా ఒక గొప్ప నిపుణుడి ప్రత్యేకత మరొకరికి అందకుండా తెరలు దించుతున్నామా? పంజాబులో గుడ్డివాడు రోడ్డు దాటుతున్నాడు. ఎదురుగా బస్సు వస్తోంది. తమిళం అయ్యరుగారికి తెలుస్తోంది. కాని ఆ క్షణంలో గుడ్డివాడికి ఎలా చెప్పాలో తెలీదు. తెరలు.

         విజ్ఞానం యొక్క గొప్ప ప్రయోజనం అజ్ఞానం ఎల్లలు చెరిపేయడం. మానవశ్రేయస్సుని వీలయినంత విస్తృతం చేయడం. ఆ పనిని, దాని అవసరాన్ని ఇంగ్లీషువాడు గుర్తించి, సాధించినట్టుగా మరెవరూ చేయలేదు. మీకు ఇంగ్లీషు వస్తే వేదాలు చదువుకోవచ్చు. భగవద్గీత చదవొచ్చు. శుశ్రుతుడి కృషిని తెలుసుకోవచ్చు. అన్నమాచార్య పదాలు పాడుకోవచ్చు. చెలంగారి నవలని చదువుకోవచ్చు. కాఫ్కా కథని చదవొచ్చు. టర్జినీవ్‌ రచనల్ని, గెలీలియో పరిశోధనల్ని తెలుసుకోవచ్చు. ఇవాళ ఒక్క ఇంగ్లీషు పెట్టుబడిగా దాదాపు ప్రపంచంలో ఏమూలకయినా వెళ్లి కాలం గడపవచ్చు. భాష తెలీని జపాన్‌, ఇటలీ, థాయ్‌లాండ్‌ వంటి దేశాలలో కూడా కనీసం ఒక్కరినయినా ఇంగ్లీషు తెలిసే దుబాసీలను ఆయా సంస్థలలో ఉంచుతారు.

          నాకీ మధ్య ఓ మిత్రుడు ఈ మెయిల్‌ పంపించాడు. సంస్కృత భాష మనమెదడులో ఏదో ప్రత్యేకతను పరిపుష్టం చేస్తుందట. ఒక విదేశీ ప్రముఖుడు మన దౌత్య అధికారిని అడిగాడట: ''ఏమయ్యా, మీ దేశంలో అంత గొప్ప భాష -సంస్కృతం -ఉందికదా. దాన్ని అభివృద్ధి చేసుకోరేం?'' అని. దౌత్య అధికారి కంగారు పడి: ''మాది సెక్యులర్‌ వ్యవస్థసార్‌. ఆ భాష మతానికి సంబంధించినది. ముట్టుకోం'' అన్నాడట. శుశ్రుతుడు, వరాహమిహిరుడు, ధన్వంతరి మొదలైనవారంతా మతానికి సంబంధించినవారు కాదుబాబోయ్‌! అని ఈ తరానికి ఎవరు చెప్తారు? ప్రజాభిప్రాయంలో మెజారిటీ లేనిదానిని అటకెక్కించడం శ్రేయస్కరం.

          మన మెజారిటీలో మూర్ఖత్వం వుంది. తాత్కాలిక ప్రయోజనం ఉంది. అందుకే హెన్రిక్‌ ఇబ్సన్‌ దాన్ని ''ఇనిమీ ఆఫ్‌ ది పీపుల్‌'' అన్నాడు. హిందీని మన స్వేచ్ఛ పేరిట దూరం చేసుకుని, చేసుకున్న కారణానికే ప్రభుత్వాలను గద్దె దించే నిర్వాకం వెలగబెట్టిన మనం -200 సంవత్సరాలు తప్పనిసరిగా మీదపడి, నేర్చుకోవడాన్ని ఒక ఘనతగా, అవసరంగా, తప్పనిసరిగా భావించిన ఇంగ్లీషుని మన 'స్వేచ్చ' పేరిట అటకెక్కించడం ఏమి సబబు? అనిపిస్తుంది నాకు.

        తేలుకుట్టింది. పక్కింటి శత్రువు దగ్గర మందు ఉంది. ఆయన శత్రువుకనుక ఆ మందు వాడననుకోవడం ఏం తెలివి? ఆ రోజుల్లో మహాత్మాగాంధీ, రైట్‌ ఆనరబుల్‌ శ్రీనివాసశాస్త్రి, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, అంబేద్కర్‌, బాలగంగాధర తిలక్‌, పరమహంస యోగానంద ఈ మాట అనుకుని ఉంటే మనం ఎక్కడ ఉండేవాళ్లం?

