సిరివెన్నెలగారు సినిమాల్లో వ్రాసిన పెళ్ళిపాటల సందడి..!
***

ఇవియే అనేక శుభలేఖార్ధములు...

       

తెలుగువారి లోగిళ్ళలో ఏటి పొడవునా ఎన్నో పండుగలూ, పబ్బాలు, వేడుకలూ, వినోదాలూను. ఆ మాటకొస్తే, తెలుగువాడేమిటి, ప్రతీ సమాజంలోనూ ఇవన్నీ అందరికీ ఉంటాయి. అయితే ఎవరి ప్రత్యేకత వారిది.

అయినవాళ్ళంతా కలసి సంబరంగా జరుపుకునే ఇలాటి కోలాహలమైన అంశాలన్నిటికీ సంగీతం, నృత్యం, వీటిని అనుసంధానించే సాహిత్యం ప్రత్యేక ఆలంబన. ఆటా, మాటా, పాటా ఈ మూడూ ముప్పేట జడలా ముడేసుకుని మురిపించందే ఏ వేడుకా, వినోదమూ నిండుతనం సంతరించుకోదు.

ఇటువంటి మొగలి పూల జడలాంటి పాటలు అనూచానంగా మన సాంస్కృతిక జీవనంలో ఎప్పటినుంచో వస్తున్నాయి. మాటలు పొదిగిందెవరో, స్వరాలు సమకూర్చిందెవరో పదాలకి నర్తనలు నేర్పిందెవరో గురుతులేనంత, రానంత, సొంతం చేసుకుందీ జాతి.

దేవుడి పెళ్ళినుంచి, సొంతింట్లో జరిగే పెళ్ళివరకూ, కళ్యాణ ఘట్టాలను కమనీయంగా, రమణీయంగా వర్ణించే గీతాలెన్నో మన ఇళ్ళల్లో ఉన్నాయి.

సినిమా పాటల్లోను ఇలాంటి సన్నివేశాలు వస్తూంటాయి. అలాంటి సందర్భాలకు పాట వ్రాయవలసి వచ్చినప్పుడు, మనకి పరంపరాను గతంగా సంక్రమించిన వారసత్వ ఆస్థిలాంటి సంప్రదాయ గీతాలు, వాటి బాణీలూ, వాటి పోకడలను స్ఫూర్తిగా పొందుతూ, చిన్నప్పటినుంచీ మనోఫలకం మీద ముద్రించుకున్న చిత్రానుభూతులన్నిటినుంచి ప్రేర అందుకుంటూ, నాదైన 'వాణి'ని మేళవిస్తూ, కళ్యాణ గీతాలను కూర్చిన అనేక సందర్భాలలో కొన్నింటిని తీసుకుని, ఈ పుస్తకరూపంలో తెస్తున్నారు సిరివెన్నెల క్రియేషన్స్ వారు.

ముంజేతి కంకణానికి అద్దం చూపించినట్టు ఈ గీతాలకి సంబంధించి మళ్ళీ ముందుమాట నేను వ్రాయవలసిన అవసరం, నిజానికైతే లేదు. ఏ కాస్తో కూస్తో ఉంది, ఉండాలి అనుకుంటే ఆ చిన్ని అవసరాన్ని ప్రకాశకులు తమ ఉద్దేశ్యాన్ని వివరించడం ద్వారా, కొన్ని పాటలకి కొంత వివరణ వ్రాయడం ద్వారా సక్రమంగా నెరవేర్చారు. దానికి కొసరుగా, కొనసాగింపుగా, రసహృదయులూ, సాహిత్య కోవిదులూ, నాకు ప్రియమిత్రులూ అయిన శ్రీ శివరాం ప్రసాద్, విజయవాడ: శ్రీ 'కిరణ్‌ప్రభ ' : శ్రీ కృష్ణవంశీలు ముంగిట్లో రంగవల్లులు దిద్దినంత ముచ్చటగా, పుస్తకానికి తమ ముత్యాల మాటలను సమకూర్చి పెట్టారు. ముఖ్యంగా, బాపుగారి ముఖచిత్రం ఈ మొత్తం పుస్తకాన్ని ముక్తసరిగా, ముద్దుగా 'చిత్ర' భాష్యంతో సమీక్షించింది.

