Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

 

గూండా రాజ్యం

 

 

 ఈ దేశంలో నిజాయితీ బొత్తిగా చెల్లని సరుకు. ముఖ్యంగా ఆఫీసర్ల నిజాయితీ పక్కలో బల్లెం. ఆ విషయం ఎరిగిన చాలామంది ఐయ్యేయస్‌ ఆఫీసర్లు దీపముండగానే యిల్లు చక్కబెట్టుకుంటున్నారు. పాపం, శ్రీలక్ష్మి, రాజగోపాల్‌ వంటివారు వీధినపడి, కొందరు జైళ్ళలో పడినా మొత్తానికి నిజాయితీని అటకెక్కించడం బాగా కిట్టుబాటవుతున్న సందర్భాలే కనిపిస్తున్నాయి.

కొందరు ఐయ్యేయస్‌లూ, ఐపీయస్‌లూ బహిరంగ సభల్లో నాయకుల కాళ్లమీద పడి తమ విశ్వాసాన్ని తెలియజేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. మరికొందరు ఆఫీసర్లు -ముఖ్యమంత్రి చెప్పుల్ని మెరుగుపెట్టి తమ నిజాయితీని చాటుకుంటున్నారు. వీరందరి మధ్యా -బొత్తిగా అనుభవం లేని, బొత్తిగా నేలబారు నిజాయితీపరులు -తొందరపడి వీధిన పడుతున్నారు.

ఉత్తరదేశంలోనయితే నాయకుల అడుగుజాడల్లో నడవకపోతే జైళ్లకు వెళ్లే వరకూ శాల్తీలు మిగలవు. అక్కడి నాయకుల ముందు శషబిషలు పనికిరావు. దక్షిణ దేశంలోనయినా -ఏ నాయకులయినా -యింత కుండలు బద్దలుకొట్టినట్టు అవినీతిని సమర్థించారా చూడండి.

ప్రస్థుత ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి చిన్నాయన -ఆయనా ఒక మంత్రి సత్తములు -ఐయ్యేయస్‌ ఆఫీసర్లకు బాబూ కష్టపడి పనిచేస్తే కాస్త దోచుకున్నా పరవాలేదు అని హితవు చెప్పారు.

ఆజం ఖాన్‌ అనే మరో సమాజ్‌వాది పార్టీ నాయకులు అన్నారు :”శ్రీరాముడి పేరిట కాస్త దోచుకోవచ్చు. ఈ దేశంలో ప్రకృతి వనరులు అందరి సొత్తు’’

ఇలాంటి విజ్ఞానాన్ని -బరితెగించిన అవినీతిని మనవారికి వంటబట్టడానికి ఇంకా చాలా అనుభవం కావాలి. మరి తమ నీతిని పాటించని అమాయకుల గతి ఏమిటి? 1994లో బీహార్‌లో గోపాల్‌గంజ్‌ మెజిస్ట్రేటు జి.కృష్ణయ్య. ఓ సాదాసీదా తెలుగు పేద రైతు కుటుంబానికి చెందిన నిజాయితీపరుడు. ఆయన ఈ నాయకుల అడుగుజాడల్లో నడవలేదు. 1994లో ఒక రాత్రి తన విధిని నిర్వర్తించి తిరిగి వస్తూండగా జనతాదళ్‌ -యునైటెడ్‌ నాయకులు ఆనంద్‌ మోహన్‌సింగ్‌, ఆయన సతీమణి లవ్లీ ఆనంద్‌, మరికొంతమంది సాయుధ గూండాలు ఆయన జీప్‌ని ఆపి -ఆయన్ని రోడ్డుమీదికి ఈడ్చారు. సూటిగా తుపాకీని పేల్చారు. రక్తసిక్తమయిన శరీరంతో కిందపడి ఇంకా ప్రాణం వున్న కృష్ణయ్యని రాళ్లతో కొట్టి చంపారు. ఆ మధ్యనే డిఎస్‌పి మహమ్మద్‌ జియా ఉల్‌ హక్‌ మరో ఇద్దరిని ఉత్తరప్రదేశ్‌ మాజీ మంత్రి, కుందా ఎమ్మెల్యే రాజా భయ్యా, అతని అనుయాయులు దారుణంగా హత్య చేశారు.

