బట్టల్లేని సమస్యలు

    చాలా సంవత్సరాల కిందట మా ఆవిడా మా అబ్బాయి వత్తిడి చేయగా చేయగా మాల్‌ దీవులకు వెళ్లాం. బియాదూ అనే చిన్న ద్వీపంలో ఒక భారతీయ సంస్థ (తాజ్‌ గ్రూపు అనుకుంటాను) ఒక రిసార్ట్‌ని నిర్వహిస్తోంది. ఆ ద్వీపం కొన్ని ఎకరాల విస్తీర్ణం. ద్వీపం అంతా రిసార్టే. మాలే విమానాశ్రయం నుంచి చిన్న లాంచీలో గంటన్నర ప్రయాణం. మాతోపాటు లాంచీలో ఒక స్విట్జర్లాండు దొరగారూ, ఆయన కంటే వయస్సులో కాస్త పెద్దదయిన ఆయన గర్ల్‌ ఫ్రెండూ వచ్చారు. చుట్టూ ఉన్న హిందూ మహాసముద్రంలో మెడలోతు నీళ్లలో మునిగి -లక్షలాది రంగు చేపల్ని చూడడం ఒక గొప్ప వినోదం. దీన్ని స్నార్క్‌లింగ్‌ అంటారు. ఈ స్విట్జర్లాండు జంటే నాచేత ఆ పనిని చేయించారు. ద్వీపంలో దిగగానే నన్ను ఆకర్షించిన మొదటి ప్రకటన: ''ఇక్కడ యాత్రికులు విధిగా బట్టలు ధరించి ఉండవలెను'' అని. మొదట పొరపాటుగా రాశారేమోననుకున్నాను. ''సరైన బట్టలు ధరించవలెను'' అనో ''మర్యాదపూర్వకమైన దుస్తులు ధరించవలెను'' అనో ఉండాలి కదా? మేనేజరుని అడిగాను. ఆయన నవ్వాడు. వారు రాసిందే కరెక్టట. ఆ ద్వీపానికి ఎక్కువగా విదేశీ యాత్రీకులు వస్తూంటారు. వారు ఆ చిన్న ద్వీపంలో ఈదుతూ, స్నార్క్‌లింగ్‌ చేస్తూ బట్టల్లేకుండా గడుపుతారట ముఖ్యంగా స్త్రీలు. చెప్పి చెప్పి -ఆఖరికి విసిగి -విధిగా ఒక నిబంధన లాగ ఆ బోర్డు తగిలించారట. ''అయినా వారి అలవాటు మానరు సార్‌'' అని వాపోయాడు మేనేజరు. మేమున్న మూడు నాలుగు రోజుల్లో బట్టల్లేని చాలామంది కనిపిస్తూ వచ్చారు. వారి వారి దేశాలలో నగ్నత్వం, ఎండలో బట్టల్లేకుండా తిరగడం ఒక వ్యాపకం కావచ్చు. కాని ఇక్కడది వికారం.
కాని పట్టుచీరె కట్టుకుని వొళ్లంతా కప్పుకునే ఒక భారతీయ మహిళతో నేనక్కడికి వెళ్లాను. ఆవిడ నా పక్కన ఉండడం వల్ల ఆ దృశ్యం మరీ ఇబ్బందిగా కనిపించింది. తప్పించుకు తిరిగే ప్రయత్నం చేశాం ఆ నాలుగు రోజులూ.
ఇందులో చిన్న వివరణ అవసరం. అది అభ్యంతరకరం, అనౌచిత్యం అని ఎందుకనిపించింది? మరి ఇటలీలో, గ్రీసులో, ఆస్ట్రేలియాలో వారు ఎందుకలా భావించరు? జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మన సంస్కృతికి అలవాటులేని, అసభ్యమనిపించే చర్యని మన 'మర్యాద'ని దృష్టిలో ఉంచుకుని బేరీజు వేస్తాం. ఆస్ట్రేలియా మనిషి ఆ నగ్నత్వాన్ని పట్టించుకోడేమో! నా పక్కన ఉన్న పట్టుచీరె మహిళ ఆ అసభ్యతని మరీ కొట్టొచ్చినట్టు వేలెత్తి చూపుతోంది. ఆమె సంస్కారం ఇక్కడి విశృంఖలత్వానికి కొలబద్ద. మనకి అది వెకిలితనం, వెగటుతనం, అభిరుచి లేమి -ఇంకా చెప్పాలంటే కుసంస్కారం. ఇంకాస్త ముందుకు పోయి చెప్పాలంటే పశుత్వం.
సమాజం సహించలేని అభ్యంతరాన్ని ఆ సమాజం తరతరాలుగా గౌరవించే 'మర్యాద'తో పోల్చి తూకం వేస్తాం. మాల్‌ దీవుల్లో ఒ క భారతీయ రిసార్ట్‌లో ఇది అభ్యంతరం. అసభ్యం. అమర్యాద. అభిరుచి దారిద్య్రం. కుసంస్కారం -ఈ కొలబద్ధలన్నీ ఈ దేశానివి, తరతరాల మన సంస్కారానివి.
మహాసాధ్వి సతీ అనసూయని త్రిమూర్తులు -కేవలం పరీక్షించడానికి నగ్నంగా వడ్డన చేయమంటే ఆమె వారిని ముగ్గురు పసివారిని చేసిన కథ మనకి తెలుసు. ఇది ఈ దేశపు సంస్కృతి ఒక గొప్ప 'మర్యాద'కి ఇచ్చిన విలువ. ఈ ఐతిహ్యాలు మన సమాజపు విలువల్ని చిత్రిక పట్టే సాధనాలు.
హిమాలయాల్లో తపస్సు చేసుకునే నాగా సాధువుల సముదాయానికి వారి నగ్నత్వం అపభ్రంశం అనిపించదు. కారణం -వారి దృష్టి, దృక్పథం అటు లేదు కనుక. భగవాన్‌ రమణ మహర్షిలో మనం నగ్నత్వాన్ని చూడము. ఒక నిరాడంబరతని చూస్తాం. ఒక మహనీయతని చూస్తాం. ఇక్కడ మన 'సామాన్యత' కొలబద్ద. వారి జీవన లక్ష్యం మన దృక్పథాన్ని సంధిస్తుంది. లేదా నిర్ణయిస్తుంది.
ఈ మధ్య లాస్‌ ఏంజలిస్‌లో జరిగిన 55వ గ్రామీ అవార్డుల సమావేశంలో కార్యకర్తలు ఒక హెచ్చరిక చేశారు -పాల్గొనేవారికి. వాక్యం ఇది: ''మీరు వేసుకునే బట్టలు మీ మర్మావయవాలను కప్పేటట్టు చూసుకోండి బాబూ! బొత్తిగా శరీరంలో ప్రతీ అవయవం కనిపించే ఉల్లిపొర బట్టలు ధరించకండి'' ఇంత చెప్తే చాలు. ఇదేమిటి? అమెరికా ఇంత చెడిపోయిందా? అనిపిస్తుంది. మరేం పరవాలేదు. మనం కూడా విదేశాలతో పోటీ పడే సంస్కారాన్ని గర్వంగా సముద్ధరించుకుంటున్నాం.
మాలేలో బియాదూ ఒక 'అపశృతి' అనేంత గొప్పగా ఈ మధ్య బెంగుళూరులో చిత్రకళా పరిషత్‌ కళా ప్రదర్శనలో మన దేవుళ్ల, దేవతల నగ్నసౌందర్యాన్ని కళాకారులు చిత్రించి ప్రదర్శించారట. దుర్గావాహిని, విశ్వహిందూపరిషత్‌, శ్రీరామసేవ వంటి సంస్థలు ఈ ప్రదర్శనని వ్యతిరేకించాయట. ఇలా తిరగబడడం నిజంగా నేరమే. కాని భారతదేశంలో 1.2 బిలియన్ల జనాభాలో 85 శాతం భారతీయులు ఉండగా శతాబ్దాల సాంస్కృతిక చరిత్రని విస్మరించి కళాకారులు మన దేవుళ్లనీ, దేవతల్నీ నగ్నంగా చిత్రించిన నీచపు అభిరుచిని ఎవరయినా వ్యతిరేకించరేం?
ఎక్కడో ఏ దేశంలోనో తమ ప్రవక్త మీద అర్థం లేని కార్టూన్లు వేస్తే ప్రపంచంలోని అన్ని దేశాలలో ముస్లింలు ఆవేశితులయి -తమ క్రోధాన్ని ప్రకటించారు. అది సబబని నేననను. కనీసం వారి దగ్గరనుంచయినా మతానికి ఎంత విలువనివ్వాలో కొన్ని పాఠాలు నేర్చుకోవలసిన ఆవశ్యకత ఉంది. అరాచకాన్ని కల్పించడం నా ఉద్దేశం కాదు అసమ్మతిని ప్రకటించడం. ఈ దేశపు సంస్కృతిని కనీసం అర్థం చేసుకోలేని ఆ కళాకారుల్ని ప్రభుత్వం ఎందుకు అరెస్టు చెయ్యదు? ఈ కళాకారులు మొన్న మన పార్లమెంటు మీద దాడికి కారణమయిన అఫ్జల్‌ గురు కంటే ప్రమాదకరమైన దౌర్జన్యకారులు. వీరికీ నిన్నకాక మొన్న ఉరితీసిన అజ్మాల్‌ కసబ్‌కీ పెద్ద తేడాలేదు.
ఒక్క మహిళ నా పక్కన నిలబడిన కారణంగానే ఒక చిన్న ద్వీపంలో నగ్నత్వం నన్ను వణికిస్తే -తరతరాల భారతీయ సంస్కృతీ వైభవాన్ని కనీసం మననం చేసుకోని ఈ కళాకారుల అంధత్వానికి ఎలాంటి శిక్షయినా తక్కువేననిపిస్తుంది. ఇది మతానికి సంబంధించిన విషయం కాదు. వ్యవస్థ సంస్కారానికి, కళయొక్క ఉదాత్తతకీ సంబంధించిన విషయం.
లోగడ ఇలాంటి ఔచిత్య రాహిత్యాన్ని ప్రకటించిన ఓ పద్మవిభూషణుని పట్ల ఈ దేశం తన నైరాశ్యాన్ని ప్రకటించింది. కళాకారుని స్వేచ్ఛకి అంతరాయం కలిగించే హక్కు ఎవరికీ లేదని కొందరు 'సిగ్గులేని' కళాహృదయులు జుత్తు పీక్కొన్నారు కాని -హుస్సేన్‌ సాహెబ్‌గారు తన తల్లికి వొంటినిండా బట్టలు తొడగడం వారి స్వేచ్ఛకి, అభిరుచికీ కొలబద్ద అయితే ''సుజలాం సుఫలాం మలయజ సీతలాం -మాతరం వందేమాతరం'' అని మనం అనునిత్యం కొలిచే భారతమాతను భారతదేశంలో పుట్టి పెరిగిన ఓ కళాకారుడు నగ్నంగా చిత్రించడం ఏ స్వేచ్ఛకు నిదర్శనమో ఎవరూ ఉదహరించలేదు. ఈ దేశంలో ప్రభుత్వాల చేతులకి గాజులున్నాయి. మత వర్గాల చేతుల్లో వోట్లున్నాయి. నాయకుల జీవితాల్లో క్షమించరాని నేరాలున్నాయి. వారి మనస్సుల్లో ఈ దేశ వైభవం పట్ల అవగాహన లేదు.
అందుకనే ఢిల్లీలో, నిన్నకాక మొన్న బెంగుళూరులో భారత దేశంలో యుగాల సంస్కృతిని ప్రతిఫలించే దేవతల, దేవుళ్లకు బట్టలిప్పే నీచపు కళ 'స్వేచ్ఛ' పేరిట విరగబడుతోంది. విశృంఖలంగా ప్రదర్శనలిచ్చుకుంటోంది. ఇది మన సంస్కృతీ మర్యాద కాదని పాలనా యంత్రాంగం నోరు విప్పదేం?
కళకి అభిరుచి, మర్యాద, సభ్యత, సంస్కారం, ప్రతిభ, దక్షత, యుక్తత వంటి పల్చని తెరలెన్నో ఉన్నాయి. ఎంత గొప్ప కళయినా జాతి జీవన సరళినీ, ఆలోచనా సంవిధానాన్ని, సంప్రదాయాల్నీ, విశ్వాశాల్నీ కించపరిచే హక్కులేదు.
పద్మవిభూషణ్‌ హుస్సేన్‌గారు -బట్టల్లేని హనుమంతుడు చంక ఎక్కిన బట్టల్లేని సీత బొమ్మ తను పుట్టి పెరిగిన, తను అనునిత్యం గమనిస్తున్న ఒక జాతి విశ్వాసాలను వెక్కిరించే నీచపు అభిరుచికి నిదర్శనమని గ్రహించలేని అంధుడా?
కళాస్వేచ్ఛకీ, సంస్కృతీ మర్యాదలకీ గల పల్చని తెరలను చెరిపే హక్కు ఏ దేశంలోనూ ఎవరికీ లేదు. ప్రదర్శనని అడ్డుకున్న వారిని శిక్షించండి. కాని ఇలాంటి దిక్కుమాలిన బొమ్మల్ని కళ పేరిట వేసి జాతిని అవమానించే ఆ కళాకారుల్ని కూడా ఆ జైలులోనే మరో దరిద్రమయిన గదుల్లో బంధించండి.
జాతి విశ్వాసాలను గౌరవించలేని నాయకత్వపు అలసత్వాన్ని ఎన్నడూ ప్రజలు క్షమించరు. క్షమించరు. క్షమించరు.
                                                                           gmrsivani@gmail.com  

 
     ఫిబ్రవరి 11,2013          

*************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   


KOUMUDI HomePage