భారతీయేతర జానపదగాథలు మానవజీవితం

                                                                    : డా. శిరీష ఈడ్పుగంటి

                                                                         

సాహిత్యం సమాజం నుండి పుడుతుంది. సమాజంలోని వ్యక్తులు, స్వభావాలు, వారివారి జీవితాలు, సుఖదుఃఖాలు మొదలైన అంశాలన్నింటి గూర్చి రచయితలు సాహిత్యరచనలరూపంలో  పాఠకులకు తెలియజేస్తారు. తద్వారా మనిషి వాటిని చదివి మానసిక ఆనందాన్ని పొందుతున్నాడు. సాహిత్యం మనిషి జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అంతేగాకుండా మనిషి జీవితానికి, సామాజికస్థితికి అత్యంత చేరువలో ఉంటుంది.  

          సాహిత్యం అనేది రచనలు చేసే కళ. సాహిత్యం అనే పదానికి అర్థం "అక్షరాలతో సాన్నిహిత్యం". ఇది ఒక ప్రక్రియ. ఒక సాహిత్యప్రక్రియను పాఠకునికి ఒక నిర్దిష్టప్రభావాన్ని  అందించడానికి సాహిత్యరచనలో ఉపయోగిస్తారు. మనిషి జీవితాన్ని తీసుకుని ఒక స్వచ్ఛమైన కళారూపంగా మార్చి చూపేది సాహిత్యప్రక్రియ. ఒక జీవన యానాన్ని ఆ ప్రయాణంలో నమోదైన సంఘటనలను పునర్నిర్మిస్తుంది. వాస్తవబద్ధమైన మానవజీవితాన్ని ప్రదర్శిస్తుంది. మానవ జీవితాన్ని, మనిషి వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తుంది. ఈ సాహిత్యప్రక్రియ మనకు రెండురకాలుగా కనబడుతుంది. 1. లిఖితరూపం 2. మౌఖికం. లిఖితరూప సాహిత్యప్రక్రియ అనేది రచనల రూపంలో కనిపిస్తుంది. నవల, నాటకం, పద్యం, గద్యం, శతకం, కథా...  మొదలైన ప్రక్రియలరూపంలో సాహిత్యం లిఖితరూపంలో ఉంటుంది. మౌఖిక సాహిత్యప్రక్రియ మౌఖిక సంప్రదాయాలను సూచిస్తుంది. వీటిలో ఇతిహాస, కవిత్వ, నాటక, జానపదగాథ, జానపదగేయగాథ వంటివి పలురకాలున్నాయి. ఈ మౌఖికసాహిత్యంలోని జానపదగాథాప్రక్రియను గూర్చి ఈ వ్యాసంలో ప్రస్తావిస్తున్నాను.

జానపదగాథాప్రక్రియ     

         జానపదగాథలు అనేకం కనిపిస్తాయి. బొబ్బిలికథ మన తెలుగుప్రాంతంలో ఒక వీరోచిత జానపదగాథ. తెలుగేతర ప్రాంతాలలో కూడా జానపదగాథలున్నాయి. మల్లెలయువరాజు తమిళంలోని జానపదగాథ. హిందూమతంలోనే కాక బౌద్ధ, జైన మతాలలో కూడా జానపదగాథలున్నాయి. గౌతమబుద్ధుడు ఒక తెల్ల ఏనుగురూపంలో భూలోకంలో అవతరించినట్లు గాథ ఉంది. ఈవిధంగా మనదేశంలో తెలుగు, తెలుగేతర ప్రాంతాలలోనూ, వివిధమతాలలోనూ జానపదగాథలున్నట్లే భారతీయేతర ప్రాంతాలలో కూడా జానపదగాథలున్నాయి. 

భారతీయేతర జానపదగాథలు

         ప్రపంచసాహిత్యం వలె భారతీయసాహిత్యం వివిధప్రక్రియల రూపంలో ఉంది. వాటిల్లో ఒక ప్రక్రియ జానపదగాథ. భారతదేశంలో వివిధ ప్రాంతాలలో పలురకాల జానపదగాథలున్నాయి. అలాగే ప్రపంచంలో వివిధదేశాలలో (భారతీయేతర ప్రాంతాలలో) అనేక జానపదగాథలు కనిపిస్తాయి. ఈ జానపదగాథలలో ఐదింటిని (ఐదు ప్రాంతాలకు చెందిన) ప్రస్తుత వ్యాసంలో చర్చిస్తున్నాను. ఈ ఐదు జానపదగాథలను వివరిస్తూ, వాటిలో మానవజీవితం ఏవిధంగా ఉన్నది తెలుపుతున్నాను. ఈ గాథలలోని మానవుని ఆలోచన, బుద్ధి, స్వభావం, ప్రవర్తన, మనిషిజీవితం మొదలైన అంశాలను ప్రస్తావిస్తున్నాను. జానపదగాథాసాహిత్యంలోని మానవజీవితాన్ని విశ్లేషిస్తున్నాను.