ఈ పచ్చని పెళ్ళిపందిట్లోకి బంధువులై అడుగు పెడుతున్న మీకు ఓ చిన్న కర్పూర కళికని అందించినట్టు..

ఈ నా మాటల్లో చెప్పుకోవలసింది బోల్డంత; చెప్పకుండా ఉండడంలో ఉన్న అందం మరింత నేను చెప్పాలనుకుంటున్నది ఈ పుస్తకం చదవడం అయిం తర్వాత మీ శిరఃకంపనలలోనూ, మీ చిరునవ్వుల్లోనూ, మీ నొసటి విరుపులోనూ, మీ కళ్ళ మెరుపులోనూ, మీ మౌన స్వగతాల్లోనూ వినాలన్న కుతూహలం మరింత కలసి..

మొత్తంగా పరిమళిస్తూ, పెళ్ళిపీటల వైపు మీ దృష్టి మరల్చేందుకు సవినయంగా స్వాగతుస్తూ 'ఇవియే అనేక శుభలేఖనార్ధములు'

మంగళం మహత్

శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

మీ
'సిరివెన్నెల'

హైదరాబాద్

15-02-2003

 

ఏయ్! రుక్కమ్మ చుక్కమ్మ

అమ్మాయి మనసులో అల్లరి ఎవరికో ఒకరికి చెప్పుకోకపోతే ఊరుకోలే ని వైనం. చెపితే అందర్లో అల్లరైపోతానేమోనన్న భయం. అయినా స్నేహితులతో తన రహస్యాన్ని పంచుకునే ఈ పాటలో తనకు కాబోయే భర్త యొక్క ఊహా చిత్రాన్ని ఓ ముద్దరాలు చిత్రించిన చందం చూడండి.

 

పల్లవి: ఏయ్! రుక్కమ్మ చుక్కమ్మ ఈ మాట విన్నారటే
         ఛీ... సిగ్గమ్మా! ఆ మాట నా నోట చెప్పాలంటే
         నమ్మనంటారో ఏమోనే కుళ్ళుకుంటారో ఏమోనే
         నాలో ఏదో నచ్చి కల్లో మారాజొచ్చి పెళ్ళాం పోస్టు నాకే ఇస్తాడంటే

          ఏయ్! రత్తమ్మ అత్తమ్మ ఈ మాట విన్నారటే
          ఛీ... సిగ్గమ్మ! ఆ మాట నా నోట చెప్పాలంటే

 

చ:1    బారెడు ఎత్తున్నోడా బోలెడు సొత్తున్నోడా
         పోరడు ఎట్టా ఉంటాడే
? చెప్పుపిల్లా చెప్పు చెప్పు
        సూర్యుడి కళ్ళున్నోడె చంద్రుడి నవ్వున్నోడె ధీరుడే నా వరుడు
        అలనాటి బాలుడా
? అతడైన చాలడే
    అబ్బో! భూమ్మీదట్టంటోడే పుట్టలేదంటే
    ఏయ్! మేకమ్మ దూడమ్మ ఈ మాట విన్నారటే
    ఛీ.... సిగ్గమ్మా ఆ మాట నా నోట చెప్పాలంటే    
 ||నమ్మమంటారో ||

 

2. అంతగా తుళ్ళితుళ్ళి గెంతకే మళ్ళీ మళ్ళీ
    ఆగవె పెళ్ళికూతురా
   గుండెను గిల్లి గిల్లి పందిరి అల్లి అల్లి
   లాగెనె కొంటె తొందర
   ఇది ఏమి మాయరో మతిపోయె దేవుడో
    రాణివాసం నాకే రాసిపెట్టి ఉందంటే
    ఏయ్! బుజ్జమ్మా బుల్లెమ్మా ఈ మాట విన్నారటే
    ఛీ..సిగ్గమ్మా ఆ మాట నా నోట చెప్పాలంటే  
 || నమ్మనంటారో || 

           (చిత్రం: చాలాబాగుంది; సంగీతం: కోటి: గానం: చిత్ర, కోరస్)

 (కొనసాగింపు వచ్చేసంచికలో)