రాజస్థాన్‌ అశోక్‌ ఖేమ్కా అనే ఆఫీసరుగారు సోనియా గాంధీ, రాబర్ట్‌ వదోద్రా స్థలాలు నియమ బద్ధంగా లేవని నిలదీశారు. ఆయన గుండెలు దీసిన సాహసం దేశమంతా చెప్పుకుంది. కనుక ఆయన్ని ఏమీ చెయ్యలేకపోయారు. కాని సర్వీసులో ఆయన సీనియారిటీని అయిదు స్థానాలు కిందకి లాగారు. ఆయన పాపం, నిజాయితీపరుడు. బొత్తిగా బతకనేర్వనివాడు. ఆయన్ని 21 సంవత్సరాలలో కేవలం 43 సార్లు మాత్రమే బదిలీ చేశారు. అంటే ప్రతీ ఆరు నెలలకీ ఆయనకి బదిలీ జరిగింది. మరొక అమాయకుడైన ఆఫీసరుగారున్నారు. ఆయన సి.ఉమాశంకర్‌. ఆయన నలభైయ్యో పడిలో ఉన్నారు. ఆయనకి కేవలం 19 సార్లు మాత్రమే బదిలీలు జరిగాయి. ఇంకా విచిత్రం ఏమిటంటే 108 రోజుల్లో రెండుసార్లు బదిలీ జరిగింది!

ఉత్తరప్రదేశ్‌లో మాయావతి హయాం లో డిడి మిశ్రా అనే డిప్యూటీ ఇనస్పెక్టర్‌ జనరల్‌గారు ఓ పొరపాటు చేశారు. మాయావతి గారిది అవినీతిపాలన అని ప్రకటించారు. మేడమ్‌ వారిని ఉద్యోగం నుంచి తొలగించి సరాసరి పిచ్చి ఆసుపత్రికి పంపించారు.

పిచ్చి ఆసుపత్రికి వెళ్లడం మంచిదా? మన రాష్ట్ర ఆఫీసర్లలాగ జైళ్లకు వెళ్లడం మంచిదా? ఈ దేశంలో ఒకనాడు పాలక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచిన సివిల్‌ సర్వీస్‌ పరిస్థితి ఇది. నిజాయితీని గౌరవించే నాధుడు లేడు. కాగా, అవినీతికి కలిసివచ్చే కిట్టుబాట్లు ఉన్నాయి. ఉదాహరణకి -పాదమ్‌ సింగ్‌ అనే ఐపియస్‌ ఆఫీసరుగారు బహిరంగసభలో మాయావతి చెప్పులమీద ధూళిని భక్తితో తుడిచాడు. ఆయనకి వెంటనే రెండేళ్లు సర్వీసుని మేడమ్‌ పొడిగించారు!

మొన్నటికి మొన్న దుర్గా శక్తి నాగ్‌పాల్‌ అనే 28 ఏళ్ల అమ్మాయి -ఆలిండియా సివిల్‌ సర్వీసు నియామకాల్లో 20 స్థానంలో నిలిచింది. గ్రేటర్‌ నోయిడాలో గౌతమబుద్ధ నగర్‌లో సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేటుగా నియమితురాలయింది. వచ్చిన కొద్ది నెలలలోనే ఇసుకని దొంగ రవాణా చేస్తున్నవారి మీద కత్తి ఝళిపించింది. రెండు నెలల్లో 297 లారీలను స్వాధీనం చేయించింది. ఎందరిమీదో కేసులు బనాయించింది. 80 లక్షల జరిమా నా వసూలు చేసింది.