 

తూర్పు ఐరోపా జానపదగాథ     

          ఒక ముసలిజాలరి సముద్రంలో చేపలు పట్టలేక నదిలో చేపలు పట్టి వాటిని అమ్మి జీవనం సాగించేవాడు. మండువేసవిలో చేపలు పట్టలేక తన దుస్థితికి తనే బాధపడతాడు. అప్పుడు  వెండిలా తళతళ మెరిసే ఈకలున్న ఒక పెద్దపక్షి చూస్తుంది. దానిపేరు కహ్, దేవతాపక్షి. ఆ పక్షి ముసలిజాలరి పై జాలిపడి ఇలా అంటుంది. తాత రోజూ నేను నీకు ఒక పెద్ద చేపను ఇస్తాను. నువ్వు దాన్ని అమ్మి జీవనం సాగించు అని ఎగిరిపోతుంది. ఆ ప్రకారమే పక్షి రోజూ ఒక పెద్ద చేపను ముసలిజాలరి ఇంటిముందు వేస్తూఉంటుంది. దాన్ని అమ్మి ఆహారం తెచ్చుకునేవాడు ముసలిజాలరి. ఆరోజులలో పెద్దచేపలకు గిరాకీ ఎక్కవ ఉండటంతో ముసలిజాలరి డబ్బులు బాగా కూడబెట్టాడు. వాటితో సముద్రతీరంలోనే ఒక ఇల్లు, వంటమనిషిని ఏర్పాటుచేసుకోగలిగాడు. కొద్ది రోజులక్రితమే అతని భార్య చనిపోవడంతో మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి తగిన వధువు కోసం వెతుకుతున్నాడు. ఒకరోజు రాజభటుడు వేసిన దండోరా వింటాడు. అది "రాజుగారికి కహ్ అనే దివ్యపక్షి కావాలి. దానిగూర్చి తెలిసినవారెవరైనా ఉంటే, దాన్ని పట్టుకోవడంలో సహాయం చేస్తే తగిన బహుమతి ఇస్తాం అని". కోశాగారంలోఉన్న బంగారంలో సగం, అర్ధరాజ్యాన్ని ఇస్తాం అని ప్రకటన. ఆ ప్రకటన విని ముసలిజాలరి అర్ధరాజ్యముంటే తను కూడా రాజేనని మురిసిపోతూ ఆ పక్షి ఎందుకు? అని రాజభటుల్ని అడుగుతాడు. రాజుగారికి కంటిచూపు పోయింది. కహ్ పక్షి నెత్తురుతో కళ్ళను శుభ్రంచేస్తే చూపు వస్తుందని వైద్యులు చెప్పారు. ఆ పక్షి గూర్చి నీకేమైనా తెలుసా అని అడుగుతారు భటులు. అప్పుడు ఆ ముసలిజాలరి దురాశకు పోయి ఆ పక్షిని పట్టుకోవడంలో సహాయం చేస్తానంటాడు. రాజభటులను తన ఇంటికి తీసుకుని వెళతాడు. ఎప్పటిలాగే కహ్ పక్షి మాత్రం జాలరి ఇంటిముందు ఒకపెద్దచేపను వదిలివెళ్ళిపోతుంటే ఆ ముసలిజాలరి పక్షితో ఇలా అంటాడు. "నువ్వు రోజు చేపను వేసి వెళ్ళిపోతావు కనీసం నన్ను కృతజ్ఞత అయిన చెప్పుకోనివ్వి అని పదేపదే వేడుకోవడంతో ఆ పక్షి నేలమీదకి దిగుతుంది. మరుక్షణమే దాని కాలు గట్టిగా పట్టుకుని భటుల్ని పిలుస్తాడు. ఇంటివెనక దాగిఉన్న భటులు పక్షిని పట్టుకోవడానికి పరిగెత్తుకుని వస్తారు. వాళ్ళు వచ్చేలోపే ఆ పక్షి జరగబోయే విషయాన్ని గ్రహించి ఆ ముసలిజాలరితో సహా పైకి ఎగిరిపోతుంది. ఆ తర్వాత ఎన్నడూ ఎవరికీ కహ్ పక్షిగాని ఆ ముసలిజాలరి గాని కనిపించలేదు.

విశ్లేషణ

          జాలరి ముసలితనాన్ని గమనించి అతని అవస్ధకు పక్షి జాలిపడుతుంది. సహాయం చేస్తుంది. కాని ముసలిజాలరి అది గుర్తించకుండా దాని ప్రాణాలకే హాని కలిగించేవిధంగా ప్రవర్తిస్తాడు. చివరికి ప్రాణం పొగొట్టుకుంటాడు. చేసిన సహాయం మరిచి పక్షికే అపకారం తలపెడతాడు. డబ్బు, అర్ధరాజ్యం కోసం ఆశపడతాడు. పక్షి చేసిన సహాయంతో తృప్తి చెందడు. కృతజ్ఞత చూపక, దురాశకు పోతాడు. చేసిన మేలు మరిచి పక్షికే కీడు తలపెడతాడు. కనుక ఎవరైనా సరే సహాయాన్ని పొంది కృతజ్ఞత చూపగ పోగా కీడు తలపెట్టకూడదు. దురాశ దు:ఖానికి చేటు.  

                                    ఉపకారికి నుపకారము
                                   
విపరీతము కాదు సేయ వివరింపంగా
                                  
నపకారికి నుపకారము
                                   
నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతీ.

ఉపకారం చేసినవారికి ప్రత్యుపకారం చేయడం గొప్పేమీ కాదు. అపకారికి వాడి తప్పులు మన్నించి ఉపకారం చేసేవాడే నేర్పరి అవుతాడు. ఈ కథలో జాలరి పక్షి చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయకపోగా అపకారం తలపెట్టి ప్రాణాలు పొగొట్టుకుంటాడు.

