సిరివెన్నెలగారు సినిమాల్లో వ్రాసిన పెళ్ళిపాటల సందడి..!
***

 ఎప్పుడెప్పుడంది

ప|| ఎప్పుడెప్పుడంది పిల్లబుగ్గ
గుప్పు గుప్పు మంది మల్లెమొగ్గ
పెళ్ళిమాట విన్నదేమో పిల్లకోతి ఫేసుకూడా
చూడ చక్కగానే ఉందిరోయ్!
జీన్సు పాంటు పక్కనెట్టి పట్టుపావడాలు కట్టి ఆడపిల్లలాగె ఉందిరోయ్ ||ఎప్పుడెప్పుడె||

చ:1. అమ్మదీని తస్సదియ్య! నమ్మరాని పిల్లదయ్య
ఆకతాయి ఆర్టులోన ఆరితేరిపోయెనయ్య
ప్రిన్సులాంటి పిల్లగాణ్ణి పర్సులోన పెట్టుకుందయా!
అల్లరొద్దు నల్లనయ్య అంతసీను లేదురయ్య
అమ్మకూచి నిన్ను చూసి నేర్చుకుంది చిన్నమాయ
రాలుగాయి లీలలోన నీకు సాటిలేరులేవయా
ఆటలొచ్చు పాటలొచ్చు అల్లరొచ్చు నవ్వులొచ్చు
ఏడుపంటే చేతకాదయా..
చెల్లిపెళ్ళి తోసుకొచ్చి కళ్ళనీళ్ళు తీసుకొచ్చి
రానివిద్య నేర్పుతోందయా

2. కాలుమీద కాలువేసి వేలితోనె సైగచేసి
బాలరాజు పోజుకొట్టి ఫీలయింది చాలుగాని
పెళ్ళి పెద్ద ఫేసు పెట్టి ఒళ్ళువంచి పనులు చెయ్యరా
ఇల్లుపీకి పదిరేసి ఫెళ్ళుమంటు పెళ్ళి చేసి
పందెమేసి చిందులేసి రెచ్చిపోయి రచ్చకెక్కి
కాకిగోల చెయ్యడానికింతకన్న ఛాన్సులేదురా
దీని పెళ్ళి సందడంటు ఒప్పుకోక తప్పదంటు
చుట్టుపక్కలున్న అందరూ
పిచ్చికోపమాపుకుంటు వెర్రినవ్వు నవ్వుకుంటు
చచ్చినట్టు సద్దుకుందురు ||ఎప్పుడెప్పుడెప్పు||
తాగుతున్నదేమో ఒట్టి కోకాకోలా
కాక్‌టైల్ తాగినంత కాకిగోల
బీరు కళ్ళచూడగానె ఆరునెల్లు తేరుకోని
ఓరుగల్లు వీరమల్లురోయ్
దేవదాసు డోసుకెళ్ళి పక్కనున్న చుక్కనైన
కుక్కపిల్లలాగ చూడకోయ్ ||ఎప్పుడెప్పుడంది||

(చిత్రం: సముద్రం, సంగీతం: శశిప్రీతం, గానం. కె.కె, మల్లిక్, కోరస్)



తన ఇంట పెరిగింది ఇన్నాళ్ళుగా

పెళ్ళిచేసి ఆడపిల్లను అత్తవారింటికి పంపించే తండ్రి హృదయాంలో ముప్పిరిగొనే పరస్పర విరుద్దమైన భావాలు ఒక పక్క సంతోషం మరొకపక్క. అమ్మాయి వేరొక చోటికి వెళ్ళిపోతున్నందుకు బాధ, వీటన్నింటినీ ‘ఓ కంట కన్నీరు ఓ కంట పన్నీరు ఆ తండ్రి చెంపల్లో జారగా అక్షింతలైనాయి' అంటూ శ్రోతల హృదయాలను ద్రవింపజేసే పదాలతో అలరించిన పాట.

ప|| అ: తన ఇంట పెరిగింది ఇన్నాళ్ళుగా తన కంట మెరిసింది శ్రీకాంతిగా
ముని వంటి జనకుణ్ణి మురిపించు సీత మమతానుబంధాలు చవిచూపగా
అల్లారుముద్దైన పెళ్ళీడు సీతమ్మ ముస్తాబు కళ్ళారా చూడగా
ఓ కంట కన్నీరు ఓ కంట పన్నీరు ఆ తండ్రి చెంపల్లో జారగా
అక్షింతలైనాయి ఆ కంటినీళ్ళు ఆశీస్సులందించగా ||తన ఇంట||

అ: శ్రీరామ నీ పాద కమలాలకి తన చూపు ముడివేసి ఆ జానకి
శిరసెత్తి నీ మోము తిలకించలేక కరమెత్తి ముత్యాలు కురిపించగా
సీతమ్మ చేతుల్లో ఆ స్వాతి ముత్యాలు మారేను కెంపుల్ల తీరుగా
ఆ కెంపులే రామచంద్రయ్య మేనంటి జారేను నీలాల జాలుగా
నరులంతా ఆ వింత కనులారా చూసి అనిమేషులౌతారుగా
ఎన్నెన్ని వర్ణాల చిత్రాలు చూసింది అందాల కళ్యాణ వేదిక
వర్ణించలేనన్ని వైనాలు చెప్పింది అరుదైన ఆ పెళ్ళివేడుక ||తన ఇంట||

ఆ: సీతమ్మ చేతుల్లో ఆ స్వాతి ముత్యాలు మారేను కెంపుల్ల మారేను తీరుగా
ఆ కెంపులే రామచంద్రయ్య మేనంటి జారేను నీలాల జాలుగా
అల్లారుముద్దైన పెళ్ళీడు సీతమ్మ ముస్తాబు కళ్ళారా చూడగా
ఓ కంట కన్నీరు ఓ కంట పన్నీరు ఆ తండ్రి చెంపల్లో జారగా || తన ఇంట||

(చిత్రం: ఆలుమగలు, సంగీతం: యమ్.యమ్. శ్రీలేఖ, గానం: యమ్.యమ్ కీరవాణి, శ్రీలేఖ)

 

 (కొనసాగింపు వచ్చేసంచికలో)