Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

       చట్టానికి కళ్లు లేవు

  మన దేశంలో చట్టానికి కళ్లు లేవు. కాని కాళ్లున్నాయి. కళ్ల ముందు జరిగిన సంఘటన ఆయినా ఎవరూ నోరెత్తరు. రాజధాని నగరం నడిబొడ్డులో ఒకాయన యిద్దర్ని రోడ్డు మధ్య నిలబెట్టి కారు ఆపి, తన మనుషుల్ని పిలిపించి చావగొట్టించడాన్ని- ఎంత లేదన్నా వందమంది చూసి వుండాలి. కాని మన పోలీసులకి ఫిర్యాదు కావాలి. దాని గురించి రిపోర్టు కావాలి. ఆ తర్వాత చర్య. ఈ ఆకృత్యాన్నిజరిపింది ఓ సినీ కధానాయకుడు. ఆయన మరో సినీ కధానాయకుడి కొడుకు. కాక- అయన కేంద్ర మంత్రి. ఆధికారం చట్టానికి గాజులు తొడుగుతుంది. తప్పు అధికారానిది కాదు. చట్టానిది. ఒకవేళ- ఓ నిస్సహాయుడూ, నిజాయితీపరుడూ ఆయిన పోలీసాఫీసరు చర్య తీసుకున్నాడనుకుందాం. ఏం చర్య తీసుకుంటాడు? మంత్రిగారి కొడుకయిన కధానాయకుడిమీద కేసుపెడతాడు, నడిరోడ్డు మీద మనుషుల్ని పెట్టికొట్టించాడని. రాష్ట్రంలో ఆయన పార్టీ మనుషులు "అన్యాయ’మంటారు. ఆఫీసరుకి పై అధికారులనుంచి ఫోన్లు వస్తాయి. ఇవన్నీ అతని నిజాయితీకి దన్నుగా నిలబడని పరిణామాలు. మరో వారం రోజుల్లో-వీలయితే ఇంకా త్వరగా-ఆతనికి బదిలీ అవుతుంది. అతని గురించి ఎవరూ పట్టించుకోరు. కొడుకు చదువు మధ్యలో ఆగిపోతుంది. పెళ్లానికి జరుగుతున్న వైద్యం నిలిచిపోతుంది. అంతకు మించి హైదరాబాదులో ఉండడం వల్ల కలిసి వచ్చే "కిట్టుబాట్లు’ నిలిచిపోతాయి. నిజాయితీ ఎవడిక్కావాలి? ఈ దేశంలో ఎవరు అడగొచ్చారు? ఏ చట్టం- నిజాయితీపరుడయిన (ఒకవేళ అయితే!)పోలీసు వెనక నిలుస్తుంది? ఇవన్నీ సినీనటుడి కొడుక్కి తెలుసు. తెలియకపోయినా- తెలిసే వాతావరణంలో పెరుగుతున్నాడు. నడిరోడ్డు మీద తన విశృంఖలత్వాన్ని చెల్లుబాటు చేసుకునే యువకుడు ఏమవుతాడు? ఆ మధ్య రాజస్థాన్ లో జర్మన్ మహిళను రేప్ చేసి- రెండేళ్లు దక్షిణాదిన స్వేచ్చా జీవనం గడిపే ఏ మహంతిగారి కొడుకో అవుతాడు.
చట్టం కళ్లు ఏం చూడాలో, ఎలా చూడాలో, ఎంతవరకూ కళ్లు మూసుకోవాలో, ఈ దేశంలో అధికారం నిర్ణయించే ’జులుం’ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో, ప్రతి రోజూ మనం చూస్తున్నాం.
కోట్లు పెట్టుబడితో సాగే క్రికెట్ వినోదంలో లక్షలు ఆదాయాన్ని ఆవినీతితో సంపాదించే క్రీడాకారులూ, వాళ్లకి సినీ నటీమణుల్నిపరిచయం చేసే పెద్దమనుషులూ- యివన్నీ ఈ విష సంస్కృతిలో భాగం.
ఇప్పుడు మొన్ననే ఆమెరికాలో జరిగిన కధ. మేం కారులో విహార యాత్రకి వెళ్తున్నాం. ఉన్నట్టుండి కారాపాడు మామిత్రుడు. "పోలీసు. మీరెవరూ సీట్లో కదలకండి” అన్నాడు. ఆయన చేతులు స్టీరింగు మీద పెట్టుకుని కూర్చున్నాడు. అతి మృదువుగా మాట్లాడే పోలీసు కిటికీ తలుపు కొట్టాడు. "87 మైళ్ల వేగంతో కారు వెళ్తోంది సార్!” అన్నాడు. "సార్!” మరిచిపోవద్దు.
