Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

 వృద్ధాప్యానికి ఆహ్వానం

    చమకం యజుర్వేదంలోని శ్రీరుద్రంలో ఒక భాగం. చమకం అంటే నాకెప్పుడూ చిన్న చూపే. కారణం కన్యాశుల్కం నాటకంలో గిరీశం. గిరీశం వెంకటేశంతో అంటాడు: ''మీ నాన్న ప్రతీ రోజూ దేవుడి ముందు కూర్చుని ఏం చేస్తాడనుకున్నావ్‌? ఓయి దేవుడా! నాకు సుఖమియ్యి. నా కోర్టు కేసు గెలిపించు. అల్లవాడి కొంపముంచు'' అంటూ దేవుడిని దేబిరిస్తాడు. 'చమే'అంటే 'నాకియ్యవయ్యా' అని అర్థం. నువ్వు కూడా నీక్కావలసినవన్నీ అడగొచ్చు. 'గేదె పెరుగూ చమే, చేగోడీ చమే' అని హితోపదేశం చేస్తాడు.
తీరా భగవంతుడంటూ కనిపిస్తే బొత్తిగా ఈ జాబితా చదవడం ఏమిటి? ఇన్ని కోరడమేమిటి? ఈ జీవితాన్ని పట్టుకు యింతగా దేబిరించే వీడికి స్వర్గం, మోక్షం ఎందుకని దేవుడు అనుకోడా? -యివన్నీ నా సందేహాలు. అయితే చమకంలో ఒకచోట -ఈ ఆలోచనలన్నింటికీ అడ్డకట్ట కట్టే విచిత్రమైన కోరిక ఉంది. ''వృద్ధిం చమే, వృద్ధం చమే'' అని. ఇదేమిటి? నాకు వృద్ధినియ్యి అన్నంతవరకూ బాగానే వుంది. నాకు వృద్ధాప్యాన్ని యివ్వమని అడుగుతాడేమిటి? అని ఆశ్చర్యం. కోరికలనుంచీ, ఈ జీవితంలో సుఖాల నుంచీ బయటపడలేని జీవుడు -అలా బయటపడేసే మానసిక స్థితిని, ఆ దశని ప్రసాదించు స్వామీ -అంటూ ఆ కోరికల వెల్లువలోనే ఒక విచిత్రమైన కోరికని జతచేశాడు. అన్ని కోరికలనుంచీ విముక్తం చేసే -లేదా విరక్తిని కలిగించే వృద్ధాప్యాన్ని ప్రసాదించు -అని వేడుకోవడం బహుశా ఏ మతంలోనూ ఏ భక్తుడూ ఏ దేవుడినీ యింత పరిణతితో, యింత గంభీరమైన కోరిక కోరలేదేమో!
''ఈ మనస్సు కోతి స్వామీ! దానికి ఉన్న చాపల్యాలుల అన్నీ తీర్చు. తప్పదు. చేసేదీ లేదు. కాని ఏదో ఒకనాడు ఈ చాపల్యాలన్నింటినీ వదులుకొనే దశనీ, స్థాయినీ, వయస్సునీ -వృద్ధాప్యాన్ని ప్రసాదించు'' అంటున్నాడు జీవుడు.
వృద్ధాప్యం ఒక మజిలీ. ప్రతీ వ్యక్తీ కోరుకు న్నా కోరుకోక పోయినా తప్పనిసరిగా చేరుకునే మజిలీ. వయస్సులోని కోరికలన్నింటికీ సెలవిచ్చి, అలసిపోయిన అనుభవాలనీ, ఆరిపోయిన అనుభూతులనూ నెమరువేసుకునే చలివేంద్రం. వృద్ధాప్యం ఒక అవకాశం. వెనక్కి తిరిగి చూసుకుని చేసిన తప్పిదాలకు నవ్వుకుని, దాటిన అడ్డంకులను పరామర్శించి, ఇక దాటనక్కరలేని స్థితికి వచ్చినందుకు ప్రశాంతంగా నిట్టూర్చే ఆటవిడుపు.