పఠాన్ గర్వం (ఆఫ్గన్ జానపదగాథ)

          అలామత్ అనే వ్యక్తికి భార్యాపిల్లలు కుటుంబం ఉంది. కట్టెలు కొట్టి వాటిని అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. "ఈద్" పండుగకు తనకు, పిల్లలకు కొత్తబట్టలు కావాలని భార్య అడుగుతుంది. అతడి దగ్గరేమో చిల్లిగవ్వ లేదు. డబ్బు కోసం ఆలోచిస్తుండగా అతనికి ఒక వర్తకుడు కనిపిస్తాడు. ఆ వర్తకుడు గాడిదమీద బట్టల మూటలు పెట్టుకుని అమ్ముతున్నాడు. అతణ్ణి చూడగానే అలామత్ కు తన సమస్యకు పరిష్కారం దొరికిందని అనుకుంటాడు. వెంటనే మూడు రాళ్ళు తీసుకుని ఆ వర్తకుని మీదకు ఒక రాయిని విసురుతాడు. ఆ రాయి వర్తకుని భుజానికి తగులుతుంది. నన్నెందుకు కొడుతున్నావు అని వర్తకుడు అలామత్ ని అడుగుతాడు. "నేను దోపిడిదొంగను, నాకునీ బట్టలమూటలు కావాలి అంటాడు అలామత్. వర్తకుడు "నాకు నిన్ను ఎదురించే ధైర్యం లేదు." కావున ఈ బట్టల మూటలు తీసుకో అంటాడు. అలామత్ వెంటనే రెండవరాయి విసురుతాడు. దాంతో వర్తకుడు భయపడి బట్టల మూటలు తీసుకోమన్నాను కదా ఇంకా ఎందుకు రాళ్ళు విసురుతున్నావు అని అడుగుతాడు. "దోపిడి అనేది ఎప్పుడూ మోసంతో ఉంటుంది. అలాకాకుంటే అడుక్కునేవాడికీ, నాకూ తేడా ఏముంటుంది?" అని మూడవరాయిని విసురుతాడు అలామత్. వెంటనే వర్తకుడు గాడిదను, బట్టలమూటలను వదలిపెట్టి పరుగుతీస్తాడు. అలామత్ వాటిని తీసుకుని వెళ్ళి భార్యకు ఇస్తాడు. పిల్లలకు, తమ బంధువులకు అందరికీ బట్టలు కుట్టించుకోమని ఇస్తాడు. ఈద్ పండుగను ఎంతో ఆనందంతో జరుపుకుంటారు. 

          కొన్నాళ్ళ తరువాత అలామత్ సంతలో చిక్కుడుగాయలు కొంటుంటే అతని భుజంపై ఒక చేయి బలంగా పడుతుంది. వెనక్కి తిరిగి చూస్తే ఆమధ్య తాను దోపిడి చేసిన వర్తకుడు. "ఏం కొంటున్నావ్ భాయ్ అని అడుగుతాడు." చిక్కుడుగాయలు అని తడబడుతూ చెబుతాడు అలామత్. అప్పుడు వర్తకుడు తనకు చిక్కుడుగాయల పంట ఉన్నదని ఎన్ని కావలిస్తే అన్ని ఉచితంగా ఇస్తానని అంటాడు. వర్తకునికి ఇరువైపులా ఇద్దరు వస్తాదులున్నారు. వారిని చూసి అలామత్ తల ఊపక తప్పలేదు. వర్తకుడు అలామత్ ను ఇంటికి తీసుకుని వెళ్ళి అతిధిమర్యాదలు చేస్తాడు. కాని అలామత్ మాత్రం తనకు ఏం శిక్ష విధిస్తాడో అని భయపడుతూనే ఉంటాడు. ఈ గండం గడిస్తే ఇంకెప్పుడూ తప్పులు చేయనని మనసులోనే అనుకుంటాడు. చివరికి వర్తకునితో ఇలా అంటాడు. "అయ్యా చిక్కుడుగాయలు ఇస్తే వాటి ఖరీదు చెల్లించి వెళ్ళిపోతానని". వెంటనే ఒక బస్తా చిక్కుడుగాయలు తెప్పించి, అలామత్ వచ్చిన గాడిద మీద పెట్టించి ఇక నువ్వు వెళ్లు అంటాడు వర్తకుడు.

            తనకు అన్ని కాయలు అవసరం లేదని, తన దగ్గర అన్ని డబ్బులు లేవని అంటాడు అలామత్. ఉచితంగా తీసుకోమని వర్తకుడు అంటాడు. వెంటనే అలామత్ "ఉచితంగానా? నేనేమన్నా  బిచ్చగాణ్ణా?" అని భయంతో అంటాడు. అప్పుడే అతని వీపు పై తుపాకీ గొట్టం తగులుతుంది. "మర్యాదగా నీ గాడిద పై ఎక్కి కూర్చొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. లేకుంటే నీతలకాయ ఎగిరిపోతుంది" అని వర్తకుడు గర్జిస్తాడు. ఒక బిచ్చగాడికి దానం చేసినట్లు తనకు ఉచితంగా చిక్కుడుగాయలు ఇవ్వడాన్ని అవమానంగా భావిస్తాడు అలామత్. భారాన్ని బలవంతంగా దిగమింగుకుంటు గాడిద మీద ఇంటికి వెళతాడు.అప్పటినుంచి అలామత్ ప్రతివారం ఒక కట్టెలమోపు చొప్పున ఆ వర్తకుడి ఇంటిముందు వేస్తాడు. ఈ విధంగా క్రమం తప్పకుండా పదిసంవత్సరాల పాటు వేస్తాడు. ఒకరోజున ఆ వర్తకుడు "ఇక చాలు నా బట్టలకు, చిక్కుడుగాయలకు తగిన మూల్యం లభించింది" అంటాడు. అప్పుడు అలామత్  వర్తకునికి నమస్కరించి, సగర్వంగా తలెత్తుకుని గాడిద మీద ఇంటికి వెళతాడు. ఇక తనను బిచ్చగాడని ఎవరు అనలేరని లోలోపల ఎంతగానో ఆనందపడతాడు.

విశ్లేషణ

          అలామత్ స్వభావం ఎవరి దగ్గర ఏది ఉచితంగా తీసుకోడు. అలా తీసుకుంటే తాను బిచ్చగాణ్ణి అనే అభిప్రాయం కలవాడు. డబ్బులేక వర్తకుని వద్ద బట్టలు మోసంతో తీసుకోవాలనుకుంటాడు. కాని వర్తకుడు ఉచితంగా బట్టలు ఇస్తానన్న  తీసుకోడు. వర్తకుడు భయంతో పారిపోవడం అలామత్ బట్టల మూటలు ఇంటికి తీసుకుని వెళతాడు.  ఈ సంఘటనతో వర్తకుడు ఇద్దరు వస్తాదులను తనకూడా పెట్టుకుంటాడు. తుపాకీ ఇంటిలో ఉంచుకుంటాడు. తనలోని భయాన్ని పారద్రోలి ధైర్యంగా వ్యాపారం చేయడం మొదలుపెడతాడు. వర్తకునికి అనుకోకుండా ఒకరోజున అలామత్ కనిపిస్తాడు. ఇంటికి తీసుకుని వెళ్ళి అతిధిమర్యాదలు చేస్తాడు వర్తకుడు. కాని అలామత్ కు లోలోపల తాను చేసిన పనికి వర్తకుడు ఏం శిక్ష విధిస్తాడో అనే భయం ఉంటుంది. వర్తకుడు అలామత్ కి ఉచితంగా చిక్కుడుగాయలు ఇస్తాననడం, అలామత్ వద్దని అనడం జరుగుతుంది. వర్తకుడు అలామత్ ను బెదిరించి బస్తా చిక్కుడుగాయలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. భయంతోనే అలామత్  వాటిని ఉచితంగా తీసుకుంటాడు. కాని అలా తీసుకోవడం అవమానంగానే భావిస్తాడు. చివరకు అలామత్ వర్తకుణ్ణి బెదిరించి తీసుకున్న బట్టలమూటలకు, అలామత్ ను బెదిరించి వర్తకుడు ఇచ్చిన బస్తా చిక్కుడుగాయలకు అన్నింటికి కలిపి డబ్బులు కట్టెలరూపంలో అలామత్ వర్తకునికి పదిసంవత్సరాలలో ఇవ్వడం జరుగుతుంది. తదనంతరం తాను బిచ్చగాణ్ణి కాదు అని అలామత్  కు పట్టరాని సంతోషం కలుగుతుంది. 

          అలామత్ భార్య కుటుంబ పరిస్థితి తెలిసి కూడా పండుగకు కొత్తబట్టలు కావాలనుకోవడం, అలామత్  కు ఏది ఉచితంగా తీసుకోవడం ఇష్టంలేక ఒకసారి వ్యాపారిని బెదిరించి, రెండవసారి తాను భయపడి ఉచితంగా తీసుకుంటాడు. వాటి విలువను మరల చెల్లించి ఎంతో ఆనందపడతాడు. వర్తకుడు మొట్టమొదట అలామత్ ను ఎదిరించే ధైర్యం లేక గాడిదను, బట్టలమూటలను వదులుకుంటాడు. రెండవసారి ఇద్దరు వస్తాదులు, చేతిలో తుపాకీతో భయపెట్టే స్థితిలో ఉంటాడు. బలమున్న వాడిదే రాజ్యం అనే సామెత రుజువవుతుంది.   

                                                 నయమున బాలును ద్రావరు

                                                భయమున విషమ్మునైన భక్షింతురుగా

                                                 నయమెంత దోషకరియో

                                                  భయమే చూపంగ వలయు బాగుగ సుమతీ!

ఈ లోకంలో మెత్తని మాటాలతో, మంచితనంతో  చెపితే ఎవరూ పాలు కూడా తాగరు. భయపెడితే విషాన్నైనా తాగుతారు. కనుక ఏదైనా పని అవ్వాలంటే మంచితనం కన్నా భయపెడితేనే అవుతుంది. అదే పని వర్తకుడు చేశాడు.

మూర్ఖపు ప్రశ్నలు (నేపాలీ జానపదగాథ)

