చరిత్ర తప్పటడుగులు

           
           మానవ జీవన గమనాన్ని నిర్దేశించడంలో చరిత్ర తిరుగులేని నియంత. తనదైన బాణీ, ధోరణీ, సరళీ, స్వారస్యం వున్న గమనం చరిత్రది. చరిత్ర అర్థంకాని విదేశీ లిపి -అన్నాడో -కవి. ఎప్పుడో కాలం గడిచాక -వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు -వేడుకగా ఎకసెక్కం చేసే వింత వినోదం చరిత్రది.
            గత శతాబ్దాన్ని -దుర్మార్గమయిన కారణానికి చిరస్మరణీయం చేసిన నియంత హిట్లర్‌. అతని చావుని ఎన్నో లక్షలమంది కోరుకున్నారు. ఎదురుచూశారు. ఎన్నో వందల మంది ఆయన్ని చంపడానికి కుట్రలు పన్నారు. ప్రయత్నాలు చేశారు. కాని అన్నిటినీ అధిగమించి చరిత్ర అతన్ని బతికించింది. దాదాపు 6 కోట్లమంది యూదుల మారణహోమానికి సూత్రధారిని చేసింది. ఇప్పటికీ పోలెండులో, జర్మనీలో, ఆశ్వజ్‌, దాషూ వంటి నగరాలలో సమష్టి మారణహోమ శాలలు ఉన్నాయి -ఒకనాటి భయంకరమైన దాష్టీకానికి గుర్తుగా.
              కొన్ని హత్యా ప్రయత్నాల వింతకథలు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండు యోధుడు హెన్రీ టాండీకి యుద్ధభూమిలో పీలగా, విసురుగా ఉన్న ఒక జర్మన్‌ సైనికుడు తారసపడ్డాడు. అతన్ని చూస్తూ చంపాలనిపించక వదిలేశాడు. ఆ పొరపాటు -ప్రపంచ చరిత్రని దారుణంగా ప్రభావితం చేస్తుందని అతను అప్పట్లో ఊహించలేదు. అతనే అడోల్ఫ్‌ హిట్లర్‌. తన తప్పిదానికి టాండీ జీవితాంతం -అంటే 86 సంవత్సరాలు పశ్చాత్తాప పడ్డాడు. 86వ యేట -అంటే హిట్లర్‌ మారణహోమాన్ని కళ్లారా చూసి మరీ కాలం చేశాడు.
            హిట్లర్‌ని హత్య చెయ్యాలన్న కుట్రలు మరెన్నో జరిగాయి. వీటి నుంచి ప్రాణాలతో బయటపడినప్పుడల్లా ''విధి నేను సాధించాల్సిన కృషికి నన్ను ఎంపిక చేసింది'' అనేవాడు. నిజానికి మృత్యువు గురించి ఆయనకో వేదాంతపరమైన దృక్పథం ఉండేది. ''మృత్యువు వేదన నుంచి, నిద్రరాని క్షణాల నుంచి, మానసికమైన వత్తిడులనుంచి విముక్తి'' అనేవాడు. కొన్ని కోట్లమంది మృత్యువుకి కారణమయిన ఓ నియంతలో ఈ ధోరణి విపరీతం, కొండొకచో పరిహాసాస్పదం. ఒకానొకప్పుడు ఒక మిత్రునితో ఆయన మాటలు: నాతో ఎప్పుడూ ఒక పిస్తోలు ఉంటుంది. కాని అదికూడా నిరుపయోగం. నా ముగింపు దగ్గర పడినప్పుడు -ఒక్క యిదే నన్ను కాపాడేది'' అని గుండె చూపించాడు.