ముసిలితనం కొడుకు కంటె ఒక అడుగు వెనక నడిపిస్తుంది. మనవరాలి భుజాన్ని ఆసరా చేసుకుంటుంది. జీవితమంతా కొరుకుడుపడని నిజాలతో ఆనందంగా రాజీపడేటట్టు చేస్తుంది. పిల్లలు ''నీకేం తెలీదు నాన్నా!'' అంటే కోపం రాదు. ఒక జీవితకాలాన్ని తెలీనితనానికి తాకట్టు పెట్టిన కొడుకుని చూసి నవ్వుకుంటుంది. తనకి తెలీదని పక్కకి తప్పించే తరాన్ని చూసి గర్వపడుతుంది. అవలీలగా అర్థం చేసుకుంటుంది. ''వాడికి తోచినట్టే చెయ్యనివ్వండి'' అనే భార్య హితవుకి గంభీరంగా తలవొంచుతుంది. ఏ విమర్శా అవమానం అనిపించదు. ఏ నిందకీ కోపం రాదు.
వృద్ధాప్యాన్ని అందరూ గౌరవిస్తారు. నీ జీవితకాలంలో సాధనల్ని పక్కనపెట్టి కేవలం వయస్సు కారణంగానే పెద్దరికాన్ని అంగీకరిస్తారు. అదొక అంతస్థు. అతని హితవుని నలుగురూ వింటారు. నీ ఆలోచనని గౌరవిస్తారు. దాన్ని పాటించరని అర్థమవుతున్నా కోపం రాదు. వయస్సు అర్థం చేసుకునే సంయమనాన్ని నేర్పుతుంది.
''మా రోజుల్లో...'' అని చెప్పుకోవడంలో చిన్న 'సాకు'ని వృద్ధాప్యం మప్పుతుంది. ''ఈ కాలం కుర్రాళ్లు...'' అన్న వెక్కిరింతకి అర్హతని సంపాదించి పెడుతుంది. తన గురించి తన పెద్దలూ అలనాడు -అలాగే అనుకొని ఉంటారని అప్పుడు జ్ఞాపకం వస్తుంది.
వేసిన ప్రతీ అడుగూ తెలిసి వేసే నమ్మకాన్నిస్తుంది. చేసే ప్రతీ పనీ యిబ్బంది లేని, శ్రమ అనిపించని మార్గం వేపే ప్రయాణం చేయిస్తుంది. తన 'రేపు' క్రమక్రమంగా కురుచనయిపోతోందని అర్థమవుతూంటుంది. దక్కిన చిన్న తప్పుల్ని వృద్ధాప్యం భద్రంగా అలంకరించుకుంటుంది. ''మనకి చేతకాదు'' అని చెప్పడం పెద్ద అర్హతగా కనిపిస్తుంది. అసాధ్యానికి 'అనవసరం' అంటూ గడుసుదనం చిన్న ముసుగు వేస్తుంది. దానికి ఊతం వృద్ధాప్యం.
జీవితంలో చాలా ప్రశ్నలకు సమాధానాలు అర్థమవుతూంటాయి. ఇప్పుడా సమాధానాలకూ వేళ మించిపోయిందని అర్థమవుతుంది. ఈ సమాజంలో అవినీతి అనే కుళ్లు ఎప్పుడు తొలగుతుంది? ప్రతీక్షణం దోపిడీకి గురవుతున్న ఈ పర్యావరణం ఒక్కసారి ఎదురు తిరిగితే ఏమవుతుంది? ఏమయినా తనకేం బాధలేదు. ఆ సమయంలో తను ఉండడు. ఈ జీవిత నుంచి శలవు తీసుకోవడమే తనకి ఉపశమనం.
దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎలా వుంటాడు? మృత్యువు తరువాత ఏమవుతుంది? సమాధానాలు అర్థమయే క్షణాలు దగ్గరవుతున్నాయి. చుట్టూవున్న జీవితాన్ని క్రమంగా ఖాళీ చేసుకుంటుంది వృద్ధాప్యం. చిన్నకేక తుళ్లిపడేటట్టు చేస్తుంది. చిన్న నిశ్శబ్దం ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పటిలాగే తెల్లారి, వృద్ధులతో కలిసి నడిచి, రెండుముద్దల అన్నం తిని, అరగంట సేదతీరి, వేడి టీ తాగి, సాయంకాలం పార్కు బెంచీ దగ్గర ''ఈ దేశం తగలడిపోతోంద'ని తిట్టుకుని, శాంతపడి -కీళ్ల నొప్పులకు మాత్రలు మింగి, రాని నిద్రనీ, నిన్నటి జ్ఞాపకాలనీ నెమరు వేసుకోవడం -వృద్ధాప్యం వ్యసనం.
ఇప్పుడు విచారం దగ్గరకు రాదు. వెళ్లిపోయిన హితులూ, సన్నిహితులూ దిగులుగా జ్ఞాపకం వస్తారు. ముగింపు భయపెట్టదు. ఎందుకంటే భయపడినా రాకతప్పదు కనుక. అన్నిటినుంచీ, అందరినుంచీ తనని కుదించుకుని -మెల్లగా అంతర్ముఖుడు కావడం వృద్ధాప్యం.
ఇప్పుడు అన్ని దురదృష్టాలకూ కారణాలు అర్దమౌతాయి. చేసిన తప్పిదాలు, మాటతప్పిన కప్పదాట్లూ, మనసు నొప్పించిన చిన్న చిన్న జ్ఞాపకాల ముళ్లూ -అవన్నీ ఓ జీవితకాలం ఆలస్యంగా కళ్లముందు కదుల్తాయి. ఈ అనుభవాల్ని హెచ్చరికలు చెయ్యబోతే పిల్లలు వినరు. వినినట్టు నటిస్తారు. నటిస్తున్నారని తనకీ తెలుసు. విన్న తృప్తిని తానూ నటిస్తాడు. వారికీ వృద్ధాప్యం ఒకనాడు పాఠాలు చెప్తుందని తెలుసు. కాని వృద్ధాప్యం ఒక వరమని ఇప్పుడు చెప్పి ఒప్పించలేడు. వారు ఒప్పుకునే వేళకి తను ఉండడు. జీవితం ఎంత విచిత్రం! నవ్వుకుంటాడు. ఆ నవ్వు ఖరీదు ఒక జీవితం.'చమకం' ఏ రుషి, ఏ మహానుభావుడు ఎప్పుడు సృష్టించారో -ఎంత ముందుచూపు, ఎంత వినయసంపద, జీవుని నిస్సహాయత, నిర్వేదం -అందులో నిక్షిప్తమయివుందో -ఆనాటి కోరిక సంపూర్ణమయిన స్వరూపంతో కళ్లముందు దర్శనమిచ్చేనాటికి -తాను జీవితమంతా కోరుకున్న 'వృద్ధాప్యం' తనని ఆవరించుకుని ఉంటుంది.ఈ దేశపు వేద సంపద, సాంస్కృతిక వైభవం, జాతి దర్శనం అపూర్వం, అనన్యసామాన్యం. చమకంలో 'వృద్ధం చమే' అనే ఒక్క కోరికా ఈ జాతినీ, మతాన్నీ, ఆలోచనా స్రోతస్సునీ అత్యద్భుతంగా ఆవిష్కరించే అభిజ్ఞ. వరం. భగవంతుడిని కోరడంలోనే భగవంతుడు ప్రసాదించిన తన ఆలోచనా పరిణతిని అలంకరించే భగవద్దత్తమైన ఆశీర్వాదం. అదీ వృద్ధాప్యం.

 


      gmrsivani@gmail.com   
     జూలై 8,  2013          

*************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   


KOUMUDI HomePage