         భూపేంద్రప్రసాద్ అనే వ్యక్తి తన ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపిస్తాడు. తన కొత్తకోడలి తెలివితేటలను పరీక్షించాలనుకుంటాడు. ఆమె దగ్గరకు వెళ్ళి ఇలా అడుగుతాడు. "మీ పెళ్ళికి నేనెంత ఖర్చు చేశానో ఊహించగలవా?" దానికి కోడలు "ఒక ధాన్యం బస్తా ఖర్చయి ఉంటుంది" అని సమాధానం చెబుతుంది. అది వినిన భూపేంద్రప్రసాద్ తన కొడుకు పెళ్ళాం ఎంత తెలివితక్కువది అనుకుంటాడు. కొడుకు పై మనసులోనే జాలిపడతాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు భూపేంద్రప్రసాద్ కొడుకు కోడలితో కలిసి బంధువుల పెళ్ళికి వెళతాడు. మార్గమధ్యంలో కొంతమంది వ్యక్తులు ఒక శవాన్ని తీసుకుని వెళ్ళడం చూస్తాడు. వారిని ఆపి "చనిపోయింది ఎవరు?" అని అడుగుతాడు  అంతలో కోడలు "చనిపోయింది ఒకరా? వందమందా?" అని ప్రశ్నిస్తుంది. దాంతో భూపేంద్ర ప్రసాద్ కు కోడలి ప్రశ్నకు తలకొట్టేసినట్టయింది. ఎదుటి వ్యక్తి సమాధానం వినకుండానే వెళ్ళిపోతాడు. మరికొంచెం దూరం వెళ్ళాక పంటచేలలో కూలీలను పలకరిస్తాడు భూపేంద్రప్రసాద్. "ఈ సంవత్సరం పంట బాగా పండినట్టుంది" అంటాడు. అప్పుడు కోడలు "ఈ   సంవత్సరం పంటేనా? గతసంవత్సర పంటా?" అని అడుగుతుంది. ఈవిధంగా అడగడంతో కోడలు ఒట్టి మూర్ఖురాలు అని తెలివి తక్కువదని అంచనా వేస్తాడు భూపేంద్రప్రసాద్. కొడుకు దగ్గరికి వెళ్ళి "నీ భార్య ఎంత చెత్త ప్రశ్నలు వేస్తుందో" అని అంటాడు. దాంతో కొడుకు చెత్తా? అని ఆశ్చర్యపోయి ఇలా అంటాడు. అవి పైకి కనబడేంత చెత్త ప్రశ్నలేమి కావు. వాటి అర్థమేమిటో ఆమెనే అడగమని అంటాడు. కొడుకు చెప్పిన దానిప్రకారం భూపేంద్రప్రసాద్ కోడలు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. "ఆ చావు ఊరేగింపు వాళ్ళను ఒక్క శవాన్ని తీసుకుని వెళుతున్నారా? వందమందా?" అని అడిగావు నీ ఉద్దేశ్యం ఏమిటి? అని అడుగుతాడు. దానికి కోడలు సమాధానం ఇలా చెబుతుంది. "కొందరి మీద ఆధారపడేవాళ్ళు చాలామంది ఉండవచ్చు. అలాంటి వ్యక్తి మరణించినప్పుడు వాళ్ళందరి జీవితాలు చిందరవందర అవుతాయి. ఒకరకంగా చెప్పాలంటే అతనితోపాటు వాళ్ళంతా చచ్చినవాళ్ళు కిందే లెక్క." అందుకే నేను అలా అడిగింది అని వివరించి చెప్పింది కోడలు. మరి వ్యవసాయకూలీలను "ఈ సంవత్సరం పంటేనా? గతసంవత్సర పంటా?" అని అడిగావు దాని అర్థమేమిటి అంటాడు  భూపేంద్రప్రసాద్. సాధారణంగా రైతుకూలీలు అప్పుల్లో ఉంటారు. వాళ్ళు తీసుకున్న అప్పు గత సంవత్సరానిదా, ఈ సంవత్సరానిదా అని అడిగాను అంది కోడలు. కోడలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వివరంగా చెప్పిన తరువాత భూపేంద్రప్రసాద్ కు తాను మొట్టమొదట కోడల్ని అడిగిన ప్రశ్నకు సమాధానం వివరంగా తెలుసుకోవాలనిపిస్తుంది. వెంటనే  మీ పెళ్ళికి నేను చాలా డబ్బు ఖర్చు చేసి ఎంతో వైభవంగా పెళ్ళి జరిపించాను. కాని నువ్వు పెళ్ళి ఖర్చు కేవలం "ఒక ధాన్యం బస్తాఖరీదు" మాత్రమే అని చెప్పావు అలా ఎందుకన్నావు? అని అడుగుతాడు. "మీరు పెళ్ళికి ఉపయోగపడే ఖర్చు చేసిన దానివిలువ అంతే అవుతుంది. మిగతా ఖర్చంతా మీ పరువు, ఆడంబరాల కోసం ఖర్చు చేసిందే" అంటుంది కోడలు. ఈ సమాధానాలతో భూపేంద్రప్రసాద్ తన కోడలు మూర్ఖురాలు కాదని చాలా తెలివైనదని తెలుసుకుంటాడు.

విశ్లేషణ

          భూపేంద్రప్రసాద్ కొడుకు పెళ్ళికి పరువుప్రతిష్ఠల కోసం ఎంతో డబ్బు ఖర్చుపెడతాడు.  కొత్తకోడలు తెలివైనదా కాదా తెలుసుకోవాలనుకుంటాడు. ఆమెను ఒకప్రశ్నవేస్తాడు. దానికి ఆమె చెప్పిన సమాధానం విని కోడలు తెలివితక్కువదని నిర్దారణకు వస్తాడు. అంటే కోడలు తెలివైనదా కాదా ఆమెను గూర్చి తెలుసుకోవాలనే కుతూహలం ఉంది. కాని ఆమె చెప్పిన సమాధానం తాలుకా వివరణ గ్రహించలేక తనలో తానే కోడలకు తెలివిలేదని అనుకుంటాడు.  కోడలు సమాధానం అలా ఎందుకు చెప్పిందో గ్రహించలేకపోవడం భూపేంద్రప్రసాద్  తెలివి తక్కువదనం. పైగా కొడుకుపై మనసులోనే జాలిపడతాడు. అంతేగాకుండా కోడలు ఇతరుల్ని అడిగినప్రశ్నలు విని మూర్ఖురాలని అనుకుంటాడు. ఆ ప్రశ్నలలోని ఆంతర్యాన్ని అర్థంచేసుకోలేకపోతాడు. కొడుకు దగ్గర కోడలు చెత్తప్రశ్నలు వేస్తుందని అంటాడు. దానికి కొడుకు ఆశ్చర్యపోయి ఆ ప్రశ్నలలోని అర్థాన్ని కోడల్ని అడిగి తెలుసుకోమంటాడు. చివరకు కొడుకు సలహా పాటిస్తాడు. వాటిని గూర్చి కోడలు దగ్గర వివరంగా తెలుసుకుంటాడు. అనంతరం కోడలు మూర్ఖురాలు కాదని చాలా తెలివైనదని గ్రహిస్తాడు.

టక్కరిబాలుడు - తెలివితక్కువ దయ్యం‘(మెక్సికో జానపదగాథ)

         ఒకసారి ఒకదయ్యం ఒక సహాయం కోసం మానవరూపం ధరించి ఒక ఊళ్ళోకి వెళుతుంది. దాని దృష్టి ఎదురుగా వస్తున్న బాలుని పై పడుతుంది. ఏయ్ అబ్బాయ్ నీకు ఉద్యోగం కావాలా అంది. కావాలి అన్నాడు బాలుడు. నీకు చదవడం వచ్చా అని అడిగింది దయ్యం. వచ్చు అంటాడు బాలుడు. అయితే ఉద్యోగం నీకు ఇవ్వలేను అంటుంది. చదువు రానివాడు కావాలి అంటుంది. వెంటనే ఆ బాలుడు ఇలా అంటాడు. వెనకాల నా సోదరుడు వస్తున్నాడు అతనికి చదువురాదు అని చెప్పి వెళ్ళిపోతాడు. దయ్యం కొంచెం ముందుకు వెళ్ళగానే ఆ పిల్లవాడు మరొక డొంకదారి గుండా, దాని కన్నా ముందే ఊళ్ళోకి వెళ్ళి ఆ దయ్యానికి ఎదురుగా వస్తాడు. ఎదురుగా వచ్చిన బాలుణ్ణ్ని చూసి ఆ దయ్యం ఇలా అడుగుతుంది. "ఇందాక నాకు కనిపించిన అబ్బాయి సోదరుడివి నువ్వేనా? నీకు చదువురాదని, ఉద్యోగం కోసం వెతుకుతున్నావని అతడు చెప్పాడు" అంటుంది దయ్యం. ఆ అబ్బాయి అవును అన్నట్లుగా తల ఊపుతాడు. అప్పుడు దయ్యం ఆ అబ్బాయిని ఒక గ్రంథాలయంలోకి తీసుకుని వెళుతుంది. ఆ అబ్బాయి చేయవలసిన పని దయ్యం చదివిన పుస్తకాలను దుమ్ము దులిపి  ఎప్పటికప్పుడు యథాస్థానంలో  పెట్టడం. దయ్యం బయటకు వెళ్ళినప్పడు ఆ అబ్బాయి ఏమితోచక ఒక్కొక్క పుస్తకం చదవసాగాడు. అవి మాయలు-మర్మాలు, మంత్రతంత్రాలు, ఇంద్రజాలం, కనికట్టు, గారడీ, విద్యల గూర్చి ఎంతో ఆసక్తికరంగా ఉండేవి. ఒకరోజున ఆ అబ్బాయి పుస్తకం చదువుతుండగా దయ్యం చూస్తుంది. ఆ బాలుడు చదువురాదని చెప్పి తనను మోసం చేశాడని గ్రహిస్తుంది. వెంటనే తన నిజస్వరూపాన్ని ధరించి ఆ బాలుణ్ని భయపెడుతుంది. అయితే  ఆ బాలుడు కూడా అప్పటికే చాలా విద్యలు పుస్తకాలలో చదివి నేర్చుకున్నాడు. కాబట్టి వెంటనే కుందేలుగా మారి బయటకు పరుగుతీస్తాడు. ఆ దయ్యం తోడేలుగా మారి కుందేలును తరమసాగింది. అప్పుడు కుందేలు పావురంగా మారి ఆకాశంలో  ఎగిరిపోతుంది. ఆ వెనువెంటనే తోడేలు గద్దలామారి పావురాన్ని తరుముతుంది. పావురాన్ని పట్టుకునే లోపు అది గులకరాయిగా మారి భూమిమీద పడుతుంది. అప్పుడు గద్దరూపంలో ఉన్న ఆ దయ్యం వడ్లగింజగామారి భూమిమీద పడబోతుంది. గులకరాయిగా మారిన ఆ బాలుడు భూమి మీద పడిపడగానే కోడిపుంజుగా మారతాడు. సరిగ్గా అదే సమయానికి వడ్లగింజగా మారిన దయ్యం భూమి మీద పడుతుంది. కిందపడి పడగానే వడ్లగింజను కోడిపుంజు మింగేస్తుంది. 

విశ్లేషణ

          విద్య లేనివాడు వింత పశువు అంటారు. చదువు అనేది ఆ బాలుడి ప్రాణాలు కాపాడింది. దయ్యం బయటకు వెళ్ళిన సమయం లో ఆ బాలుడు పుస్తకాలను చదవబట్టి అందులోని మంత్రతంత్రాలు ... వగైరా విద్యలు నేర్చుకోగలిగాడు. తద్వారా దయ్యం బారినుండి తన ప్రాణాలు  కాపాడుకోగలిగాడు. దయ్యం దగ్గర తెలివిగా ఉద్యోగం సంపాదించడమే కాకుండా తనను తాను రక్షించుకోగలిగాడు.

                                            విద్య నిగూఢగుప్త మగు విత్తము రూపము పూరుషాళికిన్

                                             విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుండున్

                                             విద్య విశిష్టదైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్

                                            విద్య నృపాల పూజితము విద్య నెరుంగనివాండు మర్త్యుండే.

మనుషులకు విద్య నిగూఢంగా దాచి పెట్టబడిన ధనం. విద్య కీర్తి, భోగాలను ఇస్తుంది. విద్యగురువు, విదేశ బంధువు, విశిష్టదైవం. విద్యకు సాటిరాగల ధనం ఈలోకంలో లేదు. ప్రభువులచే  పూజింపబడేది విద్య. విద్య తెలియనివాడు మనిషి కాదు. పశువుతో సమానం.  

 

చైనా జానపదగాథ

         చైనాలో ఒకరాజు నివాసం అడవికి దగ్గరగా ఉండేది. ఒకరోజు రాజుగారు రాత్రివేళ పుస్తకం చదువుతుండగా ఒక కోయిల పాట వినిపిస్తుంది. అది ఎంతో మధురంగా ఉంటుంది. ఆ పాటను వినిన రాజుగారు వెంటనే భటుల్ని పిలిపించి అడవిలోని ఆ కోయిలను తెమ్మని పంపుతాడు. భటులు ఆ కోయిలను కనుక్కుని రాజుగారి దగ్గరకు రమ్మని అంటారు. కాని కోయిలకి అడవిని విడిచి వెళ్ళటం ఇష్టం లేదు. కాని రాజుగారి సంతోషం కొరకు వెళుతుంది.  రాజుగారికి మందిరంలో రకరకాల పాటలు వినిపిస్తుంది కోయిల. రాజుగారు ఆనందంతో కోయిలకు బంగారు పంజరం చేయించి తన దగ్గరే ఉంచుకుంటాడు. ప్రతిరోజు ఆ కోయిల పాటలతో ఆనందపరవశుడవుతాడు. ఒకనాడు పర్షియా చక్రవర్తి చైనారాజుకు ఒక కానుక పంపిస్తాడు. అది ఒక బొమ్మ కోయిల. దానినిండా వజ్రవైఢూర్యాలు పొదిగారు. దానికి ఒక మీట ఉంది. అది తిప్పితే ఆ బొమ్మ ఆగకుండా ఐదునిమిషాల వరకూ పాడుతుంది. దాంతో రాజుగారు చాలా ఆనందంతో బొమ్మకోయిల పాటలు వింటూ, పంజరంలో ఉన్న నిజమైన కోయిలను మరచిపోతారు. ఒకరోజు రాజభటుడు పంజరం మూతతీయగా కోయిల రివ్వున అడవిలోకి ఎగిరిపోతుంది. రాజుగారు మాత్రం బొమ్మకోయిలను ఎప్పుడూ తనవెంటే ఉంచుకుని పాటలు వింటుండేవారు. కొంతకాలం తర్వాత బొమ్మకోయిల లోపల ఏదో విరిగి పాడకుండా ఆగిపోతుంది. దాన్ని రిపేరు చేయడానికి ఎంతోమంది వస్తారు. కాని అది పనిచేయదు. చివరకు గడియారాలు బాగుచేసే అతను దాన్ని రిపేరు చేసి అది నెలకో, సంవత్సరానికో ఒకసారి పనిచేస్తుంది అని చెబుతాడు. అదేవిధంగా అది అప్పుడప్పుడు మాత్రమే పనిచేస్తుంది. దాంతో రాజుగారు ఎంతో బాధపడతాడు. అదే ఆలోచనతో ఉండటం వలన రాజుగారికి తీవ్రంగా జబ్బుచేస్తుంది. ఒకరోజున రాజవైద్యులు రాజుగారిని పరీక్షించి మరణించారు అని ప్రకటిస్తారు. ఆ స్థితిలో రాజుగారి దగ్గరికి అడవిలోకి ఎగిరిపోయిన నిజమైన కోయిల వచ్చి మధురంగా పాడుతుంది. దాని పాట విని రాజు నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు. నా మిత్రుడు మళ్ళీ వచ్చాడు అని రాజు ఆనందిస్తాడు. ఆ రాత్రంతా కోయిల పాటలు వింటూనే ఉంటాడు.

