సిరివెన్నెలగారు సినిమాల్లో వ్రాసిన పెళ్ళిపాటల సందడి..!
***

 
బంగారు బొమ్మకి పెళ్ళికళ


అల్లుణ్ణి కొడుకుగానూ, కోడల్ని కూతురుగానూ కుటుంబంలోకి ఆహ్వానించడం పెళ్ళి అనే సంప్రదాయంలో ఇమిడి ఉన్న సామాజికాంశం అదే సన్ ఇన్లా, డాటర్ ఇన్లా అనే పదాల్లోని ఆంతర్యం. కన్నపిల్లలకి, పెళ్ళిద్వారా మనింటికి వచ్చిన పిల్లలకి, ఏమీ తేడాలేకుండా ఆత్మీయతను పంచడం ఒక గొప్ప సంప్రదాయం. ఆ పాటలో
'అత్తిల్లునే నీకు పొత్తిళ్ళు చేసి
పసిపాపలా చూసుకుంటమని
పదిమందిలో బాసనే చేయనీ'
అంటూ కోడలని సాదరంగా ఆహ్వానించడం చూడండి.

ప|| అ: బంగారు బొమ్మకి పెళ్ళి కళొచ్చిందోయ్
రంగేళి వేడుక ముంగిట నిలిచిందోయ్
పచ్చని పందిరిలో కలిసొచ్చిన సందడిలో
మంగళవాద్యంతో ఓ మంచి ముహూర్తంలో
అల్లిబిల్లి మేనాలో నిను ఢిల్లీకెత్తుకుపోతానంటూ
కానున్న కళ్యాణమంటున్నదోయ్ ||బంగారు||

చ|| అ: ఆకు పచ్చని చిలకరెక్క పంచవమ్మా శుభలేఖలు
చూడ చక్కని జంట కలిపిన నను మెచ్చుకోగా నలుదిక్కులు
దగ్గరలోనే వినిపిస్తోందా లగ్గం సన్నాయి
ఆ సంగతి తెలియంగానే సిగ్గులు బుగ్గలు నొక్కాయి
నీ చక్కని చెక్కిలి నొక్కులుపడితే బాగుందమ్మాయి

బల్లే బల్లే బల్లే! షాదికే బారాత్ ఆయేగి కల్
ముబారక్ బాత్ కరేగీ హల్ చల్
పారాణి పాదాల మాగాణి మారాణి
నీ రాక ఎపుడంది మా రాజధాని

చ|| 2. ఆ: తేనె తేటల తెలుగుపాట తరలి రావే మా ఇంటికి
కోటి శాంతులు తులసికోట కళలు తేవే మా పెరటికి
ఆ జనక రాజుకు దీటైన తండ్రి మన్నించు మా ఇంటి తాంబూలం
ఈ పసుపు కాంతికి మా గడప పండేలా అందించు సీతమ్మ కన్యదానం
అత్తిల్లునే నీకు పొత్తిళ్ళు చేసి పసిపాపలా చూసుకుంటామని
పదిమందిలో బాస నే చేయనీ ||బంగారు||

(చిత్రం: పెళ్ళికానుక, సంగీతం: వందేమాత్రం శ్రీనివాస్; గానం: బాలు, శ్రీమతి భానుమతి, కీరవాణి, శ్రీలేఖ)


వచ్చినారండీ పెళ్ళివారు
 

మన దేశంలో పెళ్ళనేది ఇద్దరు వ్యక్తులనే గాక, రెండు కుటుంబాలను శాశ్వతంగా బంధించే ఒక గొప్ప ఏర్పాటు ఆడపిల్ల తన ఇంటిని వదిలి పెట్టి మరొక ఒంటికి పూర్తిగా వెళ్ళిపోయే సందర్భం. మమతలకు నిలయమైన మన కుటుంబ వ్యవస్థలో, పుట్టింట్లో అన్నాళ్ళు పెరిగిన ఆడపిల్ల వేరే ఇంటికి వెళ్ళిపోతూ వుంటే, ఆ అమ్మాయి తల్లితండ్రులకీ, తోబుట్టువులకీ మనసు కరిగి కన్నీళ్ళు సుళ్ళు తిరగడం. అసలు మొత్తం వాతావరణమే బరువెక్కడం అందరికీ అనుభవమయ్యే విషయమే!
వేరే ఇంటికి వెళ్ళిన ఆడపిల్ల ఎలాంటి పరిస్తితులనెదుర్కొనవలసి వస్తుందో, ఆదరించబడుతుందో, ఆరళ్ళకి గురవనుందోననే అనేకానేక ఊహలు, భయాలు, మనుషుల్ని నిలువనీయకుండా చేస్తాయి. అటువంటి మానసిక స్థితిని మాటల్లో వెళ్ళడించడం అతి కష్టం.
ఇక్కడ మరొక విషయం గమనించాలి. ఏదైనా ఒక సందర్భం, భావం మనం అనుభవిస్తున్నపుడూ అది కలుగజేసే మానసిక స్పందన వేరు అదే సందర్భం, భావం కాలాంతరంలో మనకి ఒక కవితగా కానీ, ఓ పాటగా కానీ ఎదురైనప్పుడు ఆ భావంతో తాదాత్మ్యం చెందినపుడు మనకు కలిగే ఆనందం వేరు. ఒక విషాదకరమైన సంఘటన చూసినా, కరుణపూరితమైన పాట విన్నా, మనకు వచ్చే కన్నీళ్ళు దుఃఖం వల్లకాదు. రసానందం, రసానుభూతి వలన కలిగే అశ్రువులు మాత్రమే. ఇటువంటి అనుభూతిని అందివ్వగల పాటలే శ్రోతల ఆదరణకు నోచుకుంటాయి.
పెళ్ళి సందర్భంలోని కరుణభరితమైన మరోపాట చూద్దామా?
వచ్చినారండి పెళ్ళివారు..
ఈ పాటలో...
'కన్నతల్లిలాగా ఇన్నాళ్ళు పెంచి
నీ చేతిలో అప్పగించాక
నేను తల్లిలేని పిల్లాణ్ణి అవుతాగా!'
అన్నమాటలు గుండెల్ని పిండేస్తాయి. తల్లిలేని ఆడపిల్లకి అన్నీ తనే అయి పెంచిన తండ్రి కూతురు అత్తవారింటికి వెళ్ళిపోతే తాను తల్లిలేని పిల్లవాణ్ణి అవుతాననడంలో మాటలతో చెప్పలేని ఎన్నో భావాలతో మనసు బరువెక్కుతుంది.

ప|| వచ్చినారండీ పెళ్ళివారు తెచ్చినారండీ సంబరాలు
అ: మచ్చలేనంత మంచివారు పుచ్చుకోరంట లాంఛనాలు

చ|| 1: ఆ: రఘురాముడంటే బహుదొడ్డవాడు మావాడు
మీ అల్లుడౌతుంటె ఎన్ని బహుమతులు ఇచ్చుకుంటారండి
అ: సీతమ్మలాంటి మా చిట్టితల్లి మీ గడపలో కాలు పెడుతుంటె
మరి సాక్షాత్తు శ్రీలక్ష్మి మీదండి
ఆ: కృష్ణుడు కాదు రాముడేనని గ్యారంటీ ఏముందండీ
కో: వెనకాలొచ్చిన వానరమూకని చూసి తెలుసుకోవాలండి
అ: సిసింద్రీలా వాటం చూస్తే సీతేనా అని డౌటండి
కో: చిరుబురులాడే సత్యభామకి తీసిపోయేట్టు లేదండీ.
ఆ: సీతారాముల గానీ సత్యాకృష్ణులుగానీ అచ్చమైన ప్రేమకు మారుపేరు ||మచ్చలేని ||

2. అ: కన్నతల్లిలాగ ఇన్నాళ్ళూ పెంచి మీ చేతిలో అప్పగించాక
నేను తల్లిలేని పిల్లాణ్ణి అవుతాగా
ఆ: అత్తనయ్యే ముందే అమ్మనండి నేను
ఏ లోటూ రానీక చూస్తాగా నేను తన తల్లినే అనిపిస్తాగా
అ: అత్తకు తాను కూతురు అయితే నేను మీకు కొడుకనుకోండి
కో: అత్తకి కూతురు మామకు కొడుకు హిట్టు టైటిలవుతుందండి.
ఆ: వరసలు మార్చి మడతల పేచీ వేసేస్తున్నారేంటండీ
కో: కట్నం వద్దని దత్తత కెళ్ళి మొత్తం తెచ్చే ప్లానండీ
అ: లక్షలతో పనిలేని పచ్చని మమతల సిరిని
ఆ: పంచుకున్నవారే ఉన్నవారు ||మచ్చలేని||

(చిత్రం: కేటు - డూప్లికేటు, సంగీతం: కోటి, గానం: బాలు, రాధిక, రమణి & కో)
 

 (సమాప్తం)