భారతదేశంలో మంత్రిగారబ్బాయి ఏమంటాడు? "నీ కళ్లు నెత్తికెక్కాయా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?” అని కదా?
ఈ మిత్రుడు కిక్కురుమనలేదు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ అడిగాడు. తన కారుదగ్గరికి వెళ్లి ఒక చీటీ రాసిచ్చి "జాగ్రత్తగా వెళ్లండి సార్! కారులో పసిబిడ్డ కూడా ఉంది” అన్నాడు పోలీసు. తప్పుకి జరిమానా వేశాడు. జరిమానాను మా మిత్రుడు అంగీకరించాడు. ఎవరికీ ఎవరిపట్లా అమర్యాద లేదు. మాటల్లేవు. శిక్షపడింది. నేరస్థుడు తలవొంచాడు. బస్. మా కారు కదిలిపోయింది.
"ఆయనతో మీ మాట చెప్పరేం?” అన్నాను.
"చెప్పి లాభం లేదు. ఏం చెప్పినా కోర్టులో చెప్పుకోవాలి- అంత సమయం ఉంటే. ఎవరికీ కోర్టుకెళ్లే తీరిక ఉండదు. జరిమానా కట్టేస్తాం” అన్నాడు.
"మరి మమ్మల్ని కదలొద్దన్నారేం?” అడిగాను.
"మనం కదిలినా, కారు దిగే ప్రయత్నం చేసినా పోలీసు రివాల్వర్ తీస్తాడు. మన కారులో ఏం వుందో, మనమెవరమో అతనికి తెలీదుకదా?” అన్నాడు.
మరి హైదరాబాదులో సినీనటుడి కొడుకుని దేశానికంతటికీ తెలుసుకదా? ఇద్దర్నీ చావగొట్టడం అందరూ చూసిన సాక్ష్యం ఉందికదా? వాళ్ల చేతుల్లోనూ చట్టం, అయుధాలూ ఉన్నాయికదా? అయితే మనది భారతదేశం కదా! అంతే తేడా.
ఓసారి అమెరికాలో ఒక కారుని అపాడట పోలీసు. అది బుష్షు దొరగారి కూతురుకారు. పాపం, ఆ అమ్మాయి- అక్కడికీ తెలుగు సంస్కృతితోనే "నేనెవరో తెలుసా?” అందిట.
"అది తర్వాత చెప్దువుగాని- ముందు లైసెన్సూ, ఇన్స్యూరెన్సూ చూపించు” అన్నాడట పోలీసు.
అన్నీ చూసి "ఇప్పుడు చెప్పు నువ్వెవరివో” అన్నాడు.
"నేను అమెరికా ప్రెసిడెంటుగారి కూతుర్ని ” అంది ఆ అమ్మాయి.
పోలీసు చెక్కుచెదరలేదు. "అయితే చట్టాన్ని గౌరవించే బాధ్యత నాకన్నా నీకే ఎక్కువ వుంది. సాధారణంగా ఇటువంటి నేరాలకి 200 డాలర్ల జరిమానా. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివికనుక నీకుమరో 50 డాలర్లు వడ్డిస్తున్నాను” అన్నాడట.
ఇలాంటి మాట మన దేశంలో ఎవరికయినా అనే దమ్ముందా? అనే ప్రయత్నమయినా చేస్తారా? అని నెగ్గుకురాగలరా? అమెరికాలో పోలీసు వ్యవస్థకీ, అధికార యంత్రాంగానికీ సంబంధం లేదు. పోలీసు ఎవరికీ భయపడడు. అవినీతికీ, నిర్భయత్వానికీ మాత్రమే సంబంధం. అమెరికాలో పత్రికలన్నీ ఈ పోలీసుని నెత్తిన పెట్టుకుని ఊరేగాయి. అతని ఫొటోల్ని విరివిగా ప్రచురించాయి.
మన దేశంలో డవాలా బంట్రోతు దగ్గర్నుంచి, గవర్నమెంటు ఆఫీసులో గుమాస్తా దగ్గర్నుంచి, సోనియా గాంధీ వరకూ ఒకే మాటమీద నిలబడతారు- అవినీతి.
గీతాకారుడి వాక్యం ఒకటుంది. ""సమాజంలో పెద్దవాడు ఏ పనిచేస్తే చిన్నవాడూ ఆయన్నిఅనుకరిస్తాడు” అని.
మన దేశంలో మంత్రిగారి సినీహీరో కొడుకు చాలు- అవినీతిని ఆయుధం చేసుకోడానికి.


      gmrsivani@gmail.com   
     జూన్ ౩,  2013          

*************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   


KOUMUDI HomePage