Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

అసలు కాదు కొసరు!

                   వెనకటికి మా మిత్రుడొకాయన పెద్దలు నిర్ణయించిన అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ఆయన మెరైన్‌ ఇంజినీరు. సంవత్సరానికి ఆరునెలలు సముద్రంలో ఓడలో ఉంటాడు. బోలెడంత జీతం. భార్యకి అపురూపమైన నగలన్నీ చేయించాడు. ఆమె శరీరం మీద దిగేశాడు. కేవలం నాలుగు సంవత్సరాలు తిరగకుండా ఆయన కారు డ్రైవరు ఇతని పెళ్లాన్ని తీసుకుని నగలతో ఉడాయించాడు. డ్రైవరుగారికి పెళ్లాం కన్నా నగల మీద మోజు కుదిరింది. ఈ కథలో నీతి -ఎంత అందమైన పెళ్లాన్నయినా మితిమీరి అలంకరించకు. రెండో నీతి: ధనం కూడబెట్టి దాచాల్సింది -పెళ్లాం శరీరం మీద కాదు. ఇనప్పెట్టెలో. 'మేము చేరము బాబోయ్‌' అంటున్న తెలంగాణావారిని ఆరోజు రాష్ట్రంగా కలుపుకుని, వారికి ఏ మాత్రం న్యాయం జరగకుండా వేధించుకు తిని -వారి ప్రాంతాన్ని -హైదరాబాద్‌ని అలంకరించి, ఆకాశంలో నిలిపి -ఇప్పుడు మళ్లీ మరో రాజధానికి మూడోసారి వెదుకులాడే ఘనత తెలుగువాడిది.

             ఏతావాతా, మన రాష్ట్రానికి అసలు పోయింది. కొసరుకోసం వెదుకుదల మొదలైంది -రాజధాని. ఇది మూడోసారి. నాలుగోసారి -భగవంతుడు మేలు చేస్తే అచిరకాలంలోనే తప్పనిసరి అయే సూచనలు అప్పుడే వినిపిస్తున్నాయి. నాయకులు ఎప్పుడూ తమకు వెంటనే కిట్టుబాటయే ప్రయోజనాలనే చూస్తారు. నాగార్జునసాగర్‌, భాక్రానంగల్‌, హీరాకుడ్‌ డామ్‌లు కట్టించే, జాతి దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే వెర్రిబాగుల నాయకుల రోజులు పోయాయి. పోలవరం ఎవడిక్కావాలి బ్రిటిష్‌వారి కాలం నుంచీ నలుగుతున్న ప్రాజెక్టు అది. ఓ చుక్కనీరు ఆంధ్రాకు రానివ్వమని అప్పుడే కేసీఆర్‌ గారు వాక్రుచ్చారు. కలర్‌ టీవీలు, సైకిళ్లు, ఆడపిల్లలకి తాయిలాలు, మందు సీసాలు, నోట్లు ఇచ్చి వోట్లు దండుకునే రోజులొచ్చాయి. 'ఫలానా ఆస్తి మనదే' అని ప్రజల్ని రెచ్చగొట్టడం ఆటవిక ప్రవృత్తి. 'ఎదుటివాడిని కూడా కలుపుకొందాం' అనడం ఉదాత్తతకు చిహ్నం. జంతువులు, ఆటవికులు -కలిసి తిరగడానికి కారణం -పరస్పరం ప్రేమ కంటే సామూహిక శ్రేయస్సు ముఖ్యకారణం. ఈ ఆటవిక నీతిని రెచ్చగొట్టడం నాయకులకు బాగా తెలుసు.


             అన్ని సరుకుల్ని, అందరి అవసరాల్ని ఒకచోటే పోగుచేయడం వ్యాపారి లక్షణం. బేరం కలిసి వస్తుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. కాని ఒక వర్గం మేలుని కాంక్షించే అసలైన నాయకుడు -వారికి ఎప్పటికప్పుడు ఉపయోగపడే మేళ్లను విస్తరిస్తాడు. వికేంద్రీకరిస్తాడు. మనదేశంలో ముంబైకి దెబ్బతగిలితే ఈ దేశంలో వాణిజ్యం గల్లంతవుతుంది. ఢిల్లీకి కీడు జరిగితే జాతి ఉనికికే దెబ్బ. ఆస్ట్రేలియాకి రాజధాని మెల్బోర్న్‌ కాదు, సిడ్నీ కాదు, పెర్త్‌కాదు, అడిలైడ్‌ కాదు. మరేమిటి మెల్బోర్న్‌కి 288 మైళ్ల దూరంలో ఉన్న కాన్బెరా అనే చిన్నఊరు. నేనక్కడికి వెళ్లాను. చాలా అందమైన పట్టణం. ఒక రాజధానికి కావల్సిన వసతులు మాత్రమే ఉన్న పట్టణం. కాన్బెరా అంటే గిరిజనుల భాషలో స్త్రీ స్థనాల మధ్య ఉన్న లోయ -అని అర్థం. మౌంట్‌ బ్లాక్‌, ఆన్సిక్‌ అనే రెండు కొండల మధ్య గల అందమైన లోయ. అలాగే కాలిఫోర్నియాకి రాజధాని శాక్రమెంటో -నేను సాధారణంగా వెళ్లే డబ్లిన్‌కి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో అందమైన పట్టణం. అసలే జనాభా వత్తిడి ఉన్న నగరాలకు దూరంగా, రాజధాని అవసరాలను మాత్రమే తీర్చే తగుమాత్రపు పట్టణాలను ఆయా ప్రభుత్వాలు ఎంపిక చేసుకున్నాయి. ఇలాంటి పని చెయ్యడానికి మనదేశంలో -అందునా మన రాష్ట్రంలో ఎవరు ఒప్పుకుంటారు ఏదీ అనకాపల్లినో, అమలాపురాన్నో, బాపట్లనో, ప్రొద్దుటూరునో చెయ్యమనండి. మన నాయకత్వం ఎడ్డెం అంటే తెడ్డెం అనే ధోరణి గలది. నిర్ణయాల్లో వారి మాట చెల్లాలి. వారికి మేలు జరగాలి. ఇంకా మాట్లాడితే 'వారికే' మేలు జరగాలి. మంచి ఉదాహరణ చెప్తాను. తమిళనాడులో అన్నాడిఎమ్‌కే పదవిలో ఉన్నప్పుడు -రక్షణ శాఖతో సెంట్‌ జార్జి కోటలో సెక్రటేరియేట్‌ ఉండడానికి చేసుకున్న 99 ఏళ్ల లీజు పూర్తి అవుతోంది కనుక -స్థానిక అన్నా విశ్వవిద్యాలయం పక్కనే ఒక మంచి స్థలాన్ని ఎంపిక చేసింది. ఆ రోజుల్లో భూమి పూజ కూడా జరిగిపోయింది. ఆ తర్వాత డిఎమ్‌కే పదవిలోకి వచ్చింది. పెట్టినా, పొమ్మన్నా అత్తే అనాలి అన్నది సామెత. వస్తూనే ఆ ప్రభుత్వం చేసిన మొదటి పని -అక్కడ పనిని నిలిపివేసి ఆ స్థలంలో ఒక లైబ్రరీని నిర్మించింది! అటు తర్వాత అతి రద్దీగా ఉన్న అన్నాశాలై పక్క స్థలాన్ని ఎంపికచేసి ఆఘమేఘాల మీద కొత్త సెక్రటేరియేట్‌ని నిర్మించేసి -తమ హయాం అయిపోతోంది కనుక -ఇంకా పూర్తికాకుండానే అక్కడ ఒక అసెంబ్లీ సమావేశాన్ని కూడా నిర్వహించేసింది. శుభం. ఇప్పుడు మళ్లీ అన్నాడిఎమ్‌కే పదవిలోకి వచ్చింది. అంటే కొత్త అత్త. వస్తూనే ఆ సెక్రటేరియేట్‌ను ఒక సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చేసి -99 ఏళ్లు గడిచిపోయినా సెంట్‌ జార్జి కోటలోనే ఉనికిని సాగిస్తోంది! నాయకుల పంతాలకి ప్రజాశ్రేయస్సు, ధనం ఎంత బాధ్యతారహితంగా ఖర్చు చేశారో చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ.


       ప్రస్థుతం ఆంధ్రాలో ఏ ఒక్క పట్టణానికీ రాజధాని కావలసిన అర్హతలు లేవు. అందుకు ఉద్దేశించిన పట్టణాలు కావు కనుక. ఇప్పుడిక హైదరాబాదులాగ -అన్ని సంస్థలన్నీ ఒక్కచోటే కుదిస్తారా ఇప్పటికి నెత్తికెక్కిన అనుభవంతో -ఎలాగూ మరో రాజధాని తప్పదుకనుక -ఆయా సంస్థలను అక్కడక్కడ పంచుతారా మామిత్రుడిలాగ -ఆస్తినంతా ఒక్కచోటే దిగేస్తారా? లేదా ఆయా ప్రాంతాలకు పంచిపెడతారా? ఏ ప్రాంతం వారికి ఏదిస్తారు తాము కోరుకున్నది రాకపోతే వారు మరో ప్రత్యేక రాష్ట్రమంటారా? అప్పుడే అసంతృప్తులు బయటపడుతున్నాయికదా భాషాప్రయుక్త రాష్ట్రాలకు నాందీ పలికిన ఘనత మనదే. తెలుగు రాష్ట్రం రెండుగా చీలిన ఘనత కూడా మనదే. ఇప్పుడిక మూడవుతుందా ముక్కలవుతుందా? రాజకీయ లబ్దికి రాజధానికూడా మరొక పావుఃగా మారుతుందా? అందరినీ అన్నీ తృప్తిపరచలేవు. నోరు, శక్తి, అవసరం, లబ్ది -యిన్నిటి పెట్టుబడి ఇకముందు రాబోయే రాజధాని. అసలు ఎలాగూ పోయింది. కొసరుకోసం కొత్త ఎసరుః ప్రారంభమయింది. ఇప్పుడు పరిశీలిస్తున్న కమిటీ కూడా మొన్నటి జస్టిస్‌ కృష్ణా కమిటీలాగ సలహాలిచ్చే కమిటీయే! తీరా రిపోర్టు వచ్చాక దాన్ని అటకెక్కించేశారు పెద్దలు. ఎవరికి ఏ భాగం దక్కుతుందో వేచిచూడాలి.


       కాన్బెరాలో శాసనసభా భవనం మీద ఒక దీపం ఉంది. శాసనసభ జరుగుతున్నప్పుడు ఆ దీపం వెలుగుతుంది. దారినపోయే ఏ పౌరుడయినా నిరభ్యంతరంగా వచ్చి అతిధుల గాలరీలో కూర్చుని తాను ఎన్నుకున్న ప్రతినిధులు ఏం చేస్తున్నారో నిరభ్యంతరంగా చూడవచ్చు. నేనలా లండన్‌లో కామన్స్‌ సభలో కూర్చుని వచ్చాను. కాని మనదేశంలో మన నాయకులు దీపాలు ఆర్పేసి, సభ్యుల్ని చీకట్లో ఉంచి తాము ఆశించిన నిర్ణయాన్ని మనకు చెప్తారు. మన పార్లమెంటులో జొరబడడానికి ఒక్కరికే అవకాశముంది -దౌర్జన్యకారులకి! అది మన తలరాత.

      


      gmrsivani@gmail.com   
           మే 12,   2014          

*************

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage