Error: Embedded data could not be displayed.
  మొన్నొక రోజు వరంగల్ భద్రకాళి గుడికెళుతూ ట్రాఫిక్ లో చిక్కుకున్నాం.. ఎందుకన్ని వాహనాలు అక్కడ పోగయ్యాయో ముందు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ముందువి కదలవని తెలిసీ చెవులు చిల్లులు పడేలా వెనక నుండి హారన్లు. కనిపించిన కాస్త సందు లో నుండి దూరిపోవాలనుకునే టూ వీలర్ డ్రైవర్లు . తిట్టుకుంటున్న ఆటో డ్రైవర్లు విసిగిపోతున్న మిగతా వాహన దారులు. రోడ్డంతా చిందర వందర అస్తవ్యస్తం.. ఆఫీసుల పనులనుండి తిరిగొస్తూన్న సాయంకాలపు అలసట అసహనం విసుగు చిరాకు ....
ఆ పైనే ఆకాశంలో అదే సాయంత్రం 'ఇళ్ళకి' తిరిగేల్తూ ఏ మాత్రం అలసట లేదన్నట్టు కొంగల వరుసలు.. సహనానికి మారు పేరుగా, స్వేచ్చకి గుర్తుగా కలిసికట్టుగా కదులుతుంది కొంగల బారు. ఉరుకులూ పరుగులు లేవు. ఆత్రమూ ఆరాటం లేదు. ఆశా లేదు అయోమయం లేదు. ఈ పూట గడిచింది. రేపటిది రేపు...
మనిషీ??
అనుకున్న దానికన్నా కాస్త ఆలస్యంగా చేరుకున్నాము గుడికి.
భద్ర కాళి చెరువు దగ్గర కాసేపు గడిపందే వెళ్ళరు గుడికొచ్చిన వారిలోని పక్షి ప్రేమికులు. .. అలా చూస్తున్న మాకు కనిపించాయి మళ్ళీ కొంగలు. వలస పక్షులు.. వందల కొలది ఒక వరసలో నీటిపై ఎగురుతూ కనిపించిన చేపల్ని ఒడిసి పట్టుకుంటూ.. ఒక అద్భుత దృశ్యం ఆ కలసి కట్టు తనం.. చెరువుకి ఆ చివరలో బయటికి తేలిన బండరాళ్ల పైనంతా తెల్లని రంగు పులుముకుని అంత దూరాన్నుండీ చక్కగా వినిపిస్తున్నాయి 'పక్షి కథలు'..ఎంతెంత దూరాలను చెరిపేస్తూ వచ్చి వాలాయో ఈ ఆత్మీయ అతిధులు..
ఎంత అందమీ పక్షి లోకం! 'అది అలాగే ఉంది'
వెదురు పొదలో మైనాలు, ఇంటి చూరులో పిచ్చుకలు, మావి చిగురులో కోయిలలు, సన్న జాజి పొదలో బుల్ బుల్ పిట్టలు .. రకరకాల పిట్టలు , భలే భలే రంగులు, కమ్మని పాటలు మధురాతి అనుభూతులు మనసు పెట్టాలె గాని..
మొన్న మా మల్లె పొదలో ఒక బుల్ బుల్ పిట్టల జంట గూడు కట్టుకోవడం చూసాను. కొబ్బరి నార ఒకోటి ముక్కున కరుచుకొచ్చి బుట్టలా కుదురుగా రెండింట్లో ఒక పక్షి గూడు అల్లుతుంటే మరో పక్షి కాపలీ. రెండు రోజులు శ్రమ పడితే గూడు సిద్దమైంది. ఆసక్తిగా గమనించడం మొదలు పెట్టాను. మరో రెండు రోజుల్లో రెండు గుడ్లున్నాయి గూటిలో..నాలుగో రోజు ఏం జరుగుతుందో చూద్దామని వెళ్తే పక్షి గూటినానుకుని చీమల దండు కుప్పలు కుప్పలుగా.. 'అయ్యో ఈ గుడ్లు రేపు పిల్లలైతే!' కలవరం మొదలైంది నాలో.. ఏం చేయాలో తోచలేదు.. ఆ పక్షి గుడ్లు ఎంతో చీమలూ అంతే నాకు.. 'నిర్ణయం తీసుకోవాల్సింది ఆ తల్లి!'..గమనించడం మొదలెట్టాను తల్లి పక్షి వచ్చి ఏం చేస్తుందా అని.. కాసేపటికి వచ్చి గూటి పరిస్థితి ని చూసుకున్న ఆ తల్లి లోనూ కలవరం.. రోజంతా కష్టపడి చీమలన్నిటినీ ఒక్కొక్కటిగా మట్టుబెట్టేసింది..
ఎంత చక్కగా, నేర్పుగా ప్రకృతి తో కలిసి 'నడుస్తూ' , ఒడిదుడుకులని సహిస్తూ ,ప్రకృతిలో మార్పులకనుగుణంగా అవీ మారుతూ, మరు క్షణం చింత లేక అనుక్షణం ఆస్వాదిస్తూ, సృష్టి గమనం లో తమ వంతు బాధ్యతని నిర్వహిస్తూ, ప్రకృతి వొడిలో సాగి పోతుందీ రంగు రంగుల రెక్కల లోకం..