            మనకి ఇంగ్లీషు వద్దనడం ఏరుదాటాక తెప్ప తగలెయ్యడం వంటిదని అనిపిస్తుంది. ప్రపంచాన్ని తన పరిధిలోకి తెచ్చుకున్న ఓ గొప్ప సంస్కృతిని, ఆ భాషద్వారా ఒడిసిపట్టుకుందాం. మన మెజారిటీ శక్తి -భాష కారణంగా మన మధ్య తెరలు దించకూడదు. ఈ ఒక్క కారణానికే ఆ రోజు ఈస్టిండియా కంపెనీ, డచ్చి వ్యాపారులు మన దేశాన్ని కొల్లగొట్టారు. మన పెద్దలు బ్రిటిష్‌వారిని వారి ఆయుధంతోనే ఓడించారు. మనం వారి ఆయుధంతోనే ప్రపంచాన్ని జయిద్దాం. భాష ద్వారా వారు సాధించిన ప్రయోజనాన్ని వారు నేర్చిన విద్యతోనే సాదిద్దాం. ఇంగ్లీషుని వద్దని మనం ఒక గొప్ప ప్రపంచాన్ని అటకెక్కిస్తున్నాం.

          ప్రాంతీయ అభిమానం దురభిమానం కాకూడదు. ఆయా ప్రాంతీయ భాషల్లో చదువుకున్నవారు పట్టణాల్లో చదువుకున్నవారితో పోటీ పడలేకపోతే వారి సామర్థ్యాన్ని పెంచే అవకాశాలు కల్పించండి. గుర్రం 50 అడుగులు కొండదాటి గెంతాలి. గెంతే శక్తిలేకపోతే గుర్రం శక్తిని పెంచాలి -కొండ ఎత్తుని తగ్గించడం కాదు. మనకి అలవాటులేని, అర్థంకాని భాష పట్ల ఆనాడు బ్రిటిష్‌ పాలకులు రుచినీ, నేర్చుకోవడం వల్ల ప్రయోజనాల్ని చూపి ఎలా ప్రోత్సహించారో గుర్తుపట్టండి.

        పార్లమెంటులో మనకి మరుగుజ్జు నాయకులున్నారు. పిల్లల అసమర్థతకి అనువుగా ఒక గొప్ప 'అవకాశాన్ని' కుదించాలని ప్రయత్నిస్తున్నారు. దూరదృష్టిలేని నాయకమ్మణ్యుల విన్యాసాలివి. విస్తృతి, వికాసం, అవకాశం, అవసరం కారణంగా ఇప్పటికే మన జీవితాల్లోకి తొంగిచూసిన 'ఇంగ్లీషు' ఓ గొప్ప వరం. దాన్ని గత 67 సంవత్సరాలుగా చూస్తున్నాం. ప్రాంతీయత పేరిట తెరలు దించి ఒక రుమేనియా పైలెట్‌, ఒక బెంగాళీ వైద్య నిపుణుడు, ఒక తమిళ పర్యాటకుడి సేవల్ని నష్టపోవద్దు. నా మాటలు చాలామందికి నచ్చకపోవచ్చు. కాని ఓ గొప్ప భాషని అద్భుతంగా మరే దేశమూ సాధించలేనంత గొప్పగా ఒడిసిపట్టుకున్న భారతదేశం ప్రాంతీయత పేరిట దాని ప్రాముఖ్యాన్ని కుదించడం దురదృష్టమని నేను భావిస్తాను. ఇంగ్లీషు భాషలేకపోతే రవీంద్రుని 'గీతాంజలి', ఆర్‌.కె.నారాయణ్‌, రాజారావు, స్వామి రామా రచనలు, అద్భుతమైన తీర్పుల్ని కళాఖండాలను చేసిన వి.ఆర్‌.కృష్ణయ్యర్‌ ప్రతిభా పాటవాలు, కమలాదాస్‌ కవితలు, నిన్న మొన్నటి చేతన్‌ భగత్‌ రచనలు ఏమయేవని నేను వాపోతాను. ఇప్పటికీ చాప్లిన్‌ ఆటోబయోగ్రఫీ, డిలన్‌ ధామస్‌ కవితా, ఆర్ధర్‌ మిల్లర్‌ నాటకాలు, అరవిందుల 'సావిత్రి', జిడ్డు కృష్ణమూర్తి ప్రసంగాలు, గాంధీ ఆత్మకథ, ఎమిలీ బ్లాంటే, షా, ఆస్కార్‌ వైల్డ్‌, ఎమిలీ డికిన్సన్‌ చదివినప్పుడల్లా ఇంగ్లీషు భాష అనే ఒక్క వరాన్ని ఇచ్చినందుకు బ్రిటిష్‌వారికి మనస్సులో కృతజ్ఞతలు చెప్పుకుని పులకిస్తూ ఉంటాను.
 


      gmrsivani@gmail.com   
           ఆగస్టు 11 ,   2014          

*************

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage