Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

      మృత్యువు

   
మృత్యువు జీవితాన్ని అడిగిందట: నన్ను చూసి అందరూ అసహ్యించుకుంటారు. భయపడతారు. కాని నిన్ను ప్రేమిస్తారేం? -అని. జీవితం సమాధానం చెప్పింది: ''ఎందుకంటే నేను అందమయిన అబద్ధాన్ని. నువ్వు తప్పనిసరయిన, బాధాకరమైన నిజానివి'' అని.
నా కాలేజీ రోజుల్లో చదివాను దువ్వూరి రామిరెడ్డి గారి 'పానశాల'. ఆయన మృత్యువు గురించి అంటారు: ''అయయో మూలధనమ్ము హస్తగళితమ్మౌచుండె నానాటికిన్‌, వ్యయమై పోయిరి మానవుల్‌ మరణశయ్యాసుప్తులై...''. అయ్యో, చేతిలో ఉన్న మూలధనం ప్రతీదినం జారిపోతోంది. మానవులు మృత్యువుని చేరి ఖర్చయిపోతున్నారు -అని.
మృత్యువు జీవితానికి హఠాత్తుగా ముగింపుని రాసే క్రూరమైన రచయిత. నిన్న ఇద్దరమ్మాయిలు సినిమా చూడడానికి హైదరాబాద్‌ వచ్చారు. చూశారు. బస్సు స్టాండు దగ్గర బాంబు పేలింది. స్నేహితురాలు చచ్చిపోయింది. 22 ఏళ్ల ఈ అమ్మాయి రజితని బీడీలు చేసుకు బతికే తల్లిదండ్రులు చదివించుకుంటున్నారు. ఆమె కాలు తీసేశారు. ఇంకా ప్రమాదస్థితిలో ఉంది.
ఒకాయన మరో రెండు నెలల్లో కూతురు పెళ్లి చేద్దామనుకుంటున్నాడు. నిన్న దారుణంగా హతుడయాడు. తల్లీ, భార్యా, ముగ్గురు పిల్లలూ గుర్తుపట్టడానికీ సాధ్యంకాని ఆ శవాన్ని చూసి గుండె బాదుకున్నారు.
ప్రఖ్యాత రచయిత్రి డి.కామేశ్వరి గారి భర్త డి.వి.నరసింహంగారు ఒకసారి చెప్పారు. ఆయన బెనారస్‌లో చదువుకునే రోజుల్లో -శలవులకి ఇంటికి బయలు దేరారు. రైల్లో మిత్రులంతా పేకాట వేశారు. ఆనందంగా ప్రయాణం సాగిపోతోంది. ఈయనకి టీ తాగాలనిపించి -ఏదో స్టేషన్లో దిగారు. తీరా టీ తాగుతూండగా రైలు కదిలిపోయింది. అది గ్రహించి -పరుగెత్తారు. తన కంపార్టుమెంటుని అందుకోలేకపోయారు. మరో కంపార్టుమెంటు ఎక్కారు. మరికాస్సేపటిలో ఆక్సిడెంటు. తనకు తప్పిపోయిన కంపార్టుమెంటులో ఉన్న మిత్రులందరూ పోయారు. తప్పిపోయింది రైలు కాదు -మృత్యువు.
సికింద్రాబాదులో పేరడైజ్‌ థియేటర్‌ కట్టిన రోజుల్లో నేను హైదరాబాద్‌లో ఉన్నాను. దాదాపు 50 ఏళ్ల క్రిందటి సంగతి అనుకుంటాను. ఆ రోజుల్లో ఆ థియేటర్‌ యజమాని గురించి చెప్పుకునేవారు. ఆయన రైలు ఎక్కడానికి సికింద్రాబాద్‌ వచ్చారు. రైలు అప్పుడే వెళ్లిపోయింది. ప్రయాణం అవసరం. కారులో రైలుని వెంటదరిమి జనగాంలో అందుకున్నారు. జనగాం దాటుతూనే పెద్ద ఏక్సిడెంటు. ఆయన కన్నుమూశారు. ప్రయత్నించి, శ్రమపడి మృత్యువుని అందుకున్న అరుదైన క్షణమిది. పేరడైజ్‌ థియేటర్ని ఎప్పుడు చూసినా ఈ విధి వైపరీత్యం గుర్తుకొస్తుంది నాకు.
మృత్యువు కొందరికి శాపం. కొందరికి ఆటవిడుపు. కొందరికి విముక్తి. కొందరికి అవకాశం. కొందరికి కసి. పగ. మృత్యువు సమదర్శి.
ప్రముఖ రచయిత, నోబెల్‌ బహుమతి గ్రహీత జీన్‌ పాల్‌ సార్త్రే నాటకం -''నో ఎక్జిట్‌'' చావబోతున్న వ్యక్తిని రక్షించడంతో ప్రారంభమవుతుంది. బతికిన వ్యక్తి రక్షించిన వ్యక్తిమీద కోపం తెచ్చుకుంటాడు -'నన్ను ఎందు కు రక్షించావు?' అని. 'అదేమిటి? చావు ఆటంకం కదా?' అంటాడితను. ''దేనికి? చావుకన్న బ్రతకడంలో ఏం సుఖం వుందని నీ ధైర్యం? బతకడానికి ఎంత సాహసం?' ఇలా సాగుతుంది. బ్రతకడమే ఓ శిక్ష. ఓ దురవస్థ -అనే ఎక్జిస్టెన్సియాలిజమ్‌ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించే రచయితల్లో ప్రముఖుడు సార్త్రే.
చాలామంది మృత్యువుని చూసి భయపడతారు గాని -మృత్యువుకి కూడా లొంగని అమరత్వం ఒకటి ఉన్నదని గ్రహించరు. అది జీవన్ముక్తి. మృత్యువు కూడా నాశనం చెయ్యలేని దశ మానవుడికి -ఆ మాటకివస్తే ఒక్కమానవునికే ఉంది. ధామస్‌ ఆల్వా ఎడిసన్‌, గ్రాహం బెల్‌, లూయీ పాశ్చర్‌, జీసస్‌, శంకరాచార్య, మహాత్మాగాంధీ, వివేకానంద -ఈ జాబితా అనంతం. విచిత్రమేమిటంటే వీరిలో చాలామంది ముప్పై సంవత్సరాలే జీవించారు! ఎంతకాలమన్నది ముఖ్యం కాదు. ఎంత ఉదాత్తత? ఎంత మానవత్వం. ఎంత సేవాతత్పరత.
మతం పేరిట మనుషుల్ని చంపడంలో, పదవుల కోసం డబ్బుని కొల్లగొట్టడంలో, సుఖాల కోసం పక్కవాడిని మోసం చేయడంలో పబ్బం గడుపుకుంటారు ఎందరో. కాని జీవించిన కొద్దికాలాన్ని శతాబ్దాల మానవాళికి చెరిగిపోని వైభవం చేసిపోయిన మహానుభావుల కాలి గుర్తులు -వెదికితే మనచుట్టూ కనిపిస్తాయి.
ఉత్తర ధృవం నుంచి ప్రకృతి వత్తిళ్ల కారణంగా భూభాగం విడిపోయి -ఖండాలు కావడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. కోట్ల సంవత్సరాలు. ఆ విషయం మనం మరిచిపోతామేమోనని పెద్దలు ఆయా భూభాగాలకి ఆ పేర్లే పెట్టారు. ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం -ఇలాగ. కొన్ని కోట్ల సంవత్సరాల వయసున్న ఈ భూమిలో కొన్ని పదులయినా జీవించలేని మానవులు -రెండు రకాలు. కొన్ని శతాబ్దాలు మానవాళిని ప్రభావితం చేసే మహనీయత. సజావుగా బతకగల కొన్ని జీవితాల్ని వ్యర్థంగా సగంలోనే తుంచివేసే పాశవిక ప్రవృత్తి. మానవుడు మహనీయుడు కావడానికి చిన్న వ్యవధి చాలు. మానవుడు పశువు కావడానికి ఒక జీవితకాలం అక్కరలేదు.
అతని పేరు సూరయ్య. చిన్నతనం నుంచీ నాకు తెలుసు. బొత్తిగా చదువుకోలేదు. నోటిలోంచి మాట వస్తే ముందో వెనుకో బూతు ఉండాలి. కాని అతని మాటల్ని వినాలనిపించేది -చిన్నతనం నుంచీ. కారణం -జీవితాన్ని తెగేసే నిజాయితీ, నిక్కచ్చిగా నిజాన్ని గుర్తుపట్టే గుణం, దాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పే స్వభావం -ఇందులో ఏదో కాపట్యం లేని వ్యక్తిత్వం కనిపించేది.
కావలసింది తిని -అక్కరలేనిది అరిచి గీపెట్టినా అందుకోనివాడు. భోజనంలో ఆయన తిన్నంత కారం ఎవరూ తినలేరు. రోజూ పది చుట్టలు కాల్చేవాడు. శ్రీమంతుడు. పిల్లల గురించి అనేవాడు: ''ఈ లం....కొడుకులు మనం పుట్టిస్తే పుట్టారయ్యా. మా అయ్య నాకు కొలిమిచ్చి బతకరా నాకొడకా అన్నాడు. బతికాను. ఈళ్లకి నేనిస్తే ఆళ్లని చెడగొట్టినాడవుతాను. బతకడం తెలీని నాకొడుకులకి ఏటిస్తే ఏం లాభం?'' అనేవాడు.
పిల్లలు ఆయన్ని తిట్టుకోలేదు. మనసుల్లో ఉన్నది ఏనాడూ దాచుకోలేదు గనుక. దాచుకోడానికి ఏమీ మిగుల్చుకోలేదు గనుక. నేను చదువుకొని ఉద్యోగాలు చేసి తిరుగుతున్న రోజుల్లో ఒక సాయంకాలం ఫోనొచ్చింది. ''నేను నారాయుణ్ణండి. మా అయ్య మాట్లాడతాడంట'' అన్నాడొకాయన. వెంటనే గుర్తుపట్టలేకపోయాను. అంతలో కంగుమన్న సూరయ్య గొంతు వినిపించింది: నన్ను 'పెద్దముక్కయ్య' అని పిలిచేవాడు. ''ముక్కయ్యా -(ఇక్కడ రాయలేని బూతు అని) ఎల్లిపోతున్నాను. నాకు కేన్సరన్నారు ఈ నాకొడుకులు. మరే బయంనేదు. పోతానని తెలిసి ఇప్పుడే రెండు చుట్టలు పీకాను. ఇవ్వొద్దనుకున్నా డబ్బు మిగిలింది. ఈ లం....కొడుకులకి ఇవ్వక తప్పడంలేదు. నువ్వు గేపకమొచ్చావు. సినీమాల్లో చెండేస్తున్నావ్‌. ఎయ్‌ గొప్పేసాలు! ఎల్తా -సెప్దామని..'' అంతే. వెళ్లిపోయాడు.
ఏమిటి సూరయ్యలో ప్రత్యేకత? ఏనాడూ మృత్యువు గురించి ఆలోచించలేదు. భయపడలేదు. తన జీవితం ఏమిటో నికార్సుగా ఎరిగినవాడు. తన జీవితం మీదా, జీవనం మీదా, ఆఖరికి పిల్లల మీదా ఏ ఆశా పెట్టుకోనివాడు. ఎప్పుడూ ఎవరి కొంపా ముంచలేదు. నిర్భయంగా జీవించాడు. తల యెత్తుకుని బతికాడు. చెప్పి, ఎరిగి, తన ధోరణిలో జీవితాన్ని అనుభవించి తెలిసి వెళ్లిపోయాడు. మహానుభావుల జీవితాలకీ అర్థం ఇదే.


                                                                           gmrsivani@gmail.com  

 
     ఫిబ్రవరి 25,2013          

*************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   


KOUMUDI HomePage