               మిలటరీ యోధుల సమావేశంలో ప్రసంగించడానికి 1939 నవంబరు 9న మ్యూనిక్‌ వచ్చాడు. ఆ రోజు ఎందుకనో అతని మనస్సు కీడుని శంకిస్తోంది.'ఇవాళ నా ధోరణి మార్చాలి' అన్నాడు. జార్జ్‌ అల్సన్‌ అనే ఓ వడ్రంగి కళానిపుణుడు సమావేశానికి ముందుగానే వేదిక పక్కన ఉన్న ఓ కర్రస్థంబానికి దొంగ అరని తయారు చేసి ఉంచాడు. సభ జరిగే రోజున ఒక పక్క పార్టీ కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తూండగా -తను సిద్ధం చేసిన అరలో బాంబుని ఉంచి సరిగ్గా 11 -20 కి పేలేటట్టు ఏర్పాటు చేసి ఉంచాడు. పది గంటలకు హిట్లర్‌ ప్రసంగం ప్రారంభమవుతుంది. ఆవేశంగా ఊగిపోతూ గంటల కొద్దీ ప్రసంగించడం హిట్లర్‌కి అలవాటు. అంటే ప్రసంగం మధ్యలో బాంబు పేలుతుంది. సభ, హిట్లర్‌ జీవితం అర్ధాంతరంగా ముగుస్తాయి. అదీ ప్లాను.
              విచిత్రంగా ఆనాడు 11 -07 నిముషాలకి హిట్లర్‌ తన ప్రసంగాన్ని ఆపేశాడు. సాధారణంగా ప్రసంగం ముగిశాక కనీసం ఓ అరగంట కార్యకర్తలతో మాట్లాడుతూ గడపడం హిట్లర్‌కి అలవాటు. కాని ఆనాడు అందుకు భిన్నంగా ప్రసంగం ముగియగానే హిట్లర్‌ బయటకి వెళ్లిపోయాడు. సరిగా -8 నిముషాల తర్వాత బాంబు పేలింది!
               మరో సందర్భం. ఈ శతాబ్దంలోనే పెద్ద జోక్‌. నాజీ సైన్యంలో పనిచేసే ఓ సైనికోద్యోగి హిట్లర్‌ని హత్య చెయ్యడానికి పన్నాగం పన్నాడు. ఆ రోజు హిట్లర్‌ ప్రసంగించే వేదిక కిందనే బాంబుని ఉంచాడు. అంతా పకడ్బందీగా జరిగిపోయింది. ఇక పేలడమే తరవాయి. హిట్లర్‌ ప్రసంగం ప్రారంభమయింది. ఈలోగా బాత్‌రూంకి వెళ్లాల్సిన అగత్యం ఏర్పడింది ఈ ఉద్యోగికి. వెళ్లాడు. విచిత్రంగా బాత్‌రూం బయటి గడియపడిపోయింది. బాత్‌రూంలో ఇరుక్కుపోయాడు. హిట్లర్‌ ప్రసంగం ముగిసింది. బాంబు పేలకుండానే ఉండిపోయింది!
            ఒక పక్క హిట్లర్‌ శత్రువులు అతణ్ణి అంతమొందించే ప్రయత్నాలు చేస్తున్నా విధి ఆయన్ని కాపాడుతున్నట్టనిపించింది.
             మరో సందర్భం ఇంకా విచిత్రం. నెపోలియన్‌కి వ్యతిరేకపోరాటంలో ప్రధానపాత్రని వహించిన యోధుడి మునిమనుమడు క్లౌస్‌ షాంక్‌ వాన్‌ స్టాఫెన్‌ బర్గ్‌. ప్రస్థుత నాజీ సైన్యంలో లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌. హిట్లర్‌ని హతమార్చాలనే వర్గంలో సభ్యుడు. చాలా సమర్ధుడు. సైనిక శాఖలో చాలా పరపతి ఉన్నవాడు. అయితే ఆ ప్రయత్నాన్ని చేసేలోగానే ఆయనకి చుక్క ఎదురయింది. ఆయన కారు ఒక లాండ్‌ మైన్‌ (భూమిలో పాతిపెట్టిన బాంబు) మీద నడిచి పేలింది. ఒక కన్ను, ఒక చెయ్యి, రెండో చేతికి మూడువేళ్లు పోయాయి. అయినా హిట్లర్‌ని చంపే ఆలోచనని వదులుకోలేదు. ఒకానొక సమావేశంలో హిట్లర్‌తో పాటు గోరింగ్‌, హివ్ల్ముర్‌ అనే ఇద్దరు ప్రముఖ నాయకులు పాల్గొంటున్నారు. ఆ సమావేశంలో స్ట్రాఫెన్‌ బర్గ్‌ కూడా పాల్గొనాలి. ఈ ముగ్గురినీ ఒకే బాంబుతో హతమార్చాలని ప్లాను. ఒక ఎర్ర బ్రీఫ్‌ కేసులో అధికార పత్రాలతోపాటు ఒక ఇంగ్లీషు బాంబుని పెట్టుకుని కార్యాలయానికి వచ్చాడు.
          సమావేశం జరిగే హాలులో పెద్ద టేబిలుముందు హిట్లరు కూర్చుంటాడు. సహాయకుడికి స్ట్రాఫెన్‌ బర్గ్‌ చెప్పాడు: ''హిట్లర్‌కి వీలయినంత దగ్గరగా నా సీటుని ఏర్పాటు చెయ్యి. నా చెవి సరిగ్గా వినబడదుకనుక -దగ్గరగా ఉంటే అర్థమవుతుంది'' అని. అలాగే ఏర్పాటు జరిగింది. హిట్లరు కుర్చీకి దగ్గరగా టేబిలు కింద బాంబు ఉన్న బ్రీఫ్‌ కేసుని పెట్టేశాడు. తన పని అయాక మెల్లగా జారుకున్నాడు.
         సమావేశంలో ఒక ఆఫీసరు హిట్లరు చూపించే పఠాన్ని చూడడానికి టేబిలుమీదకి వొంగబోయాడు. కాని పూర్తిగా వొంగలేకపోయాడు. కారణం -కాలికి ఏదో తగులుతోంది. చూస్తే ఓ బ్రీఫ్‌ కేసు. కాలితో పక్కకి త్రోయబోయాడు. అది కదలలేదు. కిందకి వొంగి టేబిలుకి అటుపక్క- హిట్లరు కుర్చీకి దూరంగా వుంచేసి పఠాన్ని చూస్తూ నిలబడ్డాడు.
          12 -42 నిముషాలకు భయంకరమైన శబ్దంతో బాంబు పేలింది. అందరూ తుళ్లిపడ్డారు. కుర్చీలు గాలిలోకి లేచాయి. కాని హిట్లర్‌ని చంపవలసిన బాంబు దూరంగా పేలిన కారణంగా -కనీసం గాయపరచనుకూడాలేదు. హిట్లరు పాంటు తునాతునకలయింది. ముఖమంతా నల్లని బూడిద అలుముకుంది. మిగతావారికి గాయాలయాయి.
           తునాతునకలయిన పాంటుని గర్వంగా చూపిస్తూ: ''నాకెప్పుడూ అనిపిస్తూంటుంది. యిలాంటి అనర్థం ఏదో జరుగుతుందని'' అని నవ్వాడు హిట్లర్‌.
                జీవితంలో విపర్యయం ఏమిటంటే -ఎందరో చంపడానికి ప్రయత్నాలు చేసినా తట్టుకుని బతికిన హిట్లరు -1945 ఏప్రిల్‌ 30న ఒక మిలటరీ బంకర్‌లో చావుకి కొన్ని నిముషాల ముందు తనతో జీవితమంతా కలిసి ఉన్న ఈవాని పెళ్లిచేసుకుని -తన 7.65 కాలిబర్‌ వాల్తర్‌ పిస్తోలుతో తనని తాను కాల్చుకుని చచ్చిపోయాడు. మరొక్కసారి -మానవజాతి గమనాన్ని నిర్దేశించడంలో చరిత్ర తిరుగులేని నియంత.

    


      gmrsivani@gmail.com   
           జూన్ 2,   2014          

*************

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage