సిరివెన్నెలగారు సినిమాల్లో వ్రాసిన పెళ్ళిపాటల సందడి..!
***

 

పచ్చతోరణం కట్టేవేళ ఇది

 

'ఆడపిల్ల అరటిచెట్టు ఇట్టే ఎదిగిపోతాయి మనం గమనించకుండానే ' అని అనుకుంటా ఉంటాం. నిన్న మొన్న పుట్టిన అమ్మాయి పెళ్ళయి వెళ్ళిపోతుంది.. అనే విషయం కుటుంబంలో ఎవరూ నమ్మలేని నిజం. ఈ భావం. ఒక చక్కని సంతోష సందర్భంలో పాటగా మలచబడింది.

|| పచ్చతోరణం కట్టేవేళ ఇది ముత్యాల పల్లకి వచ్చే వేళ ఇది

   చిరుగాలుల్లారా మంగళ వాద్యం మోగించండి

   చిలకమ్మల్లారా వేదమంత్రాలు వల్లించండి

   ఈ లగ్న పత్రిక ఆహ్వానమీయగా

   మా ఇంటి వేడుక ఊరంత చూడగా     ||పచ్చతోరణం||

 

|| ఆ: మొన్న కన్నాము చిన్నారి కలని వన్నె చిన్నెల ఈ చంద్రకళని

     అ: పూట పూట ఓ పండుగవగా

         కోటికాంతుల మా ఇంటి సిరిగా

         పెంచుకున్నాము ఇన్నాళ్ళుగా

        వెన్నెల్లు మా కంట కొలువుండగా

ఆ: పొత్తిళ్ళలో నుంచి పెళ్ళీడుదాకా

    ఇట్టే ఎదుగుతుంటె ఈ పూల తీగ

   గుర్తించనేలేదు ఇన్నాళ్ళుగా

అ: అత్తింటి పందిళ్ళకందించు సందళ్ళ

    శుభఘడియ ఎదురొచ్చే మా కన్నుల

    పొంగింది పన్నీటి కన్నీళ్ళుగా    ||పచ్చతోరణం||

 

2. ఆ: మనువులో ఏమి మహిముందో ఏమో

        మరచిపోలేని మధురానుభవమో

        కన్ను తెరిచే స్వప్నాల నదిలో

        మునిగి తేలే మురిపాల మదిలో

        కొంటె కంగారు కలిగించెనో

       బంగారు తీరాలు కనిపించెనో

 

      అక్కా! మరీ అంత మైమరిచిపోక నిను సాగనంపేటి ఆవేళ దాకా మా మధ్య ఉండమ్మ మామూలుగా

      కుళ్ళెందుకే చెల్లి ముందుంది నీ పెళ్ళి

      నీ తిక్క తగ్గించి తలవంచగా

     సిగ్గంటె నీక్కాస్త తెలిసేట్టుగా   ||పచ్చతోరణం||

 

(చిత్రం: లగ్నపత్రిక, సంగీతం: రాజ్; గానం: చిత్ర, మనీ, కౌసల్య)

 

నిన్నా మొన్నా మాతోపాటే

|| ఆ: నిన్నా మొన్నా మాతో పాటే ఆడిన అల్లరి పిల్లకి

         వేరే చోటుకి వెళ్ళాలంటూ వచ్చేసింది పల్లకి

         కొత్త పెళ్ళికూతురా ఎందుకంత తొందర

         దారి చూపగ చేరాడు నువ్వు కోరుకున్న చెలికాడు      ||నిన్న||

 

||1: రంగుల కలలతో మంగళ స్నానం చేసిన సొగసుల కళలుగని

        ముంగిట నిలిచిన మంచి ముహూర్తం రాసిన లేఖలు చదువుకుని

        ఎటోవున్న స్వర్గాలన్నీ దిగొచ్చాయి నీకోసం

       సఖీ! నీకు స్వాగతమంటూ అందించాయి ఆహ్వానం

       పువ్వుల మేనాలో మబ్బుల వీధుల్లో

       దారి చూపగ చేరాడు నువ్వు కోరుకున్న చెలికాడు     ||నిన్నా||

 

2. రేపటి నుంచి ఊసులు ఏవీ మా చెవిలో నువ్వు చెప్పవని

   కోపంగానే ఉన్నాగానీ నవ్వుతూ ఉన్నాం తప్పదని

   వరాలన్నీ నిన్నే వలచి వరించాయి చిలకమ్మా

   తథాస్తంటూ దేవతకిచ్చు దూవుస్తారు లేవమ్మా

   నిత్యసుమంగళిగా నిను నడిపించంగా

   దారి చూపగ చేరాడు నువ్వు కోరుకున్న చెలికాడు    ||నిన్నా||

 

(చిత్రం: చెలికాడు, సంగీతం: యస్. ఎ. రాజకుమార్; గానం: చిత్ర, సుజాత)

 

 (కొనసాగింపు వచ్చేసంచికలో)