విశ్లేషణ

          రాజుగారికి పుస్తకాలు, సంగీతం అన్న ప్రాణంతో సమానం. అడవిలోని కోయిల పాట విని దాన్ని తెప్పించుకుని బంగారు పంజరం చేయిస్తాడు. నిరంతరం తనతోనే రాజమందిరంలో కోయిలను ఉంచుకుని పాటలు వినేవారు. పాటలు వినడమనేది నిత్యకృత్యంగా చేసుకుంటాడు రాజు. కొంతకాలం తర్వాత తనకు కానుకగా వచ్చిన బొమ్మకోయిల నిరంతరం పాడటంతో దానిపై రాజుగారి దృష్టి మల్లుతుంది. బొమ్మకోయిల మీట నొక్కితే రకరకాల పాటలు వస్తుండేవి. దాని వ్యామోహంలో పడి రాజుగారు నిజమైన కోయిలను విస్మరిస్తారు. నిజమైన కోయిలకు అడవిని విడిచి రావడం ఇష్టం లేకపోయిన రాజుగారి ఆనందం కోసం వస్తుంది. అట్లాంటి కోయిలను రాజుగారు మరచిపోయేసరికి కోయిలకు బాధకలుగుతుంది. తిరిగి అడవికి వెళ్ళిపోతుంది. రాజుగారి బొమ్మకోయిల మీట కొంతకాలం పనిచేసి తర్వాత పనిచేయడం మానేస్తుంది. ఎంతమంది ఎన్ని రిపేర్లు చేసినా బాగవ్వదు

                                                           ఎలుకతోలు తెచ్చి యొన్నాళ్ళు నుదికిన
                                                           నలుపు నలుపే కాని తెలుపు కాదు!
                                                           
కొయ్యబొమ్మ దెచ్చి కొట్టిన పలుకునా?
                                                          
విశ్వదాభిరామ వినురవేమ!!

నల్లగా ఉండే ఎలుక చర్నాన్ని తీసుకుని వచ్చి ఎన్ని రోజులు పాటు ఉతికినా దాని నలుపు పోయి తెల్లగా మారదు. ప్రాణంలేని కొయ్యబొమ్మను ఎంత కొట్టినా దానిచేత పలికించడం సాధ్యం కాదు.

ఈ కథలో బొమ్మ కోయిల పనిచేయడం మానేసిన తర్వాత రాజుగారికి నిజమైన కోయిలకి, బొమ్మకోయిలకి ఉన్న తేడా అర్థమవుతుంది. ప్రాణమున్న కోయిల ఎప్పుడంటే అప్పుడు పాటలు పాడేది. ఇప్పటికీ పాడుతుంది. అదే ప్రాణమున్న కోయిలకి, ప్రాణములేని బొమ్మకోయిలకి తేడా. అది గ్రహించిన రాజుగారు బొమ్మకోయిలను చూసుకుని నిజమైన కోయిలను నిర్లక్ష్యం చేసినందుకు బాధపడతాడు. పాటలు వినకపోవడంతో జబ్బుపడతాడు. చివరకు మరణావస్థలో ఉండగా అడవినుండి నిజమైన కోయిల వచ్చి రాజుగారిని బతికిస్తుంది. రాజుగారు తప్పు తెలుసుకుని నిజమైన కోయిలకి తగిన గౌరవం ఇవ్వడంతో అది ఎంతో ఆనందిస్తుంది. రాజుగారికి నిరంతరం పాటలు వినిపిస్తూ ఆనందింపజేస్తుంది. రాజు సజీవంగా ఉన్న కోయిలను పక్కనపెట్టి నిర్జీవమైన  బొమ్మ  కోయిల వ్యామోహంలో పడి జబ్బుపడతాడు. చివరకు తాను నిర్లక్ష్యం చేసిన కోయిలే రాజుగారి ప్రాణాలు కాపాడుతుంది.

                                                                        తనుజులనుం గురువృద్ధుల
                                                                       
జననీ జనకులను సాధుజనుల నెవడు దా
                                                                       
ఘనుడయ్యు బ్రోవడొయా
                                                                       
జనుడే జీవన్మృతుండు జగతి కుమారా!

తన కుమారులను, గురువులను, పెద్దవారిని, తల్లిదండ్రులను, సజ్జనులైన వారిని, ఎవడు తన చేతనైనను తగిన సమయమున రక్షింపడో అతడు బ్రతికిఉన్నను చచ్చినవాడితో సమానమే. ఈ కథలో కోయిల సరైన సమయంలో అడవి నుంచి వచ్చి రాజుగారి ప్రాణాలు కాపాడుతుంది.

ముగింపు

          ఈ ఐదు జానపదగాథలలో మనిషి స్వభావం అనేది చూస్తే స్పష్టంగా అవగతమవుతుంది. మూర్ఖపు ప్రశ్నలు కథలో భూపేంద్రసింగ్ ఎదుటివారి తెలివితేటలు తెలుసుకోవాలనే కూతూహలం, పఠాన్ గర్వం కథలో అలామత్ ఏది ఉచితంగా తీసుకోకపోవడం అలా తీసుకుంటే తాను బిచ్చగాడిని అయిపోతాననుకోవడం, ముసలిజాలరి కథలో పక్షి చేసిన సహాయాన్ని మరచి సొమ్ము కోసం దానికే  కీడు తలపెట్టడం, టక్కరిబాలుడు కథలో బాలుడు చదువుకోవడం వలన దయ్యం బారి నుండి ప్రాణాలు కాపాడుకోగలగడం, చైనాకథలో రాజు ప్రాణమున్న కోయిలను మరచి ప్రాణంలేని కోయిలను నమ్ముకోవడం మొదలైన అంశాలు మనిషి బుద్ధిని తెలియజేస్తున్నాయి. జానపదగాథల్లో మానవీయ విలువలు ప్రతిబింబిస్తూ ఉంటాయి. మానవీయ విలువలకు ప్రాధాన్యమిచ్చి సంస్కృతీ, సంప్రదాయాలు రూపొందాయి. నానాటికీ మనిషిలో స్వార్ధం పెరిగిపోతుంది. నాడున్న మానవీయవిలువలు నేడు మసకబారుతున్నాయి.

********