ఈ ఇసుక మాఫియాని నిర్వహిస్తున్నది నరేంద్ర భాటీ అనే సమాజ్‌వాదీ పార్టీ నాయకులు. ఎంత సాహసం! ఎంత ధైర్యం! ఈ అమ్మాయికి బొత్తిగా అనుభవం లేదని భాటీగారు భావించారు. దెబ్బతీసే అవకాశం కోసం వేచి ఉన్నారు. మొన్న కాదల్‌పూర్‌ గ్రామంలో ఒక మతపరమైన కట్టడానికి ప్రభుత్వ స్థలంలో గ్రామీణులు గోడ కడుతున్నారని తెలిసి మెజిస్ట్రేటుగారు పరిస్థితిని చక్కబెట్టమని దుర్గాశక్తి నాగ్‌పాల్‌ని పంపారు. గ్రామీణులకి ఆమె హితవు చెప్పింది. బాబూ! ప్రభుత్వం అనుమతిని తీసుకుని గోడ కట్టండి. లేదా మీ అంతట మీరే ఆ పని మానుకోండి అని. గ్రామీణులు ఆమె మాట చెవినిపెట్టారు. గోడ నిర్మాణం మానుకున్నారు. సమస్య సడలిపోయింది. కాని గవర్నమెంటు ఊరుకోలేదు. మత వైషమ్యాలకు దారితీసే చర్య తీసుకున్నదని -అర్ధరాత్రి 1 -27 నిముషాలకు ఆమెని సస్పెండు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇంకా గుండెలు తీసిన విషయమేమిటంటే ఈ నరేంద్ర భాటీ గర్వంగా మొన్న బహిరంగసభలో ఈ ఐయ్యేయస్‌ ఆఫీసరుని అర్ధరాత్రి కేవలం 41 నిముషాలలో సస్పెండు చేయించానని గర్వంగా రొమ్ము విరుచుకున్నారు. మనం ఏ కాలంలో ఉన్నాం? ఏ విధంగా మనం సోమాలియా, కాంగో వంటి దేశాలకంటే గొప్పవారం! ఒక గూండా బహిరంగంగా తన నేరాన్ని సభలో చెప్పి మరీ రొమ్ము విరుచుకునే స్థితిలో ఈ దేశ వ్యవస్థ ఉన్నదా!

ఇదీ నిజాయితీకి ఈ దేశంలో దక్కే బహుమతి. సమాజ్‌వాదీ పార్టీ మద్దతు కేంద్రానికి ప్రస్థుతం ఎంతయినా అవసరం. ఈ చదరంగంలో జీవితంలో అడుగుపెడుతున్న ఓ నిజాయితీతో, కార్యదక్షత గల ఆఫీసరు కెరీర్‌ బలి అయిపోయినా పెద్ద నష్టం లేదు. ప్రస్థుతం జైళ్లకు వెళ్లిన మన ఐయ్యేయస్‌లు ఇలాం టి భయంకరమైన చదరంగంలో తప్పనిసరయిన పావులయారేమో! మనకు తెలీదు. నిజాయితీపరులను రోడ్డుమీదకి ఈడ్చి మారణహోమం చేసే అభివృద్ధి దక్షిణాది ఇంకా సాధించలేదు. అయి తే మనకీ మంజూనాధ్‌ వంటి కథలున్నా యి. ఎంత చెట్టుకి అంతగాలి. పదవిలో ఉన్న మంత్రులే “అవినీతి’ తప్పులేద ని కుండబద్దలు కొట్టేస్థాయి కి మన అవినీతి ఇంకా రాలేదని మనం గర్వపడవచ్చు. ఎప్పుడయి నా దొరికితేనే దొంగలు. లేకపోతే మంత్రులు!

     
      gmrsivani@gmail.com   
     ఆగస్టు 5,  2013          

*************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   


KOUMUDI HomePage